NaReN

NaReN

Tuesday, November 15, 2022

పురోగమనమా.... తిరోగమనమా.....

 పురోగమనమా....   తిరోగమనమా.....


నాడు.. కష్టించటం.. సంపాదన మార్గమైతే…

నేడు.. మోసం.. సంపాదన సాధనమయ్యింది!

నాడు.. మంచి.. శిరోధార్యమైతే….

నేడు.. శిరోభారమయ్యింది!

నాడు.. సద్గుణుడు.. గౌరవనీయుడైతే….

నేడు.. అసమర్థుడయ్యాడు!

నాడు.. పండితులు.. పూజ్యనీయులైతే….

నేడు.. పేదరికంలో మగ్గుతున్నారు!

నాడు.. గురువులు.. గౌరవింపబడితే….

నేడు ..వేధింపుకు గురవుతున్నారు!

నాడు.. మద్యం.. మచ్చగా మిగిలితే….

నేడు.. మాననీయమయ్యింది!

నాడు.. విడాకులు.. విషతుల్యమైతే….

నేడు.. సర్వసామాన్యమయ్యాయి!

నాడు.. స్వార్ధం విడిచి.. సంఘ జీవనం చేస్తే….

నేడు.. స్వార్ధం.. సంఘాన్ని ముక్కలు చేస్తోంది!

నాడు.. అమ్మానాన్నలు.. దేవుళ్లుగా కొలవబడితే….

నేడు.. దెయ్యాలుగా కనబడుతున్నారు!

నాడు.. దేవుడు.. ఫలాపేక్ష లేకుండా పూజింపబడితే….

నేడు.. కోరికల చిట్టాతో.. కొలవబడుతున్నాడు!

నాడు.. ప్రకృతి.. పూజింపబడితే….

నేడు.. పరిహసింపబడుతుంది!

నాడు.. ధర్మం.. జీవన విధానమైతే….

నేడు.. అక్రమం.. ఆదాయమార్గమయ్యింది!

నాడు.. శక్తియుత్తులు.. దుష్ట శిక్షణకైతే….

నేడు.. దుష్ట కార్యాలకు.. వేదికలయ్యాయి!

నాడు.. పాలకులు.. ప్రజాక్షేమానికి పనిచేస్తే….

నేడు.. పదవులకొరకు.. పని చేస్తున్నారు!

నాడు.. విద్య.. వివేకార్జనకైతే….

నేడు.. విత్తం కోసమయ్యింది!

నాడు.. మంచివాడు.. మహనీయుడైతే….

నేడు.. మూర్ఖుడు... మాననీయుడయ్యాడు!

నాడు.. అనుబంధాలది.. అగ్ర స్థానమైతే….

నేడు.. ఆర్ధిక బంధాలు.. అందలమెక్కాయి!

నాడు.. కుటుంబం.. కళకళ లాడితే….

నేడు.. కళతప్పి.. కన్నీరు కారుస్తోంది!

నాడు.. సంస్కారం ..సుగంధం వెదజల్లితే….

నేడు.. కుసంస్కారం.. కుళ్ళు కంపు కొడుతోంది!

నాడు.. విలువలు.. వలువలు కడితే….

నేడు.. నగ్నంగా.. నడిరోడ్డుపై నిలబడ్డాయి!

నాడు.. ఆధ్యాత్మికత... అందలమెక్కితే….

నేడు.. భౌతికత ..బరి తెగించింది!

నాడు.. కవిత్వం.. కొలువుతీరితే….

నేడు.. కపిత్వం.. చెలరేగుతోంది!

నాడు.. కవులు.. కుళ్ళు కడిగేస్తే…

నేడు.. కుళ్లుకు.. దూరంగా జరుగుతున్నారు!

నాడు.. సృజనాత్మకత.. నిర్భయ అయితే….

నేడు.. అత్యాచార బాధితురాలయ్యింది!

నాడు.. క్షమాగుణం.. సాకారమైతే….

నేడు.. ప్రతీకారం.. పురివిప్పింది!


ప్రస్ఫుటమవుతున్నాయి….

పురోగమిస్తున్న సమాజపు….

తిరోగమన సూచికలు !

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE