NaReN

NaReN

Monday, May 2, 2022

నవ్వుల దినోత్సవం

 

నవ్వుల దినోత్సవం

ప్రతి సంవత్సరంలో మే నెల తొలి ఆదివారంనాడు ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని జురుపుకుంటారు. 

ఈ రోజే కాదు ప్రతి రోజూ మనం 

నవ్వుతూ

నవ్విస్తూ

మనం నవ్వులపాలవకుండా

ఎదుటవాళ్ళని నవ్వులపాలుచేయకుండా

నవ్వుతూ కలకాలం గడపాలని కోరుకొందాం.


నవ్వు ఒక యోగం నవ్వక పోవడం ఒక రోగం నవ్వించడం ఒక యోగం  చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిలా జీవించాలి .

కష్టాలు కన్నీళ్లు  ఎన్ని వచ్చినా నవ్వుతూనే బ్రతుకు .....

మనిషి పుడుతూ.. ఏడుస్తాడు, చనిపోతూ... ఎడిపిస్తాడు, ఈ రెండు ఏడుపుల మధ్య జీవితం నవ్వుతూ.. నవ్విస్తూ... గడపాలి.


 నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం  అన్నారు జంద్యాల గారు.


ఇదివరకు మనవాళ్ళు నవ్వు నాలుగు విధాలా చేటు అన్నారు. కాని ఇప్పుడు నవ్వు నలభై విధాలా గ్రేటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.


నవ్వడం వలన శరీరంలోనున్న రోగాలన్నీ మటుమాయమవు తాయని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.


నవ్వడం మూలాన జీవితంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలనుంచి దూరంగా ఉండొచ్చు.


 ఇప్పుడు మన దేశంలోకూడా నవ్వుల దినోత్సవాన్ని ఘనంగానే జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా నవ్వుల పండుగను ఆస్వాదిస్తున్నారు. 


నవ్వు గురించి బోలెడు విశ్లేషణలు ఉన్నాయి. ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా చిరునవ్వు విలువ చెబుతూ ఉంటారు. నవ్వులు ఎన్నో రకాలు. నవ్వుకూ చిరునవ్వుకూ చాలా తేడా ఉంది. నవ్వీ నవ్వనట్లుగా, పెదాల మధ్య స్వచ్ఛమైన పువ్వుల్లా విచ్చుకునేదే చిరునవ్వు. ఆంధ్ర మహాభారతాన్ని రాసిన తిక్కన సోమయాజి కూడా నవ్వులను 32 రకాలుగా వర్ణించారు. అందులో మొదటిది చిరునవ్వే. అమెరికాలోని బాల్‌ మెమోరియల్‌ హాస్పిటల్‌ అనే సంస్థ 18 రకాల నవ్వులను గుర్తించింది.


నవ్వులు ఎన్ని ఉన్నా, చిరునవ్వు ప్రత్యేకతే వేరు. మనకు అత్యంత ఆత్మీయులు ఎదురైనప్పుడు మాటకన్నా ముందుగా మనసులోంచి ఉబికివచ్చే భావనే చిరునవ్వు. కొద్దిపాటి పరిచయాలను కూడా దృఢపరిచి, స్నేహంగా మార్చేశక్తి చిరునవ్వుకు సొంతం. ఇక నవ్వు విలువ తెలియక చాలా మంది నవ్వే తెలియనట్లు ఉండిపోతారు. కొందరు చీటికిమాటికి రుసరుసలాడుతూనే ఉంటారు. 


ప్రపంచాన్ని జయించే శక్తి అణ్వాయుధాల కన్నా, చిరునవ్వుకే ఉంది. ఇది శత్రువులైనా సులువుగా అర్థం చేసుకోగల శాంతి సంకేతం.


 ఏ వ్యక్తి అయినా నిరాశ, నిస్పృహలోంచి బయటపడాలంటే చిరునవ్వు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం చిందించే చిరునవ్వు ఇతరుల బాధలను కూడా మాయం చేస్తుంది. చిరునవ్వుతో ఉన్న మోము మానసిక ఆరోగ్యానికి ప్రతిబింబంగా ఉంటుంది. అలాగే అభిప్రాయ బేధాలను కూడా దూరం చేయగల శక్తి చిరునవ్వుకే సాధ్యం. శరీరంలో రోగనిరోధక శక్తిని మింగేసే కార్టిసోల్‌ అనే పదార్థంపై చిరునవ్వు ప్రభావం చూపి, దాన్ని అణిచివేస్తుందని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు.


వందసార్లు చిరునవ్వు నవ్వితే పది నిమిషాల వ్యాయామంతో సమానమవుతుందని అంటున్నారు. 


నగర జీవనంలో ఒత్తిళ్లతో కూడిన జీవనానికి చిరునవ్వు ఒక టానిక్‌లా పనిచేస్తుందని మనోవికాస నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు, యువకులు, గృహిణులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారికి నవ్వు ద్వారా రిలాక్స్‌ అయ్యే లాఫింగ్‌ థెరపీ అవసరం.


ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరిదీ ఉరుకులు పరుగుల జీవనం. గడియారంలోని ముళ్లలా క్షణం వృథా కాకుండా చూసుకోవాలి. నిత్యం ఒత్తిళ్లే. విద్యార్థులకు చదువు, గృహిణులకు వంటావార్పు, ఇల్లు చక్కబెట్టుకోవడం, ఉద్యోగులకు కార్యాలయాల్లో గుట్టలుగా పేరుకుపోయిన ఫైళ్లు...ఇలా అన్ని వర్గాల వారూ మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఈ తరుణంలో ఇంట్లోని కుటుంబ సభ్యులను కూడా పరస్పరం చిరునవ్వుతో పలుకరించడం చాలా కుటుంబాల్లో మర్చిపోతున్నారు. పిల్లలైతే పాఠశాలకు ఆలస్యమైతే అసహనం, విసుగు, చిరాకు, భయం ముఖానికి అట్టిపెట్టుకుంటున్నారు.


 ఆఫీసుకు ఏమాత్రం ఆలసమైనా ఉద్యోగులు కుటుంబ సభ్యులను కసురుకుంటారు. చిరుబుర్రులాడుతారు. ఈ మానసిక ఒత్తిళ్లతో ఉదయం ఇంటినుంచి బయట పడుతున్నారు. దారిలో ఏ బాటసారి అడ్డు వచ్చినా, ఇతర వాహనాలు ముందు నిలిచి విసిగించినా తిట్లదండకం అందుకుంటారు. వీటిని అధిగమించేందుకే లాఫింగ్‌ థె రపీ అలవాటు చేసుకోవాలని యోగా నిపుణులు చెబుతున్నారు.


 ఎదుటివారు ఎంత మనసు గాయం చేస్తున్నా దాన్ని చిరునవ్వుతోనే సంతోషంగా జయించాలని వారు సూచిస్తున్నారు. ఒక చిన్న చిరునవ్వు వందమంది హిట్లర్లకు ఉన్నంత కోపాన్నికూడా జయిస్తుందని వారు చెబుతున్నారు. 


పెదవులపై విరిసీ విరియనట్లు మెరిసే చిరునవ్వుతో ఆత్మీయులకు మరింత ఆత్మీయంగా మెలగాలని వారు సూచిస్తున్నారు.


 చిరునవ్వులతో బతకాలి...

ఎదుటి వారిని చిరునవ్వుతో పలుకరించి చూడండి. వారు మీకు ఆత్మీయులైపోతారు. ప్రశాంత వదనంతో ఉండి, సన్నటి స్మైల్‌ను మీ పెదవులపై జాలువార్చి చూడండి. నలుగురిలో మీరుంటే అక్కడ మీరే సెంట్రల్‌ అట్రాక్షన్‌గా మారిపోతారు. ద్వేషించే వారిని కూడా దగ్గరకు చేర్చే శక్తి ఈ ప్రపంచ భాషకు ఉంది. ముఖంపై చిరునవ్వు ఉంటే చాలు ప్రత్యేకంగా మళ్లీ మేకప్‌ వేసుకోవాల్సిన అవసరం రాదని అంటారు ప్రముఖ హాస్య నటుడు చార్లీ చాప్లిన్‌. 


నవ్వు మన వ్యక్తిత్వాన్ని అద్దంలా చూపిస్తుంది. ఒక నవ్వు కళ్లతో లోతుగా పలుకరిస్తుంది. మరో నవ్వు ఆత్మీయతను ప్రేరేపిస్తుంది.

ఇంకోనవ్వు నేరుగా హృదయపు లోతుల్లోకి తొంగిచూస్తుంది. అవతలి వాళ్లు మూడీగా ఉంటే మీ చిరునవ్వే వాళ్లలో ఉత్తేజాన్ని నింపుతుంది. లోపల ఏదో వెలితి, కలత ఉంటే బహుశా మీ చిరునవ్వు వారికి భరోసా కలిగిస్తుంది. మానవ సమాజంలో చిట్టిచిట్టి పాపాయిల బోసి నవ్వుల నుంచీ ఆవిర్భమైన ఈ నవ్వుల ప్రక్రియ వారు ఎదిగే క్రమంలో మానవ సంబంధాలను కలుపుకునేందుకు ఒక ఆభరణంగా నిలుస్తుంది. ఇంకా మనలోని సకల ఒత్తిళ్లను వెలికి పంపుకునేందుకు ఒక వాహికగా నిలుస్తుంది.


 ఆహ్లాదానికి చిరునామా చిరునవ్వే...ఏ వ్యక్తి అయినా ఆహ్లాదంగా గడపాలంటే చిరునవ్వు ఒక ప్రధాన కారణంగా నిలుస్తుంది. ‘ఎదుటి వ్యక్తులను చిరునవ్వుతో పలుకరించడం నేర్చుకుంటే ఈ ప్రపంచంలో నీకు శత్రువులంటూ ఎవరూ ఉండరు’ అంటారు ప్రముఖ తత్వవేత్త ఆరిస్టాటిల్‌. 


మనం దైనందిన ఒత్తిళ్లను అధిగమించేందుకు చిరునవ్వు అనే టానిక్‌ను కచ్చితంగా ఉపయో గించు కోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఇంటి నుంచీ ఆరంభిస్తే మంచి ఫలితాలు ఉంటాయని మనోవికాస నిపుణులు చెబుతున్నారు. 


పిల్లలు తమ తల్లిదండ్రులను చిరునవ్వుతో పలుకరించడం, అలాగే పెద్దలు కూడా పిల్లలను చిరునవ్వుతో నిద్రలేపడం, విసుగు, అలసట, కోపం, చిరాకు వంటివి ఇంట్లో ఎవరూ ప్రదర్శించకపోతే ఆఇల్లు చిరునవ్వుల లోగిలిగా మారుతుంది. చిరునవ్వును ఆభరణంగా పెట్టుకొని బగయటకు బయలుదేరితే ఆరోజంతా సంతోషకరమైన సందర్భాలే ఎదురవుతాయి.


నవ్వుల దినోత్సవం సందర్భంగా  మిత్రులందరికీ నవ్వుల శుభదినం

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE