NaReN

NaReN

Friday, April 8, 2022

కొలువు.. గెలుపూ నీదే

 *కొలువు.. గెలుపూ నీదే*....

                               

‘అవకాశాలేవీ.’... అని నిలదీసిన *యువతకి*.. 

తలరాత మారాలని తల్లడిల్లే *నిరుద్యోగులకి*....

 స్థిరపడాలని ఎదురుచూస్తున్న *కుర్రాళ్లకి*......

*శుభ సమయం* ....

రానే వచ్చింది.


తెలంగాణ సర్కారు వేల సంఖ్యలో నియామకాలు జరుపుతామని ప్రకటించింది. ఇవిగాక.. కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు అవకాశాలు బోలెడు. 

*ప్రతిభ చూపిన వాడిదే విజయం*.. 

అడ్డంకుల్ని అధిగమిస్తేనే *గెలుపు*..

అందుకు *ఎలా సిద్ధం కావాలి?* 

నిపుణులు *ఏంచెబుతున్నారు?*....



*1* *మిమ్మల్ని మీరు నమ్మండి*

పోటీ ఎక్కువగానే ఉంటుంది. అయినా భయమొద్దు. చదవగలనో, లేదో అనే సందేహం అసలే వద్దు. మీపై మీరు నమ్మకం పెట్టండి. మనల్ని మనమే నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? ఒక్కో బలహీనతనీ అధిగమిస్తూ ముందుకెళ్లండి. జీవితంలో ఇంతకుముందు సాధించిన విజయాలు మననం చేసుకోండి. విజేతలు మన పక్కనే, మన మధ్యే ఉంటారు. అందులో పది ఫెయిలైనవాళ్లు, ఇంటర్ తప్పినవాళ్లూ కనిపిస్తారు. పెళ్లై, పిల్లలు పుట్టాక గెలిచినవాళ్లూ ఉంటారు. వాళ్లతో పోలిస్తే మీకేం తక్కువ?


 *1*  *కలల్లో తేలిపోండి*

సర్కారీ కొలువు కొడితే ఆ కథే వేరు. జీతానికి ఢోకా ఉండదు. జీవితాంతం భరోసా. సమాజంలో మంచి గౌరవం. ఉద్యోగం సాధించినప్పుడు అంతా పొగుడుతుంటారు. మంచి ర్యాంకు వస్తే మీడియాలో గొప్పగా రాస్తారు. ఆకాశానికి ఎత్తేస్తారు. మిమ్మల్ని సెలెబ్రిటీలా చూస్తారు. జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. కొత్త కొత్త సౌకర్యాలు సమకూర్చుకోగలుగుతారు. ఉద్యోగం మీతోపాటు.. మీ కుటుంబం తలరాతనూ మార్చేస్తుంది. ఇవన్నీ ఒక్కసారి ఊహించుకోండి. కళ్లముందు రంగుల జీవితం కదలాడుతుంది కదూ!


*3*  *తపస్సు చేయాలి*

‘అరే యార్ అలా చక్కర్లు కొట్టొద్దాం పదా..’, ‘మామా ఈ ఆదివారం త్రిబుల్ ఆర్ సినిమాకి ప్లాన్ చేస్తున్నా.. వస్తావా?’ ఇలాంటి ఊరించే మాటలే లక్ష్యాన్ని పక్క దారి పట్టిస్తాయి. ఫోన్, సినిమాలు, ఆటలు, సామాజిక మాధ్యమాలు, స్నేహాలు, ప్రేమలు.. కొన్నాళ్లు పక్కన పెడితే వచ్చే నష్టమేమీ లేదు. విరాట్ సెంచరీ కొట్టాడా? ఇన్స్టాలో ఇష్టమైన హీరోయిన్ ఏ ఫొటో పెట్టింది? ఇలాంటి ఆలోచనలూ ఏకాగ్రతను దెబ్బ తీస్తాయి. ఇవన్నీ వదిలేసి కొన్నాళ్లు అడవిలో తపస్సు చేసే మౌన మునిలా మారిపోండి.


*4* *దండయాత్ర చేయాలి*

ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు ఠంఛనుగా ఫలానా సమయానికే పడిపోవు. నాయకులకు ‘అవసరం’ వచ్చినప్పుడే మనకు అవకాశం వస్తుంది. అప్పుడే అల్లుకుపోవాలి. ఉన్న సమయంలోనే చకచకా సిద్ధం కావాలి. ఇప్పుడు అందుకోకపోతే మరెప్పుడో తెలియదు. ఈలోపు ఈడు దాటిపోవచ్చు. అందుకే.. ఇదే చివరి అవకాశం అన్నట్టు కసిగా దండయాత్ర చేయాలి. ప్రకటన వచ్చాక చూద్దాం.. రేపట్నుంచి సీరియస్గా మొదలుపెడదాం.. ఇలా వాయిదాలు వేసుకుంటూ వెళ్తే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.


 *5* *సగం విజయం*

ఎంత ప్రతిభ ఉన్నా ప్రణాళిక లేకపోతే చతికిలపడిపోతాం. మనకు ఉన్న సమయమెంత? సబ్జెక్టులెన్ని? దేనికి ఎంత సమయం కేటాయించాలి? ఇవన్నీ పక్కాగా ఉంటేనే పని జరుగుతుంది. అవసరమైతే సీనియర్లు, గత విజేతల సలహాలు తీసుకోవచ్చు. ప్రణాళిక బాగుంటే సగం విజయం సాధించినట్టే అంటారు. లక్ష్యాన్ని సరదాగా, ఆడుతూపాడుతూ చేరుకోవాలేగానీ కష్టంగా, భారంగా భావిస్తే ముందుకెళ్లలేం. మనం ఎన్ని గంటలన్నవి కాదు.. ఎంత ఇష్టంతో చదువుతున్నామన్నదే ముఖ్యం.


*ఇదో నిరంతర ప్రయాణం*

- ప్రొ.బి.రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్..


ప్రాక్టీస్ మ్యాచ్లో ఇరగదీసి అసలైన ఆటలో చతికిలపడితే ఎలా ఉంటుంది? మీది అలాంటి పరిస్థితి కాదని నిరూపించుకోవాల్సిన సందర్భం ఇది. పోటీ తీవ్రంగానే ఉండబోతోంది. అయినా హైరానా వద్దు. సీరియస్గా ప్రయత్నిస్తే విజయం సాధ్యమే. నావల్ల కాదనే అపనమ్మకం వీడండి. అలాగని అతి ఆత్మవిశ్వాసమూ పనికిరాదు. చదువును ఒక పనిలా కాకుండా, జీవితంలో ఒక భాగంగా చేసుకుంటూ సరదాగా ముందుకెళ్లాలి. మనసుని పక్కదారి పట్టించే వాటిని పక్కన పెట్టాలి. ఒకవేళ ఈ ప్రయత్నంలో విఫలమైనా వచ్చే నష్టమేమీ లేదు. ఈ అనుభవం ఇతర పరీక్షలకు దిక్సూచిలా ఉంటుంది. వ్యక్తిగత జీవన నైపుణ్యాలు పెరగడానికి దోహదపడుతుంది. కొలువు సాధించడం, జీవితంలో పైకెదగడం నిరంతర ప్రయాణంలాంటివి.


*‘హిట్’ సూత్రం వాడండి*

- గీతా చల్ల్లా, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్


ఉద్యోగం సాధించడానికి దాదాపు అందరూ ఒకేరకమైన పుస్తకాలు చదువుతారు. కోచింగ్ సెంటర్లో ఒకేలా పాఠాలు చెబుతారు. పరీక్ష సమయమూ ఒకటే. మరి కొందరే ఎందుకు విజయం సాధిస్తారు? అంటే అంకితభావం, కష్టమే మనల్ని విజేతలు లేదా పరాజితులుగా నిలబెడతాయి. ఒక లక్ష్యం చేరాలంటే మనస్ఫూర్తిగా (హార్ట్ఫుల్), బలీయమైన కాంక్ష (ఇంటరెస్ట్), నాణ్యమైన సమయం (టైం)తో ప్రయత్నించాలి. దీన్నే ‘హిట్’ సూత్రం అంటుంటారు. చదివేటప్పుడు మనసుని కేంద్రీకరించలేకపోతున్నామని చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు. మనసు శరీరాన్ని నియంత్రిస్తుందనేది వాస్తవం. కానీ శరీరాన్ని వంచి, కదలకుండా ఒకేచోట ఉంచితే మనసు సైతం అధీనంలోకి వస్తుంది. మనల్ని ఓడించేవి, గెలిపించేవి మన ఆలోచనలే. మనం నీటిలో మునిగిపోతున్నప్పుడు బంధాలు, సరదాలు.. ఇవేవీ గుర్తుకు రావు. ధ్యాస శ్వాస తీసుకోవడం మీదే ఉంటుంది. అలాగే గెలవాలనే కోరిక అనుక్షణం 

దహిస్తుండాలి...

దహిస్తూ ఉండాలి.....

దహిస్తూ ఉండాలి..........


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE