NaReN

NaReN

Sunday, April 17, 2022

👨‍👦నాన్న ఆదర్శం

 👨‍👦నాన్న ఆదర్శం

 

 *విజయ్  పదవ తరగతి చదువుతున్నాడు. చదువంటే ఆసక్తి ఉండకపోవడంతో … తరగతి గదిలో ఎప్పుడూ ఎవరో  ఒకరితో మాట్లాడతూనే ఉండేవాడు. కానీ పరీక్షలంటే మాత్రం భయం. బడి నుండి వచ్చాక కూడా  హోంవర్క్ లాంటివి చెయ్యకుండా ఆటలకు   వెళ్తుంటాడు.  లేదంటే  ఫోనుతో కాలక్షేపం చేసేవాడు.*  


 *వాళ్ల నాన్న సుందరం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పొద్దున్నే  వెళ్లి రోజంతా ఆటో నడిపి , రాత్రికే ఇంటికి  వస్తాడు. కొడుకు  చదువు గురించి పట్టించుకునే తీరిక ఉండేది కాదు. వాళ్ళమ్మ  చెప్పినా విజయ్ పట్టించుకునేవాడు కాదు.* 


 *తండ్రి వచ్చేసరికి విజయ్ నిద్రపోతూ  కనబడతాడు. ఎప్పుడైనా మధ్యాహ్నం భోజనానికి వస్తే ….   అప్పుడు  విజయ్ బడిలో ఉంటాడు. తెల్లవారు జామునే ఆటో నడిపేందుకు వెళ్తూ …. కొడుకుని చదువుకోమని చెప్పి వేకువనే నిద్ర లేపుతాడు సుందరం.*   

 *“అలాగే” అనేసి అతడు వెళ్ళిపోగానే  ముసుగు తన్నేస్తాడు విజయ్.* 


 *విద్యార్థి జీవితానికి పదో తరగతి విలువైనదని, సమయం వృధా చేయవద్దని చెప్పినా పట్టించుకోని కొడుకు గురించి తల్లిదండ్రులు దిగులు పడుతుండేవారు. విజయ్ కి  చదువు మీద శ్రద్ధ పెరగాలని బడిలో ఉపాధ్యాయుల చేత, వీధిలో మిత్రులతో చెప్పించాడు కానీ విజయ్ లో మార్పు రాలేదు.*  


 *“వేకువనే లేచి చదివితే బాగా గుర్తుంటుంది . పరీక్షలలో  చక్కగా జవాబులు వ్రాయగలవు.  బాగా చదువుకుంటే … మంచి ఉద్యోగం దొరుకుతుంది.* *నెలయ్యేసరికి జీతం వస్తుంది. జీవితంలో సుఖపడతావు. కాలాన్ని వృధా చెయ్యకు” అని బామ్మ కూడ విజయ్ కి చెబుతుండేది.* 

 *“ నువ్వూరుకో బామ్మా. ఎప్పుడూ విసిగిస్తావు. గతేడాది కరోనా వల్ల  స్నేహితులంతా  పదోతరగతి పాసయ్యారు.   మళ్ళీ కరోనా లాంటి వైరస్ వస్తే నన్నూ  పాసు చేస్తారు” అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చేవాడు.*  


 *ఒకసారి సుందరం ఆటోలో రచయిత గంగారాం  ప్రయాణించాడు .*

 *ఆయనని గుర్తుపట్టిన సుందరం మాటలు కలిపాడు. తన నేపథ్యం చెప్పిన తరువాత విజయ్ గురించి కూడా  చెప్పాడు . వాడిలో మార్పు రావడం లేదని, వాడి భవిష్యత్తు నాశనమవుతుందని భయంగా ఉందని బాధ పడ్డాడు.* 


  *“రేపు ఉదయం ఒక  బడిలో సమావేశానికి వెళ్తున్నాను. మీ అబ్బాయిని తీసుకుని అక్కడకి రండి” అని అడ్రస్ తదితర వివరాలున్న కాగితాన్ని ఇచ్చాడు గంగారాం.* 


 *మరుసటి రోజు బడికి సెలవు పెట్టించి మరీ గంగారాం చెప్పిన సమావేశానికి కొడుకుని తీసుకుని వెళ్లాడు  సుందరం.*  *అప్పటికి సమావేశం ప్రారంభమైంది. పిల్లల నుద్దేశించి గంగారాం మాట్లాడుతున్నాడు.* 

 *వారితో చదువు ఆవశ్యకతా, భవిష్యత్ అవకాశాలు,  ఉపాధి మార్గాలు వివరించాడు.* 


 *అందుకు ఉదాహరణగా తమ కుటుంబ విషయాన్ని కూడా ప్రస్తావించాడు.* 

 *తమ  అన్నదమ్ముల్లో పెద్దవాడు తప్ప మిగతా ముగ్గురూ బాగా చదవడం వల్ల మంచి ఉద్యోగాల్లో స్థిరపడినట్టు , కుటుంబ పరిస్థితులు కారణంగా చదువు మీద శ్రధ్ధ పెట్టలేకపోయిన అన్నయ్య మాత్రం  పల్లెటూరులో ఎదుగూ బొదుగూ లేని జీవితం గడుపుతున్నట్టు వివరించాడు.* 

 *తరువాత సుందరాన్ని చూసిన గంగారాం వేదిక మీదకు వాళ్ళను ఆహ్వానించాడు.* 


 *విజయ్ ని తీసుకుని వేదిక మీదకు వెళ్ళాడు సుందరం. వాళ్ళని సభకు పరిచయం చేసాడు గంగారాం.*   

 *సుందరానికి మైకు ఇచ్చి “నిన్న ఆటోలో వెళుతున్నప్పుడు నాతో చెప్పిన మాటల్నే  పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పండి” అన్నాడు.*  


 *సుందరం ‘ నేను పదోతరగతిలో ఉన్నప్పుడు రోజూ మా నాన్న వేకువనే నిద్రలేపి చదవమనేవాడు. కానీ  బద్ధకించేవాణ్ణి.   నాన్నని మోసగించి నిద్రపోయేవాణ్ణి . ఫలితంగా  బొటాబొటి మార్కులతో టెన్తు పాసయ్యాను.   ఇంటర్ ఫెయిలయ్యాను. బ్రతుకు తెరువు కోసం ఆటో నడుపుతున్నాను. మామూలుగా వచ్చే డబ్బు కంటే యాభైశాతం ఎక్కువ వస్తుందని రోజూ వేకువనే   మూడింటికి  లేచి ప్రయాణీకుల కోసం వెళుతున్నాను.* 


 *అదనంగా వచ్చే డబ్బుతో  కుటుంబ అవసరాలు తీరుస్తున్నాను.  నాన్న చెప్పినట్టు అప్పుడొక   మూడు నాలుగేళ్ళు వేకువనే లేచి బాగా  చదివుంటే ఉద్యోగం తప్పక దొరికేది. చదివే  రోజుల్లో  బద్ధకించాను కాబట్టి బ్రతికినన్నాళ్ళు వేకువనే ఆటో నడపడం కోసం లేవాల్సి వస్తోంది. చదువుకునే వయసులో అశ్రద్ధ చేసారంటే నాలాగే మీరూ కష్టపడాలి. అందుకే చదువు పట్ల నిర్లక్ష్యం పనికిరాదు” అన్నాడు.* 

 *ఆ మాటలకు అందరూ చప్పట్లు కొట్టి సుందరాన్ని* *అభినందించారు. సుందరాన్ని హత్తుకుని “ఇంతకంటే మంచి ఉదాహరణ నేను కూడా చెప్పలేను” అన్నాడు గంగారం.* 

 *ప్రక్కనే ఉన్న విజయ్ ఏడ్చుకుంటూ వెళ్లి తండ్రి పాదాల మీద పడి “క్షమించు నాన్నా. బుద్ధొచ్చింది.* 

 *మీరు చెప్పినట్టే క్షణం వృధా చేయకుండా రేపటి నుండి చదువుతాను” అన్నాడు.* 


 *సుందరం వినమ్రంగా గంగారాం కు నమస్కరించాడు.  “మీరే మీ కొడుకులో మార్పుకి కారణమయ్యారు” అని విజయ్ భుజం తట్టాడు ఆయన.* 🌈


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE