NaReN

NaReN

Sunday, April 9, 2023

మూర్ఖుని మనస్సు

 మూర్ఖుని మనస్సు


*ఓ గాడిద పులితో ఇలా అన్నది...‘గడ్డి నీలం రంగులో భలేగా ఉంది అని’*


పులి విసురుగా బదులిచ్చింది...

‘కాదు, గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంది’


రెండింటి నడుమ వాగ్వాదం పెరిగింది... వాతావరణం వేడెక్కింది... రెండూ కలిసి ఆ అడవికి రాజైన సింహం వద్దకు వెళ్లాయి...రెండూ సింహం కోర్టులో తమ వాదనలు వినిపించాయి...


సింహం తీర్పు చెప్పింది... *‘‘పులిదే తప్పు అని"* ఏడాదిపాటు ఎవరితోనూ మాట్లాడకూడదని

నిశ్శబ్దంగా ఉండే శిక్ష విధిస్తున్నాను...’’


గాడిద ఆనందంతో ఎగిరి గంతేసి, తన మందతో పంచుకోవడానికి, నీలం గడ్డి నీలం గడ్డి అని అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది...


పులి సింహం విధించిన శిక్షను అంగీకరిస్తూనే... భయంభయంగానే సింహాన్ని అడిగింది... ‘‘ఆర్యా, గడ్డి ఆకుపచ్చ రంగులోనే ఉన్నా సరే, నన్నెందుకు శిక్షిస్తున్నారు...’’


సింహం ఇలా బదులిచ్చింది... ‘‘నేను నీకు శిక్ష విధించింది గడ్డి రంగు గురించి కాదు, తెలివైనదానివి, ధైర్యమున్నదానివి...ఆ గాడిదతో పనికిమాలిన వాదన పెట్టుకున్నందుకు..."


వాస్తవమేమిటో పట్టని ఓ మూర్ఖపు గాడిదతో వాదన పెట్టుకోవడం కాల హరణం కాదా..? గాడిదకు దాని నమ్మకాలు, భ్రమలే దాని జీవితం... ఇలా కొన్ని మూర్ఖపు జంతువులు ఉంటాయి, *మనం ఎన్ని ఆధారాలు చూపించినా తమ వాదననే నమ్ముతాయి, ఎవరేం చెప్పినా వినవు... అర్థం చేసుకోవు, అందుకే వాటిని గాడిదలు అంటారు...* 


*అజ్ఞానం అరుస్తున్నప్పుడు, తెలివితేటలు నిశ్శబ్దంగా ఉంటాయి...నీ ప్రస్తుత నిశ్శబ్దం చాలా విలువైనది... ఇకనైనా గాడిదల జోలికి ఎప్పుడూ వెళ్లకు...* 


*తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు -*

*భర్తృహరి సుభాషితం*


తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు

దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు

తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు

చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.


*భావం:-*  ప్రయత్నము చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును. ఎండమావి యందును నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్ము నైనను సాధింపవచ్చును.

 *కాని మూర్ఖుని మనస్సును మాత్రం సమాధాన పెట్టుట సాధ్యము కాదు.*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE