NaReN

NaReN

Tuesday, May 21, 2024

మీరు ఎందుకు జన్మించారో తెలుసా

 మీరు ఎందుకు జన్మించారో తెలుసా


మీరు ఇంద్రియ సుఖాలు అనుభవించడానికి రాలేదు 

కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడానికి రాలేదు

ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి రాలేదు

గౌరవ మర్యాదలు పొందడానికి రాలేదు

మీరు అందరికంటే గొప్పవారు అని ఇతరులకు నిరూపించేందుకు రాలేరు


మీరు మీరెవరో తెలుసుకోవడానికి వచ్చారు


ఈ తల్లిదండ్రులు భార్య పిల్లలు తోడబుట్టిన వారు వీరందరూ ఎవరికి వారు వచ్చారు ఎవరికివారు వెళతారు అని తెలుసుకోవాలి

ఈ బంధాలు బంధాలు కాదు అని తెలుసుకోవాలి


కనిపించేది వినిపించేది చూసేది ఏది శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి...


అంతట దైవమే ఉన్నాడు అని గుర్తించాలి


ఈ దేహం కూడా శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి

దేహంలో ఉన్న ఆత్మ శాశ్వతం అని తెలుసుకోవాలి

శాశ్వతమైనదే నేను అని గుర్తించి దర్శించాలి


మీరెవరో మీరు తెలుసుకుంటేనే మీరు వచ్చిన పని పూర్తయినట్లు లేకపోతే 


మీరు వచ్చిన పని  మర్చిపోయి తిరుగుతున్నట్లే ..


ఉన్నతిలో వినయంతో ఒదిగి చూడు తెలుస్తుంది

సమ్మతిలో వివేకంతొ మెలిగి చూడు తెలుస్తుంది..


వ్యర్ధాలను తొలగిస్తే అసలురూపు బయల్పడును

శిల అయినా హృదయమైన చెక్కి చూడు తెలుస్తుంది


స్వార్ధాలకి దాసుడౌతు కరుడుగట్టె మనిషి మనసు

మానవతను మేల్కొల్పగ తట్టి చూడు తెలుస్తుంది .


కర్మలనే ఉలితోనిను మెరుగుపెట్టు సర్వేశుడు...

కష్టాలను సాధనగా తలచి చూడు తెలుస్తుంది..


అవకాశమే ఆయుధం


మనిషిని బతికించే మధురసాయనం లాంటి మహాశక్తి- ఆశ. అది మరణశయ్యపై నుంచీ లేపి మళ్ళీ నడిపించగల మహామంత్రం. మనిషిని నిట్టనిలువునా చీల్చి మసి చేసే మారణాయుధం- నిరాశ. అది ఎంతటి శక్తిమంతుడినైనా దుర్బలుణ్ని చేసే మహమ్మారి. ఏ రంగంలోనైనా జయాపజయాలు, కష్టసుఖాలు సహజం.


ఎదగాలనుకున్నవారికి ఎదురుదెబ్బలు తప్పవు. ఓరిమితో తట్టుకుని నిలబడాలి.


దెబ్బ తగిలితే గాని నొప్పి తెలియదు. తగిలిన ప్రతి గాయాన్ని ఓపికతో మాన్పుకొని మళ్ళీ ప్రయత్నం కొనసాగించాలి. మధుర పదార్థం మోతాదుకు మించి స్వీకరిస్తే వెగటు పుడుతుంది. విజయాలకే అలవడిన జీవితానికి ఓటమి బాధ తెలియదు. అందుకే ఎప్పుడైనా పరాజయం ఎదురైనా కుంగిపోకూడదు. కష్టాల్ని అనుభవించాలి. రాటు తేలాలి. ఓటమి కాటుతోనే గెలవాలన్న కసి, పట్టుదల మొదలవుతాయి. పరాజయాన్ని డీ కొట్టి స్థిరంగా నిలిచినప్పుడు, కష్టాన్ని తట్టుకుని సుఖానికి ఎదురుచూసినప్పుడు- వాటి శక్తి తెలుస్తుంది. వీటికి తగిన ప్రణాళికల్ని సిద్ధంచేసుకోవాలి. అహరహం శ్రమించాలి. ఎత్తుకు వైయెత్తులు వెయ్యాలి. చాణక్యుడిలా గెలుపు సూత్రాన్ని సొంతం చేసుకోవాలి. విజయ కంకణధారుల ధాటికి తలవంచి ఓటమి పలాయనం చిత్త గిస్తుంది.


 చిమ్మచీకటిలో పొరుగూరికి బయలుదేరాడో వ్యక్తి దారిలో కుంభవృష్టి మొదలైంది. రక్షణ కోసం ఓ చెట్టునీడకు చేరాడు. ఆ పక్కనే ఓ దిగుడు బావి. జారి అందులో పడిపోయాడు. ప్రాణా లపై ఆశ కోల్పోయి చీకట్లో కాలం. గడిపాడు. తెల్లవారింది. వర్షం తగ్గింది. బయటపడే మార్గం కనపడలేదు. ఇంతలో ఈదురుగాలికి చెట్టుకొమ్మ బావిలోకి ఒరిగింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదా వ్యక్తి, మూడు, నాలుగు సార్లు ప్రయత్నించాక కొమ్మ పట్టుకుని పైకి వచ్చాడు. దైవానికి కృతజ్ఞతలు చెప్పి ముందుకు సాగిపోయాడు. జీవితంలో యాదృచ్ఛికంగా లభించిన అవకాశాల్ని తెలివిగా దక్కించుకున్నవారే విజ్ఞులు, తగిన కృషి, పట్టుదల, విశ్వాసం, దైర్యం- ప్రయత్నానికి తోడవ్వాలి. అప్పుడు విజయం తలవంచి దాసోహమనక తప్పదు.


అవకాశాలు తమంత తాముగా మన చెంతకు చేరవు. మనం అన్వేషించాలి. తపించాలి శ్రమించాలి. చేజిక్కించుకుని కార్యనిర్వాహణలో విజయం సాధించాలి. మనలోని ఆసక్తి, శ్రద్ధ గమనించిన వివేకులు కొందరు తమ చెయ్యి అందించి అవకాశాల బాటలు పరుస్తారు. ఆ చేతులను బలంగా పట్టుకుని ఎగబాకి ఆ బాటలో విజయ ధ్వజాన్ని నాటాలే గాని, జారిపోకూడదు. స్వశక్తితో ఇతరులను ఒప్పించి మెప్పించాలి. విజయపరంపరను ఖాతాలో జమచేసుకోవాలి. వేలు వంచనిదే వెన్న అయినా దక్కదని గ్రహించాలి. అనుభవాన్ని, తెలివిని, శక్తిని కలగలుపుకొని గడ్డిపోచలను బలిష్టమైన పలుపు తాడుగా మార్చుకోవాలి. చేతికందిన అవకాశాల్ని స్వార్థ ప్రయోజనాలకు కాకుండా పరహితంగా ఉపయోగించాలి. వాటి ఫలితాలు లోకకల్యాణానికి ఉపకరించిననాడు పరమార్థం నెరవేరినట్లే. పూలబాటలో తాము నడుస్తూ పదిమందినీ తమతో నడిపించాలి. దానం, ధర్మం, సమాజసేవ నిర్వహించే అవకాశం చేతికందినప్పుడు పరమాత్మ ఆదేశంగా స్వీకరించి ఇతరుల సంక్షేమానికి నడుంకట్టేవారు ధన్యజీవులు...


మనసు పోకడలు


మనిషి నడతలన్నీ మనసు పోకడలను బట్టే ఉంటాయి. మనో చాంచల్యం మన చర్యల్లో కనిపిస్తుంది. మన చర్యలను బట్టే మనకు గౌరవ మర్యాదలుంటాయి. వైద్యులు వ్యాధి మూలాలను పట్టుకుంటేనే రోగం మందులతో శాంతిస్తుంది. తగిన చికిత్స చెయ్యడానికి వీలవుతుంది. తల్లిదండ్రులు తమ సంతానం గొప్పవాళ్లు కావాలని ఆరాటపడతారు. వారి దృష్టిలో గొప్పదనం అంటే ధనార్జన, హోదా, అధికారం, సాంఘిక గౌరవం. ఇవన్నీ ఉన్నా శీలం లేకపోతే, ఏమీ లేనట్లే. శీలం గలవారినే జ్ఞానం ఆశ్రయించి ఉంటుంది.

జ్ఞానం అంటే కేవలం వివేకంతో కూడిన లోకజ్ఞానం కాదు. పరిణతి చెందిన ఆధ్యాత్మికతనే శుద్ధ జ్ఞానం అంటారు. జ్ఞానానికి శుద్ధత ఏమిటి అనుకోవచ్చు. బంగారాన్ని శుద్ధి చేస్తేనే మేలిమి బంగారం అవుతుంది. జ్ఞానిక్కూడా సందేహాలు ఉంటాయి. జనక మహారాజు వద్దకు శుకమహర్షి వెళ్ళి సందేహాలు తీర్చుకోవడం ఇందుకు ఉదాహరణ. జ్ఞానం ఒక మహా సముద్రం. దాన్ని యథాతథంగా స్వీకరించగల శక్తి అందరికీ ఉండదు. ఒక్క అగస్త్యుడే సముద్రాలను ఆపోశనం పట్టినట్లు చెబుతారు. సముద్ర జలాలను సూర్యుడు ఆవిరిగా మార్చి మేఘాలకు అందిస్తాడు. అప్పుడు వాటిలోని లవణ లక్షణం పోతుంది. మేఘాలు శుద్ధ జలాలను వర్షిస్తాయి. అవే కొండలనుంచి సెలయేళ్లుగా, నదులుగా ప్రవహిస్తాయి. ఆ నీరు ప్రాణదాతగా ప్రకృతికి జీవం ప్రసాదిస్తుంది.ఆదిత్యయోగీ..


జ్ఞానమూ అంతే. జ్ఞానమూలం పరమాత్మ. ఆయన నుంచి శబ్ద బ్రహ్మంగా వేదాలు మహర్షులు విన్నారు. అవి శ్రుతులయ్యాయి. వాటిని మననం చేసుకుంటూ సుబోధకంగా శిష్య పరంపరకు చెప్పారు. అవే స్మృతులు. అనేక వడపోతల తరవాత జ్ఞానం శుద్ధం, పరిశుద్ధం సుగ్రాహ్యంగా మారి జిజ్ఞాసువులకు అందుబాటులోకి వచ్చింది. 


మనిషి ఇంటిని, ఒంటిని శుభ్రం చేసుకుంటాడే తప్ప మనసులోని మకిలిని వదిలించాలనుకోడు. అసలు సమస్య అంతా మనసుతోనే. దాన్ని శూన్యం చేసుకోవాలంటారు జ్ఞానులు. కొందరు తీవ్రమైన సాధనలు చేసేవారు ‘మనోనాశ్‌’ అనే స్థితికి చేరతారు. ఇది దాదాపు అవధూత స్థితి. భారతీయ ఆధ్యాత్మికత ఆత్మస్వరూపుడైన అంతర్యామికి తొలి తాంబూలం ఇస్తుంది. అంతర్యామి దాసుడే అసలైన భక్తుడు. అంతర్యామి అంటే ఆలయ శిలామూర్తి కాదు. సృష్టిలోని సమస్త ప్రేమ, ఆనందం, అనంతత్వం- ఇవన్నీ కలగలిసిన ఒక దివ్యతేజం. విశ్వంభరగా ఉన్న నిత్య చైతన్యం. దాన్ని దర్శించాలంటే మనం ఆత్మస్థితికి చేరుకోవాలి. మనం మోస్తున్న మనసు, బుద్ధి అనే రెండు బరువుల్ని వదిలించుకోవాలి, లేదా జ్ఞానాగ్నిలో దహనం చెయ్యాలి. అంటే వాటి ప్రమేయం నశించాలి.

‘నేను’కు నిర్వచనాలు మనసు, బుద్ధి. ‘నేను’ నశించాక మిగిలేది అనంతుడు, అజేయుడు, శాశ్వతుడైన బ్రహ్మమే. సృష్టిలో బ్రహ్మం కానిదేదీ లేదంటుంది యోగవాసిష్ఠం. అంటే, మనంకూడా బ్రహ్మస్వరూపులమే. కాని, ఆ జ్ఞానం మనకు లేదు. అలా లేకపోవడమే మాయ. మన జీవితకాల యుద్ధం ఈ మాయతోనే. మాయను జయిస్తే, ప్రపంచమనే మత్తు, భ్రమలోంచి బయటపడితే, ఎదురుగా కనిపించేది అంతర్యామే. ఆ మహా తేజస్సు ఎప్పుడూ, అలాగే, అక్కడే ఉంటోంది. ఎప్పుడు మనం అంతర్యామిని చూడగలుగుతామో అక్కడితో మనం గమ్యం చేరినట్లే. మన జీవనయానం ముగిసినట్లే. ఇవి జరగాలంటే- మనసు పోకడల్ని గమనిస్తూ, మనల్ని మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. తడబడకుండా, దారి తప్పకుండా...


ఈ జీవితం తర్క...కుతర్క కాలక్షేపం,

వ్యర్థ వినిమయ వస్తుసముదాయం

కుప్పలుగా పోగేసుకునే చెత్తల నిలయం

తనూ, మనో రోగాల విలాస కుహరం 

సరళమైన,స్పష్టమైన మార్గపయనం

సత్యమేదో నీ ముందు నిలుపును నిత్యం.....

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE