NaReN

NaReN

Friday, April 8, 2022

పబ్ తీర్థం

 పబ్ తీర్థం


"అంకుల్! నన్ను ఇక్కడెందుకు తీసుకొచ్చారూ!" దీర్ఘాలు తీస్తూ మొద్దుగా ఉన్న అమ్మాయి.. ముద్దుగా అడిగింది.

"నీకు.... " అంటూ అలవాటు ప్రకారం ఏకవచనంలో పిలవబోయి, అమ్మాయి చిరునామా ఙ్ఞాపకం వచ్చి,"మీకు తెలియదా?" అంటూ మర్యాదగా అడిగాడా అంకుల్.

"నిజంగా తెలియదు అంకుల్!" 

"నిన్న రాత్రి మీరు ఎక్కడ ఉన్నారు?"

"ఓ అదా! ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ కదా అంకుల్! నిన్నటి విషయాలు అస్సలు గుర్తుంచుకోను! ఆంటీ కొంచెం వాటర్ ఇవ్వరా!" 

ఆ అమ్మాయిని అంత దగ్గరగా చూడ్డాం మొదటిసారి కావడంతో, ఆ సదరు ఆంటీ గ్లాసుతో నీళ్లు ఆనందంగా అందించి, పక్కనే నిలబడి, ఇంకో ఆంటికి సెల్లో ఓ ఫోటో తీయమని సంఙ్ఞ చేసింది. 

"పోనీ.. నిన్న ఏం తీసుకున్నారో గుర్తుందా?"

"భలేవారే అంకుల్! నిన్న ఉగాది ఫెస్టివల్ కదా.. ఉగాది చెట్ని తిన్నాను అంకుల్! నాకు చాలా ఇష్టం అంకుల్! రోజూ ఆ చెట్ని చేయమంటే,  మా మమ్మి చెయ్యదు అంకుల్!   మీరు ఎప్పుడైనా తిన్నారా అంకుల్!"

"అది కాదమ్మా! నిన్న రాత్రి ఏం తీసుకున్నారని అడుగుతున్నాను!"

"ఆఁ ఙ్ఞాపకం వచ్చిందంకుల్!  నిన్న రాత్రి కూడా ఆ చెట్నినే... !"

"అదేంటమ్మా.. రాత్రి కూడా ఆ పచ్చడి తింటారా...! నో.. మీరు అబద్దం ఆడుతున్నారు!"

"లేదంకుల్.. సరస్పతి తోడు.. ఆ పచ్చడే తిన్నాను అంకుల్!"

"ఎక్కడ తిన్నారు?"

"అదా అంకుల్!  నాకు మా ఇల్లు, ఎప్పుడైనా వెళ్తే రేడిగారబ్బాయి ఇల్లు తప్పా, నాకేం తెలియదు అంకుల్! అక్కడ ఆ అంకుల్, ఆంటి ఇచ్చుంటారు!"

"రేడిగారబ్బాయి ఇళ్లా..? అదేం పేరు?"

"అదే.. అంకుల్ బంజారా హిల్స్ లో ఉంది కదా.. టెలుగులో అలానే అంటారంకుల్!"

"మరి నిన్న రాత్రి అక్కడకి మీరేందుకు వెళ్ళారు?"

"నిన్న సాటర్ డే కదా అంకుల్! దానికి తోడు ఫెస్టివల్ కూడా కదా! నేను సాటర్ డే, ట్యుయజ్ డే, థర్స్ డే  వాళ్ళింటికి వెళ్తాను అంకుల్!"

"ఎందుకమ్మా!"

"ఆ అంకులింట్లో ఈశాన్యంలో దేవుడు పటాలు ఉంటాయి కదా! అక్కడ అగరుబత్తి వెలిగించి, కోకోనెట్టు కొడతారు! ఆ కోకోనెట్ తీర్థం అంటే నాకు చాలా ఇష్టం అంకుల్.  ఆ కోకోనెట్ పార్ట్ ని కూడా మమ్మి తెమ్మంటుంది. చెట్నికి పనికొస్తుంది కదా అంకుల్! అందుకు వెళ్ళాను!"

"అదేమిటమ్మా.. పబ్ లో కొబ్బరినీళ్లు తాగడానికి వెళ్ళేరా?"

అంతలో మరో పెద్దాయన.. సెలబ్రిటీ హడవిడిగా వస్తూ..

"అంతలా మా అమ్మాయి నిజం చెప్తుంటే.. నీకర్థం కావడం లేదేమిటయ్యా!  మీ పోలీసు వాళ్ళకి, మీడియా వాళ్ళకి అన్నీ అనుమానాలే! మీ బాస్ ఫోన్ చేసారుగా.. మీకు వేరే చెప్పాలా! రా తల్లీ.. మనింటికి వెళ్దాం!" అంటూ, ఆ సెలబ్రిటి డాడి చిర్రుబుర్రులాడుతూ, ఆ అమ్మాయిని పట్టుకుని బయటపడ్డాడు.

సిఐగారు తల పట్టుకుని కూర్చిలో కూలబడ్డాడు.

****

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE