NaReN

NaReN

Saturday, June 3, 2023

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి భాద్యత

 

*🌳పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి భాద్యత...*
*🔥అలా లేకపోతే పెను విపత్తే....*
*📢మనము ఏమి చేయగలమో చేయాలి...*
*🙏🏻స్వార్ధ ప్రయోజనాలకు ధ్వంసం చేస్తే ఊరుకోకూడదు.....*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*✅పర్యా హననం... పర్యవసానం....*
   మనం బతకటానికి ఏవేవీ ముఖ్యమైన అవసరమో - అవన్నీ ప్రకృతిలో ఉచితంగా, ధారాళంగా లభిస్తాయి. యథేచ్ఛగా వాడేస్తూ, వాటి ప్రాధాన్యాన్ని మనం అంతగా గుర్తించం. ఏవేవీ మనకు అంతగా అవసరం కాదో వాటి గురించి ఎక్కువ తాపత్రయపడతాం, ఈ అవగాహనలో ఉన్న లోపం కారణంగానే ప్రకృతిని మనం సరిగ్గా పట్టించుకోవటం లేదు. ఆధునిక జీవితం మొదలైన దగ్గర నుంచి ఈ అగాధం మరింత పెరిగింది. అర్థం చేసుకోవటానికి ఆలస్యమైనకొద్దీ అది ప్రమాదకరంగా పరిణమిస్తోంది. కాలగతులు మారిపోతున్నాయి. తీవ్రమైన ఎండలు.. భయంకరమైన చలిగాలులు వెంటాడుతున్నాయి. మంచుతుపాన్లు ముంచుకొస్తున్నాయి. ధ్రువప్రాంతాలు కరిగిపోతున్నాయి. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఊహించని ఉత్పాతాలు ఆకస్మికంగా తలెత్తుతున్నాయి. గుర్తించేలోపునే విలయ విధ్వంసం సృష్టించి పోతున్నాయి.
   ప్రకృతిలో మనిషికి ఉన్న బలం, తెలివీ మరే జీవికీ లేవు. యుక్తితో కూడిన శక్తి ముందు ఎంతటి మహా శక్తి అయినా తల వొంచాల్సిందే! ఐదారడుగుల మనిషి ముందు అలాగే వొంచింది ప్రకృతిలోని సమస్తం. ఎలా ఆడిస్తే అలా ఆడాయి జంతువులు. అధిరోహిస్తే అణగి ఉన్నాయి పర్వతాలు. తవ్వేకొద్దీ దారిచ్చాయి గనులూ, వనులూ. వెతికేకొద్దీ బతకనిచ్చాయి సముద్ర జలాలు. అన్వేషించే కొద్దీ అర్థమయ్యాయి ఆకాశ రహస్యాలు. పట్టణాలు, నగరాలు, మహా నగరాలు నిర్మితమయ్యాయి. నదుల మీద ఆనకట్టలు, పర్వతాల మధ్య ఇనప వంతెనలు, కొండల మధ్య కొంగొత్త నగరాలు, గమ్యాల మధ్య అతివేగ వాహనాలూ, క్షణక్షణ కాలంలోనే సమాచార విస్ఫోటాలు... విలసిల్లాయి, విస్తరించాయి. ఆధునిక జీవితం, అత్యద్భుత శాస్త్ర సాంకేతిక సామర్థ్యం ... అని అనుకుంటుండగానే- వెనక నుంచి ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి.
   ఎండలు తీవ్రం...వానల పెడముఖం.. అకాల వరదల ఉధృతం.. సునామీల బీభత్సం... పెనుగాలుల భయానకం.. తాగునీరు కాలుష్యం.. సాగునీరూ విషతుల్యం.. రుతువులు గతి తప్పి.. రుతు ధర్మాలు వికటించి .. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని దారుణ స్థితి! ఇలాంటి ప్రకృతి ప్రకోపాలు అనేకం చవిచూశాక- ఓసారి వెనక్కి తిరిగి చూస్తే- ఇదంతా మానవ స్వార్థం విచక్షణా రహితంగా ప్రకృతిపై సాగిస్తున్న అత్యాచారపు పర్యవసానం అని అర్థమవుతోంది. కార్పొరేట్‌ శక్తుల విపరీత లాభాల విజృంభణ ఫలితమని తెలుసొస్తోంది.
   మన వెనకటి తరాల జనం ప్రకృతిని ఆరాధించారు. దానిని ఆధారంగా చేసుకున్నారు తప్ప అధ్వానంగా, అత్యాశాపూరితంగా వ్యవహరించలేదు. ఇప్పటికీ కొండల్లో నివసించే వారు అంతే జాగ్రత్తగా ఉంటారు. వంట చెరకుగా ఎండిన చెట్లనే నరుకుతారు. పచ్చని చెట్లను నరకటం తప్పుగా భావిస్తారు. లాభాలను సంపాదించే స్వార్థపరుల కన్ను అడవిపై పడినప్పటినుంచే - అటవీ విధ్వంసం ప్రారంభమైంది. ఏ దేశంలోనైనా ప్రకృతి సమతుల్యంగా ఉండాలంటే- అటవీప్రాంతం 33 శాతం ఉండాలి. మనదేశంలో ఇప్పుడు 21.54 శాతమే ఉంది. అత్యల్పంగా ఉన్నది గుజరాత్‌లో 7.5 శాతమైతే, హర్యానాలో 4 శాతమే! మన రాష్ట్రంలో అడవులు జాతీయ సగటు కన్నా తక్కువ (17.27 శాతం). ఈ లెక్కలను బట్టే మన బాధ్యత కూడా ఉంటుంది.
   దాదాపు 400 ఏళ్ల క్రితం అమెరికా, యూరప్‌ దేశాల్లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. ఈ భూమిని కాలుష్యమయం చేయటంలో, కర్బన ఉద్గారాలతో పర్యావరణానికి హాని చేయడంలో వారి పాత్ర అప్పటినుంచీ ఉంది. భూమ్మీద ఉష్ణోగ్రతలు ఇంతగా పెరగటంలో సంపన్న దేశాలదే పెద్ద పాత్ర. తరువాతి కాలంలో ఆ దేశాలు కాలుష్యాన్ని వెదజల్లే యంత్రాలను, వాటి పరిజ్ఞానాన్ని మన లాంటి తృతీయ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేశాయి. తాము ఇప్పుడు తక్కువ కాలుష్యం సృష్టించే యంత్ర పరిజ్ఞానం వినియోగిస్తున్నాయి. అయినంత మాత్రాన ఇప్పటిదాకా సాగిన విధ్వంసానికి బాధ్యత వహించనంటే కుదురుతుందా? తొలినుంచీ ఎవరు ఎంత కారణమైతే అంత బాధ్యత వహించటం న్యాయం. అందుచేత పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత సంపన్న దేశాలదే!
   *దేశాలకు, ప్రాంతాలకు సరిహద్దులు ఉంటాయి. గాలికి, నీటికి, ప్రకృతికి ఏ హద్దులూ ఉండవు. ఎవరి ఊపిరికైనా ఒకటే గాలి. ఎవరి దాహానికైనా ఒకటే నీరు. ఇటువంటి అమూల్యమైన ప్రాణావసరాలను కాపాడుకోవటం మనందరి బాధ్యత. 'బతుకు - బతకనివ్వు' అంటుంది ప్రకృతి. దానిని పాటిస్తే- అందరూ బాగుంటారు. ఆ అందరిలో మనమూ ఉంటాం.*

 

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE