NaReN

NaReN

Saturday, November 26, 2022

పూల వాసన

 *పూల వాసన*


ఒకరోజు పది మంది జాలరులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. సాయంత్రానికి చేపలతో సహా తీరానికి చేరుకున్నారు. చేపలను బుట్టల్లో వేసుకొని ఇంటికి బయల్దేరారు. ఇంతలో ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. భారీ వర్షం మొదలైంది. జాలరులకు ఏం చేయాలో పాలుపోలేదు. చుట్టూ చూడగా దూరంగా ఒక చిన్న ఇల్లు కనిపించింది. అందరూ పరుగు పరుగున ఆ ఇంటి అరుగు మీదికి చేరుకున్నారు. బయట అలికిడి విని.. ఆ ఇంటి యజమాని బయటకు వచ్చాడు. అరుగు మీదున్న జాలరులతో.. ‘లోపలికి రండి. వర్షం తగ్గాక వెళ్లిపోవచ్చు’ అన్నాడు. బుట్టలు అరుగు మీద పెట్టి.. జాలరులు లోనికి వెళ్లారు. ఆ ఇంట్లో ఓ మూలన రాశులుగా పూలు, దండలు ఉన్నాయి. మల్లెలు, సంపెంగల పరిమళం ఇల్లంతా వ్యాపించింది. జాలరులు పూల వంక ఆశ్చర్యంగా చూస్తూ.. ఇంట్లో ఓ మూలన కూర్చున్నారు. ‘రాత్రంతా వర్షం కురిసేలా ఉంది. రాత్రి ఇక్కడే నిద్రించి రేపు ఉదయం వెళ్లొచ్చు’ అన్నాడు ఇంటి యజమాని. తన భార్యతో చెప్పి వారికి రుచికరమైన భోజనం పెట్టించాడు. అందరూ తృప్తిగా తిన్నారు. నిద్రకు ఉపక్రమించారు. ఆ ఇంటి యజమాని కుటుంబం హాయిగా నిద్రపోయింది. ఈ జాలరులకు మాత్రం నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి దాటుతున్నా.. కునుకు రాలేదు. ఆ పది మందిలో ఒకడు లేచి.. అరుగు మీదున్న చేపల బుట్ట తెచ్చుకుని.. తల దగ్గర పెట్టుకుని పడుకున్నాడు. కాసేపటికే అతడికి నిద్ర పట్టింది.


తెల్లవారే సరికి పది మంది జాలరుల తలల దగ్గర చేపల బుట్టలు ఉన్నాయి. రోజూ చేపల వాసన మధ్య పడుకునే వారికి పూలవాసన సరిపడలేదు. చేపల బుట్టలు తెచ్చుకున్నాక గానీ వారికి నిద్ర పట్టలేదు. పూర్వ సంస్కారం ఎలాంటిదో చెప్పే కథ ఇది. దృశ్యవాసనలు, విషయ భోగ విలాసాలే గొప్పవిగా భావిస్తుంటారు చాలామంది. వాటిని అధిగమించడానికి ప్రయత్నించరు. మంచిని అంత తొందరగా గ్రహించలేరు. కనీస ప్రయత్నం చేయకుండా.. ‘నా వల్ల కావడం లేదంటూ.. మళ్లీ పాత సంస్కారాన్నే పాటిస్తూ ఉంటారు. వాసనలు అనుకున్నంత బలీయమైనవి కావు. వివేకవంతులు ఈ విషయాన్ని గుర్తించి.. తమ తప్పులను తాము దిద్దుకుంటారు. వాసనలు వదిలేసి ఉత్తములుగా నిలబడతారు.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE