NaReN

NaReN

Friday, October 21, 2022

మేధావి అంటే ఒక శాతం ప్రేరణ

 *"మేధావి అంటే ఒక శాతం ప్రేరణ, తొంభై శాతం పరిశ్రమ" అనే నానుడికి నిలువెత్తు రూపం ఎడిసన్ మహాశయుడు.*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


థామస్ అల్వా ఎడిసన్ (ఫిబ్రవరి 11, 1847 – అక్టోబర్ 18, 1931) మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త.

ఆయన 1000 పేటెంట్లకు హక్కులు కలిగి ఉన్నాడు. 1889 లో పారిస్లో గొప్ప వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. అందులో ప్రదర్శించబడ్డ వస్తువుల్లో తొంభై శాతానికి పైగా థామస్ ఎడిసన్ కు చెందినవే.


ఎడిసన్ అమెరికా లోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే ప్రాంతంలో జన్మించి మిషిగాన్ రాష్ట్రంలోని పోర్టుహ్యురాన్ అనే ప్రదేశంలో పెరిగాడు. తండ్రి శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్ (1804-1896) మరియు తల్లి నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ (1810-1871) లకు ఏడవ మరియు చివరి సంతానం.ఇతని కుటుంబం డచ్ మూలాలు కలిగినది. 10 ఏళ్ళ వయస్సు నాటికి యీయన సొంతంగా లాబొరేటరీని యేర్పాటు చేసుకున్నాడు. ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం రైళ్ళలో న్యూస్ పేపర్లు,స్వీట్లు అమ్మేవాడు. 


అతి చిన్నవయస్సు లోనే టెలిగ్రాఫ్ నమూనా యంత్రాన్ని తయారు చేశాడు. 1861 లో సివిల్ వార్ ప్రబలినప్పుడు ఎడిసన్ "గ్రాంట్ ట్రంక్ హెరాల్డ్" అనే ఓ మోస్తరు న్యూస్ పేపర్ నడిపాడు. ఈ సమయంలోనే ఆయనకు ప్రమాద వశాత్తు చెవుడు వచ్చింది. రైల్వే బోగీలోనే లాబొరేటరీ పెట్టి కొన్ని రోజులు ప్రయోగాలు చేశాడు. పొరపాటుగా అగ్ని ప్రమాదం జరగడంతో రైల్వే అధికారులు ఆయనను దూరంగా ఉంచివేశారు. 


1862 లో ఎడిసన్ ఒక స్టేషను మాష్టర్ బిడ్డను ప్రమాదం నుంచి రక్షించి అందుకు ప్రతిఫలంగా ఆయన వద్ద నుంచి టెలీగ్రఫీని నేర్చుకున్నాడు. 1868 లో టెలిగ్రాఫ్ పేటెంట్ ను పొందగలిగాడు. 


బతుకు తెరువు కోసం స్టాక్ ఎక్సేంజీ టెలిగ్రాఫ్ ఏజన్సీలో పనికి కుదిరాడు. తన టెలిగ్రాఫ్ పరికరాన్ని అమ్ముకున్నాడు. ఏ కొద్ది మొత్తమో లభిస్తుందని అనుకున్న ఎడిసన్ కి నలబై వేల డాలర్లు ముట్టడంతో ఆశ్చర్యపోయాడు. అంతే, అప్పటి నుండి ఆయన ఆవిష్కరణలకు అంతం లేకుండా పోయింది. 


1878 లో ఎలక్ట్రిక్ బల్బ్ ను రూపొందించాడు. అది ఆర్థికంగా ఆయనకు మరింత ఎత్తుకు తీసుకుని వెళ్ళింది.


థర్మో అయానిక్ ఎమిషన్ గురించి కూడా అదే సమయంలో ఎడిసన్ వెల్లడించాడు. 


1887-1889 మధ్య కాలంలో టైప్ రైటర్, ఎలక్ట్రిక్ పెన్, గ్రామ్ ఫోన్, మోషన్ పిక్చర్ కెమేరా, అలాగ ఎన్నింటినో యీయన రూపొందిచారు. 1931 న చనిపోయే నాటి వరకు సరికొత్త ఆవిష్కరణలు కోసం అనుక్షణం ఆరాట పడ్డాడు.


1877లో కనిపెట్టబడిన ఫోనోగ్రాఫ్. ఈ పరికరాన్ని కనిపెట్టినపుడు ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆయనకు మెన్లో పార్క్ మాంత్రిడు అనే పేరు పెట్టారు.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పసుపులేటి నరేంద్రస్వామి

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE