NaReN

NaReN

Tuesday, December 7, 2021

సబ్మెరైన్ డే

 జలాంతర్గామి అంటే ఏమిటి? వాటి పేరుముందు చేర్చే ఐ.ఎన్ .ఎస్ .అంటే ఏమిటి? 

వాటి పనితీరేంటి? మన సబ్మెరైన్ల చరిత్రేంటి? బలమెంత? అందులో పనిచేసే సిబ్బంది స్ధితిగతులేంటి? మొదలగు ఆశక్తికర అంశాలను

తెలుసుకోవాలంటే  ఈనాటి సబ్మెరైన్ డే కధనం చదవాల్సిందే ! మరెందుకు ఆలస్యం కెకెవి.! ఆ వివరాలు చదవండి.....


డిసెంబర్‌ 8 

సబ్‌మెరైన్‌ డే.., 


భారత నౌకాదళంలో తొలి జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ కల్వరి ప్రవేశించిన   రోజు (1967) డిసెంబర్‌ 8  ని ఏటా సబ్‌మెరైన్‌ డే గా నౌకాదళం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 


భారత నౌకాదళం లోని అన్ని యుద్ధ నౌకలకు ముందు ‘ఇండియన్ నేవల్ షిప్’  

(ఐ.ఎన్.ఎస్), జలాంతర్గాములకు ముందు ‘ఇండియన్ నేవల్ సబ్ మెరైన్ (ఐ.ఎన్.ఎస్.) ‘ అని చేరుస్తారు.


భారతీయ నౌకా దళంలోని మన జలాంతర్గాములు గురించి చూద్దాం... 

ఇండియన్ నేవీలో 16 సబ్‌మెరైన్‌లు (జలాంతర్గామి)  ఉన్నాయి. ఇందులో ఎక్కువ రష్యా, జర్మనీలనుండి కొనుగోలు చేసినవి. ఇందులో ప్రధాన మయినవి సింధుఘోష్ తరగతికి చెందినవి. ఈ తరగతిలో మొత్తం 10 సబ్‌మెరైన్‌లు ఉన్నాయి. వీటి బరువు 3,000 టన్నులు. ప్రతి సబ్‌మెరైన్‌లో 220 కిమీ దూరంలోపు ఉన్న నౌకల పైన ప్రయోగించ గలిగే మిస్సైళ్ళు ఉన్నాయి. ఈ సబ్‌మెరైన్‌లు సముద్రంలో 300 మీటర్ల లోతువరకు వెళ్లగలగి, 18 నాట్ల వేగంతో 45 రోజుల పాటు సముద్ర ఉపరితలాన్ని చేరుకోకుండా ప్రయాణించ గలవు. 


1985 నుండి అణు సబ్‌మెరైన్‌లను నిర్మించడానికి కల్పాక్కం వద్ద ఉన్న అణు కేంద్రంతో కలసి నేవీ కృషి చేస్తున్నది. 2010 నాటికి 6,000 టన్నులు బరువు కలిగి, పూర్తి అణు సామర్థ్యం కలిగిన ఓ సబ్‌మెరైన్‌ను, 2025 నాటికి ఇలాంటివి మరో నాలుగు నిర్మించడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరిగింది.


నీటిలో మునిగి ప్రయాణం చెయ్యగల వాహనం జలాంతర్గామి. 

వివిధ దేశాల నావికా రక్షణ దళాల్లో జలాంతర్గామి ఒక ముఖ్య భాగం. జలాంతర్గామిని మొదటగా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో విస్తృతంగా ఉపయోగించారు. 


జలాంతర్గాములు అనేక రకాలైన మిషన్లను చేపట్ట గలవు. 


యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్‌, 


యాంటీ- సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌,


 ఇంటెలిజెన్స్ సేకరణ, 


మైన్‌ లేయింగ్‌, 


తీర ప్రాంతాల్లో నిఘా తదితర మిషన్లు చేపట్టగలవు.


భారత నౌకాదళంలో చేరిన కొన్ని జలాంతర్గాములు – వాటి తేదీల వివరాలు ఇలా ఉన్నాయి…

ఐ.ఎన్.ఎస్.సింధుధ్వజ్… 12 జనవరి,1987, 

ఐ.ఎన్.ఎస్. షల్కి …07 ఫిబ్రవరి 1992, 

ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ …30 ఏప్రిల్ 1986,

ఐ.ఎన్.ఎస్. షంకుల్ .28 మే 1994, 

ఐ.ఎన్.ఎస్. సింధువీర్…11 జూన్ 1988, 

ఐ.ఎన్.ఎస్. సింధుశస్త్ర…19 జూలై 2000,

ఐ.ఎన్.ఎస్. వగ్లి ….10 ఆగష్టు 1974, 

ఐ.ఎన్.ఎస్. వేల ….31 ఆగష్టు 1973, 

ఐ.ఎన్.ఎస్. శాతవాహన… 21 డిసెంబర్1974,

ఐ.ఎన్.ఎస్. షిషుమార్…22 సెప్టెంబరు1986, 

ఐ.ఎన్.ఎస్. సింధురాజ్ …20 అక్టోబరు 1987,

ఐ.ఎన్.ఎస్. సింధురత్న…19 నవంబరు 1988, 

ఐ.ఎన్.ఎస్. షంకుష్ …20 నవంబరు1986,

ఐ.ఎన్.ఎస్. సింధుకీర్తి …09 డిసెంబరు1989, 

ఐ.ఎన్.ఎస్. సింధు విజయ్…17డిసెంబర్1990,

ఐ.ఎన్.ఎస్.సింధు కేసరి… 19డిసెంబర్1988, ఐ.ఎన్.ఎస్.సింధు రక్షక్ …24 డిసెంబర్1997.

ఐ.ఎన్.ఎస్ విరాట్…

27 సంవత్సరాల సేవ తరువాత 2016 లో ఈ నౌకను నౌకాదళం నుండి విరమింప జేసారు. 2013 లో ఐ.ఎన్.ఎస్ విక్రమాదిత్య కమిషను కాకముందు, విరాట్‌యే భారత నౌకాదళపు ఫ్లాగ్‌షిప్ నౌక. పని విరమించే ముందు వరకూ ఇది ప్రపంచంలోనే అత్యంత పాత విమాన వాహక నౌక. 1959 లో బ్రిటిషు నౌకాదళంలో హెచ్ ఎం ఎస్ హెర్మెస్‌గా చేరిన ఈ నౌకను 1987లో భారత్ కొని, 1987 మే 12 న ఐ ఎన్ ఎస్ విరాట్‌గా పేరు పెట్టింది. 

ఐ.ఎన్.ఎస్వి విక్రమాదిత్య… భారత్ రష్యా నుండి కొనుగోలు చేసిన విమాన వాహక నౌక. కీయెవ్ తరగతికి చెందిన అడ్మిరల్ గోర్ష్‌కోవ్ విమాన వాహక నౌకను విక్రమాదిత్యగా పునర్నిర్మిం చారు. ఇది 2013 లో భారతీయ నౌకాదళం లోకి ప్రవేశించింది.


ఐ.ఎన్.ఎస్ చక్ర…అణు జలాంతర్గామి…

ఐఎన్ఎస్‌ అరిహంత్‌ …నూక్లియర్‌ సబ్‌మెరైన్‌.

నూక్లియర్‌ మిస్సైల్స్‌ను ప్రయోగించే సబ్‌మెరైన్ల కోసం  సముద్ర గర్భంలో అధునాతన బెర్తులు రూపుదిద్దు కుంటున్నాయి.


విశాఖపట్నం కేంద్రంగా స్వదేశీ పరిజ్ఞానంతో తొలి నూక్లియర్‌ సబ్‌మెరైన్‌ అరిహంత్‌ నిర్మాణం జరిగింది. 


సముద్రంపైన, భూమిపైన యుద్ధం చేయగల ఐఎన్ఎస్‌ జలాశ్వతో పాటు అణు ఇంధనంతో పనిచేసే సబ్‌మెరైన్‌ ఐఎన్ఎస్‌ చక్ర ఇక్కడి నుంచే సేవలు అందిస్తోంది.


చైనా వద్ద 56 సబ్‌మెరైన్లు ఉండగా మన దగ్గర 16 మాత్రమే ఉన్నాయి. చైనా ఇప్పటికే ఐదు న్యూక్లియర్‌ సబ్‌మెరైన్లను సమకూర్చు కుంది. మ‌న దేశంలో తొలి న్యూక్లియర్‌ జలాంతర్గామి (అరిహంత్‌).


ఫ్రెంచ్‌ నావికాదళ రక్షణ, ఇంధన సంస్థ డీసీఎన్‌ఎస్‌ రూపొందించిన జలంతార్గముల ను భారత నేవీ ఫోర్స్ ప్రాజెక్ట్‌ 75లో భాగంగా ముంబైలోని మజగాన్‌ డాక్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) నిర్మిస్తోంది. ఆరు స్కార్పీన్‌ క్లాస్ జలాంతర్గాము ల్లోని మొదటిదైన ఐఎన్ఎస్ కల్వరిని 2017 డిసెంబర్‌లో భారత నావికాదళం లోకి ప్రవేశ పెట్టారు. ఇది డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ జలాంతర్గామి. 


2017లో ప్రవేశపెట్టిన ఐఎన్ఎస్ ఖండేరి రెండవది కాగా.. 

మూడోది ఐఎన్ఎస్ కరంజ్ 2018 నేవీ దళంలో చేరింది. ఇక, నాల్గోది ఐఎన్‌ఎస్‌ వెలా 2019 నుంచి సేవలందిస్తుంది. శత్రు దేశాల క్షిపణులు, జలాంతర్గాముల కళ్లుగప్పే స్టెల్త్‌ సాంకేతిక పరిజ్ఞానంతో, ప్రాజెక్ట్‌ 75లో భాగంగా రూపొందించిన ఐదో స్కార్పీన్‌ తరగతి జలాంతర్గామి ఇటీవలే మజగావ్ డాక్ వద్ద అరేబియా సముద్ర జలాల్లో జల ప్రవేశం చేసింది. 


ప్రస్తుతం సబ్‌మెరైన్ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు చర్యలు జరుగు తున్నాయి. ఇందులో భాగంగా రాబోవు 30 సంవత్సరాలలో 24 సబ్‌మెరైన్‌లు నేవీ అమ్ముల పొదిలో చేరబోతున్నాయి. ప్రస్తుత మార్పులను బట్టి హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అన్ని దేశలలో భారత నావికా దళం అత్యంత బలమయినదిగా తయారవుతున్నదని చెప్పవచ్చు....


1971 మే 19న వీర్‌బాహు అనే సబ్మెరైన్  నౌకాదళంలో కమిషనింగ్‌ అయింది. ఈ సబ్‌మెరైన్‌ మిగతా సబ్‌మెరైన్లకు ఆపరేషనల్‌ సపోర్టు ఇస్తూ 50 ఏళ్లుగా తూర్పు నౌకాదళంలో ఉంది.ఐఎన్‌ఎస్‌ వీర్‌బాహు హీరోయిక్‌ ఆర్మ్‌గా పిలవబడుతుంది.


జలాంతర్గాములు మన నౌకాదళంలో పోషించే పాత్ర ఏమిటి? వాటిలో సిబ్బంది జీవనశైలి ఎలా ఉంటుంది? యుద్ధ సమయంలో వారు ఎలా పనిచేస్తారు? తదితర అంశాలు పరిశీలిద్దాం!


రోజుల తరబడి సముద్ర గర్భంలో ప్రయాణం, జీవనం.. శత్రు సైన్యానికి తెలియకుండా వారి తీరాల్లోకి చొరబడటం.. నౌకాదళంలో కీలకపాత్ర పోషించే జలాంతర్గాముల్లో సిబ్బంది జీవనం అత్యంత కష్టం. దేశంపైఅపారమైన ప్రేమ, సాహసోపేతమైన  జీవన శైలిపై ఇష్టం.. ఈ రెండూ లేకపోతే జలాంతర్గామిలో పనిచేయడం అంత సులభం కాదు. 

 

జలాంతర్గామిలో అత్యంత కీలకమైన ప్రాంతం కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌. కెప్టెన్‌తో సహా అన్ని విభాగాల అధిపతులూ ఇక్కడ ఉంటారు. ఎటుచూసినా పైపులు, వైర్లు తప్ప మరేమీ కనిపించనికొద్దిపాటి స్థలం. హార్బర్‌ నుంచి సబ్‌మెరైన్‌ను మొదట తొమ్మిది మీటర్ల లోతులోకి తీసుకుని వెళతారు. అక్కడి నుంచి సముద్ర ఉపరితలంలో కనిపించే వాటిని పరిశీలించడానికి పెరిస్కోప్ లు అందుబాటులోకి వస్తాయి. వాటి నుంచి ఒక వైపు కెప్టెన్‌, మరో వైపు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పరిశీలిస్తారు. రెండు పెరిస్కోపుల  మధ్య నావిగేషన్‌ డైరెక్షన్‌ను కంట్రోల్‌ రూమ్‌కు అందించే పరికరం ఉంటుంది. వీటి తరువాత వరుసగా సబ్‌మెరైన్ సముద్ర 

ఉపరితలానికి వచ్చినప్పుడు ఇంధనానికి, లోపల పనిచేసే సిబ్బందికి సరిపడా గాలిని సక్‌ చేసే యంత్రం ఉంటుంది. ఆ తరువాత రాడార్‌లు, సోనార్‌ సిస్టమ్‌కు చెందిన పరికరాలు కనిపిస్తాయి. ఏ కాస్త చోటు దొరికినా దాన్ని ఎలా వాడుకోవాలా అనే ఆలోచనే ఉంటుంది. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ తరువాత ఆఫీసర్స్‌ బస చేసే ప్రాంతం ఉంటుంది.


మొత్తం సబ్‌ మెరైన్‌లో కెప్టెన్‌ ఒక్కడికి మాత్రమే క్యాబిన్‌ ఉంటుంది. అదేదో చాలా పెద్దది అనుకునేరు. ఐదడుగుల వెడల్పు, ఆరడుగుల పొడవుండే చిన్న గది అది! దానిని దాటి ముందుకు వెళితే ఆరుగురు, ఎనిమిది మంది నిద్రించడానికి వీలైన చిన్న చిన్న కంపార్ట్‌మెంట్ల వంటివి కనిపిస్తాయి. దానికి ఎదురుగా భోజనాల బల్ల కనిపిస్తుంది. దానిని ఆనుకుని వంట గది నుంచి తీసుకువచ్చిన భోజనాన్ని గిన్నెల్లోకి మార్చి వడ్డించడానికి అనువుగా ఉండే ప్యాంట్రీ ఉంటుంది. భోజనాల గదిలో ఓ చిన్న టీవీ. అత్యవసర సమయాల్లో ఈ భోజనాల గదే ఆపరేషన్‌ థియేటర్‌గా మారిపోతుంది. ప్రతి సబ్‌ మెరైన్‌ జట్టులో ఓ వైద్యుడు, సహాయకుడు తప్పనిసరిగా ఉంటారు. అత్యవసర సమయాలలో అపెండిసైటిస్‌ వంటి ఆపరేషన్స్‌ చేసిన సందర్భాలు అనేకం.  


ఇది 1987 అక్టోబర్‌ 20న మన నౌకా దళంలోకి చేరిన సింధురాజ్‌ జలాంతర్గామి లోపలి పరిస్దితి. ఆరు గదులుగా నిర్మితమైన ఈ సబ్‌ మెరైన్‌లో మూడు అంతస్తులు ఉంటాయి. మధ్య అంతస్తులో ప్రధానమైన కమాండ్‌ కంట్రోల్‌ ఉంటుంది. ప్రతి గదిలోకీ ప్రవేశించడానికి గుండ్రటి తలుపు ఉంటుంది. అత్యవసర వేళల్లో సబ్‌ మెరైన్‌ను రక్షించేందుకు మూడు హాచ్‌లు ఉంటాయి. ముందు, మధ్య, చివరి భాగాలలో ఇవి ఉంటాయి. ఏ గదికైనా సమస్య తలెత్తినప్పుడు దానిని సీల్‌ చేసి మిగిలిన వాటిని రక్షించే ప్రయత్నం చేస్తారు. అత్యవసర సమయాల లో ఒక్కోసారి.. ఆక్సిజన్‌ పరిమాణం సాధారణం కంటే తక్కువగా ఉండేచోట, అంతంత మాత్రంగా వెలుతురు ఉండే చోట, ఎర్రటి గుడ్డి కాంతి తప్ప మరేమీ లేని చోట పనిచేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో ఏ చిన్న ప్రమాదం జరిగినా ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. అందుకనే ప్రతి సబ్‌ మెరైనర్‌ నడుముకు ఆక్సి మాస్క్‌ పరికరాన్ని తగిలించుకుంటాడు. అత్యవసర వేళల్లో డబ్బాలాంటి పరికరం మూత తీసి మాస్క్‌ను తగిలించుకుంటే సుమారు 25 నిమిషాలపాటు ఆక్సిజన్‌ సరఫరా నిరాటంకంగా అందుతుంది. ఇది కేవలం ఒకసారి వాడడానికి మాత్రమే పనికొస్తుంది. ఇప్పటికీ జర్మన్‌ మేడ్‌ ఆక్సిమాస్కలను వాడుతున్నా వాటి స్థానంలో మెల్లగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ఆక్సి మాస్క్‌లు వస్తున్నాయి. ఇన్ని కష్టాల నడుమ సైతం మన నౌకాదళ సిబ్బంది ఎంతో అంకిత భావంతో పనిచేస్తుండటం విశేషం.


అత్యంత సంక్షిష్ట, దుర్భర పరిస్థితులలో శత్రుదుర్భేధ్యంగా మన సముద్ర జలాలలను తీర్చిదిద్దడంలో అహరహం శ్రమిస్తున్న ఆ యోధులకు సలాం చేయాల్సిందే. వారాంతపు విశ్రాంతి సంగతి అటుంచింతే...సెలవు దొరకడం కూడా ఇబ్బందికరంగానే ఉండే వృత్తిలో కొనసాగుతున్న నౌకాదళ సబ్‌ మెరైన్‌ సిబ్బందికి జేజేలు పలుకుదాం.

 

దాడి ఎలా చేస్తారు?

శత్రువుపై దాడి జరిగేటప్పుడు సబ్‌మెరైన్‌ అంతటా ఒక రకమైన ఉద్విగ్న వాతావరణం నెలకొంటుంది. అందరూ అప్రమత్తంగా ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటిగా ఆజ్ఞలు జారీ అవుతుంటాయి. వాటిని అందుకున్నట్టుగా సంబంధిత సిబ్బంది నుంచి సమాధానాలు వస్తుంటాయి. ఓ వైపు సోనార్‌ సిస్టమ్‌కు అనుసంధానించిన కంప్యూటర్‌పై సహాయకుడు వేస్తున్న లెక్కలను కెప్టెన్‌ పరిశీలిస్తుంటాడు. మరోవైపు ఇంకో సహాయకుడు.. శత్రువు ఎంత దూరంలో ఉన్నాడు, ఎంత వేగంగా కదులుతున్నాడు అన్న సమాచారాన్ని అందిపుచ్చుకుని దిక్సూచి గీసి ఉన్న గ్లాస్‌పై టార్గెట్‌ను గీస్తుంటాడు. మొత్తం పరిస్థితిని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ జాగ్రత్తగా గమనిస్తుంటాడు. దాడికి టార్పెడోలు లోడ్‌ చేస్తారు. టార్గెట్‌ ఎంత దూరంలో ఉంది? ఏ దిశగా కదులుతోంది? అన్న సమాచారాన్ని మరోసారి నిర్ధారించుకుంటారు. మరుక్షణం కెప్టెన్‌ నోటి నుంచి ఉత్తర్వులు వెలువడతాయి. సీఈవో ఆ ఉత్తర్వులను రిపీట్‌ చేస్తారు. అంతే.. జలాంతర్గామి నుంచి టార్పెడో దూసుకుపోతుంది. సముద్ర ఉపరితలంలో ప్రయాణిస్తున్న నౌకను కచ్చితంగా ఢీకొడుతుంది. ఆ తాకిడికి.. అతి భారీ నౌక సైతం మధ్యకు విరిగి తునాతునకలవుతుంది...,

మన దేశ రక్షణలో అనుక్షణం నిమగ్నమై ఉండే నౌకా దళానికి, జలాంతర్గాములకు,దేశరక్షణకు తమ ప్రాణాలనుసైతం తృణప్రాయంగా పెట్టి పనిచేస్తున్న నౌకాదళ సబ్‌ మెరైన్‌ సిబ్బందికి రెడ్ శాల్యూట్ ....,

No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE