NaReN

NaReN

Thursday, September 15, 2022

నీ ఓటు విలువ

 నీ ఓటు విలువ



నియోజకవర్గంలో....ని

ఏ ఒక్కమగాడి ఒంట్లోనుండి   

వీసమెత్తు మత్తుదిగకుండా సూడండీ

ఓటు హక్కున్న ఏ ఒక్కఆడది కైకిలికిపోకుండా కాపలాకాసీ 

కూలిచ్చి మన ప్రచారానికి పిలుచుకపోండీ


పిడుచగట్టుకపోయిన ఆ లేకి నాలుకలమీద 

పూటపూటకి నాలుగు పెగ్గుల సొప్పున చీపులిక్కరిని పొయ్యండి

వాళ్లే......

పొంగిపోయి మన వెంట నడుస్తారు

వాళ్లే....

నిక్కీ నీలిగీ మనకోసం నినాదాలిస్తారు


మడిసి మడిశి మశివంతపేలికలైన ఆ  ముడుతకొంగుల ముఖాన 

ఓ మోపెడన్నీ చీరెల మూటల్ని ముట్టజెప్పండి

వాళ్లే....

కట్టుకొనచ్చి మన ప్రచారలకి పబ్బతులు పడుతారు

వాళ్ళే....

జట్లుజట్లుగొచ్చి మన జీపులముందు జానపద కోలాటమాడుతారు


మన పుట్టినరోజులకి  ఫ్లెక్సీలు కడుతూ

మన పెళ్లిరోజులకి కేకులు కట్జేస్తూ యూత్ లీడర్లుగా ఊరుమీద పడి తిరుగుతున్న ఆ హౌలా అవారాగాళ్ళకి మాత్రం ముందస్తు బయానాలు ఇచ్చేయండి 

వాళ్లే.... 

మన కాన్వాయిల వెనుక  కుక్కలై తిరుగుతారు

వాళ్లే.... 

మన రథయాత్రలముందు రిమ్మచ్చి మొరుగుతారు


ఏ కులానికి ఎవరెవరు నాయకులో

ఏ సంఘానికి ఎవరెవరు సంస్కర్తలో 

వాళ్లని పిలిపించి ప్రత్యేక ప్యాకేజీలు మాట్లాడండి

వాళ్లే...... 

వాళ్ల కులభవనాల్లో మన పార్టీ భజనలు చేస్తారు

వాళ్లే....

వాళ్ల సంఘ సభ్యులకి మనకి కట్టుబడి ఉండాలని తీర్మానం చేసుకుంటారు


ఆ ఆట పాటల అలుకతక్కువ ఏశగాళ్లకి 

గోశీ గొంగల్లు పంచి పెట్టండీ

కళాకారులుగా  కైకిలొచ్చే ఆ కూలీ గొంతుకలకి

కొన్నిజతల కొత్తగజ్జెలు ఇప్పించండీ

వాళ్లే.... 

నాలుగురోడ్ల కూడలీలో నిలబడి మన పేర్లమీద పాటలుపాడుతారు

వాళ్లే....

ఊరు వాడల్లో తిరుగుతు మన రాజకీయ వీరంగమాడుతారు


కొసాకరికి

గంపగుత్తగా మనం కొనుక్కున్న ఓట్లెన్ని

రేపు శత్రుశిభిరాలు  చీల్చుకుపోయే ఓట్లెన్ని

చివరాకరికి మన ఉచ్చులో చిక్కుకున్న ఓట్లెన్ని

తెల్లారితో మన గుర్తు మీద గుద్దబడే ఓట్లెన్ని

లెక్కలుతీసి ప్రతీ గడపగడపకు పచ్చనాకులు పంచిపెట్టండి

వాళ్లే....

వాళ్ల చూపుడువేలుతో వాళ్ల కండ్లల్ల పొడుచుకుంటారు

వాళ్లే....మన కుర్సీలముందు కుక్కిన పేనుల్లా పడుంటారు. 


                                         సత్య కలకోటి👣


( ఎవరికి ఓటేస్తున్నాం ఎందుకు ఓటేస్తున్నాం ఎవరెవరు పోటీదారులు ఎవరి ఎజెండాలేంటి 

ఎవరిని ఎన్నుకోవాలి అనే మౌళిక విషయాలు కూడా తెలియని మెజారిటి ప్రజలే ఈ దేశంలో ప్రభుత్వాల్ని ఏర్పరుచుకుంటారు  ఆ ప్రభుత్వ పాలకులచే రకరకాల హింసకి గరవుతుంటారు. 


వాళ్ల నియోజ్కవర్గానికి ఎమ్మల్యే ఎవరో కూడా తెలియని ఎంతోమంది అమాయక ఓటర్లున్న దేశం మనది. 

ఈ దేశంలోని మెజారిటి ప్రజలకి 

ఎలక్షన్ అంటే డబ్బులు, ఎలక్షన్ అంటే మందు ఎలక్షన్ అంటే పాటలు ప్రచారాలు అనే తెలుసు తప్ప ఎలక్షన్ అంటే దేశ భవిష్యత్తుని ఓటుకి దేశ ధిశల్ని మార్చేసేంత దమ్ముందని తెలియదు. ఎందుకంటె ఈ దేశంలో ఎలక్షన్ ఓక జాతర ఆ జాతరలో ప్రజలు తాగుతారు తింటారు ఆడుతారు పాడుతారు వెళ్లిపోతారు తరాలుగా అలవాటుపడ్డ బతుకలవి. 


బహుజన ఓటుబ్యాంక్ బాగానే ఉందికానీ

ఆ బ్యాంకుకి లాకర్లు లేవు కనీసం లాక్ చేయడానికి గేట్లు కూడా లేవు. 

అందుకే ఎవడిపడితే వాడు చొరబడుతాడు ఎప్పుడుపడితే అప్పుడు దోచుకుంటాడు)

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE