NaReN

NaReN

Sunday, May 19, 2024

చదువొస్తే ఉన్న మతి పోయిందట

 *చదువొస్తే ఉన్న మతి పోయిందట*


రాను రాను రాజు గుఱ్ఱం ఏమో అయినట్టు. . ముఖ్యంగా విద్యాశాఖలో అన్ని తప్పుల తడకలే. ఉన్నత చదువులు చదివిన వారి ఆధ్వర్యంలో ఉండే ఈ శాఖలో అన్ని అసంబద్ధ నిర్ణయాలే. మరో వైపు ఏ శాఖలో లేనన్ని సంఘాలు ఉండేది ఇక్కడే. ఉద్యోగుల సంఖ్య దాదాపు అన్ని శాఖలు కలిపినా ఇందులోనే ఎక్కువ. కానీ జరిగే తప్పులు ఎక్కువ, ప్రశ్నించే గొంతులు శూన్యం. 


*టెక్నాలజీ ఉన్నా అదే పరిస్థితి*


టెట్ అనేది ఈ నడుమ పెద్ద రాద్దాంతంగా మారి సుమారు ఏడాది నుండి కోర్టులో నానుతున్న సమస్యాత్మక అంశంగా తయారైంది. వేలకు వేల మంది లక్షలాది రూపాయలు తగలెట్టి కోర్టులో వాజ్యం వేశారు. అది ఇలా కొలిక్కి వస్తుందో లేదో, సంఘాలన్నీ డిల్లీకి అర్జంటుగా లగెత్తి మేమేదో చేశాం అనే బిల్డప్ ఇచ్చాయి. కానీ రేపు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అప్పటివరకు అంతా డోలాయమానం, గందరగోళం, మానసిక ఆందోళన. అలాంటి టెట్ ఏదోలా రాసేద్దాం అదృష్టం పరీక్షించు కుందాం అని చదువుకొని రాయబోతున్న వారికి పరీక్ష సెంటర్ల కేటాయింపు మరో తలనొప్పిగా తయారైంది. టెక్నాలజీ శాపంగా మారిన వైనం. మనుషులు చేసినా బాగుండు అనుకునే దుస్థితి. పది ప్రాధాన్యతలు అడిగి నచ్చిన జిల్లాను కేటాయించింది కంప్యూటర్ మెషిన్. గరిష్టంగా పక్క జిల్లాలకు దూర ప్రాంతాలకు కేటాయించిన దాన్ని తలచుకొని నెత్తి నోరు కొట్టుకుంటున్న ఉపాద్యాయులు. దీనిపై బీఈడీ డీఈడీ సంఘం నోరు తెరిచింది కానీ ఉపాధ్యాయుల కోసం ఉన్న నూటా పదకొండు సంఘాలు పెదవి విప్పిన పాపాన పోలేదు. వేలకు వేలు ఫీజు కట్టడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు వేలకు వేలు పోసి అసౌకర్యాలకు గురై ఆందోళనలో పరీక్ష రాయాల్సిన గతి మరొక ఎత్తు. ముందుగా దరఖాస్తు చేసిన వారికి పక్క జిల్లాల్లో చివరాఖరికి చేసిన వారికి సొంత జిల్లాలో పరీక్ష కేంద్రం కేటాయింపు వెనక మర్మం ఎంతకు అర్థం కావటం లేదు. తీరా ఇంత జరిగినా రేపు అక్కడ కంప్యూటర్లు ఎలా పని చేస్తాయి కరెంట్ ఉంటుందా లేదా ఇంటర్నెట్ వస్తుందా రాదా అన్నది మరో భయానకమైన అనుమానం. ఇది మన టెక్నాలజీకల్ తెలంగాణలో పరీక్షల పరిస్థితి. అంతా ముందులా ఉండదు. మేం అందరికీ ఫ్రెండ్లీ అన్న ప్రభుత్వం దీని మీద నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లే ఉంది ఉద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి. మిగతా సమస్యలు మాట్లాడితే ఇది ఒడువని ముచ్చటగా మిగిలిపోతుంది. మెడకు పడిన పాము కరవక మానదు కదా. ఏం చేద్దాం. భరిద్దాం. అంతకు మించి ఏం చెయ్యగలం? ఎన్నటికీ నోరు మూసుకోలేదు. అందులో ఇదీ ఒకటి.


_ఆల్ ద బెస్ట్_

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE