NaReN

NaReN

Tuesday, March 30, 2021

కవిత ఖరీదు ఎంత...

 *కవిత ఖరీదు ఎంత...*


కవి అంటే అస్తమించని రవి అని...

కవి అంటే రవి చూడని చోట చూడగలడని అంటారే...

ఆ కవి విలువెంత...

ఆ కవి కన్న కవిత ఖరీదెంత...

చప్పట్ల చప్పుడేనా...


కవి అంటే సమాజానికి మేల్కోపని

కవి అంటే మంచితనపు మెరుపని అంటారే...

ఆ కవి విలువెంత...

ఆ కవి కన్న కవిత ఖరీదెంత...

ప్రశంసాపత్రం కోసం పాకులాడే స్వభావమేనా...


కవి అంటే భావ తరంగమని

కవి అంటే హృదయాన్ని కదిలించునావని అంటా‌రే...

ఆ కవి విలువెంత...

ఆ కవి కన్న కవిత ఖరీదెంత...

రసశ్వాదనలేని రాగద్వేష రోగపు ఊబిలో నిండా మునుగుడేనా...



కవి అంటే చైతన్య ప్రవాహమని 

కవి అంటే కాంతి కెరటమని అంటారే...

ఆ కవి విలువెంత...

ఆ కవి కన్న కవిత ఖరీదెంత...

క్షణకాలం మైకు ముందు మోగి మూగబోయే స్వరమేనా...


కవి అంటే స్వేచ్ఛ పావురమని 

కవి అంటే మనసు దోచే నెమలి నాట్యమని అంటారే...

ఆ కవి విలువెంత...

ఆ కవి కన్న కవిత ఖరీదెంత...

కాపీ కుక్కల చేతిలో చించిన విస్తరేనా...


కవి అంటే కల్మషం లేని మనిషని

కవి ఆంటే కరుణాసాగర విశాల హృదయమని అంటారే...

ఆ కవి విలువెంత...

ఆ కవి కన్న కవిత ఖరీదెంత...

గాలికి కొట్టుకుపోయే కాగితమేనా...


కవి అంటే హృదయం నింపే భావ అన్నపూర్ణని

కవి అంటే జీవన గమనం చూపే దిక్సూచి అని అంటారే...

ఆ కవి విలువెంత...

ఆ కవి కన్న కవిత ఖరీదెంత...

కాలే కడుపుతో.. కదిలే కన్నీటితో..

సమాజాన్ని కదిలిస్తూ కదలని కట్టై మిగిలిపోవడమేనా...


కడుపు మండే అడుగుతున్నా...

కళ్ళు చెమ‌ర్చే అడుగుతున్నా...

ఈ కుళ్ళు సమాజాన్ని... అందులోని లొసగులను...

*ఎవరు చెబుతారు సమాధానం...*

*ఎన్నో కవితలను చదివిన పాఠకులా...?*

ఎన్నో కవితలను అచ్చేసుకుని తమ పబ్బం గడుపుకున్న పాత్రికేయులా...?*

అన్ని కళలకు విలువుందాయే

కపిత్వం మధ్యన కవితే చిక్కిపాయే

కవే అన్నింటికీ... అందరికీ లోకువాయే...


ఔనులే...కవితలు కాలక్షేపపు బఠాణీలైనాయి..

ఔనులే...కాసులున్నోళ్ళు కాటికి కాళ్ళుచాసుకున్న నసుగుడును కవిత్వం అనిరి మరి...

ఇంకొందరు ప్రక్రియల పేరుతో కవితను వర్గాలుగా విభజించి వేలాడదీసిరి...


కుటిల కవుల పబ్లిసిటీ జోరీగ చప్పుడులో 

నికార్సైన కవి కనుమరుగైపోతున్నాడు...

ఆ కవిని కాపాడుకోవాల్సిన కర్తవ్యం ఎవరికి ఉందో మరి....



★★★★★★★★★★★★★★★★

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE