NaReN

NaReN

Friday, August 2, 2024

“పక్కింటోళ్ళ చలవ”

 “పక్కింటోళ్ళ చలవ”


కొన్ని కార్ల మీద, ఆటోలు, మోటర్ సైకిళ్ళు, స్కూటర్ల మీద ” Dad’s Gift”, లేక “Mother’s Gift”, “God’s Gift” ఇలా నానారకాలుగా వ్రాసి ఉండడం చూస్తూంటాం. కుటుంబసభ్యులు కొని ఇచ్చారనో, లేదా దేవుడు కరుణించి డబ్బులు వచ్చేలా చేసినందుకు ఈ వాహనం తనకు ఏర్పడిందని చెప్పుకోడం కోసం అలా వ్రాస్తారు అనేది సహజమైన ఆలోచన అనుకుంటాం. పాతిక ముప్పై ఏళ్ళు వచ్చిన తరువాత ఎవరో కొనిస్తే కానీ వీళ్ళు స్వంతంగా ఒక చిన్న వాహనం కొనుక్కోలేకపోయారు అని నేను వాళ్ళ అసమర్ధ చూసి జాలి పడతాను. మొన్న ఒక బట్టల దుకాణం దగ్గర “పక్కింటోళ్ళ చలవ” అని అచ్చ తెలుగులో రాసి కనపడిందో కారుమీద. ఇదేదో వింతగా అనిపించింది నాకు. దానర్ధం బోధ పడ్లేదు? ఎందుకంటే పక్కింటోడు  కారెందుకు కొనిస్తాడెవరికైనా? అనే ఆలోచనతో. ఇందులో మర్మమేమిటో తెలుసుకోవాలనిపించింది. దానర్ధం ఎంటో తెల్సుకోవాలని ఉత్సుకత పెరిగిపోడంతో ఆ బండి యజమాని వచ్చే వరకు అక్కడే తచ్చాడాను. కొన్ని సందేహాలు తీర్చుకోకపోతే నిద్రపట్టదు. ఒక అరగంట తర్వాత ఆ కారు యజమాని వచ్చి తలుపు తీయబోతుంటే  ఆయన్ని పలకరించాను.

“ఏం కావాలి” ఏదో నేను ఆయన నుంచి ఆశిస్తున్నట్టు  చూస్తూ అన్నాడు. ఆయన తప్పేంలేదు, ఎవరికైనా అదే అనుమానం వస్తుంది ఆ సమయంలో.

“ఏం లేద్సార్… చిన్న సందేహం! మీకు అభ్యంతరం లేకపోతే” అని కొద్దిగా నానుస్తూ మాటలు నమిలాను. నా వల్ల ఆయన కొచ్చే ఆర్ధిక ఇబ్బంది ఏమీ లేదని గ్రహించి, మొహం కొంచం తేట చేసుకొని ” ఏంటండీ మీ సందేహం?” అన్నాడు.

“ఏం లేద్సార్, మీ కారు వెనక పక్కింటోళ్ళ చలవ  అని వ్రాసి ఉందే దాని అర్ధం తెల్సుకోవాలని” బయట పెట్టాను అరగంటకి పైగా బుర్ర తొలిచేస్తున్న నా సందేహాన్ని.

“మా పక్కింటోళ్ళు కారు కొన్నప్పట్నుండి మా ఆవిడకి నిద్ర, ఆవిడ వల్ల నాకు మనశ్శాంతి కరువైనాయి. వాటన్నింటిని తిరిగి పొందడం కోసం అవసరం లేకపోయినా అప్పు చేసి మరీ కొన్నను ఈ కారు. చేసిన పాపం చెబితే పోతుందన్నారుగా! అందుకని అలా రాయించా” తాపీగా చెప్పారు ఆ కారు యజమాని.

చాలా రోజులకి ఓ సరదా మనిషి తారస పడ్డాడన్పించింది😀.

No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE