NaReN

NaReN

Saturday, August 27, 2022

బ్రహ్మరాక్షసుడి సంగీతం


*బ్రహ్మరాక్షసుడి సంగీతం*

మూలం: ఎ.కె.రామానుజన్, ఫోక్ టేల్స్ ఫ్రం ఇండియా 

తెలుగు అనువాదం: నారాయణ


*పేదబ్రాహ్మణుడొకడు తన పేదరికానికి తట్టుకోలేక కాశీయాత్రకని బయలుదేరాడు. ఎండలో చాలాదూరం నడిచీ నడిచీ అలసిపోయిన అతనికి, చక్కని తోట ఒకటి కనిపించింది. ఆ తోటలోని మహావృక్షాల నీడన విశ్రాంతిగా కూర్చొని, వెంట తెచ్చుకున్న అటుకులు భోంచేద్దామనుకున్నాడు అతను. ముందుగా కాలకృత్యాలు తీర్చుకొనేందుకని అతను ఓ పొద మాటున కూర్చోగానే గంభీరమైన స్వరం ఒకటి 'వద్దు' అన్నది.*

*అతను గబుక్కున లేచి అది 'ఎవరి గొంతు' అని అన్ని వైపులా చూశాడు; కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఆ తర్వాత అతను నోరు కడుక్కునేందుకుగానూ అక్కడే ఉన్న కుంట దగ్గరకు పోగానే మళ్లీ అదే స్వరం వినబడింది: 'వద్దు' అని! అయితే ఈసారి అతను ధైర్యంగా తన పని కానిచ్చాడు, ఆ హెచ్చరికను పట్టించుకోకుండా.*

*అయితే అతను తన వెంట తెచ్చుకున్న అటుకుల మూటను విప్పినప్పుడు, మళ్లీ ఆ గొంతు "వద్దు" అన్నది. అతను దాన్నీ పట్టించుకోకుండా, తను తినగలిగినన్నింటినీ తిని, మిగిలిన వాటిని తిరిగి మూటగట్టుకొని, ముందుకు బయలుదేరాడు. అంతలో అదే స్వరం "వద్దు,వెళ్లకు" అన్నది.

బ్రాహ్మణుడు ఆగి, నలుదిక్కులా చూశాడు. ఎవ్వరూ కనబడలేదు. అందుకని అతను "ఎవరునువ్వు? ఎందుకిలా శబ్దం చేస్తున్నావు?" అని అరిచాడు.*


*"పైకి చూడు, నేనిక్కడున్నాను" అన్నది గొంతు. అతను పైకి చూసేసరికి, ఆ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుని ఒక రాక్షసుడు కనబడ్డాడు.*


*ఆ రాక్షసుడు తన దీనగాథను బ్రాహ్మణునితో ఇలా మొరపెట్టుకున్నాడు. "గత జన్మలో నేనూ నీలాగానే ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి, గాన కళలో ఆరితేరాను. నా జీవితకాలమంతా నేను సంగీత రహస్యాల్ని సేకరించటంలోనే వెచ్చించాను తప్పిస్తే, వాటిని ఎవ్వరితోటీ పంచుకోలేదు; ఏ ఒక్కరికీ నేర్పలేదు. అందుకనే ఈ జన్మలో నేను రాక్షసుడినవ్వాల్సి వచ్చింది. భగవంతుడు నాకిచ్చిన శిక్ష ఇది. నువ్వలా వెనక్కి తిరిగిచూస్తే అక్కడో చిన్న గుడి కనబడుతుంది. ఆ గుడిలో ఒక సంగీతకారుడు సన్నాయి వాయిస్తూంటాడు- రోజంతా! అతను వాయించినంత ఘోరంగా సన్నాయిని ఎవ్వరూ వాయించలేరు- అన్నీ అపశృతులే. ఆ శబ్దం నాకు కలిగించే వేదన అంతా ఇంత అని చెప్పలేను - నా చెవుల్లో కరిగిన సీసం పోసినంత బాధగా ఉంటుంది. నేను దాన్ని అస్సలు భరించలేకపోతున్నాను. అతను వాయించే స్వరాల్లో తప్పుగా ఉన్న స్వరం ప్రతి ఒక్కటీ నాలోంచి బాణం మాదిరి దూసుకుపోతున్నది. ఆ శబ్దాలకు నా శరీరం తూట్లుపడి జల్లెడ అయిపోయినంత బాధ కలుగుతున్నది. ఒళ్లంతా నొప్పులే నొప్పులు. ఇదిగనక ఇలాగే కొనసాగితే నాకు పిచ్చెక్కి నేను ఏవేవో చేయటం తథ్యం. రాక్షసుడిని గనుక నన్నునేను చంపుకోలేను కూడాను. మరి ఈ చెట్టును విడిచి పోనూ పోలేను - నన్ను ఈ చెట్టుకు కట్టేశారు. కనుక ఓ బ్రాహ్మణుడా, నువ్వు చాలా మంచివాడివి. నీకు పుణ్యం ఉంటుంది. నామీద దయ తలుచు. తీసుకెళ్లి దూరంగా కనబడే ఆ తోటలోకి చేర్చు. అక్కడ నేను కనీసం కొంచెం ప్రశాంతంగా గాలి పీల్చుకోగలుగుతాను. అలా చేస్తే నా శక్తులు కూడా కొన్ని నాకు తిరిగి వస్తాయి. ఒకప్పుడు నీలాగే బ్రాహ్మణుడై, ఇప్పుడు నాలాగా రాక్షసుడైనవాడిని ఉద్దరించినందుకుగాను, నీకు బహు పుణ్యం లభిస్తుంది." అన్నాడు.*


*పేద బ్రాహ్మణుడు కరిగిపోయాడు. కానీ పేదరికం అతన్ని రాటుదేల్చింది. అతనన్నాడు -"సరే, నేను నీ కోరిక తీరుస్తాను. నిన్ను వేరే తోటకు చేరుస్తాను - అయితే దానివల్ల నాకేం ప్రయోజనం? నువ్వు బదులుగా నాకోసం ఏం చేస్తావు?" అని.*


*"నీ ఋణం ఉంచుకోను. నీకు మేలు చేస్తాను. నాకీ ఒక్క సాయం చెయ్యి చాలు" అని ప్రాధేయపడ్డాడు బ్రహ్మరాక్షసుడు.*

*'సరే'నని బ్రాహ్మణుడు వాడిని భుజాలమీద ఎక్కించుకొని, గుడికి దూరంగా ఉన్న వేరే తోటలోకి తీసుకుపోయి వదిలాడు.*

*బ్రహ్మరాక్షసుడి కష్టాలు తీరాయి. సంతోషం వేసింది. దానితోపాటు, పోయిన కొన్ని శక్తులు కూడా తిరిగివచ్చాయి వాడికి. వాడు బ్రాహ్మణుడిని ఆశీర్వదించి, అన్నాడు -"నువ్వు పేదరికంతో బాధపడుతున్నావని నాకు తెలుసు. నేను చెప్పినట్లు చేయి - ఇక జన్మలో పేదరికం నిన్ను పీడించదు. ఇప్పుడు నేను స్వతంత్రుడిని- కనుక నేను పోయి, మైసూరు రాజ్యపు యువరాణిని ఆవహిస్తాను. నన్ను వదిలించటం కోసం రాజుగారు రకరకాల మాంత్రికుల్ని రప్పిస్తారు. కానీ నేను మాత్రం వాళ్లెవరికీ లొంగను. నువ్వు వచ్చాకగానీ నేను ఆమెను వదలను. తన కుమార్తెను పట్టిన భూతాన్ని వదిలించినందుకుగాను సంతోషించి మహారాజుగారు, జీవితాంతం నిల్చేంత సంపదను నీపైన కురిపిస్తారు. అయితే ఒక్క షరతు - ఆ తర్వాత నేను వెళ్లి వేరే ఎవరినైనా ఆవహించినప్పుడు, నువ్వు ఇక ఎన్నడూ అడ్డురాకూడదు. దీనికి విరుద్ధంగా ఏనాడైనా జరిగిందంటే నేను నిన్ను తినేస్తాను మరి, ఆలోచించుకో" అని.*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE