NaReN

NaReN

Thursday, October 31, 2024

20కే భోజనం

 20కే భోజనం

విజయవాడ నడిబొడ్డున మొగల్రాజపురం.

శిఖామణి సెంటర్లో #మన_భోజనశాల.

ఇద్దరు మిత్రులు కలసి #ఈశ్వర్_ఛారిటీస్ పేరిట ఆ భోజనశాల నడిపిస్తున్నారు. 20 రూపాయలకే ఆరోగ్యకరమైన భోజనం పెడుతూ రోజుకు సుమారు 400 మంది కడుపు నింపుతున్నారు. పోటీ పరీక్షలకు వచ్చే యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగుల బంధువులు, వ్యక్తిగత పనుల నిమిత్తం నగరానికి వచ్చేవారి ఆకలిని అతి తక్కువ ఖర్చుతో ఈ భోజనశాల తీరుస్తోంది. ఒక దాతకు సంబంధించిన సోదరి భోజనశాల నిర్వహణ మొత్తం చూసుకుంటున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు భోజనశాల తెరిచి ఉంటుంది.

***

#మేమూ_రుచి_చూశాం

మాటల సందర్భంలో మన భోజనశాల ప్రత్యేకతను సీనియర్ జర్నలిస్ట్, మా కొలీగ్ శ్రీ ఎం.గురువారెడ్డి చెప్పగా.. ఆశ్చర్యపోయాను."సార్.. మనమూ ఓసారి వెళ్దాం" అంటే.. ఓకే అన్నారు. ఇది జరిగి సుమారు నెల గడిచిపోయింది. ఈ రోజు ఉదయం ఆయనే ఫోన్ చేసి.. "వెళ్దామా" అనడిగారు. అడిగిందే తడువుగా క్షణాల్లో రెడీ అయిపోగా.. ఇద్దరం కలసి 12.07 సమయంలో వెళ్లాం. అక్కడి కౌంటరులో 40 రూపాయలు చెల్లించి రెండు టోకెన్లు తీసుకున్నాం. అప్పటికే సుమారు 20 మంది భోజనం చేస్తుండటం కనిపించింది. మరో కౌంటర్లో టోకెన్లు అందచేసి భోజనం ప్లేట్లు, కూర, మజ్జిగ తీసుకుని.. అక్కడే సుఖాశీనులమై భుజించాం. మాకైతే కడుపు నిండిపోయింది. ఎక్కువ భుజించే అలవాటున్న వారు ఇంకో 10 రూపాయలు అదనంగా చెల్లిస్తే మరో పెద్ద కప్పు నిండా అన్నం ఇస్తారు. ఎంత ఎక్కువ తినేవారైనా రెండో కప్పు అన్నంతో కచ్చితంగా కడుపు నిండిపోవాల్సిందే.

***

#నిర్వహణ_భేష్

ఉదయం 8 గంటల నుంచే వంట చేయటం ఆరంభించి.. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఆహారం అంతా సిద్ధం చేస్తారు. నిర్దేశించిన వేళల ప్రకారం.. ఏ సమయంలో వచ్చినా.. ఆహారం వేడివేడిగానే వడ్డిస్తుండటం వీరి ప్రత్యేకత. ప్రధానంగా భోజనంలో రెండు మూడు కూరగాయలతో వండే ఒక కూర, ఒక పెద్ద కప్పు నిండా అన్నం, సాంబారు, వాము, కొత్తిమీర వంటివి కలిపిన మజ్జిగ కూడా ఇస్తున్నారు. వీటితో పాటు రోజూ తప్పకుండా ఏదో ఒక  రోటి పచ్చడి తయారు చేసి పెడుతున్నారు. ఈ రోజు ఏం పెడతారనే మెనూ బోర్డు సైతం అక్కడ కనిపిస్తుంది. భోజనశాలలో శుభ్రతకు పెద్దపీట వేస్తున్నారు. పనిచేసే వారి దగ్గర నుంచి వినియోగించే వస్తువుల వరకు అన్నింటినీ బాగా శుభ్రం చేసిన తరువాతే ఉపయోగిస్తారు. ప్లేట్‌లో అన్నం వడ్డించే ముందు వేడి నీటిలో కడిగి పెడుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక యంత్రాన్ని కొనుగోలు చేశారు. భోజనం పూర్తయ్యాక.. ఎవరికి వారు ప్లేట్, కప్పులను వాష్ బేసిన్ పక్కనే ఉండే కన్వేయర్ బెల్ట్ పై ఉంచితే.. ఎప్పటికప్పుడు యంత్రంలో క్లీన్ అయ్యే ఏర్పాటు చేశారు. అక్కడ రోటి పచ్చడి చేయడానికి మిక్సీలు, గ్రైండర్లు వినియోగించడం లేదు. పాత పద్ధతిలోనే రోలులోనే తయారు చేస్తారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సేవాభావంతో ఆహారం అందిస్తున్నారని తెలిసి.. తిన్న వారంతా అభినందించి వెళుతున్నారు.

***

#అవసరార్థులు_తప్పక_వెళ్లండి 

సేవాభావంతో భోజనశాల నిర్వహిస్తున్న #ఈశ్వర్_చారిటీస్ ఇద్దరు మిత్రులకు లోలోపలే ప్రణామాలు అర్పించుకుంటూ అక్కడ నుంచి బయటకొచ్చాం. వచ్చిన వాళ్లు సామాన్యులా.. గొప్పవాళ్లా అనేది అక్కడెవరూ పట్టించుకోరు. అవసరార్థులు ఎవరైనా ఆ ప్రాంతానికి వెళితే.. మన భోజనశాలను సందర్శించాలని సూచన 🙏🙏      



No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE