NaReN

NaReN

Thursday, July 7, 2022

చుక్కల భూములంటే ఏమిటి ?


చుక్కల భూములంటే ఏమిటి ? 

ప్రభుత్వానికి వాటిపై హక్కెందుకు ?

(AP State)

...........................................................



" భూమినాదని యనిన భూదేవి నవ్వదా''

 ఈ మాటన్నది ఎవరంటే దార్ల సుందరమ్మనే తత్త్వజ్ఞాని, ఈమె

 గుంటూరు జిల్లాలోని చర్లగుడిపాడులో పద్మసాలె కుటుంబానికి చెందిన గంజి నాగమాంబ, శ్రీరాములు దంపతులకు 1802-03లో జన్మించింది. ప్రాయం వచ్చాక రామచంద్రపురం నివాసి దార్ల శేషయ్యను వివాహమాడింది. 1833లో ఆమె రాసిన భావలింగ శతకం నేటికి లభిస్తున్న మహిళా శతకాల్లో మొట్టమొదటిది.

ఆ భావలింగశతకములోనే ఈ దార్ల సుందరమ్మ మాటన్నట్టుగా నేను చదివాను.


దార్ల సుందరమ్మ కంటే శత సంవత్సరాల ముందుగా  యోగివేమన కూడా 


భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు

దానహీను జూచి ధనము నవ్వు

కదన భీతుఁజూచి కాలుడు నవ్వును

విశ్వదాభిరామ! వినుర వేమ!


అని అన్నాడు.

ఈ సామ్రాజ్యం నాది, ఎన్నో భూభాగాలు జయించాననే రాజును చూచి

నేను జమీందారును నేను భూస్వామిని నాకు వేల ఎకరాల భూముందనే వారిని,

నేను భూవ్యాపారిని (రియాల్టర్) ఎన్నో వందల ఎకరాలు కొన్నాను, అమ్మాననే వాడిని చూచి,

నాకేం బంగారం పండే 10 ఎకరాల మాగాణి వుంది నాకేం తక్కువ అనే వాడిని

నాకు మెట్రోపాలిటన్ సిటిలో, మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో, గ్రామపంచాయితిలో పదులసంఖ్యలో ఇంటి స్థలాలున్నాయని మిడిసిపడే వారిని చూచి భూమాత ఫక్కున నవ్వుతుందట, ఎందుకంటే ఆమే భూమాత సకల భూమికి అధిదేవత, అలాంటి పుడమి తల్లి ఈ భూములన్ని నావే నేనే స్వంతదారుడినంటే నవ్వక ఏం చేస్తుంది.


ఎవరు కూడా వేలవందలపదుల ఎకరాలకు స్వంతదారులు కాదు, ఎంత సంపాదించినా చివరికి వారికి మిగిలేది ఆరడుగుల నేలే.


ఇక చుక్కల భూమి విషయానికి వద్దాం.ఆంధ్రదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం 1918 నుండి 1928 వరకు  భూమిని సమగ్రసర్వే చేయించింది.  ఈనాటికి కూడా ఎవరు వెలెత్తి చూపనంతగా, అంత ఖచ్చితంగానన్నమాట. వారి కొలతలలో 0.0001 మి.మి. తేడా ఈనాటికి  కూడా  లేనంతగా వారి సర్వే జరిగింది. భూములను సర్వేచేయించే సమయంలో భూయాజమానులకు నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే కొలతలు వేసి రికార్డు చేశారు. ఇలా కొలతలు వేసిన భూరికార్డులను ఫీల్డ్ మెజర్మెంటు (FMB) పుస్తకంగా తీసుకువచ్చారు.


ఒక గ్రామంలో భూయాజమానులకు ఏ సర్వే నెంబరులో ఎంతభూమి వుంది, యాజమాని ఎవరు భూస్వభావం అంటే చెరువు, సముద్రతీరం, నది, వాగు, వంక, కొండ,గుట్ట, దారి అడవి, గుడి, బడి, స్మశానం , ఊరు, అణగారిన వర్గాలకు (డిప్రెస్డ్ కేటగిరి) కేటాయించిన భూమి,, ఎవరికి చెందని భూమి (Unclaimed land) మొదలైనవాటినన్నింటిని నమోదుచేసి ఏ విస్తీర్ణంలో ఇవన్ని ఉన్నాయో స్పష్టంగా పేర్కొని ఒక పుస్తకరూపంలో తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకాన్నే మనము RSR అంటే రీసెటిల్మెంట్ రిజిస్టర్ లేదా Diglot  అంటున్నాము. DigIot అంటే రెండు భాషలు. ఈ పుస్తకము తెలుగు ఇంగ్లీష్ భాషలలో వుంటుంది కనుక DigIot అని అంటారు. Diglot లోని ప్రతినమోదుకు సర్వే నెంబరులు ఇవ్వడము జరిగింది.


RSR లో ఎవరు క్లైమ్ చేయని భూమికి యాజమానెవరో తెల్చడం కష్టము కనుక  ఇలాంటి భూములకు అనగా ఎవరు కాపుదారులు కాని భూములకు యాజమాని పేరున్న చోట చుక్కలను పెట్టారు. ఇవే చుక్కల భూములంటే.


ఇక FMB లో భూయాజమాని - పేరు వివరాలు వుండవు కాని మిగతా వివరాలన్ని (చిహ్నాల) రూపంలో పొందుపరచి వుంటాయి.


1928 వరకు భూమిని సర్వేచేసినపుడు కొందరు యాజమానులు సర్వే సమయంలో సర్వేతోపాటు  హజరు కాలేదు. పంటలు పండక భూమిని వదిలివేయడం, శిస్తులు కట్టలేక భూమిని వద్దనుకోవడం, కరువుకాటకాల వలన గ్రామాన్ని వదిలేయడం, సర్వే చేస్తున్న సంగతి తెలియకపోవడము ఇలా రకరకాల కారణాల వలన వారు హజరుకాలేకపోయివుండవచ్చు.

ఎప్పుడైతే RSR విడుదలైందో అందులో తమపేర్లు భూవివరాలు కనబడలేదో వారంతా ఆందోళనకు భయానికి గురైనారు. RSR లో పేరు లేకపోయినా వాస్తవానికి వారు భూయాజమానులే.


ఎప్పుడైతే తమ పేర్లు RSR లో కనబడలేదో భూమివున్న యాజమానులు ప్రభుత్వానికి తమ గోడును విన్నవించుకోవడం జరిగింది. జరిగిన తప్పులను సరిచేయటానికి ప్రభుత్వం ఓ మధ్యేమార్గాన్ని  ప్రవేశపెట్టింది. ఆ పద్ధతిపేరే రికార్డ్ ఆఫ్ హొల్డింగ్స్ ( RH) అనంటారు. ఎవరి పేరైతే RSR లో లేదో వారి పేర్లంటిని RH లో నమోదు చేశారు. ఇలా RH లో 1933 నుండి 1953 సంవత్సరాల మధ్యకాలములో RSR లో పేర్లులేని భూయాజమానుల పేర్లు నమోదు చేయడము జరిగింది. భూమికి రక్షణదారు అంటే కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్  రివెన్యూశాఖ వుంటుంది. ఎందుకోకాని RH ను రిజిస్ట్రేషన్ శాఖవారికి అప్పగించడము జరిగింది.


సమస్తభూమికి ప్రభుత్వమే యాజమాని, అందుకే RSR లో GD (గవర్నమెంట్ డ్రై) గవర్నమెంట్ వెట్( GW) అని వ్రాసివుంటుంది.ఒక భూమి మనకు వంశపారంపర్యంగా వచ్చినా, కొన్నప్పుడు రిజిస్టర్డ్ డాక్యూమెంట్లు మన దగ్గరున్నా, భూమిని అమ్మే అధికారము తాకట్టు పెట్టే అధికారము మొ॥ మనదగ్గరున్నా చివరగా భూయాజమాని ప్రభుత్వమే. అందుకే ప్రజోపయోగం కోసం ఏ భూమినైనా ప్రభుత్వము స్వాధీనం చేసుకోనే అధికారముంది.


భూమిని స్వాధీనపరచుకొన్నప్పుడు మనకిచ్చే నష్టపరిహారం ప్రభుత్వం మనకు ఇచ్చే సొమ్ము సోషియల్ వెల్పేర్ ఫ్రండే కాని మరేమి కాదు. నాకు ఇచ్చిన భూనష్టపరిహారం పైనే కోర్టులలో వ్యాజ్యాలు వేసుకోవచ్చునే కాని  భూమిని ఇవ్వమని వేయకూడదు. ఒకవేళ అలాంటి కేసులు వేసినా కోర్టులు కొట్టేస్తాయి.


RSR లో చుక్కలున్న భూమికి యాజమానులెవరు లేరు కనుక ప్రభుత్వమే ఈ భూములకు యాజమాని. ప్రభుత్వాలు సాంఘికసంక్షేమ పథకము కింద ఇలాంటి భూములను నిరుపేద వ్యవసాయదారులకు D పట్టా ఇస్తుంది. D పట్టాలంటే ధరఖాస్తు పట్టాలు. భూమిలేని వారు ప్రభుత్వానికి ధరఖాస్తు చేస్తారు కనుక వారికి ఇచ్చిన భూములను D పట్టాభూములంటారు.ఇలా నిమ్నజతులకు ఇచ్చిన D పట్టావివరాలు RSR వుంటాయి.


1954 జూన్ 18 వరకు  అంటే స్వతంత్ర్యం రాకముందు నుండి 18.6.1954 వరకు పేదలకు ఇచ్చిన D పట్టాలలో సదరు భూములు అమ్ముకోరాదని  ఏలాంటి  నిబంధనలు (కండిషన్స్)  ఉండేవి కాదు. అందువలన ఇలాంటి భూములు అన్యాక్రాంతమైయ్యేవి. పేదలు తమకు ఉచితంగా ఇచ్చిన భూములను అమ్మేసుకోవడము వలన వారు తిరిగి భూమిలేని నిరుపేదలయ్యేవారు.


అందువలన ఇలాంటి భూములు అన్యాక్రాంతము కాకుండా రెవెన్యూశాఖ ఒక ప్రభుత్వఉత్తర్వును (GO No 1442  Revenue Department Dated 18.6.1954) తీసుకువచ్చింది.

GO No 1142 జారీ అయిననాటి నుండి పేదలలకు D పట్టాగా మంజూరుచేసిన  భూములను D పట్టాదారులు అమ్మటానికి వీలులేదు, ఇతరులు కొనటానికి వీలులేదు. అలా ఎవరైనా అమ్మినా లేదా కొన్నా అటువంటి భూములను ప్రభుత్వం వెనక్కు (Resume) తీసుకొని మరలా అర్హులకు D పట్టాలివ్వవచ్చును. అయినప్పటికి Dపట్టాదారులకు కొనేవారికి చివరికి కొందరు అధికారులకు చట్టము పట్ల అవగాహనలేకపోవడము వలన D పట్టాభూముల అమ్మకము విరివిగా జరిగింది. 

ప్రభుత్వము 1977 లో నిషేధిత భూవిక్రయచట్టము   Government  అంటే The Andhra Pradesh Assigned Lands (Prohibition of Transfers) Act, 1977 (Act 9 of 1977) చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టము 29.1. 1977  తేదీనుండి ఆంధ్రప్రదేశ్ అంతటా అమలులోనికి వచ్చింది. దీనినే Act 9 ఆఫ్ 77 అనికూడా (యాక్ట్9/77 అంటారు. ఈ చట్టము ప్రకారము ప్రభుత్వము D పట్టాగా ఇచ్చిన భూములను అమ్మడం, కొనడము, తనఖా వుంచడము, కౌలుకు ఇవ్వడము చేయరాదు. అయితే G0 1142 లో చెప్పినట్లుగా ప్రభుత్వబ్యాంక్ లలో, ప్రభుత్వపు కో-ఆపరేటివ్ సొసైటీలలో వ్యవసాయం నిమిత్తము తనఖా(మార్టగేజ్)  చేయవచ్చును.

ఎవరైనా Act 9/77 ను ఉల్లంఘిస్తే అటువంటి భూములను ప్రభుత్వం స్వాధీనము చేసుకోవచ్చును. అలాంటి భూములలో భవనాలు, ఇండ్లు, పరిశ్రమలు మొ॥వున్నప్పటికి ఏలాంటి నష్టపరిహరము లేకుండా స్వాధీనము చేసుకోవచ్చును.


అయితే స్వాతంత్ర్యసమరయోధులకు మాజీ సైనికులకు ( Ex - Service)  D పట్టాగా అసైన్‌మెంటు చేసిన భూములను 10 సంవత్సరాల అనంతరం అమ్ముకోవచ్చుననే వెసులుబాటు కల్పించింది.


అంతా బాగానే వుంది, మరైతే  RSR లో భూమి చుక్కలభూమిగా వుంది, RH లో పేర్లున్నాయి. ఈ భూములు అమ్ముదామన్నా కొందామన్నా రిజిస్టరు కావడము లేదు. ఎందుకంటే ఇలాంటి చుక్కల భూమంతా ప్రభుత్వభూమేనని 2005 లో రెవెన్యూశాఖవారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖవారికి   జాబితాలు పంపడం జరిగింది. దీనినే 22 A (1) కింద వుంచడము జరిగిందంటారు. RH లో పేర్లుండి తమ అవసరాలకు తమ భూమిని అమ్ముకోవాలంటే ఏం చేయాలని ప్రభుత్వంను అడగడం జరిగింది. ఇలాంటి భూములేమైనా వుంటే 22 A (1) నుండి తొలగించటానికి ప్రతిపాదనలు పంపమని కలెక్టర్లను కోరడము జరిగింది. తహశీల్దారుల, ఆర్డీవోల  సాయముతో వాటిని 22 A (1) నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇంకా కొన్ని మండలాలలో పని జరుగుతూవుంది.

అయితే చుక్కలభూమిని ఎవరికి D పట్టాగా అసైన్‌మెంటు చేసివుండరాదు. ఎవరికైనా అసైన్మెంటుగా ఇచ్చివుంటే 22 A (1) నుండి తొలగించాటనికి వీలుకాదు.


ఈ సమాచరము ప్రాథమిక అంశాలు తెలుసుకోటానికి మాత్రమే. 

అవసరమున్న వారు చట్టాలను అవగాహన  చేసుకోవాలి.


పసుపులేటి నరేంద్రస్వామి


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE