NaReN

NaReN

Tuesday, July 19, 2022

యాచకుడి నుండి యాచనా?

 యాచకుడి నుండి యాచనా?


ఒకప్పుడు ఒక మహారాజు అడవికి పోయి అక్కడ ఒకయోగిని కలుసుకున్నాడు. ఆ యోగితో రాజు కొంతసేపు మాట్లాడాక ఆయనలోని పవిత్రత, జ్ఞానానికి ముచ్చటపడ్డాడు. అప్పుడా మహారాజు తన మీద దయ ఉంచి ఏదైనా బహుమతిని స్వీకరించవలసిందిగా ఆ యోగిని ప్రార్ధించాడు.


ఆ యోగి అందుకు నిరాకరిస్తూ, "ఈ అడవిలో లభించే ఫలాలు నాకు సరిపడా ఆహారాన్నిస్తున్నాయి. పర్వత సానువుల నుండి ప్రవహించే సెలయేరు నాకు తగినంత నీటిని సమకూరు స్తుంది. ఇక్కడి చెట్ల బెరళ్ళు నా శరీరాచ్ఛాదనకు సరిపోతున్నాయి. ఈ కొండ గుహలు నా నివాసానికి అనువుగా ఉన్నాయి. ఇంకా నేను నీ నుండి గాని, ఇతరుల నుండి గాని బహుమతులు పొందాల్సిన అవసరం ఏముంది చెప్పు?" అని అన్నాడు.అందుకు ఆ మహారాజు "స్వామీ! అలా అనకండి. నా సంతృప్తి కొరకు నాతో మా భవనానికి వచ్చి నా నుండి ఏదో ఇఒకటి తమరు స్వీకరించాలి. నా ప్రార్థనను మన్నించండి” అన్నాడు. రాజు చాలా ఒత్తిడి చేశాక ఇక తప్పదన్నట్లు అంగీకరించి ఆ యోగి రాజప్రాసాదానికి వెళ్ళాడు. రాజు ఆ యోగిని ఒక గదిలో కూర్చోబెట్టి దైవప్రార్ధన ఇలా చేయసాగాడు."భగవాన్! నాకు మంచి సంతానాన్నివ్వు. ఇంకా అధికంగా సంపద నివ్వు. నా రాజ్యాన్ని విస్తరించు. నాకు తగిన ఆరోగ్యాన్నివ్వు". అతడు ప్రార్థన ముగించేలోపే యోగి దిగ్గున లేచి మౌనంగా గది బయటకు నడవసాగాడు. ఆ చర్యకు రాజు దిగ్భ్రాంతుడై యోగిని అనుసరిస్తూ, బిగ్గరగా "స్వామీ! తమరు వెళ్ళిపోతున్నారేమిటి? నా బహుమానం తమరు స్వీకరించనే లేదు" అంటూ అడిగాడు.అప్పుడా యోగి, రాజు వంక తిరిగి, “నేను యాచకుల నుండి యాచించే వాడిని కాను. నీకు నువ్వే ఒక యాచకుడివి. ఇక, నాకు నువ్వేమి ఇవ్వగలవు? యాచించే వారి నుండి దేన్నైనా స్వీకరించేటంతటి మూర్ఖుణ్ణి కాను నేను" అన్నాడు. రాజు ముఖం జేవురించింది.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE