NaReN

NaReN

Wednesday, November 16, 2022

పాత రోజుల్లో....

 పాత రోజుల్లో




*పాత రోజుల్లో పెళ్లిచూపుల్లో "అమ్మాయిని పెద్దబాలశిక్ష వరకూ చదివించాము, నోటి లెక్కలు వచ్చు. చాకలి పద్దులు అవీ వ్రాయడం తెలుసు." వంటి మాటలు ఉండేవి కదా, గుర్తున్నాయా.! ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ ఏ మీడియం అయినా సరే, తెలుగువారి విద్యాశాఖ క్రింద ఉండే ప్రతీ బడిలో ఈ పుస్తకాన్ని తప్పనిసరి చేస్తే చాలు. ఈ పుస్తకం పుట్టుకకు కారణం కూడా ఇంగ్లీషువాడే! 1832లో ఓదొరగారి పిల్లల అవసరం మేరకు మన తెలుగు వారైన పుదూరు సీతారామ శాస్త్రి గారిచే 48 పేజీలతో మొదలైన ఈ పుస్తకం,1856 నాటికి 78పేజీలకు పెరిగి, 1865 నాటికి మరిన్ని విషయాలను తనలో చేర్చుకుని, "బాలల వివేక కల్పతరువు"గా పేరుపెట్టబడినది.1912లో వావిళ్ళ రామశాస్త్రులు అండ్ సన్సు వారిచే పెద్దబాలశిక్షగా నామకరణం చేయబడి ముద్రణ చేయబడినది. ఇప్పుడు 2019నాటికి 18పర్వాలుగా రెండు భాగములుగా అందుబాటులో ఉన్నది. దీనిని పది భాగములుగా విభజించి, ఒకటి నుంచి పది వరకూ ప్రతీ తరగతిలో తప్పని సరి చేసినచో ఏ మాధ్యమ బోధనఅయిననూ తెలుగు భాషకు ఇబ్బంది కాబోదు. తెలుగు వాచకము ఒక సబ్జెక్టుగా అలాగే కొనసాగుతూనే, పెద్దబాల శిక్ష ఒక ఉపవాచకముగా యున్నచో బాగుంటుందని అనిపిస్తుంది. పైపని అయ్యేనో లేదో గానీ మనం మాత్రం పిల్లలకు నేర్పుకుంటే చాలా ఉపయుక్తం. ఇంగ్లీషు మాధ్యమంలో ప్రాథమిక విద్యనభ్యసించిన నాకు, అదే కాలంలో తెలుగు మీద బెరుకులేకుండా, ఒకవిధంగా ప్రీతి పాత్రంగా అవడానికి ప్రథమ కారణం ఇంటిలో ఈ పెద్దబాలశిక్ష బోధించటమే. అక్షరమాలతో మొదలై వారాలు, నెలలు, తిథులు, నక్షత్రాలు, ఋతువులు, ప్రభవాది సంవత్సరముల నామావళి, ఎక్కములు, లీలావతి లెక్కలు, బల్లి శకునములు, శతక పద్యములు, సామెతలు, నీతి కథలూ ఇంకా చాలా వాటికి రెడీ రెక్నార్ గా తెగ వాడేవాళ్ళం. ఒక విధంగా తెలుగు విజ్ఞాన సర్వస్వం అది. ఇప్పుడు ఇంకా చాలా చాలా జోడించారు. ఇంట్లో పిల్లలకు నేర్పండి, తెలుగు దిగులు వదిలేయండి. కుదరదంటారా మన పిల్లల కోసం మనకే కుదరకపోతే ఇంకెవ్వరికీ కుదరదు.*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE