NaReN

NaReN

Sunday, April 16, 2023

ఓ తండ్రి కథ...

 160423f1607.      170423-4.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఓ తండ్రి కథ…



       నీ భవిష్యత్ ను మార్చే శక్తి 

          నీకు మాత్రమే వుంది!

               ➖➖➖


వార్తాపత్రికలు వేసే వ్యక్తి ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నాకు వార్తాపత్రికను అందించడానికి వచ్చేవాడు, నేను మా ఇంటి వసారాలో నడవడం గమనించేవాడు. అలా నా ఇంటి ముందు గేటు దాటుతూ, సైకిల్ ఆపకుండానే న్యూస్ పేపర్ ని బాల్కనీలో విసిరేసి…

 “నమస్తే బాబూజీ” అని పలకరించి వేగంగా ముందుకెళ్లిపోయేవాడు.

సంవత్సరాలు గడిచేకొద్దీ నేనూ పెద్దవాడినయ్యాను, నా మేల్కునే సమయం కూడా మారిపోయింది. ఇప్పుడు నేను ఉదయం 7 గంటలకు లేస్తున్నాను.


చాలా రోజులుగా నేను ఉదయం నడకకు లేవలేకపోవడంతో, ఒక ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో, నా యోగక్షేమాలు తెలుసుకోవడానికి  అతను నా ఇంటికి వచ్చాడు. ఇంట్లో అంతా బాగానే ఉందని, నేను ఆలస్యంగా లేవడం ప్రారంభించానని తెలుసుకుని, ముకుళిత హస్తాలతో, "బాబూజీ! నేనొక విషయం చెప్పవచ్చా?" అని అడిగాడు.

"ఫర్వాలేదు, చెప్పు" అన్నాను.


అతను ఇలా అన్నాడు, "ఉదయం త్వరగా లేచే మంచి అలవాటును మీరు ఎందుకు మార్చుకుంటున్నారు? నేను ఉదయాన్నే విధానసభ రహదారి నుండి వార్తాపత్రికలను తీసుకొని వస్తాను. మీరు వార్తాపత్రిక కోసం ఎదురుచూస్తూ ఉంటారని, మీకు వార్తాపత్రికను అందించడం ఆలస్యం అవకూడదని అనుకుంటూ, చాలా వేగంగా సైకిల్  త్రొక్కుకుంటూ వస్తాను."


నేను ఆశ్చర్యంగా "నువ్వు విధానసభ రోడ్డు నుండి వార్తాపత్రికలు తెస్తావా?" అన్నాను.


"అవును, అక్కడ నుండే మొదటి పంపిణీ ప్రారంభమవుతుంది," అతను సమాధానం చెప్పాడు.


నేను అతనిని మరొక ప్రశ్న అడిగాను, "అయితే అప్పుడు నువ్వు ఎన్ని గంటలకు నిద్ర లేస్తావు?" 


"రెండున్నరకి లేస్తాను ... మూడున్నరకి అక్కడికి చేరుకుంటాను" చెప్పాడు.


"అప్పుడు?" నేను మళ్ళీ అడిగాను. 


"వార్తాపత్రికలు పంచిన తరువాత, ఏడు గంటలకు నేను ఇంటికి వెళ్లి పడుకుంటాను. పది గంటలకు ఆఫీసుకు వెళ్ళాలి. పిల్లలను పెంచడానికి, కుటుంబ పోషణకి ఇవన్నీ చేయాలి కదా", అన్నాడు.


నేను కొన్ని క్షణాలు అతని వైపు చూస్తూ ఉండిపోయాను, "సరే! నువ్విచ్చిన విలువైన సూచనను నేను గుర్తుంచుకుంటాను", అన్నాను.


ఈ సంఘటన జరిగి దాదాపు పదిహేనేళ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మా ఇంటికి వచ్చి ఒక ఆహ్వానపత్రిక ఇచ్చాడు. "బాబూజీ! నా కూతురి పెళ్లి... మీరు మీ కుటుంబంతో తప్పక రావాలని కోరుకుంటున్నాను", అన్నాడు.


పెళ్లిపత్రికను చూసిన వెంటనే ఒక డాక్టర్ అమ్మాయికి డాక్టర్ అబ్బాయికి పెళ్లి అని తెలిసింది.

నేను గబుక్కున అనాలోచితంగా, "మీ అమ్మాయా?" అనడిగాను.


నేను ఏ ఉద్దేశ్యంతో అడిగాననుకున్నాడో, అతను వెంటనే, "అదేంటి బాబూజీ అలా అడుగుతున్నారు! ఈమె నా కూతురే!", అన్నాడు.


వెంటనే నా వైఖరిని సరిదిద్దుకుని, 

"అంటే నా ఉద్దేశ్యం, నీ కుమార్తెను డాక్టర్‌ ని చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను", అంటూ మా మధ్య ఇబ్బందిని తొలగించాను.


“అవును బాబూజీ! నా కుమార్తె KGMC నుండి MBBS చేసింది. ఆమె కాబోయే భర్త కూడా అక్కడ MD…  

నా కుమారుడు కూడా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు" అన్నాడు.


తలుపు దగ్గర నిలబడి లోపలికి పిలవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా, "సరే బాబూజీ! నేను ఇంక బయలుదేరాను... ఇంకా చాలా కార్డులు పంచాలి... పెళ్ళికి దయచేసి తప్పకుండా రండి. మీ కుటుంబంతో రండి, నా కుటుంబం మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తుంది" అన్నాడు.


నేనెప్పుడూ అతనిని లోపలికి రమ్మని పిలవలేదు, ఈరోజు హఠాత్తుగా లోపల కూర్చోమని ఆహ్వానిస్తే, అది బూటకమే అవుతుంది. కాబట్టి గౌరవంగా ఒక నమస్కారం పెట్టి, నేను బయటి నుండే అతనికి వీడ్కోలు పలికాను.


ఆ సంఘటన జరిగిన రెండేళ్ల తర్వాత, అతను ఇంకోసారి నా ఇంటికి వచ్చినప్పుడు, అతని కొడుకు జర్మనీలో ఎక్కడో పనిచేస్తున్నాడని మా సంభాషణలో తెలిసింది.


ఇప్పుడింక, నా ఉత్సుకత ఆపుకోలేక, చివరికి అతనిని ఒక ప్రశ్న అడిగాను: "నీ పరిమిత ఆదాయంతో నీ పిల్లలకు ఉన్నత విద్యను ఎలా అందించావు?"


"బాబూజీ! ఇది చాలా పెద్ద కథ, కానీ నేను మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వార్తాపత్రికలు, నా ఉద్యోగమే కాకుండా, నేను ఖాళీ సమయంలో కూడా కొన్ని పనులు చేస్తూనే ఉంటాను. నా రోజువారీ ఖర్చులు కూడా చాలా జాగ్రత్తగా నిర్వహించుకుంటాను.

నేను రాత్రిపూట మాత్రమే మార్కెట్‌ కి వెళ్లి తక్కువ ధరకు లభించే గుమ్మడి, పొట్లకాయ, బెండకాయలు కొంటాను... ఎందుకంటే రాత్రిపూట దుకాణాలు మూసే సమయంలో దుకాణదారులు చాలా తక్కువ ధరకే కూరగాయలు ఇస్తారు.

ఒకరోజు, నా కొడుకు ఇరుగుపొరుగు పిల్లలతో ఆడుకోవడానికి వారి ఇంటికి వెళ్ళాడు, ఎర్రటి ముఖంతో, కళ్ళ నీళ్లతో తిరిగి వచ్చాడు. మమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలని అనుకున్నాడు.


ఆ సాయంత్రం అందరం భోజనానికి కూర్చున్నప్పుడు, మా అబ్బాయి కంచంలో కూర, చపాతీని చూసి ఏడవడం మొదలుపెట్టాడు. తల్లితో ఇలా అన్నాడు, “ఏంటి ఇది.. ఎప్పుడూ అదే గుమ్మడికాయ, బెండకాయ, పొట్లకాయ ... రుచి పచి లేని కూరగాయలు ...ఇవన్నీ తిని, తిని అలసిపోయాను. నేను నా స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళు బఠానీలు-పనీర్, కోఫ్తాలు, దమ్ ఆలూ, ఒకటి కాదు... ఇంకా చాలా తింటారు!  ఇక్కడేమో, కేవలం ఒక కూర, ఎండిన చపాతీ మాత్రమే ."


నేను అతని వైపు ప్రేమగా చూసి, “ముందు నువ్వు ఏడుపు ఆపితే, తర్వాత మాట్లాడుకుందాం” అన్నాను.


అప్పుడు నేను, "నాయనా! ఎప్పుడూ నీ కంచంలోనే చూసుకో. ఎదుటివాళ్ళకి ఉన్నదానిని మనం చూసుకుంటే అసలు మన దగ్గర ఉన్నవాటిని కూడా మనం ఆస్వాదించలేం. ఇప్పుడు, ఈ క్షణంలో  మనకు ఏది ఉందో దానిని హృదయపూర్వకంగా అంగీకరించాలి. భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకుని, ఎల్లప్పుడూ మన భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ నిన్ను నీవు విశ్వసించు, నీ భవిష్యత్తును మార్చే శక్తి నీకు మాత్రమే ఉంది, వేరెవరికీ లేదు. నిన్ను నీవు ఇంకా మెరుగుపరచు కోవడానికి, ఇంకా మంచిగా అవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండు. 


నా కొడుకు కన్నీళ్లు తుడుచుకుని, ఆ తర్వాత నవ్వుతూ నా వైపు చూసి, 'ఈ రోజు నుండి నేను నా జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోను, నా భవిష్యత్తును బాగు చేసుకోవడానికి నా వంతు కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను’,  అన్నాడు. 


అప్పటి నుండి, నా పిల్లలు ఎవరూ నా నుండి ఏ కోరికలు కోరలేదు, ఏమీ ఆశించలేదు. పరిమిత వనరులతో, వారు తమ జీవితాన్ని మెరుగుపరచు కోవడం ప్రారంభించారు. బాబూజీ! ఈ రోజు వారు ఎక్కడ ఉన్నా, అది వారి త్యాగాల ఫలితమే".


నేను మౌనంగా, శ్రద్ధగా అతని మాటలు వింటూనే ఉన్నాను. నా హృదయపు లోతుల్లో తండ్రి ప్రేమ యొక్క శక్తిని అనుభవించగలిగాను.


♾️♾️♾️♾️♾️♾️


మన భవిష్యత్తు, మన విధి, దానిని మనం ఎంత బాగా నిర్మించుకుంటాం అన్నది, మనపైనే ఆధారపడి ఉంటుంది. 

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE