NaReN

NaReN

Monday, January 9, 2023

HEART TOUCHING STORY

 *💕HEART TOUCHING  STORY .💕*

*_ఓ అధికారి యొక్క పాఠశాల సందర్శన - అనుభవాలు..._*

               *****

      *ఉదయాన్నే తప్పనిసరిగా ప్రార్థన సమయానికి పాఠశాలకు హాజరవ్వాలి.  ఎంతమంది ఉపాధ్యాయులు సమయానికి వస్తున్నారో తెలుసుకోవాలి.  ఈ మధ్య బొత్తిగా అందరిలో సమయపాలన (టైమ్ సెన్స్) కరువైంది. ఎవరూ పట్టించుకోవట్లేదని తెలిస్తే పనిచేసేవాడెవడు?! ఈరోజు నేను వెళ్ళే పాఠశాలలో అందరూ సమయానికి హాజరైతే ఎంతబావుండును. ఇలా పలు ఆలోచనలతో ఉదయం 9.00 గంటలకు ఓ ప్రాథమికపాఠశాల ఆవరణలో అడుగుపెట్టా, ఓ సందర్శనాధికారిగా!*


*అనుకున్నంతా అయ్యింది. చిన్నతరగతి పిల్లలందరూ పుస్తకాల సంచీలేసుకొని పాఠశాల అరుగు మీద కూర్చోనున్నారు. ఐదవతరగతి పిల్లలనుకుంటా, కొంతమంది పాఠశాల ఆవరణంతా శుభ్రం చేస్తున్నారు.  ఆడపిల్లలు తరగతిగదిని చీపురుతో శుభ్రం చేస్తుంటే మగ పిల్లలు బెంచీలెత్తి సహకరిస్తున్నారు. పాఠశాలంతా పిల్లలతో కళకళ లాడుతూ వుంది.*


*ఉపాధ్యాయులెక్కడ?? పరిసరాలంతా కళ్ళతోనే వెదికా? ఎక్కడా కనపడక పోయే సరికి ఇంకా రాలేదని నిర్థారణకొచ్చి సమయం కావడంతో ఓ పెద్ద పిల్లాడ్ని పిలిచి అసెంబ్లీ బెల్లు కొట్టమన్నా.*


*పిల్లలే స్వయంగా అసెంబ్లీ చక్కగా నిర్వహించారు. చాలా ఆనందం వేసింది. వారి క్రమశిక్షణ, వారి పద్ధతి చూసి.  ఉపాధ్యాయులు ఎవరూ ఇంకా రాలేదు. వారు రాకుండా నేను అసెంబ్లీ నిర్వహించడం ఖచ్చితంగా వారికి చెంప పెట్టే. ఈ సమయంలో వస్తే వారి ముఖం ఎలా వుంటుందో అనుకుంటూ ప్రక్కకు చూశా.*

*దూరంగా ఉన్న ఇంకో తరగతి గదిలోంచి ఒకావిడ చిన్న పిల్లాడికి మూతి తుడుస్తూ చెయ్యి పట్టుకొని గబగబా నా వైపు అడుగులు వేసుకుంటూ వస్తూ కనిపించారు. బహుశా ఉపాధ్యాయురాలేమో ననుకున్నా.*  


*కళ్ళతోనే నమస్కారం చెప్పారు. నేనూ అంతే! చిన్నగా తలూపా.  అసెంబ్లీ అయ్యింది. పిల్లలందరూ క్రమం తప్పకుండా వరుసగా తరగతి గదిలోకి వెళ్తున్నారు.  అప్పుడే చేరిన ఒకటవతరగతి చిన్నారిని ఇద్దరు పెద్దపిల్లలు చేతులు పట్టుకుని నడిపించుకెళ్తున్నారు.  చూడడానికి ఎంతో బావుందని పించింది.*


*ఉపాధ్యాయురాలు ఏదో మాట్లాడబోతుంటే నేనే కల్పించుకొని “ఎంతసేపయ్యిందండీ వచ్చి”? అన్నా! గొంతులో కొంత గాంభీర్యత ప్రదర్శిస్తూ.*

*“ఎప్పుడూ గం.8.30 కే పాఠశాలలో వుంటానండి” ఆవిడ సమాధానం.*

*“మరి ఈరోజో” ఆలస్యంగా వచ్చిన వారి సమాధానం ఇలానే వుంటుందనే ధోరణితో...* 

*“ఈరోజు కూడా గం.8.30 కే వచ్చానండీ” అని వినయం ప్రదర్శిస్తూ ఆవిడ సమాధానం.*

*“అసెంబ్లీకి హాజరైతే బావుండేది” ముక్తసరిగా ఒకింత అసహనంతో అని, ఈవిడొక్కరే కనిపిస్తున్నారు. మరి మిగిలిన అయ్యవార్లు... వారెప్పుడొస్తారో!!! అనుకుంటూ తరగతి గదిలోకి వెళ్ళా.*


*తరగతి విశాలంగా వుంది. ఈ మూలనుంచి ఆ మూల దాకా.  రంగు రంగు బొమ్మలతో, పాఠ్యాంశాలకు చెందిన బోధనా సామగ్రితో ఎంతో ఆకర్షణీయంగా వుందా తరగతి గది.*  


*గదిలోకి రాగానే బల్లమీదున్న పుస్తకాలు గబగబా సర్థుతూ, కుర్చీచూపించి కూర్చోమని వినయంగా చెప్పిందా ఉపాధ్యాయురాలు.*


*దీనికేం తక్కువలేదు. ఆలస్యంగా రావడం. కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక నటన. ఓ గంటో అరగంటో వుంటాడు.  వినయం నటిస్తే పోలా? అని మనసులో అనుకుంటూ ఉండే ఉంటుందని పించింది.* 


*కుర్చీలో కూర్చొన్నా!! ఆవిడ నిలబడే వుంది. అక్కడే ఖాళీగా వున్న కుర్చీ చూసి కూర్చోండి అందామనుకున్నా! ఎందుకో అనబుద్ది కాలేదు. "హాజరు పట్టీ ఇవ్వండి? ఎంతమంది ఉపాధ్యాయులు?" అడిగా ఇందాకటి అసహనానికి కొనసాగింపుగా.*


*”నేనొక్కర్తినేనండి ఇది ఏకోపాధ్యాయ పాఠశాలండీ" అవతలనించి సమాధానం.*


 *“పిల్లలు ఎంతమంది?!” ఒకింత ఆశ్చర్యంతో అడిగా.*


*“62 మంది అండీ” అంతే వినయంతో సమాధానం. షాక్ కి గురవడం నావంతయ్యింది.*


*పిల్లలు నిశ్శబ్దంగా ఎవరి పనులు వారు చేసుకుంటూ చదువుకుంటున్నారు. ఓ నాలుగేళ్ళ పిల్లాడు తరగతి గదంతా కలియతిరుగుతూ అందరికీ సూచనలిస్తున్నాడు.  చాలా ఉషారుగా చలాకీగా ఉన్నాడు.  అలా తిరుగుతున్న వాడు కాస్త ఒక్కుదుటున టీచర్ దగ్గరకొచ్చి చెయ్యి పట్టుకు గుంజుకొని తీసుకెళ్తున్నాడు రమ్మంటూ.  ఎందుకమ్మా!! అంటూ ఆవిడ, వాడి కూడా వెళ్తుంటే అప్పుడు గుర్తు పట్టా అసెంబ్లీ జరుగుతున్న సమయంలో టీచర్ చెయ్యిపట్టుకు తీసుకొచ్చింది వాడినేనని. ఎవరో రాయకుండా దిక్కులు చూస్తున్నారని కాబోలు టీచర్ కి ఫిర్యాదు చేస్తున్నాడు. 'అలాగే! ఈసారి అలా చేస్తే మళ్ళీ చెప్పమని' సున్నితంగా చెయ్యి వదిలించుకొని నాదగ్గర కొచ్చింది టీచర్.*


*వాడి నాయకత్వ లక్షణాలు, వాడి చెలాకీ తనం చూసి బహుశా వీడు ఈ టీచర్ కొడుకై వుంటాడు అనుకున్నా.  ఏంటో ఈ ఆడవాళ్ళకి ఉద్యోగం రావడం, ప్రసూతి సెలవులు, ఆపై మూడు నాలుగు సంవత్సరాల దాకా పిల్లల పెంపకం కూడా పాఠశాలలోనే! అయినా ఏమీ అనలేం. అనుకుంటూ ఓ నిట్టూర్పు విడిచా!*


*"మీరనుమతిస్తే పిల్లలకు పాఠాలు చెప్పి వస్తా"నంది ఆవిడ.  'ఉన్న రికార్డులన్నీ ఇక్కడ పెట్టి మీరు క్లాసుకి వెళ్ళండి' అన్నా ఒకింత అధికార దర్పాన్ని ఒలక బోస్తూ.*


 *అన్ని రికార్డులు, రిజిష్టర్లు బల్లమీద వుంచి పిల్లలకు పాఠాలు చెప్పడానికెళ్ళిందామె.*  


*ఆవిడ అక్కడికెళ్ళగానే ఎగురుకుంటూ వచ్చి వళ్ళో వాలి పోయాడు ఇందాకటి కుర్రాడు.  ఆవిడ వాణ్ణి ఒళ్ళో కూర్చో పెట్టుకొని మిగతా తరగతి పిల్లలకు పాఠాలు చెప్తోంది.*


*ఎందుకో నాకు ఆవిడని పిలిచి గట్టిగా అరచి చెప్పాలని పించింది “రేపట్నించి మీరు పిల్లాడ్ని తీసుకురాకండి” అని.  తమాయించుకొని ఊరుకొన్నా. రికార్డులు చూస్తూ జరుగుతున్నది ఓ కంట కనిపెడుతూనే ఉన్నా.* 


*దగ్గర్లో ఉన్న  రెండు, మూడు తరగతుల పిల్లల్ని పుస్తకాలు తెమ్మన్నా. ఒక్కొక్కరినీ లేపి పేజీ నంబరు చెప్పి చదవమన్నాను. అందరూ చక్కగా చదువుతున్నారు.  అడిగిన వాటికి సమాధానాలూ చెప్తున్నారు.  టీచర్ లానే వినయాన్నీ ప్రదర్శిస్తున్నారు.  పిల్లల మాటలు, అభినయగేయాలు, వారు ఆహార్యంతో చెప్తున్న కథలు నన్ను సమయాన్ని కూడా మరిచిపోయేలా చేశాయి. దాదాపు ఓ అరగంట గడిచినట్లుంది.  టీచర్ బానే చెపుతున్నట్లు ఉందనుకుంటూ చూట్టూ ఉన్న పిల్లల్ని కూర్చోమని టీచర్ కోసం చూశా.*  


*పిల్లలు రాసుకుంటున్నారు.  టీచర్ కనిపించలేదు. ఇప్పుడు ఆ చిన్నపిల్లాడి కోసం చూశా వాడూ కనిపించలేదు.  టీచర్ ఏరని పిల్లలని అడిగా?  ప్రక్క వరండాలో వున్నారని అనటంతో మెల్లిగా వెళ్ళి చూశా ఏంచేస్తున్నారోనని.*


*కూడా తెచ్చిన టిఫిన్ బాక్స్ లోదేదో పిల్లాడికి తినిపించడం అయిపోయినట్లుంది. మూతిని శుభ్రంగా కడిగి తన పమిట చెంగుతో తుడిచి తరగతి గదిలోకి పదమని చెప్తూ బాక్స్ సర్దడం నాకంట పడింది.*


*పాఠశాల సందర్శనకు ఎవరో వచ్చినారని కూడా పట్టింపులేకపోవడం, పాఠశాలలో బోధన కంటే స్వంత పనులకు ప్రాధాన్యత నివ్వడం, బడిలో పిల్లలందరినీ వదిలి తన పిల్లాడిదొక్కడిదే ఆకలిగా భావించడం… ఓ పక్క నాలో కోపం కట్టలు తెంచుకుంటోంది. ఆమె చేసే పని మంచిగా లేదని గట్టిగా చెప్పేద్దామని నోటి చివరిదాకా వచ్చింది. పిల్లల ప్రగతి, పాఠశాల వాతావరణం చూసి ఎందుకో నాలో నేనే నిగ్రహించుకోవాల్సి వచ్చింది.* 


*నన్ను చూసిన ఆవిడ “వచ్చేస్తున్నాను సర్, ఒక్కనిమిషం” అంది అదే వినయంతో.*


*ఆహా! ఎంత నటన!!? కసిగా నాలో నేనే అనుకున్నా. లాభంలేదు. ఈవిడకు పాఠం చెప్పాల్సిందే.. ఓ నిశ్చయానికి వచ్చేశా.*  


*టీచర్స్ డైరీ, లెసన్ ప్లాన్, రోజువారీ టి.ఎల్.ఎం, సిలబస్, పిల్లల డైరీ, పిల్లల నోటు పుస్తకాలు దిద్దడం, తరగతులవారీ సామర్థ్యాలు, సెన్సెస్ రిజిష్టర్, బడిబయటి పిల్లలూ, ఎస్.ఎం.సీ సమావేశాలు, తీర్మానాలు….. ఇక దాడి మొదలెట్టా.*


*నేనడిగిన వాటిలో కొన్నింటిని ఆవిడ చూపెడుతోంటే… మళ్ళీ ఆ కుర్రాడు!!  ఆవిడ చెయ్యి పట్టుకుని రమ్మంటూ గుంజుతున్నాడు.  ఆవిడ ఉండు నాన్నా!! వస్తాగా నువ్వెళ్ళు, నా కన్నవి కదూ! అంటోంది.*


*ఇక భరించడం నావల్ల కావట్లేదు. వెళ్ళదేమో ననుకున్నా. వాడి మొండి పట్టుదలో లేక ఆవిడ అతి గారాబమో!! ఎక్కడి పుస్తకాలక్కడ వదిలి వెళ్ళిపోతోంది.*


*మేడమ్!! నేను ఇంకో పాఠశాల కెళ్ళాలి.  వాడిని వదిలి కాసేపు ఇలా వస్తారా?? కొంత కఠినంగానే అన్నా ఈసారి.*


*నాన్నా కూర్చో, ఇప్పుడే వస్తా! సార్ పిలుస్తున్నారు.  నా కన్నవుకదా! సార్ ని పంపించి వస్తా కదా! అని ప్రేమగా బుగ్గలు రెండూ నిమిరి బల్ల దగ్గరకొచ్చింది.*


*ఆ పిల్లాడి పేరు ఎన్నో తరగతిలో వుంది? డైరక్టుగా పాయింటులోకొచ్చేశా!*


*"లేదండి, వాడికింకా నాలుగేళ్ళే” ఆవిడ సమాధానం.* 

*ఐదేళ్ళైతే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ చేరుస్తావులే.  అయినా ఇప్పటికే ఏ కెజీలోనో వెసేసుండాలే?* *మనసులోనే అనుకున్నా.*

 

*ఈలోగా వాడు రాకెట్ లా రానే వచ్చాడు.* *మందుగోళీ ఇస్తావ్ గా ఇమ్మంటూ…*


*ఒక్కక్షణం అంటూ.. బీరువాలోంచి మందు బిళ్ళలు తీసి పిల్లాడితో మింగించి నీళ్ళు పట్టించింది.  వాడు పరిగెట్టు కుంటూ రయ్యిమని నాదగ్గర కొచ్చి “గుడ్ మార్నింగ్ సార్” అనుకుంటూ వెళ్ళి పోతుంటే చెయ్యి పట్టుకు ఆపా.*


*నీ పేరేంటి? మీ నాన్న గారు ఏంచేస్తారు??* *అల్లరెక్కువ చేస్తావా?  చెయ్యి అలా పట్టుకునే అడిగా.*


*_నా పేరు రాజేష్.  నేను క్లాస్ లీడర్ని.  మాటీచర్ పెట్టింది నన్ను. నాకు అమ్మా నాన్నా లేరు. అమ్మమ్మ వుంది. అల్లరేం చేయను. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తాను. చెయ్యి వదలండి. నేను క్లాస్ చూడాలి_*

*అంటుంటే అప్రయత్నంగా వాడి చెయ్యి వదిలేశా.*


*వీడు టీచర్ కొడుకు కాడా?... మరెవరు??* 

*ఈవిడెందుకు ఇంత గారాబంగా చూస్తోంది??* 

*అంతా ఒక్కసారిగా తల్లక్రిందులైనట్లు అనిపించింది.  అమ్మా నాన్నా లేరు!!! చెవుల్లో గింగురు మంటోంది.*


*ఆవిడ రాగానే, నా ప్రశ్నలన్నీ ఆమె ముందుంచా?*


*అవునండీ పాపం వాడికి నాన్న చిన్నప్పుడే పోయాడు.  అమ్మ మొన్న మొన్ననే పోయింది.  మధ్యాహ్న భోజన సమయానికి ఈ పిల్లాడిని చంకనేసుకొని పాఠశాల కొస్తూ ఉండేది. తను కొంత తిని పిల్లాడికి కొంత పెట్టేది. అప్పుడప్పుడూ పదో పరకో అవసరాలకని, మందులకని అడిగి తీసుకెళ్తూ ఉండేది.* *తనలాంటి కష్టం ఎవరికీ రాకూడదని, పిల్లాడిని కూడా తల్లి తండ్రులుగా ఇద్దరం అన్యాయం చేశామని తరచు బాధ పడుతూ ఉండేది.  ఆ మాయదారి మహమ్మారి మా కుటుంబాన్నంతటినీ చుట్టేసిందని.. తన కొడుకును కూడా ఎప్పుడో ఒకప్పుడు మింగేస్తుందని.. తన తరవాత వాడిని ఎవరు చూస్తారో నని ఒకటే బాధ పడేది.*  

*ఒకరోజు ఉదయం, ఆయాసపడుతూ బడి జరుగుతుంటే పిల్లాడితో వచ్చి...*   *_“టీచరమ్మా!! టీచరమ్మా!!! నువ్విచ్చే డబ్బులతో మా అబ్బాయికి ఇన్నాళ్ళూ మందులు కొన్నాను. ఇక నేను బ్రతకనని పిస్తోంది.  అవకాశం వుంటే మధ్యాహ్నం కొంచెం మా అబ్బాయికి రోజూ ఇంత అన్నం పెట్టమ్మా. ఆ మాయదారి జబ్బు, వాడ్ని కూడా మాదగ్గరకి చేర్చేదాకా!!"_  అన్నది. తర్వాత వారం రోజులకు ఆవిడ పోయిందని తెలిసింది” అంటూ ఆవిడ విచారంగా చెప్తుంటే… అప్రయత్నంగా కళ్ళ వెంట నీళ్ళు జల జలా రాలాయి ఆ పిల్నాడ్ని తలుచుకొని.*

*ఇంతకీ సమస్యేమిటి అన్నాను?? తెలిస్తే ఏమైనా సహాయం చేయగలనేమో ననుకుంటూ...* 


*_“హెచ్.ఐ.వి పాజిటివ్”_ చెప్పింది టీచర్.* 

*ప్రక్కలో పిడుగు పడినట్లు, భూమి రెండుగా చీలిపోతున్నట్లు, నేనేదో అగాధంలోకి జారిపోతున్నట్లు అనిపించింది.* 

*అప్రయత్నంగా కుర్చీలోంచి లేచి నిల్చున్నా...* 


*టీచర్ ఇంతదాకా ఒళ్ళో కూర్చో పెట్టుకొని ప్రేమగా చూస్తున్నదీ, అన్నం తినిపించి మూతి తుడిచిందీ, నాన్నా, కన్నా అంటూ సంబోధిస్తున్నదీ ఆ పిల్లాడినా!!!!!!???.....*  


*ఆ టీచర్ ఓ మాతృమూర్తిలా కన్పిస్తోంది. నాప్రమేయం లేకుండానే నేను రెండు చేతులూ జోడించి _“అమ్మా!”_ 🙏🙏🙏అన్నాను.*

 *ఇంకా అక్కడ వుంటే ఒక చక్కటి పిల్లల ప్రపంచాన్ని పాడుచేసిన వాడినవుతానని పించింది.  ఎక్కడివక్కడ వదిలేసి బయటి కొచ్చేశా.  బయట ఒకరెవరో విద్యా కమిటీ మెంబరట కనిపించారు.  టీచర్ గారు రాక ముందు పిల్లలు ఇరవై లోపే వుండేవారని... ఇప్పుడు అరవై పైగా పెరిగారని, చక్కగా పిల్లలందరినీ ప్రేమగా చూస్తూ పాఠాలు చెబుతారని, మా పిల్లలు కూడా టీచర్ లా వినయంగా ఉండటం లాంటి మంచి బుద్ధులు నేర్చు కుంటున్నారని... ఎప్పుడూ ఉదయమే 8.00 లకే వచ్చేస్తారని ఆలస్యంగా వెళతారని…. ఇలా చెప్తుంటే..*


 *_పాఠశాలను, ఉపాధ్యాయుల పనితీరును ఒకరోజులో, ఒకగంటలో అంచనా వేయడం ఎవరి వల్లా సాధ్యం కాదని, పూర్తి విషయాలు తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రాకూడదని తెలుసుకున్నాను._*


*టీచర్ కేదో పాఠం నేర్పాలనుకున్న నాకు ఆ సందర్శన ఒక చక్కటి గొప్ప పాఠం నేర్పింది.*

 *బరువైన హృదయంతో అక్కడి నుండి కదిలాను… ఒక వేదాంతిలా..., మరియూ జ్ఞానోదయమైన బుద్ధునిలా....* 

🙏🙏🙏🙏🙏

1 comment:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE