NaReN

NaReN

Friday, April 7, 2023

లంగూడీ అంటే తెలుసా

 ✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️


                   *లంగూడీ* 

                🟰🟰🟰🟰🟰

ఓ రోజున తెలుగు మేష్టారు సెలవు పెడితే ఆ క్లాసుకి నన్ను వెళ్ళమన్నారు   హెడ్మాష్టారు.

నాకు తెలుగులో పాండిత్యం లేదనీ, వ్యాకరణం క్షుణ్ణంగా చదివి ఉండలేదనీ యెట్లా తెలిసిందో మరి; కొందరికి తెల్సింది. తెల్సిందని నేనను కొంటున్నాను. లేకపోతే ఓ కుర్రాడు లేచి నాప్రాణానికి ' లంగూడీ అంటే ఏమిటండీ' అంటూ ఎందుకు అడుగుతాడు? 

లంగూడీ! లంగూడీ ఏమిటి? ఇదెక్కడి మాటరా దేవుడా! ఎప్పుడూ వినలేదే!

నాలో బయలుదేరిన గాభారాని పైకి కనబడనీయకుండా కోపంగా ముఖం పెట్టి 

' సమాసంబులం బ్రాతాదుల తొలియచ్చు' సూత్రం అర్థం అయిందా? అన్నా.

అది అర్థం అయిందండీ లంగూడీ యే అర్థం కాలేదండీ అన్నాడు వాడు.

అతగాడి వరస చూస్తే యుద్ధానికి సిద్ధం అవుతున్న ప్రత్యర్థిలా కనిపించాడు.

ఓటమి నంగీకరంచ కూడదు.  అందుకే బింకంగా వ్యాకరణం క్లాసులో ఇతర విషయాలు అడక్కు అన్నా.

' ఇది వ్యాకరణానికి సంబంధించిన దేనండీ ' వాడెంత సౌమ్యంగా అన్నా నా ప్రాణాలతో ఆడుకుంటున్నట్లు అనిపించింది. 

అప్పటికే పిల్లలు ఒకరి మొఖం ఒకరు చూసుకొంటూ తలలు వంచుకుని ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు. ఇంతలో నా పాలిటి భగవంతుడులా  స్కూలు ప్యూను బెల్లు కొట్టేడు. బ్రతుకు జీవుడా అనుకుని దాని అర్థం వచ్చే క్లాసులో చెప్తా లేవోయ్ అని బయట పడ్డాను.

తర్వాత ఆ మాట కోసం ఎన్ని నిఘంటువుల్ని తిరగేశానో లెఖ్ఖ లేదు!

ఎవర్నైనా అడుగుదామంటే నామోషీ. అసలు అసలలాటి పదం ఉందో  లేదో తెలీదు.

'మేష్టారూ వాడు మిమ్మల్ని ఏడిపించడానికి అన్నట్టున్నాడండీ అని వాళ్ళు నవితే?

అందుకే ఆ సంగతి అంతటితో మరిచి పోయాను.  కనీసం మరిచిపోయినట్లు నటించాను.

కానీ, ఆ గడుగ్గాయి కుర్రా డెందుకు మరిచి పోతాడు?  నన్ను ఏడిపించ డానికే కంకణం కట్టుకొన్నాడు. తర్వాత క్లాసులో అడగనే అడిగేడు.  నేను భయపడి నంతా అయ్యింది.

నేను తెల్లమొహం వెయ్యడం, తబ్బిబ్బు పడడం, వాడు కూర్చోకుండా అర్థం చెప్పవలసిందే అన్నట్లు జండా కొయ్య లాగా నుంచునే ఉండడం, తక్కిన పిల్లల్లో కొందరు చాటుగానూ, కొందరు బాహాటంగానూ నవ్వుతూ ఉండడం - నాకు తెలియదు అని చివరికి ఓటమిని అంగీకరించి ' అయినా ఎక్కడుంది ఆ మాట? ' అని చిరాకు పడ్డాను.

ఇదిగోనండీ ఈ వ్యాకరణ పుస్తకంలో అంటూ ముందుకు వచ్చాడు. నా గుండె గుభిల్లుమంది.  తీరా  వాడిచ్చిన పుస్తకం చూద్దును కదా నాకూ నవ్వు వచ్చింది.  అప్పటికే సముద్రఘోషలా ఉంది క్లాసంతా నవ్వులతో.  

ఇంతకీ అదేంటో తెలుసాండీ?.....చిన్నయ సూరి వ్యాకరణ సూత్రంలో మాట అది. " ఇ, ఈ, ఎ, ఏ లం గూడి " అని. లం అనే అక్షరాన్ని దాని ముందు అక్షరంతో కలపకుండా తర్వాత అక్షరంతో కలిపి చదివి నా ప్రాణమూ పరువూ రెండూ తీశాడు.

తెలియక అలా చేశాడంటారా? ఒక్క నాటికీ నమ్మను.


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE