NaReN

NaReN

Sunday, October 16, 2022

నీ ఓపికే నీ విజయం

 

నీ ఓపికే నీ విజయం..

మనిషి తాను అనుకున్న పనిలో ఏదోవిధంగా విజయం సాధించాలనుకుంటాడు. కండబలంతోనో, పదవి ద్వారానో, పాండిత్యం ప్రదర్శించో, వాక్చాతుర్యంతోనో తన కార్యక్రమంలో సంపూర్ణ విజయం సాధించేవారా.. నిద్రపోడు. తలపెట్టిన పని ధర్మబద్ధమైనదా, ఇతరులకు హాని కలిగించేదా, నడుస్తున్న మార్గం సరైనదేనా- ఇవేవీ ఆలోచించే స్థితిలో సాధారణంగా ఉండడు. పని పూర్తికావాలంటే దగ్గరి దారేదో చూసుకుంటాడు. చాలామందిలో ఈ లక్షణం చూస్తుంటాం.


 ధర్మంగా అర్ధం (ధనం) సంపాదించి, ధర్మంగానే కోరికను తీర్చుకుంటూ మోక్షప్రాప్తి పొందాలి. విజయం సాధించడానికి పట్టుదల అవసరమే కాని అది మొండిపట్టుదల కాకూడదు. సాహసం అవసరమేకాని దుస్సాహసం కారాదు. ఆలోచన అవసరమే, దురాలోచనగా మారకూడదు. అవసరమైన చోట అణకువ, వినయం, విధేయత, మౌనం కూడా ఆయుధాలుగా మారాల్సి వస్తుంది. మూర్ఖుల సభలో ఒకేఒక పండితుడున్నప్పుడు, అతడు మౌనంగా ఉండటమే సమంజసం. ఒకవేళ ఏదైనా మాట్లాడినా, మూర్ఖులు లెక్కచేయడపోగా అవమానిస్తారు. అవహేళన చేస్తారు. 


వర్షరుతువులో చెరువుల దగ్గర కప్పల బెకబెకలే బాగా వినిపిస్తాయి. అటువంటి సమయంలో కోకిల తన పంచమస్వరం వినిపించక మౌనంగానే ఉంటుంది. ఆ ధ్వని కాలుష్యంలో తన స్వరం వినిపించకపోవడమే మంచిదనుకుని మిన్నకుంటుంది. అంతమాత్రాన అది

తన ఓడినట్లు కాదుగదా! 'అనువుగాని చోట ' అధికులమనరాదు' అన్న వేమన పలుకులు అక్షరసత్యాలు.


అండపిండ బ్రహ్మాండాలను తనలో నిక్షిప్తం చేసుకున్న

విశ్వపురుషుడు శ్రీమన్నారాయణమూర్తి బలి గర్వం నాశనం చేయడానికి మరుగుజ్జు రూపం (వామనావతారం)లో వెళ్ళాడు. అంతమాత్రాన తగ్గినట్లు కాదే...


భక్తుడికి ఐశ్వర్యం ప్రసాదించే ఈశ్వరుడు కపాలంతో భిక్షాందేహి అన్నాడు. ఒంటినిండా భస్మం పూసుకొన్నాడు. 


ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి వృద్ధబిక్షువు వేషంలో వెళ్ళి కవచ కుండలాలను దానంగా అడిగి తీసుకున్నాడు. కార్యసఫాల్యం కోసమే కదా! సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమంతున్ని మార్గమధ్యంలో సురస అనే రాక్షసి అడ్డుకుంటుంది. కబళించేందుకు నోరు తెరుస్తుంది. సూక్ష్మ రూపుడై ఆమె నోట్లోకి వెళ్ళి. బయటికి వచ్చేస్తాడు. అంతటి బలశాలి అక్కడ అంగుష్ఠమాత్రుడు కావాల్సివచ్చింది. అదంతా కార్యసాఫల్యం కోసమేకదా!


ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలని, నిరహంకారం విధేయత సమయస్ఫూర్తితోనే పనులు చక్కబెట్టుకోవాలని విదురనీతి చెబుతోంది. అన్నీ ఉన్న విస్తరి అణిగే ఉంటుంది అని నిండుకుండ తొణకదు అని- ఇలాంటి సామెతలన్నీ మనం విన్నవే "తెలివి లేనప్పుడు అన్నీ తెలుసు అని విర్రవీగాను, గురువుల నుంచి కొంత జ్ఞానం పొందాక, ఏమీ తెలియని అజ్ఞానిని అన్న సత్యం గ్రహించాను' అన్న సందేశాత్మక నీతిబోధ భర్తృహరి శతకం అందిస్తోంది.


మధుర రసాలతో నిండి ఉన్న మామిడిచెట్టు ఆ పండ్ల బరువుకు ఒంగే ఉంటుంది. ఎవరి కోసం? మనకోసం. అవి అందుకుని ఆ చెట్టును పొగడ కుండా ఉండగలమా!


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE