అప్పట్లో ఒకడుండేవాడు అని ఎప్పుడూ అనుకుంటారు ఆ గ్రామస్థులు.Hats off to you sir.🙏🙏
ఈ స్కూల్ నాది అని ఫీల్ అయ్యాడు.దాని కోసం ఎంత దూరమైనా వెళ్లాడు.ఎంతకైనా తెగించాడు.జీవితాన్నే పణంగా పెట్టి ఆ పాఠశాలను నిలబెట్టాడు. 🙏🙏🙏
చరిత్ర లో నిలిచిపోయిన పాఠశాల - విలీనాన్ని ఎదిరించి పాఠశాలను గెలిపించిన ఉపాధ్యాయుడి విజయగాధ.చదవండి..
సెప్టెంబర్ 4, సవ్వడి న్యూస్ అనంతపురం బ్యూరో:
రాష్ట్రంలోని ఒక మారుమూల కుగ్రామంలో ఉన్న పాఠశాల కోసం తన ఉద్యోగాన్నే పణంగా పెట్టి, రాష్ట్ర ప్రభుత్వానికే ఎదురునిలచాడు, తన శక్తి మించిన పోరాటం చేసి, విజయం సాధించి సంచలనం సృష్టించిన ఓ ప్రధానోపాధ్యాయుడి 'విజయగాథ' ను తెలుసుకోవడమే కాకుండా, ఆ టీచర్ నడిపిన పోరాటంతో విజయం తలవంచి దాసోహం అన్నది. ఆ కుగ్రామంలో ఆ టీచర్, ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 72 రోజుల పాటు నడిపిన పోరాటం, స్ఫూర్తి భావితరాలు సైతం గుర్తుంచుకునేంత గా నిలిచిపోయాయి. అందులోనూ అధికార పార్టీకి చెందిన ఓ మినిస్టర్ ఉన్న నియోజకవర్గంలో ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుని, ప్రభుత్వమే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పాలసీ (117 GO) కు వ్యతిరేకంగా పోరాడి కేవలం ఆ ఒక్క పాఠశాలను మాత్రమే, ప్రభుత్వ పాలసీ నుంచి మినహాయించడం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాఠశాలకు తాళం వేసి అవిశ్రాంత పోరాటం సలిపి అఖండ విజయం సాధించిన 'విజయగాధను, నేటి ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా ఆ సంచలన సంఘటనను సవివరంగా నెమరువేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు సంచలనం సృష్టించిన ఆ ప్రధానోపాధ్యాయుడే నల్లపల్లి విజయ్ భాస్కర్, అనాటి ఆ పోరాట జ్ఞాపకాల్లోకి తొంగి చూద్దాం రండి.. అది అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని ఓ మారుమూల కుగ్రామం. పేరు మాయదార్లపల్లి గ్రామానికి మూడు, మూడు కిలోమీటర్ల చొప్పున 'నేలబడి తోట', 'కుంట' అనే రెండు ఆవాస గ్రామాలు ఉన్నాయి. ఆ మూడు గ్రామాలకు కలిసి మాయదార్లపల్లిలో ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడే.. సినీ ఫక్కీలో తమ స్కూల్ విద్యార్థుల కోసం ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన 'రియల్ హీరో' నల్లపల్లి విజయ్ భాస్కర్.. ఆ పాఠశాలలో మొత్తం వంద పాతిక కు పైగా విద్యార్థులు ఉండగా, అందులో నేలబడి తోట, కుంట గ్రామాలకు చెందిన 44 మంది విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాయదార్లపల్లి పాఠశాలకు వంకలు, వాగులు దాటుకుని అడవిమార్గం గుండా నడుచుకుంటూ స్కూల్ కు వచ్చి చదువుకుంటారు. ఇలా నడుచుకుంటూ వచ్చే సమయంలో దారిలో పాములు, ఎలుగుబంట్లు, వన్యమగాలు ఎదురుపడడం ఉంటాయి, వాటికి భయపడి పాఠశాలకు వెళ్లకుండానే తిరిగి ఇంటికి వెళ్లపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక వర్షాకాలంలో అయితే వారి కష్టాలు దేవుడికే ఎరుక. పుస్తకాల బ్యాగును తలపై పెట్టుకొని, నడుము లోతు నీళ్లలో నడుచుకుంటూ పాఠశాలకు రావాల్సిఉంటుంది. ఇది క్లుప్తంగా మాయదార్లపల్లి పాఠశాల, ఆ మూడు గ్రామాల విద్యార్థులు చదువుకోవడానికి ప్రతిరోజూ పడుతున్న తిప్పలు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. గత YCP ప్రభుత్వం 'నాడు-నేడు' పనుల్లో భాగంగా శిథిలావస్థలో ఉన్న మాయదార్లపల్లి పాఠశాలను రూ.44 లక్షలతో అత్యద్భుతంగా అన్ని విధాల ఆధునీకరించింది. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ తోపాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం పట్టుమని పది రోజులకే అవిరైపోయింది. కారణం నూతన విద్యా విధానంలో భాగంగా ఆ ప్రభుత్వం తెచ్చిన 117 జీవోనే.. ఈ జీవో ప్రకారం ప్రాథమిక పాఠశాలకు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న 3,4,5 తరగతులను, 3 కిలోమీటర్ల లోపు ఉన్న 6,7,8 తరగతులను ఉన్నత పాఠశాలలోకి విలీనం చేశారు. దీంతో మాయదార్లపల్లి పాఠశాలలోని 6,7,8 తరగతుల విద్యార్థులు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐసాపురం పాఠశాలకు వెళ్లి చదువుకోవాలి, అప్పుడు అసలు సమస్య మొదలైంది.. రహదారి సరిగ్గా లేకపోవడం, బస్సు సౌకర్యం అస్సలు లేని గ్రామాలు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీనికి తోడు నేలబడి తోట, కుంట గ్రామాలకు చెందిన విద్యార్ధులు వారి గ్రామాల నుంచి మాయదార్లపల్లికి 3 కిలోమీటర్లు, అక్కడి నుంచి
ఐసాపురానికి 3 కిలోమీటర్లు మొత్తం చొప్పున 6 కిలోమీటర్లు పోవడానికి,తిరిగి రావడానికి 6 కిలోమీటర్లు నడవాలి. దీంతో దాదాపు 44 మంది విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు బడి మానేసే పరిస్థితి ఏర్పడింది. చదువు అంటే ఇష్టముండి, బాగా చదివే విద్యార్థులు బడి మానేస్తామని చెప్పడంతో ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ కలత చెందారు. వెంటనే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను,రాజకీయపార్టీనేతలనూ, విద్యార్థి సంఘాలను చైతన్య పరిచారు.
దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తమ పాఠశాల తమకు కావాలంటూ ఉద్యమానికి తెరలేపారు. రూ.40 లక్షలతో అత్యద్భుతంగా ఆధునీకరించిన ఆ పాఠశాల గేటుకి తాళం వేసి ఏకంగా గేటుకు కంప వేసేశారు. దీంతో ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా, మా పాఠశాల
మాకే కావాలంటూ ఉద్యమం మొదలైంది. ప్రభుత్వ పాలసీకి
వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ అలుసుగా చూశారు. దీంతో విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ మరింత పట్టుదల పెరిగింది. దీనికి తోడు ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్,
ఉపాధ్యాయులు ఎండ, వాన లెక్క చేయకుండా చెట్ల కింద, ఆరుబయట పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. బసాపురానికి తాము ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లేదిలేదని విద్యార్థులు సైతం పట్టుబట్టి మధ్యాహ్నభోజనం సైతం ఇంటి నుంచి తెచ్చుకున్నారు. తమ విద్యార్థులు అక్కడ ఎక్కడో ఉన్న బడికి వెళ్ళలేక, ఎక్కడ బడి మానేస్తారో అని, అలాంటప్పుడు వారు బడి మారటానికి వీల్లేదని ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ టీసీలు కూడా ఇవ్వలేదు.ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ పాలసీ మారదనే సాకుతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాయదార్లపల్లి విద్యార్థులకు విద్యాశాఖ కార్యాలయం నుంచి నేరుగా ఆన్ లైన్ లోనే టీసీలు ఇచ్చారు. అయినా సరే ప్రధానోపాధ్యాయుడు గానీ, విద్యార్థులు గానీ పట్టు వీడలేదు. తమ పాఠశాల తమకే కావాలంటూ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేశారు.2022 జూలై 6న ప్రారంభమైన ఈ ఉద్యమం ఒకరోజు కాదు, వారం రోజులు కాదు ఏకంగా 72 రోజుల పాటు కొనసాగింది. ఈ ఉద్యమంలో అనేక అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదే నెల 11వ తేదీన మండల విద్యాశాఖాధికారి పాఠశాలను సందర్శించి పై అధికారులకు తప్పుడు నివేదిక సమర్పించారు.. జూలై 16న
ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ కలెక్టర్ ని కలిసి ఆ పాఠశాల, అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పూసగుచ్చినట్టు వివరించారు. జూలై 31న విజయవాడకు వెళ్లి అప్పటి
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ ను కలిసి పరిస్థితిని అంతా వివరించారు. ఇది అయ్యేపని కాదు ఎందుకు వృథాప్రయాస మీ పని మీరు చేసుకోండి అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ 'సార్ ఎప్పటికైనా ఈ ఫైల్ మీ దగ్గరకే వస్తుంది, అప్పుడు సంతకం చేయడానికి సిద్ధంగా ఉండండి' అని తిరిగి వచ్చేశారు. ఆగస్టు 8న అప్పటి విద్యాశాఖ మంత్రి
ఆదిమూలపు సురేష్ కు కూడా కలిసి పరిస్థితిని వివరించారు. ఐనా ఫలితం శూన్యం. అదే రోజున విద్యార్థులు తమ పాఠశాల తమకే కావాలంటూ గ్రామంలోని వాల్మీకి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అంతేకాకుండా జగన్ మామయ్యా మా స్కూల్ మాకే
కావాలంటూ ఏకంగా ముఖ్యమంత్రికి పోస్ట్ కార్ట్ లు రాశారు కూడా.అంతటితో ఆగకుండా ఆగస్టు 10న హైకోర్టు ప్రధానన్యాయమూర్తికి
లేఖలు రాశారు. దీనికి స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఉద్యమాన్ని పరిశీలించాలని న్యాయ సేవాధికార సంస్థకు బదిలీ
చేసింది. దీంతో మారుమూల గ్రామమైన మాయదార్లపల్లి పాఠశాల ఉద్యమం రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రజల్లో మరింత ఉత్కంఠ రేపింది. ఉద్యమానికి అప్పటి అధికార YCP మినహా మిగిలిన అన్ని పార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు తమ ప్రకటించాయి.
సెప్టెంబర్ 19న కళ్యాణదుర్గం TDP నాయకులు ఉమామహేశ్వరనాయుడు అనంతపురం CPM నాయకులు రాంభూపాల్ మాయదార్లపల్లిని సందర్శించి తమ మద్దతును ప్రకటించారు. సెప్టెంబర్ 5 న జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం, అక్టోబర్ 2న గాంధీ జయంతి కార్యక్రమాలను కూడా అరుబయట చెట్ల కిందే నిర్వహించారు. అక్టోబర్ 13న విద్యార్థులు తమ పాఠశాల తమకే కావాలంటూ మోకాళ్ళపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అప్పటికీ కనీసం MRO ను కూడాచూడని ఆ మారుమూల మాయదార్లపల్లి ప్రజలు జిల్లా కలెక్టర్ ను, జాయింట్ కలెక్టర్ ను, జిల్లా విద్యాశాఖ అధికారితోపాటు, నాలుగు మండలాల MEO లను, RDO ను, ఇతర జిల్లా అధికారులందరినీ సెప్టెంబర్ 24 న తమ గ్రామానికి రప్పించుకున్నారు. కలెక్టర్ తోపాటు ఉన్నతాధికారులు కూడా తమ గ్రామానికి రావడంతో వారు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. అయితే అప్పటి కలెక్టర్ నాగలక్ష్మి అక్కడి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను, అక్కడి వాస్తవ పరిస్థితిని ఉన్నది ఉన్నట్లు ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీ కి రాసి పంపింది. ఆ తరువాత కూడా ఉద్యమాన్ని భగ్నం చేయడానికి ఆ నియోజకవర్గ మంత్రి చేయని కుట్రలు, కుతంత్రాలు లేవు.. సెప్టెంబర్ 21వ తేదీ ఆ గ్రామానికి చెందిన YCP నాయకులను పిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం తగదని, ఉద్యమాన్ని ఆపకపోతే ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ ను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అయినా విద్యార్థులు, తల్లిదండ్రులు రాజకీయాలకు అతీతంగా తమ పాఠశాల తమకే కావాలంటూ ఉద్యమాన్ని మరింత ఉదృతంగా కొనసాగించారు. బసాపురానికి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆ మంత్రి చేసిన కుట్రలు సైతం భగ్నమయ్యాయి.ఉద్యమం ఉధృతం కావడంతో చివరకు ప్రభుత్వం దిగి వచ్చి అక్టోబర్
21న విలీనం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బసాపురం పాఠకాలకు వెళ్లనందుకు ఆబ్సెంట్ వేసిన ఆ విద్యార్థులకు అటెండెన్స్ వేసి అమ్మఒడికి అర్హులని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.ప్రభుత్వ పాలసీకి
వ్యతిరేకంగా పోరాడి రాష్ట్రంలోనే విలీనం నుంచి మినహాయింపు పొందిన పాఠశాలగా అనంతపురం జిల్లా, మాయదార్లపల్లి పాఠశాల నిలిచింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని అనంతపురం జిల్లా బెళుగుప్ప
మండలం గంగవరం పాఠశాలలో కూడా ఉద్యమం ప్రారంభమైంది.దీనికి సైతం ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ మద్దతు
ప్రకటించారు. ఆ పాఠశాలను సందర్శించి విలీనం విషయం పునరాలోచించాలని ప్రభుత్వానికి ఉపాద్యాయులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా పోరాడి విలీనంనుంచి మినహాయింపు పొందిన పాఠశాలగా మాయదార్లపల్లి పాఠశాల సంచలనం సృష్టించింది, విలీనం నుంచి మినహాయింపు పొందిన కారణంగా ప్రస్తుతం ఆ పాఠశాలకు 6 స్కూల్ అసిస్టెంట్, 2 ఎస్జీటీ పోస్టులు మంజూరయ్యాయి. దీంతో ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి
విజయ్ భాస్కర్ తో పాటు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నల్లపల్లి విజయ్ భాస్కర్, ఉపాధ్యాయులు,విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ పాఠశాల ఉన్నంత కాలం వారందరూ గుర్తుండిపోతారు.