NaReN

NaReN

Sunday, June 12, 2022

బండికథ!


బండికథ!

‘నాకైతే రాయల్ ఎన్‌‌ఫీల్డే కొనుక్కోవాలనుంది. నా యవ్వనమంతా సిటీబస్సులు, స్కూటీ పెప్పులతో గడిచిపోయింది. ఇప్పటికైనా బుల్లెట్ మీద అమ్మనెక్కించుకుని అలా ఆచ్చెళ్లాలని అనిపించకూడదా? ‘ఎంతసేపూ ఫేస్‌బుక్‌లో లైకులే తప్ప బైకుల గురించి ఏ ఆలోచనా రాదా నీకూ?’ అని పోరుపెడుతోంది మీ అమ్మ ఎప్పట్నుంచో!’


ఆపై ఇక మాటరాక గొంతు గద్గదమై ఆగిపోయాను. కొడుకులిద్దరూ ఏదో చర్చలో పడ్డారు. బయటికి వినబడకుండా గొణుక్కోవడం తెలుస్తోంది. మధ్యలో ‘ఓవరేక్షన్’ అన్న మాటేదో గుసగుసగా వినబడి తలెత్తాను. ఇద్దరూ నవ్వాపుకుంటున్నారని అర్ధమవుతోంది. ‘ఏంట్రా అంటున్నారూ?’ అని అడిగినా ఎలాగూ చెప్పరు. నాకుతెలుసు. 


కాసేపటికి పెద్దాడు అందుకున్నాడు.


‘ఎన్‌ఫీల్డ్ గురించైతే చూడక్కర్లేదు నానా! చాలా మంచి బండి. నే చెప్పేది ఈ వయసులో అంత బరువున్న బండిని వెనక్కిలాగడం అదీ కష్టంకదా అని! బోన్స్‌లో కాల్షియం డిప్లీషన్ ఉంటుంది కదా? పార్కింగ్ దగ్గర ఎప్పుడైనా ఏ మోకాళ్లో పట్టేశాయనుకో...?’ అంటూ సగంలో ఆపేశాడు. 


చరణొచ్చి చిరంజీవిని వెక్కిరించడమంటే ఇదే! ఈ జూడాగాడు నాకు కాల్షియం గురించి చెప్తాడు! అయినా వాళ్లతో వాదించదలచుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో నేను స్పీకర్ సపోర్ట్ లేని ప్రతిపక్షంలాంటివాణ్ణి. తనెప్పుడూ వాళ్లనే సమర్ధిస్తుంది.


అంచేత కాస్త సంయమనం పాటించి వెంటనే ఆ దృశ్యాన్ని కళ్లముందు కలర్లో ఊహించుకున్నాను. 


మా హాస్పిటల్ వెనకాల చెట్లకింద ‘నో పార్కింగ్’ బోర్డు ముందునించి నా బండి స్టాండ్ తీయబోతోంటే అది నామీదకి వాలిపోతున్నట్టు...


అప్పుడే సెల్ మాటాడుకుంటూ అటుగా వెళుతున్న ఇద్దరు కుర్రాళ్లు నాకు సాయం చేసినట్టు...


అదిచూసి మా నర్సులందరూ నవ్వినట్టూ... 


నేను అవమానభారంతో ‘పాంచాలీ పంచభర్తృకా!’ అంటూ ఇత్తడి చెంబొకటి విసిరేసినట్టూ...


శివశివా! ఇక చాలు!


ఆ కలని టైటిల్స్ స్టేజ్‌లోనే ఆపేసి దిగులుగా మొహం పెట్టాను.


‘అన్నయ్య చెప్పింది కూడా పాయింటే! వాడిమాట విని ఏ హీరో బండో తీసేస్కో నానా! ఎందుకొచ్చిన బుల్లెట్టు?’ అని మా రెండోవాడు లాప్‌టాపులో దూరిపోయాడు. 


ఇంతకుమునుపెన్నడూ బైక్ నడిపిందిలేదు. ఎప్పుడూ స్కూటీ, హోండా యాక్టివా.. అంటూ నాజూకు బళ్లే తోలాను. మనకి హెల్మెట్ పట్టదన్న సంగతి మీకు తెలుసుగా? ఒకవేళ ఆ కథంతా తెలియకపోతే ఆనక మళ్లీ చెప్పుకుందాం.


కానీ మావూళ్లో ఎంత ఉక్కపోస్తున్నా నల్లటి జర్కినేసుకుని..., 

కళ్లు సరిగ్గా కనబడకపోయినా నల్లటి గాగుల్స్ పెట్టుకుని..., 

తలకి పట్టకపోయినా హెల్మెట్టొకటి పెట్టుకుని...,


సాహోలో ప్రభాస్‌లా బుల్లెట్ బండెక్కి హైవే మీద అరసవిల్లి వెళ్లాలని కోరిక. 


‘ఇదేం కోరికండీ బాబూ, ఏ అరకో వెళ్లాలని అనుకోకుండా అరసవిల్లేవిఁటీ?’ అంటూ ఈపాటికే అవాక్కదీ అయిపోయి ఉంటారు. ఎందుకంటే అరసవిల్లి రోడ్డు బావుంటుంది. గేరు మార్చాల్సిన పనుండదు. పైగా పుణ్యక్షేత్రం కదూ, పుణ్యం ‘పురుషా’ర్ధం కూడా కలిసొస్తాయని!


అయినా నా సరదా తీరుద్దామని పిల్లలిద్దరూ ముందుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూముకే తీసుకెళ్లారు. రిసెప్షన్లో ఇద్దరమ్మాయిలు కూర్చున్నారు. ఒక పిల్ల పేరు నిరాశ, ఇంకొకామె నిస్పృహ. మేనేజర్ నేమ్‌ప్లేట్ మీద నిర్వేద్ అనుంది. నేననుకోవడం మేం ముగ్గురం కొనే బేరం కాదని ముందే ఊహించడంవల్ల వాళ్లంత ఉత్సాహంగా లేరనుకుంటా! అందుకే ఆ పేర్లు పెట్టుకున్నారు.


‘బండి ఎవరికోసం తీసుకుంటున్నారు?’ అన్నాడు ఓకుర్రాడు నన్ను పైనుంచి కిందదాకా పరీక్షగా చూస్తూ. మావాళ్లిద్దరూ నన్ను చూపించారు. అయితే అతనిపేరు శల్యుడు! అతగాడు మమ్మల్ని సాధ్యమైనంత నిరుత్సాహపరుస్తూ, నా బులపాటం మీద బిస్లరీ వాటర్ చల్లుతూ చివరికి మాచేతే ‘సర్లే, వద్దులే బాబూ!’ అనిపించేశాడు.


పెద్దలమాట చద్దిమూటయితే పిల్లల మాట పిజ్జామూటని సామెత! ఇంకెందుకని ఇంకొక షోరూముకి బయల్దేరాం. 


కాస్త ఖాళీగానే ఉంది ఈ షాపు. హండ్రెడ్ సీసీవి, వన్‌ఫిఫ్టీ సీసీవి బళ్లు చూపిస్తున్నాడు షాపబ్బాయి. 


ఒక మోడలేదో కాస్త హైట్ తక్కువగా ఉన్నట్టనిపించి దానిగురించి వివరాలు చెప్పమన్నాం. నేను ఆ బండిగురించే ఎందుకడిగానో కారణం మీకు తెలుసు. కేవలం ఆ మాటదగ్గరే ఆగిపోయి కామెంట్లవీ పెట్టెయ్యకుండా ముందు పోస్టంతా చదవండి మీమొమం!


సరే, అతగాడేమో మెల్లిగా మా దగ్గరకొచ్చి బండి సీటు మీద ప్రేమగా రాస్తూ ‘ఈజీగా త్రిబుల్స్ ఎలిపోవచ్చు సార్! పికాప్ అదిరిపోద్ది!’ అన్నాడు.


నేను వెంటనే రెండుచేతులతో రెండు చెవులూ మూసేసుకుని ‘శివశివా!’ అంటూ ఆర్తనాదం చేశాను. అతను ఉలిక్కిపడి బండిమీంచి చెయ్యి తీసేశాడు.


వెంటనే మా పెద్దాడు అందుకున్నాడు....


‘అపరిచితుడు సినిమాలో రూల్స్ రామానుజం మాలూమ్ హై తేరెకూ? మా డాడీ అదే టైపు. పైపెచ్చు విక్రమ్ పుట్టిన సంవత్సరమే, అదే నక్షత్రంలో పుట్టారు. రోడ్డుమీద డ్రైవ్ చేస్తూ మొబైల్ మాటాడేవాళ్లని ముక్కచివాట్లు పెట్టడం, రాంగ్ సైడ్ వచ్చేవాళ్లని రాచిరంపాన పెట్టడం అంటే ఆయనకి చాలాచాలా ఇష్టం. అటువంటి మా నాన్నతో త్రిబుల్స్ వెళిపోవచ్చంటావా? ఇంకో విషయం... అది త్రిబుల్స్ కాదు. ట్రిపుల్స్!’ అని ఊపిరి తీసుకోవడానికి ఆగాడు.


అప్పుడు నేను చెవులమీంచి చేతులు మెల్లిగా తీసి ‘మైలేజ్ ఎంతొస్తుందో?’ అన్నాను.


అతనీసారి పెట్రోల్ టాంక్ మీద ఆప్యాయంగా నిమురుతూ ‘కంపినీవోడు సెవెంటీ అంటాడుగానండీ మనకి రణింగ్‌లో యాఫై వరకు ఈజీగా వచ్చేస్తద్సార్!’ అన్నాడు.


ఈ కుర్రాడు ఇంతకుముందు అచ్యుతాపురం సంతలో ఆవులవీ అమ్మేవాడనుకుంటాను. వాళ్లుకూడా ఇలాగే, అమ్మకానికి తీసుకొచ్చిన దూడలమీద ఇంత మమకారమూ చూపిస్తూ, ఇలాగే గంగడోలదీ రాస్తూ ఉంటారు.


ఇంకాసేపట్లో మేంగనక ఆ బండిని ఖాయం చేసి తీసుకుంటామనే క్షణాల్లో దాన్ని వదల్లేక ఇతగాడు ఏకంగా కళ్లనీళ్ల పర్యంతమైపోతాడేమో అనిపించింది. 


కానీ మావాళ్లిద్దరికీ ఆ బండి డిజైనదీ నచ్చలేదు. మరీ ప్లెయిన్‌గా ఉందిట! ఒంపుసొంపులేమీ లేవుట! ఎదుగుతున్నారుగా? సరే, సరదాపడనీ!


సరేలెమ్మని బయల్దేరబోతూండగా ఆ కుర్రాడు ‘కొత్తమోడలొకటుంది చూద్దురు రండి!’ అంటూ లోపలి వరండాలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక్కత్తీ ఒంట్రెత్తుగా పార్క్ చేసివున్న నల్లటి నిగనిగలాడే బండిని చూపించాడు. దీన్నైతే ఏకంగా కౌగలించుకుని మాటాడ్డం మొదలెట్టాడు. వీడి దుంపతెగా! తిన్నగా నిలబడలేడా ఏం? అనుకుని మనసులోనే నవ్వుకున్నాను. 


ఆ బండి నాలాంటి బాధ్యతాయుతమైన అంకుళ్ల కోసం తయారైంది కాదు. కాలేజీలో చేరిన మర్నాడే నాన్నని సతాయించి కొనిపించుకుని, తీరా స్టిక్కరింగ్ మాత్రం ‘డాడ్స్ గిఫ్ట్’ అని చేయించుకునే యూత్ కోసం తయారుచేసిన స్టైలిష్ బండది!


సడన్‌గా ఆ బండిని చూసి మావాళ్లిద్దరూ నవ్వుకోవడం కనబడింది నాకు. ‘చెప్పండ్రా!’ అంటే ఏంలేదంటారు. వాళ్లల్లోవాళ్లు గుసగుసగా ‘ఇలియానాలా ఉంద’ని అనుకోవడం వినబడింది. సరే, కుర్రాళ్లు కదా? సిగ్గుపడుతున్నారు. ఎక్కువ రొక్కించకుండా వదిలెయ్యడం మంచిది.


ఎందుకో ఆ షాపులో మనకు ఏదీ నప్పక కాస్తదూరంలోనే ఉన్న ఇంకొక షోరూముకి వెళదామని బయటికొస్తోంటే ఎంట్రన్స్ దగ్గర ఎవరో ఒకాయనకి మేమిందాక మొట్టమొదట చూసిన బండినే చూపిస్తూ ‘ఈజీగా త్రిబుల్స్ ఎలిపోవచ్చు సార్! పికాప్ అదిరిపోద్ది!’ అంటున్నాడు ఆ కుర్రాడు మళ్లీ!


ఆయన మాస్క్ తీసి నవ్వుతూ ‘నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ని తమ్ముడూ!’ అన్నాడు. ఇక అక్కడ నిలబడ్డం అనవసరమని బయటికొచ్చేశాం. 


ఇహ ఈ జన్మలో మారడు వీడు!


ఈ రెండో షాపువాళ్లు చాలా బిజీగా ఉన్నారు. మేం ముగ్గురం గుమ్మంలో అప్పుడే ప్రత్యక్షమైన బ్రహ్మవిష్ణుమహేశ్వరుల్లా పావుగంటపాటు కదలకుండా నిలబడే ఉన్నా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. 


‘పదండ్రా వెళిపోదాం!’ అన్నాను మోహన్‌బాబులా కోపంగా. అయితే మా మనోజ్‌గాడే సర్దిచెప్పి, ఒకబ్బాయిని బలవంతంగా ఆపి మాట్లాడాడు. 


అతను మమ్మల్ని మేడమీదకి వెళ్లి బండి డిజైన్ సెలెక్ట్ చేసుకుని కిందకొచ్చేస్తే బిల్ చేయించేస్తానన్నాడు. 


‘ఇంత స్పీడుగా ఉన్నారేంటి నాన్నా వీళ్లూ? మనకి నచ్చడంతో సంబంధం లేదా?’ అంటూ ఆశ్చర్యపోయాడు విష్ణుగాడు.


‘సర్లేరా, వాళ్లకలా సాగుతోంది. అవసరం మనది, పదండి డాబామీదకి!’ అని బయల్దేరదీశాను.


మొత్తానికి మా ముగ్గురికీ నచ్చిన బండిని సెలెక్ట్ చేసుకుని కిందకొచ్చాం.


వెంటనే ఒకబ్బాయి పెన్నూ, పేపరూ పట్టుకుని ఎదురుగా కూర్చుని ఇన్స్టాల్‌మెంటదీ ఎంతెంత పడుతుందీ లెక్కలు కట్టడం మొదలెట్టాడు. నేనదేదీ వద్దని వారించాను. 


‘ఏట్సార్, ఫైనాన్స్ ఒద్దా?’ అన్నాడు ఆశ్చర్యంగా! ఆ మాట వినగానే షాపులో తలొంచి ఏవేవో పనులు చేసుకుంటూ బిజీగా ఉన్న పదిపదిహేనుమంది ఒకేసారి ఆశ్చర్యంతో తలెత్తి చూశారు.


‘అవసరంలేద’ని చెప్పగానే ఆ కుర్రాడు బ్రతిమాలడం మొదలెట్టాడు.


కాస్సేపయ్యాక గోముగా అడిగాడు. 


చివరికి అలిగి వెళిపోయాడు. 


మళ్లీవచ్చి నిష్ఠూరాలడాడు. 


ఇహ శాపనార్ధాల్లోకి దిగుతాడేమో అని అనుకునే సమయానికి మేనేజర్ వచ్చాడు. 


‘సార్ వద్దంటంటే ఎందుకురా వెంకటీ, అన్నిసార్లడుగుతావు? కొందరంతే!’ అన్నాడు.


ఈ ‘కొందరంతే’ అంటే ఏమిటో? దానికన్నా తిట్టడమే నయంలా ఉందికదూ? సరే, నా మాట ఇంట్లో కాకపోయినా కనీసం ఇలాంటిచోటయినా నెగ్గించుకోవాలి కదా?😝 అంచేత పట్టుబట్టి ఏ ఫైనాన్సూ లేకుండానే ఓ బండివాణ్ణయ్యాను.


నాకు మా పెద్దాడే నేర్పించాడు బైక్ ఎలా నడపాలో. కేవలం ఒక్కరోజులోనే అలవాటైపోయింది. ఇప్పుడైతే చిన్న చిన్న ప్రయోగాలు సైతం చేసేంత తెగింపు వచ్చేసింది కూడా! కానీ చెయ్యట్లేదులెండి. 


బండిమీద నన్ను చూసిన మా చంటిగాడు బుల్లెట్ ఎందుకు తీసుకోలేదని నిలదీశాడు. పోన్లెండ్సార్, మంచిపని చేశారు, పెట్రోలు రేట్లు పెరీపోయాయి కాబట్టి ఇదే బెటరంటూ చివరికి కన్విన్సయ్యాడు. 


మొదటిసారి తనని బండిమీద ఎక్కించుకున్న తరవాత ‘ఎలా ఉన్నాంరా, గులాబీలో పాట గుర్తొస్తోందా?’ అనడిగాను మావాళ్లని.


‘లేదు నాన్నా, రాఘవన్‌లో పాట గుర్తొస్తోంది!’ అన్నాడు మావాడు.


అట్లుంటది వాళ్లతోని! ఇదీ నా బండికథ!



No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE