NaReN

NaReN

Wednesday, March 2, 2022

లాయరా మజాకా

 'లా' చదివే విద్యార్ధిని వాళ్ళ ప్రొఫెసర్ గారు అడిగారు "నువ్వు ఒక కమలా పండుని ఎవరికైనా ఇవ్వాలంటే ఎలా ఇస్తావూ?" అని.


అప్పుడు ఆ విద్యార్ధి "ఈ కమలా పండు తీసుకో" అంటాను" అన్నాడు.


"అలా కాదు, ఒక లాయర్ లాగా చెప్పాలి" అన్నారు ప్రొఫెసర్ గారు.


అప్పుడు ఆ విద్యార్ధి ఈ విధంగా చెప్పాడు.


"ఆన .... 2022 వ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తేదీకి సమానమైన శ్రీ ప్లవ నామ సంవత్సరం, మాఘ బహుళ అష్టమి గురువారం నాడు మురళీ కృష్ణ అనబడే నేను, వయసు 20 సంవత్సరాలు, తండ్రి పేరు విఠల్ రావు, గుంటూరు పట్టణం, బ్రాడీపేట ప్రస్తుత మరియు శాశ్వత నివాసియై ఉన్నాను. నేను పూర్తి స్పృహతో, స్వతంత్ర్యముగా ఆలోచించి, ఎటువంటి వత్తిడులు లేకుండా మనఃస్పూర్తిగా, సంకల్పశుధ్ధితో  కమలా పండు అని అందరిచే పిలువబడే ఈ పండుపై, దాని తొక్కపై, దాని రసముపై, దానిలోని గిఃజలపై, దాని గుజ్జుపై నాకు సంపూర్ణ హక్కుభుక్తములు కలవనిన్నీ, ఈ పండుని, తొక్కని, తొనలను, గింజలని, రసమును, గుజ్జును కలిపి కానీ, విడివిడిగా కానీ ఆచంద్రతారార్కం అనుభవించే స్వేఛ్ఛ మరియు హక్కు నాకు కలవనిన్నీ ధృవీకరించుచున్నాను.


ఇందుమీదట ఈ కమలాపండును, దాని తొక్కను, తొనలను, గింజలను, గుజ్జును కలిపి కానీ, విడివిడిగా కానీ, కోసి కానీ, రసము తీసుకుని కానీ  మీరు దాన, వినిమయ, విక్రయాది సర్వహక్కులతో ఇష్టపూర్వకముగా అనుభవించులాగున ఈ దఖలు దస్తావేజు దఖలు పరచడమైనది.


ఈ విషయమందు నన్ను ఎవరు ప్రలోభపెట్టలేదనిన్నీ, భయపెట్టలేదనిన్నీ, నా ఈ నిర్ణయంపై ఎవరియొక్క అనుచిత ప్రభావం లేదనిన్నీ మీకు చెప్పి నమ్మించి ఈ కమలా పండును మీకు సర్వహక్కులతో ఇచ్చుచున్నాను.


ఈ కమలాపండు మీద ఇప్పటివరకు నాకు తప్ప మరెవరికీ ఎటువంటి భాజ్యమైన లేదా అవిభాజ్యమైన హక్కు లేదనిన్నీ, ఇకముందు ఈ కమలాపండుపై ఎటువంటి తగాయిదాలు వచ్చినా నా స్వంత ఖర్చులతో పరిష్కరించెదనని హామీ ఇచ్చుచున్నాను.


ఈ దఖలు దస్తావేజు రిజిస్టరీ అయిన అనంతరం ఈ కమలాపండుపై నాకు ఎటువంటి హక్కు లేదనిన్నీ, ఎటువంటి సంబంధమూ లేదనిన్నీ ధృవీకరించుచున్నాను.


😛😛😛

2 comments:

  1. 😳😳🤣🤣కమలా పండు తో జీవితం తెలిపారండి

    ReplyDelete

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE