NaReN

NaReN

Thursday, September 15, 2022

పెసరట్టు కావాలా నాయనా అదీ నెయ్యితో....

 పెసరట్టు కావాలా నాయనా అదీ నెయ్యితో....



ఇదిగో...ఇవాళ ఏం టిఫిన్ చేస్తున్నావ్ ? 


మీకేం కావాలో చెప్పండి..


చక్కగా అల్లం, పచ్చి మిరప కాయల్తో ,ఉల్లిపాయ పెసరట్టు వెయ్యి..


ఒకటి చాలా..


ఒకటేం సరిపోతుంది... మధ్యాహ్నం వరకూ మళ్ళీ ఏమీ ఉండదు గా.. 

ఒక నాలుగు వెయ్యి...


నూనెతో నా , నెయ్యితో నా ?


హోటల్లో లా నూనెతో వేస్తే ఏం బాగుంటుంది చెప్పు..

నేతితోనే వెయ్యి... 

రుచి గా ఉండాలి మరి..


ఏం చట్నీ కావాలి ?? 

వేరుశనగల చట్నీ చెయ్యమంటారా ? లేక అల్లప్పచ్చడి కూడా కావాలా ..? 


రెండూ ఉంటే భేషుగ్గా ఉంటుందోయ్...నీకు తెలుసుగా ... 


సరే అలాగే.. ..

ఇదేమిటి ..

కరెంటు పోయిందా ?


అవును..మళ్ళీ వస్తుందిలే ..కంగారు పడకు ..

ఇవాళ పెసరట్లు తిని తీరాల్సిందే...


అలాగే..మీకు చేసి పెట్టడం నాకు కూడా సంతోషమే ..


అన్నట్లు.. 

ఇందాక ఫోన్ వచ్చింది..

లలిత జ్యువెలర్స్ నుండి..దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయి కదా ...

కొత్త కొత్త డిజైన్లు వచ్చాయిట....

ఒక్కొక్క డిజైన్ కి పది, పన్నెండు మాత్రమే చేయించారుట..

తొందరగా వస్తే మంచిదని ఫోన్ చేశారు..


వాళ్ళు నీకెందుకు ఫోన్ చేశారు ?? అనుమానంగా అడిగాడు..


నాలుగేళ్ల క్రితం , గొలుసు మార్చి కొంత డబ్బు వేసి ..ఇదిగో ఈ గొలుసు కొన్నాను కదా..అప్పుడు వాళ్ళ దగ్గర నా ఫోన్ నెంబరు ఇచ్చాను...


అవును..

వాళ్ళు అలాగే చెపుతారు...

మనం డబ్బు చూసుకోవాలి కదా ...


సరే..మీ ఇష్టం.. 

మీకు టిఫిన్ కావాలా..

బయటకు వెళ్లి తెచ్చుకుంటారా ? 


మరి...పెసరట్లు వేస్తానన్నావు ?


అన్నాను గానీ... 

ఇవాళ మనసు బాగోలేదు..ఇంకో సారి చేస్తానులెండి...


మనసు బాగోక పోతే హాస్పిటల్ కి వెళ్తారు... లలిత జువెలర్స్ షాప్ కి వెళ్ళరు ఎవరూ..


భార్యకు బాగో పోతే భర్తలు పెసరట్లు తినరు....

అయినా నేను బంగారం కొనమనేది మీ కోసమేగా ? 


నాకోసమా అదెలా ?? 


నేను పెట్టుకునేది మీ కోసమేగా..

నేను పెట్టుకుంటే మీకే గౌరవం..కాదంటారా ? 


అవుననుకో.... కానీ..


కానీలు, అర్ధనాలు పోయి చాలా కాలం అయ్యింది..బంగారం కొంటే , ముందు ముందు ధర పెరుగుతుంది...మీరు టీచర్  కదా...మీకు తెలియదా..?


అవుననుకో...


మన పెళ్ళప్పుడు పది గ్రాముల బంగారం మూడు వేలు..ఇప్పుడు యాభై మూడు వేలు.. అప్పుడు ఎలాగూ కొన లేదు... ఇప్పుడయినా కొనండి...


మా అమ్మకు కూడా నిన్న రాత్రి ఫోన్ చేసి చెప్పాను..నాలుగు బంగారపు గాజులు ..కొత్త డిజైన్లు కొనుక్కుంటున్నానని....

అమ్మ మిమ్మల్ని ఎంత పొగిడిందో తెలుసా ? 


ఎంత ? ..


ఈ భూమండలం మొత్తం వెదికినా మీలాంటి మంచి అల్లుడు లేడని అన్నది..


అవును..ఆవిడకు నేనంటే అభిమానం..


ఉన్న ముగ్గురు అల్లుళ్లలో మీరే ఆవిడకు గొప్ప... 

నాకు అమ్మ అలా మీగురించి చెపుతూ ఉంటే గర్వంగా ఉంటుంది తెలుసా ? నాకేమీ అక్కర లేదు ఇంకా..


అంటే గాజులు అక్కర లేదా ?...


అవి తప్ప ..

ఇంకేమి వద్దని నా ఉద్దేశం..


ఇప్పుడు ఏం చేద్దాం..

నా దగ్గర పన్నెండు వేలున్నాయి.. నాలుగు గాజులు సుమారు 35 గ్రాములు ఉంటాయి.. ఇంకో రెండు లక్షలు మీరు ఇస్తే చాలు... తరుగు, మేకింగ్ ఛార్జీలు  కూడా ఉంటాయి కదా...మొత్తం డబ్బు మీతో ఖర్చు చేయించటం నాకు ఇష్టం లేదు..


సరే..చూద్దాం..సాయంత్రం వెళ్దాం.


మరి మీరు టిఫిన్ చెయ్యరా ??.


చేస్తాను..


అయితే పదండి..బయటకు వెళ్లి టిఫిన్ చేసి ,అటునుండి లలిత జువెల్లర్స్ కి వెళ్లి గాజులు తెచ్చుకుందాం..


తప్పదా ..


డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయి..ఇంకా ఏం ఆలోచించకండి ..


సరే ..నీ ఇష్టం..


ఇద్దరూ దార్లో టిఫిన్ చేసారు.. భర్త రెండు ఇడ్లీలు తిన్నాడు.


భార్య నేతి పెసరట్టు అల్లం చట్నీ తో తింది.. బంగారపు గాజులు బోనస్ గా వచ్చాయి ఆవిడకు..


భర్తలు బయట ఎక్కువగా తినరని మీకెలా చెప్పాలి  ?  వాళ్ళు చేసే త్యాగం గాజులు, నెక్లేస్ ల రూపం లో కనబడుతూ ఉంటుంది అపుడప్పుడు...


ఇంటికి వచ్చిన తరువాత భార్య అన్నది....భర్త తో... మీరెంత మంచి వారండీ ?? 


మళ్లీ ఏడాది వరకూ నాకు పెసరట్టు అక్కర లేదు ..చెప్పాడు భర్త..


అలాగే...ఏడాదికో సారి బంగారం కొన్నప్పుడు బయట తిందాం..హోటల్ లో కుదిరినట్లు ఇంట్లో సరిగ్గా కుదరవు ....


ఆ రోజు రాత్రి తల్లి కి ఫోన్ చేసి చెప్పింది...

మీ అల్లుడు గారు నేను వద్దన్నా వినకుండా ,బోలెడు డబ్బు పోసి ,నాలుగు గాజులు కొన్నారు.. ఆయన బలవంతం చేసి నేతి తో వేసిన పెసరట్టు కూడా  తినిపించారు...నాతో..


నువ్వు అదృష్ట వంతురాలివి తల్లీ....సంక్రాంతి కి కూడా ఏమైనా కొనుక్కో.. తప్పకుండా ...


అలాగేనమ్మా....ఆయన నా మాట కాదనరు...చెప్పింది కూతురు..


నేతి పెసరట్టు తినాలని కోరిక ఉన్న భర్తలు ..

లలిత జువెల్లర్స్ కి వెళ్ల వలసిన ప్రమాదం ఉంటుందని ఈ  జీవితం ప్రతి వార ఫలాల్లో వ్రాసి ఉంటుంది..  

ఆ తరువాత మీ ఇష్టం.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE