NaReN

NaReN

Wednesday, April 20, 2022

వైద్యుల వెతలు

 వైద్యుల వెతలు

‘ఎప్పుడూ చదువేనా?’ అనిపించి కాసేపలా బయటపడి సాయంకాలాల్లో సాగరకన్యతో సరసాలాడ్డానికి హాస్టల్ గదులు తెరుచుకునేవి. ఇద్దరుంటే మూడోవాడిని అవాయిడ్ చేసే ‘బాయిడ్’గాళ్లు చెప్పాపెట్టకుండా చెట్టపట్టాలేసుకుని జిల్లాపరిషత్ బజ్జీల బండి దగ్గరకెళిపోయేవారు. 


అట్నించి రాగానే వాళ్లిద్దరూ మాయాబజార్లో శర్మా శాస్త్రుల్లా వంకాయ బజ్జీ రుచిని వర్ణిస్తోంటే మాకు నోట్లోంచీ, కళ్లలోంచీ నీళ్లు కారిపోయేవి. నన్ను తీసుకెళ్లకుండా పోయిన ఆ ‘కన్నింగ్’హామ్‌గాళ్ల మీద కోపం మిర్చి బజ్జీలో కంటే ఎక్కువగా మండిపోయేది. వంకాయని చీరేసినట్టు నిలువునా చీరెయ్యాలనిపించేది. 


ఈలోగా నాలుగో నెంబరున్న ఎదుటిగది ‘గుడ్‌’మన్ గిల్‌మన్ ఒకడు వేడివేడి న్యూస్‌పేపర్ శంఖమొకటి నా చేతిలో పెట్టేవాడు. దాన్నిండా నోరు కాలేన్ని పకోడీలు, మనసు నిండిపోయేంత ప్రేమా ఉండేవి.


‘తిను వరుణ్, నాకూ ఉన్నాయిలే!’ అన్న మాటకి తినకుండానే కడుపు నిండిపోయేది. వేణువూదే అలవాటున్న ఆ సీనియరన్నయ్య ఇలాగే పాటతోను, మాటతోను మమ్మల్ని కట్టిపడేసేవాడు. 


అప్పుడప్పుడు చదువుతున్న గైటన్ మూసి టైటన్ వాచీలమ్మే నాగరాజ్ & కో మెట్ల దగ్గర ప్రత్యక్షమయ్యేవాళ్లం. మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి సైతం తీరికలేనంత ఉత్సాహం ఆ బండి దగ్గర. కమ్మగా సెనగపిండి వాసన ఆ చుట్టూతా! 


దేవుడి ప్రభల్లా నిలువుగా నిలబడివున్న వెడల్పాటి అరటికాయ చీలికలు చూస్తూ ఉండగానే వస్తాదుల్లా బయటపడి, అలా సెనగపిండిని ఒళ్లంతా పట్టించుకుని సెగలపొగల నూనెలోకి జారుకునేవి. 


వేసేదాకా కంగారు, తీసేదాకా కంగారు. ‘నాకంటే నా’కంటూ ఎగబడి ఎగరేసుకుపోయే బజ్జీలన్నీ ఉక్కపోతల్ని కాసేపలా మరపించేసేవి. ఉప్ఫూ ఉప్ఫూల్ని వినిపించేసేవి.


పదిమందీ కలిసి ఇంకా ఏ బాధ్యతలూ లేని భుజాలమీద చేతులేసుకుని నవ్వుకుంటూ కెజిహెచ్ డౌన్ దిగిపోయేవాళ్లం. 


దిగేకొద్దీ మీదకొచ్చేసేలా కనబడే సముద్రాన్ని చూస్తే కోపం వచ్చినప్పుడు అమ్మలా కనబడేది. ఏం చెయ్యదన్న నమ్మకం... అచ్చం అమ్మలానే! 


ఇంకా ఏ ఒక్కడిలోనూ బట్టతలల జీన్సవీ నిద్రలేవకపోవడాన ఎగురుతున్న జుట్టునలా వెనక్కి నెడుతూ ఎదురుగాలికి ఎదురేగేవాళ్లం. 


గాలిలో చెమ్మ, గుండెల్లో ధీమా సమతుల్యంగా ఉండడాన కబుర్లలో నిజాయితీ వినబడేది. కాలుష్యం అప్పుడప్పుడే నిద్రలేచి ఇంకా తన కోరల్ని కోల్గేట్‌తో క్లీన్ చేసుకుంటూ ఉన్న రోజులవి. 


సెల్సవీ రానందున శరీరంలో కణజాలమంతా స్నేహాలనే సైటోప్లాజాన్నీ, రూమ్మేట్లనే రైబోజోముల్నీ నింపుకుని ఉండేవి. కరెంటు పోతే బల్లల మీద దరువేస్తూ పాటలు పాడే సరదాల మైటోకాండ్రియాలే మాకు నిజమైన ఊపిరి. 


రాతికట్టడాల ఉమన్స్ కాలేజీ ముందునుంచి వెళుతూ రాతిగుండె అమ్మాయిల్ని దొంగచాటుగా చూడడం, తీరని సరదాలతో గుండె రాయిచేసుకు బతకడం కూడా అప్పుడే అలవాటయ్యాయి.


రామకృష్ణ మిషన్‌లో వివేకానందుడి పుస్తకాలు కొని చదివేసి, మర్నాటినుంచీ తెల్లారే నాలుక్కల్లా లేచేసి, కసరత్తులు చేసెయ్యాలని కఠోరమైన నిర్ణయం తీసేసుకునేవాణ్ణి. తీరా ఏడింటికి మావాడు లేపగా లేపగా స్నానమైనా చెయ్యకుండా పెసరత్తులు తిని కాలేజీకి బయల్దేరేవాణ్ణి. 


ఆ పరమహంస పటాన్ని చూసిన ప్రతిసారీ ఆయన మమ్మల్ని చూసే నవ్వుతున్నాడని అనిపించేది. కాళీమాత ఆలయంలో ఖాళీజాగా దొరికితే ప్రసాదం తింటూ ఎదురుగా కెరటాల్ని చూడటం ఒక దివ్యదర్శనం. 


ఒడ్డుని కోసేస్తున్న సముద్రం మమ్మల్ని మాత్రం ఏమీ అనేదికాదు. నాచుపట్టిన రాళ్లన్నీ మా పాదాల తాకిడికోసం ఎదురుచూస్తాయనిపించేది. అక్కడ చేరి చెప్పుకునే డిస్సెక్షన్ హాలు కబుర్లు, ఫిజియాలజీ లాబుల్లో ఎగిరిపడిన కప్పల తిప్పలు మాతోపాటు ఆ రాళ్లూ వినేవనిపిస్తుంది. ఎంతసేపూ చిప్పమొహాలన్నీ చేరి ‘నీకళ్లు ఆల్చిప్పల’నీ, ‘నీ పెదాలు దొండపళ్ల’నీ పొద్దుపోయేదాకా చెప్పుకునే అబద్ధాలు వినీవినీ విసుగెత్తి బండరాళ్లైపోయి ఉంటాయి. 


మళ్ళీ ఆ అసత్యాల నీడల జాడల్లోంచి వెలుగులోపడి, ఈ రాళ్లమీంచే దూకేసిన ఎన్నో అబల హృదయాల్ని చూసిన అలసట కూడా అయివుండాలి. 


సముద్రం చాలా కథలు చెప్తుంది. అలా నోరెట్టుకు పడిపోతుందిగానీ ఆ అలల గలగలల్ని ఎవరైనా డీకోడ్ చేస్తే ఎన్నో రహస్యాలు, ప్రమాణాలు, శుష్క వాగ్దానాలు, ఒప్పించడాలు, ఆనక నొప్పించడాలు... ఇవన్నీ బయటపెడుతుందనిపిస్తుంది.


చీకటడ్డాక రూములకి బయలుదేరే మెడి‘కోలకళ్ల’ చిన్నోళ్లంతా చెదిరిన క్రాపుల్నీ, ఇసకంటిన చొక్కాలనీ సర్దుకుంటూ దులుపుకుంటూ పిడతకింద పప్పు తింటూ కెజిహెచ్ అప్పెక్కేవారు. ఆయాసాలు, నీరసాలూ అంటని గుండెలవి. ఉద్వేగంతో ‘లవ్’ అనే తప్ప ‘డబ్బ’ని కొట్టుకోవడం ఎరగని గుండెలే అవింకా! 


ఏదైనా మా విశాఖ సాగరతీరం రూపు మార్చుకుంది. రాతికట్టడాలన్నీ కనుమరుగయ్యేలా ఐబాకోలు, ఐనాక్సులూ వచ్చి చేరాయి. పల్లీలు పంచుకున్న షేక్‌హాండ్ల స్నేహాలన్నీ థిక్ షేక్ ఫ్యాక్టరీల్లో మగ్గులు మగ్గులుగా కొవ్వెక్కిన బంధాలైపోతున్నాయి.


అన్నమయ్య విగ్రహం ఎదుట కచేరీలన్నీ ఆరింటికి సీరియళ్లుగా అనాధ్యాత్మికాలైపోయాయి. 


పొడవాటి తీరమంతా కుర్కురే కవర్లతో కర్కశంగా కనబడుతోంది. 


నన్ను దూరంనుంచి చూడండి. మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటానంటుంది బంగారమంటి బంగాళాఖాతం. కానీ అమ్మాయిల్నీ, అవనినీ అంగుళాల్లో కొలిచే మానవ నైజం ఇసకలోనూ ఇటుకల్ని పాతేస్తోంది. సముద్రానికి వీధరుగు లేకుండా చేసేస్తోంది. తన గోడంతా ఏ గోడకేసి తలబాదుకుని చెప్పాలో తెలియక రోదిస్తోంది. 


మా మెడికోలంతా ఇప్పుడు గుండెల్నీ, మెదళ్లనీ చీల్చేంత పెద్ద సర్జన్లైపోయారు. వారెవరికీ ఈ అనుభూతులు మరపురావు. అయితే నాలాంటి చాదస్తంగాడెవడో ఫోర్‌సెప్స్‌తో కెలకాలి. అప్పుడు ఫిజియాలజీ కప్పల్లా ఒకడొకడూ ఎగిరెగిరి బోలెడన్ని కబుర్లు చెబుతాడు. 


ఎంచేతంటే.. అవన్నీ సముద్రపు ఉప్పూ, బజ్జీల కారం శరీరాలే కాబట్టి!


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE