NaReN

NaReN

Sunday, June 12, 2022

అమ్మ అంటే చాలు

 అమ్మ అంటే చాలు


ఆదివారం మధ్యాహ్నం మూడవుతోంది.  ఎండ మండిపోతోంది.  కళ్ళు మూతలు పడుతున్నాయి.  అలసట ముఖంలో ప్రస్ఫుటంగా కనపడుతోంది.  మంచం మీదకు పోయి ఓ ఒరగంట విశ్రాంతి తీసుకోవాలని ఉంది.  నిన్న శనివారం.  మా స్వామివారికి శనివారం వస్తే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది.  ఆదివారం సెలవు కనుక కాసేపు పగలు పడుకోవచ్చనే ధీమా ఆయనకు ఉంటుంది.  అందుకే శనివారం రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉంటారు, ఉంచుతారు.  అప్పుడప్పుడు మధ్యలో లేపుతారు కూడా.  అందుకే ఈ నీరసం, నిద్రకు చేరాలనే కోరిక.  


పనులింకా పూర్తికాలేదు.  భోజనాలు లేట్ గా తిన్నాం.  మావయ్యగారు మాత్రం ఒంటిగంటకు తినేసి పడక కుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్నారు.  ఇంకో అరగంటలో టీ టైమ్ అవుతుంది.  ఆయన అడగరు.  ఇస్తే తీసుకుంటారు.  ఇవ్వకపోతే అడగరు కూడా.  దేనికీ తన అభిప్రాయాన్ని బయట పెట్టరు.  చింతా చీకూ కనపడనీయరు.


రాత్రి భోజనం చేస్తారు.  పెరుగు అన్నం ఆయనకు ఇష్టం.  ఇప్పుడు పాలు కాచి తోడువేస్తేనే రాత్రికి ఆయనకు పెరుగు అన్నం పెట్టగలను.  కమ్మని పెరుగు అంటే ఆయనకు చాలా ఇష్టం.  పుల్లగా ఉంటే వేసుకోరు.  దగ్గరలో పెరుగు పాకెట్లు దొరికే దుకాణాలు కూడా లేవు.  తప్పని సరిగా కాచాలి.  


అత్తయ్యగారు బ్రతికి ఉన్న రోజుల్లో ఈయన వైభవం చూడాలి.  అడుగులకు మడుగులొత్తుతూ అందరూ సేవలు చేసేవారు.  ఆవిడ వెళ్ళిపోయిన తరువాత మేమంతా సేవ చేస్తున్నా ఆయన మనసుకు నచ్చినట్లుగా చేయలేకపోతున్నామేమో అనే అనుమానం నా మనసులో కదులుతూ ఉంటుంది.  మా శ్రీవారికి చెప్తే లైట్ గా తీసుకో అంటారు.  


పాలు కాచడానికి ఓపిక లేదు.  పడక గదిలోకి వచ్చాను.  ఆయన, పిల్లలిద్దరూ గట్టిగా కౌగలించుకొని నిద్రపోతున్నారు.  ఆవులింత వచ్చింది.  పక్కన చోటుచేసుకొని నేనూ నడుం వాల్చాను.  నిద్ర పడుతోంది, పట్టడం లేదు.  పాలు కాచాలి.  పాపం ఆ పెద్దాయన ఇష్టంగా తినే వస్తువు పెరుగు అన్నం ఒక్కటే.  నా పిల్లలు అమ్మా అది కావాలి అంటే ఎంత కష్టమైనా ఆ వస్తువును తయారు చేసి పెట్టడం లేదా!  మరి ఈయనకు ఎవరు పెడతారు?


అత్తయ్యగారు చివరి రోజుల్లో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.  "ఆయన చిన్న పిల్లాడి కన్నా సౌమ్యంగా ఉంటారమ్మా!  ఏం కావాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు.  అడిగితే ఏమనుకుంటారో అని సైలెంట్ గా ఉంటారు.  నేనే ఆయనకు భార్యను, అమ్మను కూడా.  నా చివరి క్షణాలు దగ్గరలో ఉన్నాయని తెలుస్తోంది. భవిష్యత్తులో నువ్వే ఆయనకు కోడలు వూ, అమ్మ వూ కూడా.  జాగ్రత్తగా చూసుకో అమ్మా!"  


అంతే - ఒక్క ఉదుటున మంచం మీదనుంది క్రిందకు దిగాను.  వంటగదిలోకి వెళ్ళి పాలు కాచి, AC room లోకి తీసుకెళ్లి చల్లటి నీళ్ళలో గిన్నె పెట్టి కూల్ చేశాను.  పావుగంటలో తోడు వేశాను.  మనసు కుదుటన పడింది.  అప్పుడు మంచం ఎక్కాను.  పిల్లలు లేచారు.  ఆయన కోరిక పకోడీలు కావాలని.  ఇక నిద్రను పక్కన పెట్టి మళ్ళీ వంటగదిలోకి చేరుకున్నాను.  


రాత్రి అయ్యింది.  ఎనిమిది గంటలకు మావయ్యగారికి భోజనం పెట్టాను.  కూర, చారు తరువాత కంచం నిండా పెరుగు అన్నం కలుపుకొని ఆవకాయ నంజుకుంటూ భోజనం చేస్తున్నారు.  చివరిలో మావిడి పండు ముక్కలు కూడా తిన్నారు.  ముఖంలో తృప్తి కనపడుతోంది.  భోజనం అవగానే చెయ్యి కడుక్కొని "మంచి భోజనం పెట్టావమ్మా!  ఎందుకో సాయంత్రం కొంచెం ఆకలి వేసింది.  త్వరగా భోజనం చేస్తాను కదా అని మంచినీళ్లు తాగి సర్దుకున్నాను.  నిన్ను కోడలిగా తెచ్చుకున్న మేమంతా అదృష్టవంతులం.  నువ్వు, నీ భర్త పిల్లలు క్షేమంగా ఉండాలమ్మా!"  అంటూ దీవించారు.   


లెక్కల పరీక్షలో నూటికి నూరు శాతం మార్కులు వచ్చినంత ఫీలింగ్ వచ్చింది నాకు.  మనసు ఎంతో తృప్తిగా ఉంది.  మా ఆయన ఎదురుగా మావయ్యగారు నన్ను పొగడడంతో నాకు చాలా సిగ్గు అనిపించింది.  గదిలోకి వెళ్ళగానే ఆయన కౌగిలికి తీసుకున్నారు.  ఇంత గౌరవం ఎవరికి దక్కుతుంది - ఒక్క తల్లికి తప్ప.  నేను ఆడదానిగా పుట్టడం భగవంతుడు నాకిచ్చిన వరం.  

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE