NaReN

NaReN

Monday, September 5, 2022

కోరికలే గుర్రాలయితే ?.

 కోరికలే గుర్రాలయితే ?... 

          అనే డోపమైన్ హై కథ ! 


" ఎం ఐఏఎస్ అండీ బాబు ? ఆ గ్లామర్ ఎప్పుడో పోయింది . ఒకప్పుడు కలెక్టర్ బంగాళా  రాజ ప్రాసాదంలా ఉండేది . ఇప్పుడు కొత్త జిలాల్ల్లో కనీసం సరైన అద్దె కొంప దొరకడం లేదు . పిల్లల చదువుకు మంచి స్కూల్ ఉండదు . వీధి స్థాయి ఛోటా నాయకుడు సైతం కలెక్టర్ ను నిలదీసేవాడే ! రాత్రి - పగలు గొడ్డు చాకిరీ . పగవాడికి కూడా ఈ శాపం వద్దు " అంటాడో ఐఏఎస్ అధికారి .


" అధికారం లో ఉన్న పార్టీ లకు ఊడిగం చేయడంతోటే సరిపోతోంది. మిగతా ప్రభుత్వ విభాగాలు చేయలేని పనులన్నీ మాకు అప్పచెబుతారు . ఒకప్పుడు ఎస్సై  బులెట్ వేసుకొని తిరుగుతుంటే ఆ ఊళ్ళో రౌడీ లకు తడిచిపోయేది . ఇప్పుడు ఎస్పీ అంటే కూడా వీధి రౌడీ  లెక్క చెయ్యని స్థితి " వాపోతాడో సీనియర్ ఐపీఎస్ . 


రెవిన్యూ ఉద్యోగులు , డాక్టర్ లు , ప్రభుత్వ-  ప్రైవేట్ టీచర్ లు , న్యాయవాదులు , న్యాయమూర్తులు , సాఫ్ట్ వెర్ ఉద్యోగులు , ఎవరిని కదిపినా అసంతృప్తి ." ఒకప్పుడు ఇలా ఉండేది కాదు . ఇప్పుడు ఉద్యోగం చేయడం కష్టమై పోతోంది . బతక లేక ఈ ఉద్యోగం లో వేగాల్సి వస్తోంది అంటారు .


   రోగి ప్రాణాన్ని కాపాడడానికి తమ వంతు ప్రయత్నం  చేసినా తమ పై దాడి చేసారంటూ డాక్టర్ ల సమ్మె . పిల్లల్ని కొట్టడం కాదు , తమపైనే బెదిరింపులు వస్తున్నాయంటూ టీచర్ లు . అందరికీ న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులు తమకు న్యాయం జరగడం లేదు అంటూ వ్యవస్థపట్ల అసంతృప్తితో ...


అందరినీ నడిపించేది రాజకీయనాయకుడు . " నేను ఎంపీ గా ఎంపికయిన కొత్తలో ఏదో లక్షల్లో ఖర్చు . ఇప్పుడు వంద కోట్లు చాలడం లేదు . కౌన్సిలర్ పోస్ట్ కు,   సర్పంచ్ పోస్ట్ కు కోట్లు ఖర్చుపెట్టాల్సిన స్థితి . ఎక్కడినించి తేవాలి ? తిరిగి ఆ ఆ సొమ్మును ఎలా రాబట్టాలి " వాపోతాడో సీనియర్ రాజకీయనాయకుడు .


"ప్రైవేట్ ఉద్యోగం అయితే గొడ్డు చాకిరీ .. బానిసత్వం .. ప్రభుత్వ ఉద్యోగం అయితే హాయి" అంటాడో ప్రైవేట్ ఉద్యోగి . 


   "ప్రభుత్వ ఉద్యోగమా ? కంటికి నిద్ర లేదు . ఒకప్పుడు నలుగురు చేసే పని నేనొక్కడే చెయ్యాల్సి వస్తోంది . మంచి పోస్టింగ్ రావాలంటే లక్షల్లో ఖర్చు . ట్రాన్స్ఫర్ అంటే ఖర్చు . ముందుగా పెట్టుబడి . ఆ తరువాత లంచాలతో సంపాదన . దిగితే లోతు తెలుస్తుంది . ఈ ప్రుభుత్వ ఉద్యోగాల గ్లామర్ పాతకాలం మాట . అందుకే నా పిల్లలని మంచి కంపెనీ ల్లో పని చేయమని చెప్పా . సొంత బిజినెస్ అయితే తానే రాజు .. తానే మంత్రి .. రిటైర్మెంట్ ఉండదు " అంటాడో ప్రభుత్వోద్యోగి  . 


"కళ్ళకెదురుగా నాతోటి పరిశ్రమాధిపతులు నాశనం!   వందలకొద్దీ పరిశ్రమలు మూతపడ్డాయి . ముల్టీనేషనల్ కంపెనీ లనుంచి తట్టుకోలేని  పోటీ. వారివి మోసపూర్తిత పద్ధతులు . ప్రభుత్వ విధానాలు కూడా వారికే అనుకూలం . అధికారులకు , రాజకీయనాయకులకు లంచాలు ఇవ్వలేము . ఇదో నరకం .. నా పిల్లల్ని అమెరికా కు పంపిస్తున్నా. ఎక్కడయితే హాయిగా బతికేస్తారు " అంటాడు మూడు తరాలుగా పరిశ్రమ నడిపి దివాళా అంచుల్లో ఉన్న కోయింబత్తూర్ పారిశ్రామిక వేత్త .


ఇండియా లో బతికేలేము అంటూ అమెరికా , కెనడా , ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా కు వలస పోయే వారు ఎంతో మంది . అమెరికా లో ఎన్నో తరాలుగా స్థిరపడిన వారు అమెరికా లో హ్యాపీ  లైఫ్ గడపలేము అంటూ డబెట్టి గోల్డెన్ వీసా కనుక్కొని గ్రీస్ కు లేదా స్కాండినేవియన్ దేశానికి.  


అసలు భూమి నివాసయోగ్యం కాదు . త్వరగా మార్స్ పైకి వెళ్ళిపోతే   బాగుండు అని మరి కొందరు .


అసంతృప్తి .. కలెక్టర్ మొదలు బిల్లబంట్రోతు వరకు .. స్టార్ట్ అప్  మొదలు ఫామిలీ బిజినెస్ మాన్  వరకు .. రాజకీయనాయకుడు మొదలు కార్యకర్త వరకు .. అందరిలో అసంతృప్తి . 


ఎందుకు ?


👇👇👇👇👇👇👇👇👇👇👇


1950  లో ప్రపంచ జనాభా 250  కోట్లు . ఇప్పుడు 800  కోట్లు .


 డెబ్భై  సంవత్సరాల్లో మూడు రెట్లకు కు పైగా పెరిగిన జనాభా ! ఇల్లు కట్టు కోవడానికి పంటలు పండించడానికి భూమి అవసరం .

  కానీ  అప్పుడూ ఇప్పుడూ అదే భూమి .  


అంటే ?

 


పరిమతమైన వనరులు .. అపరిమితంగా పెరిగిపోతున్న డిమాండ్ ..


తిండి కోసం , నివాసం కోసం .. బతకడం కోసం పోటీ .విపరీతమైన పోటీ . 

  పోటీ తెచ్చే  ఒత్తిడి . 


ఇదీ నేడు సర్వత్రా కనిపించే స్థితి .


కానీ శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి పుణ్యమా అంటూ జనాభా ఇంతగా  పెరిగినా,  అందరి అవసరాలూ తీర్చగలిగిన స్థితి లో నేడు మానవాళి ఉంది. ఎనభై ఏళ్ళ క్రితం బెంగాల్ లో కరువు వల్ల ముప్పై లక్షల మంది చనిపోయారు అంటే నమ్మగలరా ?  నేటి ప్రపంచం లో ఆకలి చావులు , కరువులు కాటకాలు ఎక్కడో కొన్ని ఆఫ్రికా దేశాలకు పరిమితం .


ఆవసరాలు తీరుతాయి .


  మరి కోరికలు ? 


👎👎👎👎👎👎👎


స్కూటర్ కొన్నాయనకు కారు కావాలి . కారు కొన్నాయనకు లగ్జరీ కారు కావాలి . దాన్ని కొన్నాయనకు ప్రైవేట్ జెట్ కావాలి . 


ఫ్లాట్ కొన్నాయనకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి . అది కొన్నాయనకు విల్లా కావాలి . గేటెడ్ కమ్యూనిటీ కావాలి . అది కొన్నాయనకు డిజైనర్ బంగాళా కావాలి . అది ఉన్నాయనకు సొంత దీవి కావాలి .


గ్రామ సర్పంచి గా గెలిచినాయనకు ఎంపీటీసీ అయ్యేదాకా నిద్ర ఉండదు . ఆదియితే జడ్పీటీసీ కావాలి .. ఎమ్మెలే కావాలి .. మంత్రి కావాలి .. మంత్రి అయితే సీఎం కావాలి . సీఎం అయితే పీఎం కావాలి . రాష్ట్రపతి పదవి రాలేదని అసంతృప్తి తో గుండెఆగి చనిపోయాడో పెద్దాయన . ప్రధాని కావాలని కలలు కని కని తీవ్ర ప్రయత్నాలు చేసి  విసిగి తీవ్ర నిరాశ తో వృద్ధాప్యం లో పడి కొట్టుమిట్టాడుతున్న వృద్ధ జంబూకాలెన్నో !  


ఆవసరాలు పరిమితం . గుర్రాలయిన కోరికలు ! 


కోరికలే మనిషి బాధలకు మూలం అన్నాడు గౌతమ బుద్ధుడు . 


2500 ఏళ్ళ  క్రితమే మనిషి కోరికలకు పగ్గాలు ఉండేవి కావు . ఇప్పుడు గ్లోబల్ సమాజం . కోరికలు ఇప్పుడు గుర్రాలు కావు  .. రాకెట్ లు .. సూపర్ సోనిక్ జెట్ లు!

 నలభై ఏళ్ళ ప్రపంచీకరణ ! అప్పటిదాకా ఏదైనా సామజిక విలువలు మిగిలుంటే దాన్ని తుడిచి పెట్టేసింది ! 


తనకు రాముడు లాంటి భర్త కావాలనుకొనేది ఒక నాటి స్త్రీ ! అంటే మరో స్త్రీని తలపులోకి కూడా రానివ్వ కూడదు . తనకు సీత లాంటి భార్య కావాలి అనుకునేవాడు ఒకప్పటి యువకుడు . అంటే కష్టాల్లో నష్టాల్లో తనవెంట నిలవాలి . న్యాయం కదా ?


ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రపంచం . తనకు రష్మిక మందన లాంటి భార్య కావాలి !  సరిపోతుందా ? లేదు వీలైతే మృణాల్ ఠాకూర్ రెండో  భార్య గా ! పోనీ అక్కడితో ఓకే ?   సన్నీ లియోన్ లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి ! పూనమ్ పాండే  షెర్లీన్ .. ఇంకా ఇంకా కావాలి ! 


వ్యయసాయం చేసే భర్త వద్దు . సిటీ లో ఉద్యోగం చేసేవాడు కావాలి . అక్కడితో హ్యాపీ నా ? పక్కింటాయనకు కారుంది . మనకు లేదు . ఆఫీస్ లో పని చేసే కొలీగ్ కు సిక్స్ ప్యాక్ వుంది . నీకు లేదు .


  "  లైఫ్  ఈజ్  షార్ట్ .  చేతకానోళ్లే నీతులంటూ ఉపన్యాసాలిస్తారు . ఎంజాయ్ . దానికోసం ఏమైనా చేయొచ్చు . ఆన్లైన్ గేమ్ లో డబ్బు కోసం అమ్మనైనా చంపొచ్చు . పక్కింటి కుర్రాడితో సుఖం కోసం భర్తకు అన్నంలో విషం పెట్టొచ్చు . ఎంజోయ్మెంట్ ముఖ్యం . " ఇదీ గ్లోబల్  యుగం లో మిలీనియం యూత్ ఫిలాసఫీ . 


 స్మగ్లేర్ లు  గూండా లు రౌడీ షీటర్లు నేటి యువత కు ఆదర్శ పురుషులు .


తెలంగాణకు చెందిన ఒక నాయకుడు తన నియోజకవర్గం లో యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేసాడు . అబ్బే ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరికీ కావాలి అని ఎక్కువ శాతం నోరు చప్పరించేసారుట ! తమ కళ్ళకెదుట రాజకీయాల్లో చేరి కోట్లు కూడబెట్టిన వారు వీరికి ఆదర్శం . సంవత్సరం లో వంద కోట్లు కూడబెట్టాలనుకున్నోళ్లకి నెలకు ఇంత జీతం చొప్పున చేసే ఓపిక ఉంటుందా ?

జీవితం చిన్నది . నిజమే ! ఆనందంగా బతకాలి . కరెక్ట్ .. కానీ ...  

✔️✔️✔️✔️✔️✔️✔️

ఆనందం అంటే ?  

వస్తువుల్లో ఆనందాన్ని  వెతుక్కోంటోంది  నేటి సమాజం .


వేలకోట్ల సంపద వున్నా తీవ్ర అనారోగ్యం తో చనిపోయిన రాకేష్ జున్ఝున్వాలా , గోవా బీచ్ లు .. బికిని మోడల్స్ .. క్యాలండర్ గర్ల్స్  విజయ్ మాల్యా .. నేడు  లండన్ లో బోడి మల్లయ్య గా మారిన తీరు  .. సమకాలీన ప్రపంచం ఎన్ని ఉదారణలను విసిరేసినా నేర్చుకోలేని స్థితికి చేరుకొంది మానవాళి . 


ఆనందం అనేది కిలోల్లో టన్నుల్లో దొరికే వస్తువు కాదు . డబెట్టి దాన్ని కొనలేవు . డబ్బు అవసరమే ! ధర్మార్థకామమోక్ష అన్నారు . అర్థం అంటే డబ్బు కావాలి . కామ అంటే సెక్స్ { సెక్స్ ఒక్కటే కాదు } .. అదీ  కావాలి . కానీ ధర్మ ముఖ్యం అని  చెప్పే గురువులు లేకపోయారు . చెప్పినా...  వారి రీచ్ తక్కువ .ప్రవచనాలు ముసలాళ్లకే ! నేటి తరానికి చెప్పేవారెవరు ? 


ధర్మం అంటే ? 


ధర్మం అంటే జడ పదార్థం కాదు . కాల ధర్మం .. దేశ ధర్మం .  ఆపద్ధర్మం . దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా మారుతుంది . 


ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో చెప్పేదే ధర్మం . భూప్రపంచం లో నువ్వొక్కడే ఉంటే నీ ఇష్టం . నువ్వు ఆడిందే అట.. పాడిందే పాట ! కానీ ఒక్కడే బతకలేవే ! కన్న వెంటనే తల్లి వదిలిస్తే గంటలో శవం అయిపోయేవాడివి . పొద్దునే నువ్వు వాడే బ్రష్ మొదలు రాత్రి పడుకొనే బెడ్ దాకా నలుగురి శ్రమ  తో వచ్చిందే . నీకు నచ్చినా నచ్చక పోయినా నువ్వు సంఘ జీవి . పట్టుకముందు నుంచి కట్టే కాలే దాక ! 


సమాజమంటే మనుషులు . నీ లాంటి వారు . పెద్దవారు .. చిన్న వారు .

  నువ్వేమి చెయ్యాలి .. ఏమి చేయకూడదు చెప్పేదే ధర్మం ! అదొక సామజిక  నియంత్రణా సూత్రం . 


నువెక్కిన బోట్ లో ఎవడో చిల్లు పెడితే?  నీ మునక గ్యారంటీ . నా బోట్ నా ఇష్టం అంటూ నువ్వు దాన్ని తగలేస్తే అందరూ పోవడం  గ్యారంటీ ! 


సమాజం అలాంటిదే ! ప్రేమ ,  పెళ్లి , పెటాకులు , పిల్లలు , చదువులు,  ఉద్యోగాలు అన్నిటికీ రూల్స్ వున్నాయి . ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో చెప్పే సూత్రాలు వున్నాయి . అదే ధర్మం .


ధర్మం  అంటే మత గ్రంథాలు కాదు . మతం వ్యక్తిగతం . అంబెడ్కర్ ఇచ్చిన రాజ్యాంగం మన ధర్మం . కాలానుగుణంగా అందులో మార్పులు చేర్పులు చేయడానికి మనం ఎన్ను కొన్న పార్లమెంట్ . అది చేసే చట్టాలను సమీక్షించడానికి న్యాయ  వ్యవస్థ . అంతర్జాతీయ స్థాయిలో ఐక్య రాజ్య సమితి .. దాని అంగాలు .. మానవాళి కళ్యాణం కోసం చిందిన రక్తం  ఎంతో! అబ్రహం లింకన్,  గాంధీ , అంబేద్కర్, రాజారామ్ మోహన్ రాయ్ , భగత్ సింగ్ .. ఒకరా ఇద్దరా ? వందలు వేలు ! ఇంతమంది మేధావుల త్యాగధనుల జీవిత ఫలం నేటి నీ సుఖం . ప్రపంచ యద్ధాలు .. అణుబాంబులు .. ఒడంబడికలు.. శాంతి సదస్సులు .. ఎన్నో వేల గంటల  మానవ  సమిష్టి మేధ,  నేటి నీ సుఖం .

 అన్నింటినీ కాలదన్ని నా సుఖమే నే కోరుకొన్నా అంటే ? 


పోనీ సుఖాన్నయినా అనుభవిస్తున్నావా ? 


ఒకప్పుడు శుక్రవారం అరగంట చిత్ర లహరి చూసి ఫుల్ హ్యాపీ అయిన మహిళా నేటి బామ్మ. ఎంటో!  యు ట్యూబ్ లో అన్ని గంటలు పాటలు చూసినా సంతృప్తి రాలేదంటుంది . ఆది వారం సంక్షిప్త శబ్ద చిత్రం విని ఆనంద  బాష్పాలు రాల్చిన మొన్నటి బాలుడు  నేడు వృద్ధాప్యం లో స్మార్ట్ టీవీ లో ఎన్ని సినిమా లు చూసినా సాటిస్ఫాయ్ కావడం లేదు . సిల్క్ స్మిత మోకాటి పై దుస్తులకే గంగవెర్రులెత్తిన నాటి తరం .. పూర్తి నగ్న చిత్రాలను చూసిన కిక్ రాని నేటి తరం .


ఏంటిది ?


   కాలం మారిందా ?


    అది మారుతూనే  ఉంటుంది . మీరు ఈ మెసేజ్ చదవడం మొదలెట్టి నిముషాలు గడిచిపోయాయి . సమస్య కాలం కాదు . జెనెరేషన్ గ్యాప్ కాదు . 


సమస్య  డోపామైన్ హై .


   దీన్ని  అందరికీ అర్తం అయ్యేలా చెప్పాలంటే ఇప్పటికే కొండవీటి చేంతాడంటయినా ఈ మెసేజ్ మరీ లాంగ్ అయిపోతుంది . తోలి సారి ఒక బీర్ కే కిక్ . ఆరు నెలలు గడిస్తే రెండు పెగ్గులు . ఆరేళ్లు గడిస్తే ఫుల్ బాటిల్ కొట్టినా కిక్ రాదు . అదే డోపామైన్ హై . 


నేడు జరుగుతోంది ఇదే ! 


గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ .. విల్లా .. విమానం .. అమెరికా .. అంటార్కిటికా టూర్.. ఏదైనా సరి పోవడం లేదు . ఇంకా ఇంకా కావాలి . 


ఇంకేం ఇంకేం కావాలి .. చాల్లే ఇది చాల్లే .. 


ఆనందం ఒక గుణాత్మక అంశం . అదో అమూర్త భావన . దీన్ని  అందరికీ  అర్థం అయ్యేలా చెప్పి సమాజం లో మార్పు తెచ్చే గురువులు కావాలి . నేడు ఉపాధ్యాయ దినోత్సవం . తల్లే  మొదటి గురువు . అటు పై బడి . తల్లి ఒడి లో అటు పై బడిలో మనిషి నేర్చేదే ధర్మం . అంటే మంచి చెడు.


ధర్మో రక్షతి రక్షితః ! చాల సింపుల్ సామజిక సూత్రం . "అరే వెర్రి నాగన్నా! బోట్ లో ఉన్నావు. ఎలా కూర్చోవాలి? ఎలా లేవాలి ?ఎప్పుడు లేవాలి? ఇలా అన్నిటికీ పద్దతులున్నాయి ..అని చెప్పేదే ధర్మం .


నీ సుఖం కోసం ధర్మాన్ని తుంగలోకి తొక్కితే దాని ఫలం  నిన్ను వెంటాడుతుంది . పదవి కోసం డబ్బులిచ్చి ఓట్లు కొనడం .. డబ్బు కోసం  ఓటు అమ్ముకోవడం .. ఇలా అందరూ ధర్మాన్ని అతిక్రమిస్తే.. వ్యవస్థలు .. సంక్షోభాలు .. అశాంతి ,  అసంతృప్తి . నేడు జరుగుతోంది అదే.


ఈ పరిస్థితి మారాలంటే/


 ధర్మాన్ని అంటే రాజ్యాంగ సూత్రాలను చట్టాన్ని అందరూ పాటించాలి . 

  లేక పొతే ?


సిస్టం సెల్ఫ్ కరెక్షన్ చేసుకొంటుంది .


 అందరూ తమకు తోచిన రీతిలో వ్యవహరిస్తే ?


 రేప్ లు .. హత్యలు .. మర్డర్ లు అంతర్యుద్ధాలు .. ఇలా సమాజం సర్వనాశనం అయిపోతుంది . వినాశంనుండి సమాజం అంటే భావి తరాలు పాఠాన్ని  గ్రహిస్తారు . ధర్మ సంస్థాపనార్థం సంభవామి యుగే యుగే అంటే ఇదే .. అన్ని మతాల్లో దేవుడొస్తాడు .. బాగుచేస్తాడు అని నమ్మకం వెనుకనున్న సామజిక శాస్త్రం ఇదే . సమాజము - సెల్ఫ్  కర్రెక్క్షన్ . అప్పటికీ మీరు నేను  ఉండము. 


నేడు మీరు తేల్చుకోవాలింది ఒక్కటే .. ఏది దారి ? ధర్మాన్ని రక్షించి మన ఓడను ఒడ్డుకు చేర్చడమా ? లేక ప్రళయాన్ని సృష్టించి తిరిగి ఎప్పుడో ధర్మం మొలిచేలా కాల చక్రానికి  ఒదిలెయ్యడమా ?


గురువుల దారా ? 


స్మశాన దారా ?


  తేల్చుకోవాల్సిన సమయం ఇదే !


తల్లి తో మొదలెట్టి మంచిచెడు చెప్పి ధర్మాన్ని రక్షించిన గురులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ  శుభాకాంక్షలు .

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE