NaReN

NaReN

Wednesday, August 27, 2025

జీవితానికి ఉపయోగపడే 15 మంచి మాటలు

 


*జీవితానికి ఉపయోగపడే 15 మంచి matalu

 (Life-Useful Quotations)*  


*ముందుమాట (Introduction)*  

జీవితం అనేది అనుభవాల సమాహారం. మనకు దిశానిర్దేశం ఇచ్చేది సద్బోధన, సూక్తులు. ఇవి మనసుకు వెలుగునిస్తూ, ఆచరణలో మార్గదర్శకత్వం ఇస్తాయి.  


**1. Truth – సత్యం**  

సత్యం ఎప్పటికీ ఓడిపోదు. అది కొన్నిసార్లు ఆలస్యంగా గెలుస్తుంది కానీ శాశ్వతంగా నిలుస్తుంది. సత్యం మనసుకు ధైర్యం ఇస్తుంది. అబద్ధం తాత్కాలిక సౌకర్యమే ఇస్తుంది. సత్యవంతుల జీవితం అందరికీ ఆదర్శం. సత్యం అనుసరించే వారు భయపడరు. సత్యం ద్వారా నమ్మకం పెరుగుతుంది. సత్యం మనిషిని నిజమైన మహానుభావుడిగా మారుస్తుంది.  


**2. Patience – సహనం**  

సహనం కలవారు కష్టాలను జయిస్తారు. ఆత్రం ఎప్పుడూ తప్పులకు దారి తీస్తుంది. సహనం ఉన్నవారికి బుద్ధి నిలుస్తుంది. సహనంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. కోపం క్షణికం, సహనం శాశ్వతం. సహనం కలవారు ఇతరులకు శాంతిని పంచుతారు. సహనం ఉన్నవారికి విజయం దగ్గరలోనే ఉంటుంది. సహనం ఒక గొప్ప ఆయుధం.  


**3. Discipline – క్రమశిక్షణ**  

క్రమశిక్షణ లేని జీవితం అసంపూర్ణం. స్వీయ నియంత్రణతోనే విజయాలు వస్తాయి. క్రమశిక్షణతో సమయం వృథా కాదు. సమాజం క్రమశిక్షణతోనే సజావుగా నడుస్తుంది. క్రమశిక్షణ ఉన్నవారిని అందరూ గౌరవిస్తారు. విజయానికి క్రమశిక్షణ మూలస్థంభం. క్రమశిక్షణ ఉన్నవారికి క్రమబద్ధత పెరుగుతుంది. క్రమశిక్షణ జీవన ప్రమాణాన్ని పెంచుతుంది.  


**4. Hard Work – కష్టపడి పనిచేయడం**  

కష్టం లేకుండా ఫలితం రాదు. కష్టం చేసినవారే నిజమైన విజయాన్ని అందుకుంటారు. కష్టపడి పనిచేయడం శ్రమ కాదు సదుపాయం. కష్టాన్ని దాటితేనే గెలుపు ఉంటుంది. కష్టపడే మనసు ఎప్పటికీ వెనుకబడదు. కష్టపడితేనే ప్రతిభ వెలుగుతుంది. కష్టానికి గౌరవం ఎల్లప్పుడూ ఉంటుంది. కష్టపడి సాధించినదే శాశ్వతం.  


**5. Knowledge – జ్ఞానం**  

జ్ఞానం కంటే గొప్ప సంపద లేదు. జ్ఞానం ఉన్నవారిని ఎవ్వరూ దోచుకోలేరు. జ్ఞానం చీకటిలో వెలుగులాంటిది. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ వినయం పెరుగుతుంది. జ్ఞానం మనిషిని వినయశీలిగా మారుస్తుంది. జ్ఞానం ఉన్నవారు ఇతరులను వెలిగిస్తారు. జ్ఞానం మనిషి జీవితాన్ని ఉన్నతంగా మార్చుతుంది. జ్ఞానం సమాజానికి దారి చూపుతుంది.  


**6. Honesty – నిజాయితీ**  

నిజాయితీ గలవారికి అందరూ నమ్మకం పెడతారు. నిజాయితీ గల వ్యక్తి ఎప్పుడూ భయపడడు. నిజాయితీ మనిషికి నైతిక శక్తినిస్తుంది. నిజాయితీ ఉన్నవారిని సమాజం గౌరవిస్తుంది. నిజాయితీ వల్ల నమ్మకం నిలుస్తుంది. నిజాయితీ జీవనంలో ఆనందం ఇస్తుంది. నిజాయితీతోనే మంచి సంబంధాలు ఏర్పడతాయి. నిజాయితీ శాంతికి మూలం.  


**7. Time – సమయం**  

సమయం అనేది అమూల్యమైనది. దానిని వృథా చేస్తే తిరిగి రావడం లేదు. సమయాన్ని కాపాడినవారే విజయాన్ని అందుకుంటారు. సమయం మనిషిని ముందుకు నడిపిస్తుంది. సమయం విలువ తెలుసుకున్నవారికి గౌరవం లభిస్తుంది. సమయం శ్రద్ధగా వినియోగించాలి. సమయాన్ని వృథా చేస్తే జీవితం వెనుకబడుతుంది. సమయం సక్రమంగా వాడితే ఫలితాలు గొప్పవిగా వస్తాయి.  


**8. Friendship – స్నేహం**  

స్నేహం జీవనంలో ఆనందాన్ని ఇస్తుంది. నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ తోడుంటాడు. స్నేహం నమ్మకంపై నిలుస్తుంది. స్నేహితుడు మన లోపాలను సరిచేస్తాడు. స్నేహం మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. స్నేహితుడు బాధల్లో తోడ్పడతాడు. స్నేహం నిజాయితీతో బలపడుతుంది. స్నేహం జీవన పథంలో వెలుగును నింపుతుంది.  


**9. Love – ప్రేమ**  

ప్రేమ జీవనానికి శక్తినిస్తుంది. ప్రేమతో సంబంధాలు నిలుస్తాయి. ప్రేమ మనసును మృదువుగా చేస్తుంది. ప్రేమ ద్వేషాన్ని దూరం చేస్తుంది. ప్రేమలో నిజాయితీ ఉంటే బంధం బలపడుతుంది. ప్రేమతోనే శాంతి పెరుగుతుంది. ప్రేమ మనిషిని దయగలవాడిగా మారుస్తుంది. ప్రేమ ప్రపంచానికి మానవత్వాన్ని ఇస్తుంది.  


**10. Health – ఆరోగ్యం**  

ఆరోగ్యం లేకపోతే ధనం ఉపయోగం లేదు. ఆరోగ్యం ఉంటే శ్రమించగలం. ఆరోగ్యం మనిషి జీవనానికి పునాది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కర్తవ్యం. ఆరోగ్యం శాంతిని ఇస్తుంది. ఆరోగ్యం ఉన్నవారు ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం విజయం సాధించడానికి తోడ్పడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం.  


**11. Charity – దానం**  

దానం మనిషిని మహోన్నతుడిగా చేస్తుంది. దానం సమాజంలో సానుభూతిని పెంచుతుంది. దానం చేసే హృదయం పవిత్రం. దానం వల్ల సమానత్వం పెరుగుతుంది. దానం ఇతరుల కష్టాలను తగ్గిస్తుంది. దానం మనసుకు శాంతినిస్తుంది. దానం మానవత్వాన్ని నిలుపుతుంది. దానం మనిషి విలువను పెంచుతుంది.  


**12. Courage – ధైర్యం**  

ధైర్యం లేని జీవితం బలహీనత. ధైర్యం కలవారే సమస్యలను ఎదుర్కొంటారు. ధైర్యం మనిషికి ఆత్మవిశ్వాసం ఇస్తుంది. ధైర్యంతో విజయాలు సాధ్యమవుతాయి. ధైర్యం లేకపోతే భయమే మిగులుతుంది. ధైర్యం జీవితం ముందుకు నడిపిస్తుంది. ధైర్యం ఉన్నవారికి గౌరవం వస్తుంది. ధైర్యం మానవత్వానికి శక్తి.  


**13. Simplicity – సరళత**  

సరళత కలవారు అందరినీ ఆకట్టుకుంటారు. సరళత మనసుకు ప్రశాంతి ఇస్తుంది. సరళతలోనే గొప్పదనం ఉంటుంది. సరళత గలవారు ఎవరినీ కించపరచరు. సరళతతో జీవితం సులభమవుతుంది. సరళత మనిషిని వినయశీలిగా మారుస్తుంది. సరళతతో బంధాలు బలపడతాయి. సరళత అనేది సహజమైన అందం.  


**14. Gratitude – కృతజ్ఞత**  

కృతజ్ఞత గలవారు నిజమైన మహానుభావులు. కృతజ్ఞత మనిషిని వినయవంతుడిగా ఉంచుతుంది. కృతజ్ఞత చూపించడం ఒక గొప్ప గుణం. కృతజ్ఞత బంధాలను బలపరుస్తుంది. కృతజ్ఞత గల మనసు అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. కృతజ్ఞత గలవారికి మరింత సహాయం లభిస్తుంది. కృతజ్ఞత మనసు పవిత్రతను చూపిస్తుంది. కృతజ్ఞత మానవత్వానికి మూలం.  


**15. Self-Confidence – ఆత్మవిశ్వాసం**  

ఆత్మవిశ్వాసం కలవారు ఏదైనా సాధిస్తారు. ఆత్మవిశ్వాసం మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం విజయానికి దారి చూపిస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్నవారు వెనుకడుగు వేయరు. ఆత్మవిశ్వాసం మనసును బలంగా ఉంచుతుంది. ఆత్మవిశ్వాసం లేనివారు ఎప్పుడూ భయపడతారు. ఆత్మవిశ్వాసం గలవారికి అవకాశాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం జీవితం ఉన్నతంగా మార్చుతుంది.  


*ముగింపు (Conclusion)*  

ఈ సూక్తులు జీవనంలో మార్గదర్శకత్వం ఇస్తాయి. వీటిని పాటిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, సమాజం సౌఖ్యంగా ఉంటుంది. జీవితం సార్థకంగా గడుస్తుంది.


శుభం భూయాత్🙏🏻


సదా మీ సేవలో🙏🏻

పసుపులేటి నరేంద్రస్వామి

Tuesday, August 19, 2025

గద్వాల రాణి

 గద్వాల రాణి 


*నిజాం నవాబును ఎదురించిన వీరవనిత. గద్వాల సంస్థానాన్ని స్వతంత్ర సంస్థానంగా ప్రకటించి పాలించిన మహారాణి. నిజాం ప్రభువుల నుంచి పతనమైన తన రాజ్యాన్ని పునరుద్ధరించుకున్న వీరవనిత మహారాణి ఆది లక్ష్మిదేవమ్మ గారి వర్ధంతి జ్ఞాపకం* !


      🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿



గద్వాల సంస్థానంలో సాహితి పోషకులలో చెప్పకోదగ్గ రాజు శ్రీ మహారాజా సీతారామభూపాలుడు 1924లో స్వర్గస్తు లైనారు. తరువాత పాలన బాధ్యతలు శ్రీ మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ 1929లో చేపట్టారు. 1949లో జాగీరుల రద్దుతో రాణి పాలన ముగిసంది. ఆమె చేసిన 25సంవత్సరాల పాలనలో ఎ న్నో విజయాలు. మన్ననలను, ప్రశంసలను రాణి అందు కున్నారు. 25సంవత్సరాల రాణి పాలనను గద్వాల చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగ్గదిగా ఇప్పటికీ చెప్పుకుంటారు.

.......

పూడూరును చాళుక్యులు పరిపాలించగా, చాళుక్యులకు, పల్లవులకు మధ్య జరిగిన యుద్ధంలో పెదసోమభూపాలుడు గదను, వాలమును ప్రయోగించడం వలన ఈ కోటకు "గదవాల (గద్వాల)" అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ విధంగా 1663 నుండి 1950 వరకు గద్వాల సంస్థానాధీశులచే పరిపాలింపబడింది. రాజాభరణాల రద్దు తరువాత ఈ కోటను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, 

......

గద్వాల, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలానికి చెందిన పట్టణం. ఇది జోగులాంబ గద్వాల జిల్లాకు పరిపాలనా కేంద్రం. మండలానికి, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్రంగా కూడా ఉంది

.....

గద్వాల సంస్థానం తుంగభద్ర, కృష్ణానదుల మధ్య ప్రాంతంలో నడిగడ్డగా పిలిచే ప్రాంతంలో 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. 14వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత గద్వాల సంస్థానాధీశులు బహుమనీ సామ్రాజ్యం సామంతులుగా ఉన్నారు. 1663లో రాజా పెదసోమభూపాలుడితో ప్రారంభమైన గద్వాల సంస్థాన పాలన విలీనమయ్యే వరకు కొనసాగింది. 1704లో నాడగౌడుగా ఉన్న సోమన్న కృష్ణానది తీరన గద్వాల కోటను నిర్మించారు. రాజ్యాన్ని బనగానపల్లె, ఆదోని, సిరివెల్ల, నంద్యాల, ఆత్మకూరు, అహోబిలం ప్రాంతాలకు విస్తరించారు. 1909 వరకు గద్వాల సంస్థానాధీశులు సొంత నాణేలను ముద్రించుకున్నారు. ఈ సంస్థానంలో 11 మంది రాజులు, 9 మంది రాణులు పాలించారు. చివరగా మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ గారు 1924 నుంచి సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యే వరకు మహారాణిగా కొనసాగారు. గద్వాల సంస్థాన వారసుడైన కృష్ణ రాంభూపాల్‌రెడ్డి 1962లో రాష్ట్రలో  జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

......

గద్వాల్ కోట ఒక అద్భుతమైన కట్టడం, దీని చుట్టూ పాత పట్టణం విస్తరించి ఉంది.  కోటలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనది శ్రీ చెన్నకేశవ స్వామి.  జమ్ములమ్మ అనే మరొక ప్రసిద్ధ దేవాలయం పట్టణానికి పశ్చిమాన ఉంది.

.....

మహారాణి ఆది లక్ష్మి దేవమ్మ మహబూబ్ నగర్ జిల్లా లోని ఒకనాటి గద్వాల సంస్థానాన్ని పాలించిన మహారాణి. రాజా చిన సీతారామభూపాలుని భార్య. ఆయన అనంతరం పాలనచేశారు. 1946 నుండి 1949 వరకు పాలించారు. ఆమె ఈ సంస్థానపు చివరి పాలకురాలు కూడా. నిజాం నవాబును ఎదురించిన వీరవనిత. గద్వాల సంస్థానాన్ని స్వతంత్ర సంస్థానంగా ప్రకటించి పాలించించారు. సీతారామభూపాలునికి సంతానం లేకపోవడంచే నిజాం నవాబు మిర్ ఉస్మాన్ అలీఖాన్ తమ రాజ్యంలో గద్వాల సంస్థానాన్ని కలుపుకుంటే, రాణి న్యాయపోరాటం చేసి సంస్థానాన్ని తిరిగి చేజిక్కించుకున్నారు. 


▪️ సాహితి సేవా.....


శ్రీ మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ పాలనలో చేసినా సాహితిసేవను గద్వాల చరిత్రలో సువర్ణక్షరాలతో లి ఖించదగినది. రాణి పాలనలో వెలుగులోకి వచ్చిన సాహితి సేవలు ఎవరి పాలనలో వెలుగులోకి రాలేదు. ప్ర తి సంవత్సరం కార్తీక మాఘ శుద్ధ పౌర్ణమి నాడు కవి పం డితులను ఆదరించి వారిని సన్మానించి వారి పాదదూళిని సింధూరంగా భావించి నుదుటన పెట్టుకునే వారట. అలాగే ప్రతి మాఘపౌర్ణమి నాడు చెన్నకేశవ స్వామి రథో త్సవం సందర్భంగా దక్షిణ భారత దేశము నుంచి కళా కారులను ఆహ్వానించి సన్మానించేవారు. నాడు సన్మానం పొందిన వారిలో తిరుపతి వెంకటకవులు కూడా ఉన్నారు. ఆంధ్రదేశంలో గద్వాలలో సన్మానం పొందుట తమ విద్య కు పరిపూర్ణత లభించినట్లేనని కవులు భావించేవారు. అందుకే రాణి పాలనలో గద్వాలను విద్వద్గద్వాలగా కీర్తి సంతరిం చుకుంది.

.......

సంస్థానంలో సంప్రదాయంగా వస్తున్న సాహిత్య పోషణను కొనసాగిస్తూ, ఎందరో కవులను ఆదరించి గద్వాలకు విద్వద్గద్వాలగా కీర్తి రావడానికి కారకులయ్యారు. ఎంతోమంది కవుల పుస్తకాలను ముద్రింపజేశారు. 1949 లో సంస్థానాల, జాగీర్ధారుల పాలనలు రద్దు కావటంతో రాణి సంస్థానపు ఆస్తులను, చారిత్రాత్మక గద్వాల కోటను ప్రభుత్వ పరం చేశారు. 1663లో రాజా పెద సోమభూపాలుడి పాలనతో ప్రారంభమైన గద్వాల సంస్థానపు పాలన 1949లో మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ పాలనతో ముగిసింది. ఆమె పేరు మీదుగా గద్వాల కోటలో మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటైన మొదటి డిగ్రీ కళాశాల. 

.....

స్వాత్రంత్యానికి పూర్వం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 16 సంస్థానాలు ఉండేవి. అందులో ముఖ్యమైనవి వనపర్తి, గద్వాల, కొల్లాపూర్‌, అమరచింత సంస్థానాలు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం కాలేదు. కేంద్రప్రభుత్వం ‘ఆపరేషన పోలో’తో సైనిక చర్యకు దిగడంతో 1948 సెప్టెంబర్‌ 17న విలీనం కావడంతో ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం సిద్ధించింది. దీంతో సంస్థానాలన్నీ పోయి ప్రజాస్వామ్య పాలన ఏర్పడింది. అప్పటి వరకు సంస్థానాధీశులుగా కొనసాగిన వారిలో కొంతమంది ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ నిలబడి గెలిచారు. ప్రస్తుతం రాజవంశాలకు చెందిర వారు క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.


• గద్వాల సంస్థానంను పాలించిన రాజులు....


బుడ్డారెడ్డి గద్వాల సంస్థానానికు మూలపురుషుడు. మొత్తం 11 రాజులు, 9 రాణులు ఈ సంస్థానాన్ని పాలించారు. వీరిలో ముఖ్యులు.


1) రాజ శోభనాద్రి

2) రాణి లింగమ్మ (1712 - 1723)

3) రాణి అమ్మక్కమ్మ (1723 - 1724 )

4) రాణి లింగమ్మ ( 1724 - 1738 )

5) రాజా తిరుమలరావు

6) రాణి మంగమ్మ ( 1742 - 1743)

7) రాణి చొక్కమ్మ ( 1743 - 1747 )

8) రాజా రామారావు

9) రాజా చిన్నసోమభూపాలుడు

10) రాజా చిన్నరామభూపాలుడు

11) రాజా సీతారాం భూపాలుడు

12) రాణి లింగమ్మ (1840 - 1841 )

13) రాజా సోమభూపాలుడు

14) రాణి వెంకటలక్ష్మమ్మ

15) రాజారాంభూపాలుడు

16) రాణి లక్ష్మీదేవమ్మ

17) మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ ( 1924 - 1949 )


• సంస్థానం గుండా యూనియన్ దళాలకు ప్రవేశం...


మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ గారు 1947లో భారత స్వాతంత్ర్యానంతరం నిజాం నవాబును ఎదిరించిన సాహసి. 1948లో భారత యూనియన్ దళాలు హైదరాబాదుపై పోలీస్ చర్య తీసుకొనే సమయంలో కర్నూలు మీదుగా హైదరాబాదుకు వెళ్ళడానికి తన సంస్థానం గుండా యూనియన్ దళాలకు ప్రవేశం కల్పించింది తన దేశభక్తిని చాటుకున్నారు.

......

1948 సెప్టెంబరులో హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన పిదప తన సంస్థాన ఆస్తులను, తెలంగాణలోనే ప్రఖ్యాతి  గాంచిన గద్వాల మట్టికోటను ప్రభుత్వానికి ధారాదత్తం చేసింది. ప్రస్తుతం ఈ కోటలోనే జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, పిజి సెంటర్, దేవాలయం ఉన్నాయి. డిగ్రీ కళాశాలకు ఈమె పేరిట మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ (మాల్డ్) డిగ్రీ కళాశాలగా పిలుస్తున్నారు.


• గద్వాల చీరలకు పునాదివేసారు మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ గారు.


గద్వాలనుండి కొన్ని కుటుంబాలను బెనారస్ పంపించి అక్కడ నేతపని శిక్షణ ఇప్పించి దానిలో కూడా గద్వాల ప్రత్యేక అంచుని తయారుచేయడానికి  బాటవేసింది రాణీ గారు.గద్వాల చీరకు అంత సొగసు పాపులారిటి ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు రాణి  గారికి వచ్చిన అలోచన కొత్తగా పట్టు+కాటన్ కలగలిపి చీరలు నేస్తే  ఎలాగుంటుందన్న అదే విషయాన్ని కంచి, బెనారస్ లోశిక్షణ తీసుకొచ్చిన 12 మంది చేనేతలతో మాట్లాడారు.కోటగుమ్మం డిజైన్ గద్వాలకు చిహ్నంగా కనిపిస్తుంది.ఈ ఆలోచన ఆదిలక్ష్మిదేవమ్మ గారిదే. 


• గద్వాల చీరల్లో మాత్రమే ఎందుకుంది ? 


చీరలు ఎందుకింత పాపులరైంది ? ఎందుకంటే రెండు రకాల వస్త్రాలను మిశ్రమంచేసి గద్వాలలో చీరలను నేస్తారు కాబట్టే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతిచీరకు బార్డర్ తో పాటు పల్లు అంటే కొంగు ఉంటుందని అందరికీ తెలిసిందే. మామూలుగా ఏ ప్రాంతంలో చీరలు నేసినా పూర్తి కాటన్ లేదా పట్టు లేదా ఏదో ఒకరకమైన బట్టతో మాత్రమే తయారవుతాయి.కాని గద్వాలలో మాత్రం బార్డర్, కొంగును పట్టుతోను మధ్యలోని చీరమొత్తాన్ని కాటన్ తో నేస్తారు.పట్టు+కాటన్ మిశ్రమంతో చీరలు నేస్తారు కాబట్టే దేశం మొత్తంమీద గద్వాల చీరలు ఎంతో ప్రత్యేకంగా  నిలుస్తున్నాయి. కాటన్+పట్టుతో కలిపి చీరను నేసే ప్రక్రియ దేశంలో గద్వాలలో తప్ప ఇంకెక్కడాకనబడదు. అందుకనే గద్వాల పట్టుచీరలు ఎంతో ప్రత్యేకం.1946 ప్రాంతంలో హైదరాబాద్ లోని అబిడ్స్ లో గద్వాల చీరల కోసమే మహారాణి ప్రత్యేకంగా షోరూమ్ ను ఏర్పాటు చేసారు. భర్త సీతారాంభూపాలుడి ద్వారానే అప్పటిదాకా అన్ని విద్యలలో ముందున్న గద్వాల "విద్వద్ గద్వాల"గా విద్యావంతులకు పండితులకు నిలయంగా మారాయి.ఆ విద్యలలో చేనేతలను పుట్టించి,ప్రోత్సహించిన గొప్ప కళా పోషకురాలు గద్వాల మహారాణి గారు.

.......

1663లో మహారాజా పెద్దసోమభూపాలుని పాలనతో ప్రారంభమైన గద్వాల సంస్థానం 1949లో శ్రీ మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ పాలనతో అంతమైంది. 1949లో జాగీరుల రద్దు తో రాజుల పాలనకు తెరపడింది. మూడు సంవత్సరాలు ప్రభు త్వ పాలనను చూసిన ఆమె 18-8-1953న దివంగతులైనారు. 25సంవత్సరాలు సాగిన రాణిగారి పాలనను ఇప్పటికీ ఎవ రు మరచిపోలేదు. కాని రాణి సేవలు, త్యాగాలు, గొప్పతనం ఎంతమందికి గుర్తుకు ఉందన్నది ప్రశ్నార్థకం.


• శ్రీవారికి ఏరువాడ జోడు పంచెలు....


బహుమానంగా పంపటం కూడా మహారాణి హయాంలోనే మొదలైందన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు ముందు వెంకటేశ్వరస్వామికి గద్వాల నుండి పట్టుతో నేసిన జోడు పంచెలు బహుమానంగా వెళ్ళటం దశాబ్దాలుగా ఆనవాయితీగా ఉన్నది. జోడు పంచెలను తయారుచేసే చేనేతలు ప్రత్యేకంగా దీక్ష తీసుకుని 41 రోజుల పాటు ప్రత్యేకమైన మగ్గంలోనే నేస్థారు. శ్రీవారికి నేసే జోడు పంచెల మగ్గాన్ని ఏడాది మొత్తం మీద దేనికీ వాడ కుండా ఉంచుతారు.మహారాణి వారసులు కొడుకు, కోడలు లతా భూపాల్ నేటికీ  ప్రతి ఏడాది గద్వాల నుండి జోడు పంచెలను నేయించి ప్రత్యేకంగా తిరుమలకు పంపుతూ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.


         🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

ఉడిపి హోటల్ తెలుసా...

 ఉడిపి హోటల్ తెలుసా...


ఉడుపి హోటల్ ఎందుకంత పేరు గాంచాయో తెలుసా....


ఇంట్లో మనం నలుగురికి లేదా 5గురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోండి.


మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు.అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి,,రెండవది బలరాముడు.ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి.

 

  దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది.ఉడిపిరాజైన నరేషుడు

  సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు. 


అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు.అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు.

మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.


అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది,

నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు.

 అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము.వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు  చెపుతాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది,50 లక్షల మందికి భోజనం వండటం

 అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది,అందరికీ భోజనాలు తయారుచేయమని చెపుతాడు.


50 లక్షల మందికి భోజనాలు వండాలంటే  

 భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం

 భీముడు కు ముఖ్యం.అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు.అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు.


నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న  సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేష్ ఎలా 

వండేవాడు అంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా,వృధాకాకుండా వండేవాడు.


రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది.

అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా 

వండేవాడు నరేశుడు.

ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు.

 ఇది ఎలా సాధ్యం?అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు,అది కూడా ఒక్క మెతుకు కూడా

 మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు.

 అసలు నరేశునికి ఎలా తెలుస్తుంది?

 ఈ రోజు  ఇంతమంది మాత్రమే చనిపోతారని,మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?..


ఇలా18 రోజులు గడిచిపోయాయి.పాండవులు గెలిచారు.పట్టాభిషేకం జరుగుతుంది.అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు.కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు.ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అంటాడు.


అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగాడు.

అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికి చెందుతుంది అని చెప్తాడు.

 అప్పుడు నరేష్ మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం.కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణుని కే చెందుతుంది అని చెప్తాడు.

  ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు.

  ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా

  కారణం అని నరేషుడుని అడుగుతారు. 

అప్పుడునరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు...


శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.నేను లెక్క పెట్టి పెట్టే వాడిని.

శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని...

 శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలుఅయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.. ఆంటే

 శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు.

  దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు.

  ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు.

  ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు.

ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు.

"హరిసర్వోత్తమ"

"వాయు ఉత్తమ*"

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

Monday, August 18, 2025

లోకం ఆగదు

 ఎవ్వరు లేకపోయినా ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకటం ఆపేద్దాం …


ఒక సిస్టమ్‌, ఆర్గనైజేషన్‌, రిలేషన్‌షిప్‌ ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్‌ చేయొచ్చు. 


‘నేను లేకపోతే ఈ కంపెనీ.. ఆఫీస్‌.. ఈ సంస్థ, ఈ ఇల్లు.. ఈ రాష్ట్రం.. ఈ దేశం.. ఏమైపోతుందో’ అని చాలామంది అనుకుంటూ ఉంటారు!


ఏం కాదు! అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. 

ఇంకా బాగా నడవవచ్చు కూడా ! 

కొత్తవారు కొత్త ఆలోచనతో రావచ్చు! 


మనలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు. 

మనకున్న అనుభవం, మనం ఆలోచించే విధానం, మన ఎనర్జీ - ఇలా ఎన్నో మంచి లక్షణాలు మన లో ఉండవచ్చు.


ఆ విషయంలో మన స్థానాన్నితాత్కాలికంగా ఎవరూ భర్తీ చేయలేకపోవచ్చు ! అంతమాత్రాన ఏమీ ఆగిపోదు! 


అయినా, మన టైమ్‌ బాగుండకపోయినా, దగ్గర పడినా అందరూ ఠక్కున పక్కన పెడతారు! అప్పటిదాకా మన పక్కన ఉన్న వాళ్లే, పక్క దారి పడతారు! 


ఎన్నో ఏళ్లు పనిచేసిన కంపెనీలో, సంస్థలో మన రిటర్మైంట్‌ రోజున బాగా భావోద్వేగానికి గురయి మాట్లాడుతూ ఉంటామ్!  అప్పటివరకూ సాధించిన వాటి గురించి గొప్పలు (గప్పాలు) చెబుతూ ఉంటాం! 

కానీ, ఇటు మన స్పీచ్‌ నడుస్తుంటే, మన యాక్సిస్‌ కార్డును, ఐడి కార్డును, ఇంకొకడు అప్పటికే డి-యాక్టివేట్‌ చేసేసి ఉంటాడు.


మరొకడు మన అఫీషియల్‌ మెయిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌ మార్చేస్తాడు. 

బ్యాంకు అకౌంట్ ఆథరైజ్డ్ సిగ్నేచర్ మార్చేసి బ్యాంకు కి అప్పటికే లెటర్పంపించేసి ఉంటారు! 


మన టేబుల్ మీద మనం పెట్టుకున్న దేవుడి ఫోటో తీసేసి వాళ్ళది పెట్టేసుకుంటారు! ఇవన్నీ సహజం! 


మనకు కాఫీ ఇచ్చే బాయో, బంట్రోతో అప్పటికే మన డెస్క్‌ ఖాళీ చేసి, అన్నీ మన కారులో పెట్టేసుంటాడు. 

మన తరువాత మన పోస్టులోకి వచ్చే వ్యక్తి, మన నేమ్ ప్లేట్ తీసేసి మన బ్యాగ్లో వేసేసి- “సార్ మీ నేమ్ ప్లేట్ తీయించి మీకు ఇస్తున్నాము సార్ ! గుర్తు గా వుంచుకోండి”అంటూ, అప్పటికే రెడీ అయిన తన నేమ్ ప్లేట్ ఫిక్స్ చేయించే ప్రయత్నంలో వుంటాడు!


మన  సహచర ఉద్యోగులు మనల్ని ఎంతో మిస్‌ అవుతున్నామని తెచ్చిపెట్టుకున్న కన్నీళ్లతో చప్పట్లు కొడుతూ ఉంటారు.


అదే సమయంలో మన తర్వాత ఆ కుర్చీలో కూర్చొనేవాడు మన పక్కనే బాధగా నిలబడి, మన  స్పీచ్‌ అయిపోగానే, ఆ సీట్లో కూర్చుందామని చూస్తుంటాడు. 

వీడ్కోలు పార్టీ అయిపోగానే అందరూ మనల్ని మర్చిపోతారు. అంతెందుకు, వీడ్కోలు మీటింగ్ మధ్యలోనే కొంత మంది శాలువా కప్పి చల్లగా జారుకుంటారు, అప్పటిదాకా ఉండవలసి వచ్చినందుకు బాధ పడుతూ! 


ఆ తర్వాత జీవితం అంతా ఇంట్లోనే!


ఆఫీస్‌ నుంచి ఎవరూ ఫోన్ చేసి మన  సలహాలు, సూచనలు అడగరు! వాటి కోసం ఎదురు చూడొద్దు. ఎవడూ రాడు. 

ఏదైనా సలహా కావాలంటే చాట్‌- జీపీటీని అడుగుతారు . ప్రపంచం ఎంతో వేగంతో పరుగెడుతోంది. 

కళ్లు మూసి తెరిస్తే అన్నీ మారిపోతాయి. 

పెద్ద పోస్టులో రిటైర్ అయిన వ్యక్తుల PA లు కూడా, ఆ సదరు రిటైర్ అయిన వ్యక్తి రిటైర్మెంట్ అయిన మరునాడు ఫోన్ చేసి ఏదైనా పాత విషయం అడగబోతే, ఆ సదరు “నిన్నటి సారు “ చెప్పే లోపే, “సార్!  పెద్ద సార్, కొత్త సార్ పిలుస్తున్నారు intercom లో! మళ్లీ పది నిమిషాలు ఆగి ఖాళీ అయ్యాక ఫోన్ చేస్తాను “ అని , ఇటు రెస్పాండ్ అయ్యేలోపే ఫోన్ కట్ చేస్తాడు! అది ఉద్యోగధర్మం! 

మనం తప్పు పట్టకూడదు! 

నిన్నటితో అతనిది ముగిసింది! 

ఈరోజు నుండి“పెద్దసార్“ 

మారాడు! ఇది కొంతవరకు జీర్ణించుకోవచ్చు! 


అదే పాత ప్రభుత్వంలో పదవి వెలగబెట్టిన ఏ ప్రజా నాయకుడో, ఏ సంస్థ కార్య నిర్వాహక సభ్యుడో అయితే ఈ అవకాశం కూడా లేదు! ప్రభుత్వం మారినా వెంటనే, మూటా ముల్లి సర్దుకోవాలి! పాత రికార్డ్స్ మనకు ఇబ్బంది కలిగించే డాక్యుమెంట్స్ ముందే సర్దుకోవాలి! 


మనం అందరం మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా? 

మన టైం అయిపోయింది! 

మనం మంచి పొజిషన్‌.. సక్సెస్‌లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటాం. 

తర్వాత అందరూ మర్చిపోతారు. 


‘నేనే లేకపోతే’ 

అని ప్రతి అత్తగారు అనుకుంటుంది. 

కానీ, కొత్త కోడలు వస్తుంది. 

ఆమెకంటే ఇల్లు బాగా చూసుకుంటుంది! ఇది 95% నిజం కూడా! 


కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే 

”ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం అనేది అవమానించడం కాదు. 

మనం చేయాల్సిన పనులు అక్కడ పూర్తయ్యాయని అర్థం. మిగిలిన జీవితం హాయిగా బతకాలి! ద్వేషాలు, వైషమ్యాలు విడవాలి! 


కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి . కొత్త సవాళ్లను ఎదుర్కోవాలి . పాత అలవాట్లని కొంతవరకు మార్చుకోవాలి! సర్దుకు పోటం నేర్చుకోవాలి! 

మనల్ని మనమే  గౌరవించుకోవాలి! తప్పదు మరి!


ఇంకా ఆఫీస్‌, పోస్ట్ నెత్తి మీద పెట్టుకుని మోయరాదు. పిల్లా, పాపలతో సరదాగా గడపటం నేర్చుకోవాలి! 


పవర్‌.. మనీ.. సక్సెస్‌.. జీవితాంతం ఉండవు. అవి వున్నప్పుడే, అవి లేనప్పుడు ఎలా బతకాలి నేర్చుకోవాలి.


‘నేనే లేకపోతే..’ అనే ఆలోచన వస్తే, ఒక్కటే గుర్తు పెట్టుకోండి. 


“నేనే” లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది… 

ఏదీ ఆగదు… 

పాత నీరు పోతూనే ఉంటుంది… 

కొత్త నీరు భర్తీ చేస్తూనే ఉంటుంది… 


ఎవరైనా వచ్చి మనల్ని పొగిడి “సార్! మీరు లేకపోతే “ అంటే, మనం వెంటనే అర్థం చేసుకోవాలి, వాడు మనల్ని మోసం చేస్తున్నాడని, వాడిని కూడా మోసం చేసుకుంటున్నాడని! 


ఇంత వయసు వచ్చి రిటైర్ అయ్యాక, ఈ మాత్రం maturity రాకపోతే, మనం ఇన్నాళ్లు బతికింది వృధా అన్న మాట! 


కొన్ని విషయాల్లో, కొంత సమయం తర్వాత, వదిలేయడంలో ఉన్నఆనందం పట్టుకొని వేళ్ళాడటంలో వుండదు!


మనం పట్టు వదలకపోతే, వాళ్లే వదిలిస్తారు! 


ఈ విషయంలో, నేటి తరంలో, మన పిల్లలే మన మాట వినరు! 

“మీ టైం అయిపోయింది, మీకేమి తెలియదు! 

మీరు ఊరుకోండి, అన్నిట్లోనూ వేళ్లు పెట్టకండి! మాకు తెలుసు, మేము చూసుకుంటాము! మేమూ పెద్ద వాళ్ళమయ్యాముగా “ అంటారు! 


వాళ్ళు ‘మేమూ పెద్దవాళ్లమయ్యాముగా’అనగానే, మనం మన పెద్దరికాన్ని పక్కన పెట్టి, పద్ధతిగా, పెద్దరికాన్ని కాపాడుకుంటూ పక్కకు తప్పుకోవాలి! 

లేదంటే మనల్ని మనమే చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది!


ఇది ఉద్యోగంలో నైనా, వ్యాపారంలో నైనా, వేరే దేనిలోనైనా, ఇంట్లో నైనా తెలుసుకొని మసలటం విజ్ఞుల లక్షణం! 

లేకపోతే అభాసుపాలవటం తధ్యం! ఇది మనకు చరిత్ర చెబుతున్న సత్యం!

Sunday, August 17, 2025

SON OF INDIA

 SON OF INDIA


(ఆగస్టు 18 సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా)


సుభాష్ చంద్ర బోస్ వీర విప్లవ స్వతంత్ర సమర యోధుడు. ఆయన పేరు వినగానే బ్రిటిష్ పాలకులకు వెన్నులో వణుకు పుట్టేది. మహాత్మా గాంధీ అహింసా పోరాటాన్ని సాగిస్తున్న తరుణంలో, బ్రిటిష్ పాలకులను ఒక్క అహింసా మార్గం ద్వారా ఎదుర్కోవడం సరి కాదని భావించి, సాయుధ పోరాటం ద్వారా అయుధంపట్టి బ్రిటిషర్లు ను దేశము నుండి తరిమి వేయ గలమని ఆయన నమ్మారు.


'దేశ భక్తి అంటే ఒక దేశాన్ని ద్వేషించి, మరొక దేశాన్ని ప్రేమించడం కాదు, దేశంలో ఉన్న ప్రజలందరినీ కుల, మతాల కతీతంగా ప్రేమించాలనే విషయాన్ని అక్షరాలా ఆచరించి చూపిన మహా మనిషి నేతాజీ. 1897 జనవరి 23న కటక్ లో జన్మించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నత విద్య నభ్యసించి ఇండియన్ సివిల్ సర్వీస్ కి ఎంపికయ్యారు. బ్రిటీష్ వారి క్రింద పనిచేయడం ఇష్టంలేక ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి 1921లో ఇండియాకి వచ్చారు. 1921 - 32 ల మధ్య భారత జాతీయ కాంగ్రెస్లో చురుకైన పాత్ర పోషించారు. అనంతరం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు పలు దేశాల్లో పర్యటించారు. స్వరాజ్ అనే పత్రికని నడిపారు. 'ది ఇండియన్ స్ట్రగుల్' అనే పుస్తకాన్ని రచించారు. 


1939లో భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో విభేదించి సొంతంగా 'ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్' పార్టీని స్థాపించారు. వజ్రాన్ని వజ్రంతో కోయాలనే సంకల్పంతో 'అజాద్ హింద్ ఫౌజ్' (ఇండియన్ నేషనల్ ఆర్మీ )ని ఏర్పాటు చేసి 


భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని పోరాటం చేసారు. 

"ఢిల్లీ చలో" అనే నినాదం ఇచ్చి, భారతీయ సైనికులను స్వతంత్ర పోరాటంలో పాల్గొనమని పిలుపునిచ్చారు.1945 ఆగస్ట్ 18న విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని భావిస్తారు. 


ఆయన మరణంపై 1956లో షానవాజ్ కమిటీని, 1970లో ఖోస్లా కమిటీని, 1999లో ముఖర్జీ కమీషన్ ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే ఈ కమిటీలేవి బోస్ మరణంపై సంతృప్తికరమైన వివరణలుఇవ్వలేకపోయాయి. జైహింద్ నినాదంతో తన సహచరులలో ఉత్తేజాన్ని నింపేవారు. ఆయన జన్మదినాన్ని 'దేశ్ ప్రేమ్ దివస్' గా జరుపుతారు. నేతాజీ స్ఫూర్తితో నేటి పాలకులు దేశంలోని పౌరులందరనీ కుల, మత, వర్గాల కతీతంగా సమానంగా చూడగల్గితే అదే బోస్ కిచ్చే నిజమైన నివాళి. 



తెలంగాణ పోరాట యోధుని కథ

 తెలంగాణ పోరాట యోధుని కథ


*సర్దార్ సర్వాయి పాపన్నగౌడ*

(రేపు పాపన్న పుట్టినరోజని రుజువులేమీ లేవు కాని, పాపన్న స్మరించుకోవడానికి ఒక సందర్భం)


సర్వాయి పాపన్న కథ:


తొలిసారి పాపని గురించి పాడిన పాట, జానపదుల నోట తర, తరాలుగా పాడబడుతున్న వీరగీతం, రాయలసీమ దత్తమండలాలకు(సీడెడ్ జిల్లాలకు) చెందిన పాలెగాండ్ల కుటుంబగాయకుడు బళ్ళారివాసి ఒక భట్రాజు పాడిన ఒక బాలడ్(జానపదగాథ) అని జేఏబోయెల్ తన వ్యాసంలో పేర్కొంటడు. తను సేకరించిన ‘పాపని’ జానపద వీరగీతంలో మాటల ఆధారంగా  పాపడు నాయుడు లేదా కాపు కులానికి చెందినవాడు అంటడు బోయెల్. పాడిన పాటలో పాపని వివరాలు సరిగా లేకపోయినా అతని తల్లిపేరు ‘సారమ్మ’ అని తెలుస్తున్నదని రాసాడు. 


ఆ పాట 

‘వస్తాడు తను సర్వయ్య పాపడు’ అని మొదలైతుంది. 

పాపడు తన కోరుకుంటున్నది, చేయాలనుకుంటున్నది తల్లికి చెప్పి, ఆమె దగ్గర సెలవు తీసుకుంటున్నపుడు

‘తల్లి కొలువుకు వడిగా వెళ్ళేను

తల్లికి దండముగ నిలిచేను

యేరు కట్టి వ్యవసాయము, అమ్మా

ఎంగిలి ముంత ఎత్తలేను

కొట్టుదును గోల్కొండ పట్టణం

ఢిల్లికి మోజూరునవుదును

మూడు గడియల బండారు గొట్టుదును

మూలకోట కందనూర సూచి

బంగారు కడియాలు పెట్టుదును’ అని పాపడంటే


‘మనకంత బంట్రోతు తన(0)మేలు

మన కులకై మానవద్దురా

సర్వయ్య పాప’ అని అడ్డుపడ్తది తల్లి. 


కాని, పాపడు తల్లి మాట వినక తనదారిన తాను యుద్ధసన్నద్ధాలు చేసుకున్నడు. కత్తులు, కైజారులు, బల్లేలు సమకూర్చుకున్నడు. యుద్ధానికి సిద్ధమైపోతున్న పాపడు

‘అడుగో పాపడు వస్తానుంటే

కుందేళ్ళు కూర్సుండపడేను

లేడిపిల్లలు లేవలేవు

పసిబిడ్డలు పాలుతాగరు

నక్కలు, సింహాలు తోకముడుచును’ 


  అరివీరభయంకరుడుగా కనిపించాడు. పాపడు తన నేస్తులను కలవడానికి తాళ్ళల్లకు పోయిండు. దోస్తులకు ధైర్యం తేవాలని తొలుత ‘దోచుడు’ యుద్ధపద్ధతిని ఎంచుకున్నడు. దోచుడంటే గొప్పతనంగ అనిపించకపోవచ్చు. కాని, స్థానికంగా తనకు అనువైన తొవ్వ. బోయలు ఇటువంటి పనులు చేయడానికి ముందు మంచిగ తాగకుండ మొదలుపెట్టరు. పాపడు మామూలు తాగుబోతు కాదు. తన తీరు వేరు.


‘పాపడు తాగేటి కల్లు

యే తాటి యే తాటి కల్లు 

వేలు పెట్టితే వేలు తెగును

దివిటీ పెట్టితె భగ్గున మండును

తాగేటప్పుడు తీయగ వుండును

తాగినవాణ్ణి లేవనివ్వదు

లేచినవాని పోనివ్వదు’


 ఈ గ్రామీణ ఇతిహాసాన్ని పల్లెటూరి యువతీ యువకులు పాడుకునే గీతాలతో పోల్చుకోవాలి.


ఈ కింది పాట మోటకొడ్తూ ఒక యువకుడు పాడుకున్నది

‘యేగి యేగి యెండలైన

యేడూరు గుమ్మి నీడలైన

దూడవాడు మొగడైన

వుండవలె కొండ నడుమ


యెదురింటి యెర్ర పాప

సూతుమన్న కానరాడు

పాపిష్టి తల్లిదండ్రి

బైలెల్ల నివ్వరు


యెత్తు గుబ్బలు యెర్రదాన్ని

కోరగుబ్బలు యెవ్వని పాలు

ఆలు లేని బాలునికి

ఆరు నెలల అరణం ఇస్తు


గుబ్బలుండే తీరు సూచి

గుద్దికొంటె తీరునంటె

గుండెగల బంటు అయితె

గుండ్లపల్లి కనమకురా’... 

పాపని చూసి మోజుపడ్డ పడుచుదాని పాట ఆ రైతు పాడిన జానపదశృంగారగీతంలో నాయకుడు పాపన్న.

(Ed.JAS Burgess - Indian Antiquary,Vol.III(1874), Telugu Ballad Poetry-JA Boyle,p.1-6)


జానపద రచనల్లో వీరగుణ స్పోరకమైనది సర్వాయి పాపని కథ అంటాడు హరి ఆదిశేషువు(జానపదగేయ వాఙ్మయపరిచయము-59పే.)


 పాపన్న పుట్టింది పులగాము. పెరిగింది తాటికొండ. గవండ్ల కులం. ఇంటిపేరు నాసనోళ్ళు. హసేన్, హుసేన్, తుర్క రహిమాన్, దూదేకుల పీరు సాబ్, నక్కల పెరుమాండ్లు, నెల్లూరి హనుమంతు, చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందులు నేస్తగాళ్ళు.


 పాపనియొక్క పేరు చెప్పితే 

 వూరపిచ్చిక పొలం చేరదు

 పొట్టిపిచ్చిక వూరు చేరదు

 కౌంజులూ కారాడుతూండు

 నక్కలు నాట్యాము త్రొక్కు...

పసిబిడ్డలు పాలుతాగరు

గుర్రాలు గుగ్గిళ్ళు తినవు

యేనుగూలు మేతాదినావు...

    వాడిపేరంటే....

 ఢిల్లీ దర్బారొణుకు, గోలుకొండబస్తీలొణుకు

 కడపజిల్లా తొణుకురా, వాడిపేరంటే

 కందనోలు మాలుతొణుకురా వాడిపేరంటే

 మైసూరు జిల్లాలొణుకురా వాడిపేరంటే

 చెన్నాపట్టణము వొణుకురా వాడిపేరంటే... అంతటా దడ దడే.

చిన్నపుడు చెట్టునీడ నిద్రపోతున్న తనకు ఎండ తగులకుండ పన్నెండు శిరసులనాగు పడగలగొడుగు పట్టిందని, పాముపడగపట్టినవాడు యేడుగడియలు రాజైతడని బ్రాహ్మణులు జాతకం చెప్పిండ్రని, ఇది తన బాల్యంలో జరిగిందని చెప్పిన గాధని నమ్మిండు పాపన్న. కులకస్పె పాటించలేదు. గౌండ్లవృత్తిని చేపట్టలేదు పాపన్న. దానితో ‘ఊరుకొట్టితే ఫలమేమి, పల్లెకొట్టితే ఫలమేమి, కొడ్తె గోలకొండనే కొట్టాలె’ననుకున్నడు.


 దోస్తులతో పంతంకట్టి చెడతాగి, ఒళ్ళుమరిచి దారిలొస్తున్న పాపనికి ఎదురైన ఎరుకల నాంచారిని బుట్ట దింపించి గద్దెచెప్పుమన్నడంట. 


 నాంచారి ‘యేడుగురి పెండ్లాలతోను, పన్నెండుమంది లంజలతోను

 ఏనాటపిల్లతోను, బోగమోరి కన్యతోను

 పొలకినెక్కే పంతమున్నాది ఓరాయుడా, 

 గోలుకొండ ఏలడాన్కి పంతమున్నాది

 ఓరాయుడా, నీకు పంతామున్నాది’ అని చెప్పిందంట గద్దె. 


గద్దె చెప్పిన నాంచారినే గుంజుకొచ్చి, కోడలని తల్లికి అప్పజెప్పిండంట. మైకాన ఉన్న పాపన్న తల్లిని ‘గోలుకొండ కొట్టెతానికి పైకం కావాలె, కల్లమ్మి దాచిన పైసలియ్య’మని సీతబాధలు పెట్టిండట. దాచిన ధనం జాడలు చెప్పి అంత దోచిపెట్టిందట సర్వమ్మ. ఇది చాలదు ఇంకా కావాలె అంటే ఎల్లమ్మ గుడిల యేడు కొప్పెర్ల ధనమున్నదని చెప్పిందట ఆ తల్లి.


 గుడికొస్తున్న పాపన్నను చూసి ఎల్లమ్మే పారిపోబోయిందంట. ఎల్లమ్మను పట్టుకుని ‘ఏడుదున్నలు కావలెనా, ఏటపోతులు కావలెనా’ అని అడిగితే, ఆ దేవత ‘అవన్నీ వద్దు పాపన్నా’ అని ధనం జాడ చూపిందట. ఆ ధనమంతా ఎత్తుకుని పాపన్న పన్నెండువేల రాణువను కూడగట్టుకున్నాడట. గోల్కొండ నవాబుతో యుద్ధం చేసి, గెలిచి యేడు గడియలు గోలుకొండ తఖ్తునెక్కినాడు పాపన్న. వరం నిజమైంది. 5లక్షల దండున్న నవాబు పాపన్నను దెబ్బతీసిండు.  పగవాని చేతిలో చచ్చుడు నచ్చని పాపన్న బాకు నెగరేసి ఎదనెదురిచ్చి వీరమరణం పొందినాడంట.1(జానపదగేయ వాఙ్మయపరిచయము-59-60పే.)


 ఈ పాపనికథలో అతిసామాన్యుడు ఒక మహారాజు గద్దెనెక్కడమనేది వీరోచితగాథే. ఏ రాజవంశంవాడు కాడు, రాజోచితమైన వారసత్వం లేదు తనకు. ధనవంతుడు, విద్యావంతుడు కాడు తాను. జనంలోని మనిషి. అందుకనే తమలోనివాడు, తమలాంటివాడు సర్వాయి పాపన్నంటే ప్రజలకు ఇష్టం.  సర్వాయి పాపన్న గాథంటే ప్రజల కథే. జానపదుల కథే. అందుకే పాపన్నది జానపదవీరగాథ. పాపన్న ప్రజలవీరుడు.


పాపన్న చరిత: 

 

 తాటిగొండ(తరిగొండ)లో పుట్టి పెరిగిండు పాపన్న. కల్లుగీత కులవృత్తికి చెందిన పాపన్న తాను గౌండ్లపని చేయనని తల్లితో చెప్పిండు. కొడితే గోల్కొండ కోటనే కొడతగాని, నడుముకు ముస్తాదు కట్టనన్నడని జానపదగీతాల్లో వుంది.(1870). గౌండ్లు నాయకత్వాలకు సరిపోతరని, అధికారం చెయ్యగలరని, ఒక్క గౌండ్లపని ఎన్నో కులవృత్తులకు ఆధారమౌతుందని అనేటోడు.


 పాపన్న గురించి ఖాఫీఖాన్ అనే చారిత్రక సమాచార సేకర్త... అధికారిక నివేదికల ఆధారంగా, తను రాసుకొన్న వార్తలవల్ల.. పాపన్న చరిత్ర వివరంగ తెలుస్తున్నది.


 1690ల తరవాత తన అక్కదగ్గర వున్న ధనాన్ని దోచుకున్నాడు పాపన్న. ఆ డబ్బుతో కొంతమంది అనుచరులను సమకూర్చుకున్నడు. తరికొండగుట్టమీద ఒక కోట కట్టుకున్నడు. పెద్ద దారులమీద దారిదోపిడీ మొదలుపెట్టిండు. హైదరాబాదు వరంగల్ నడుమ తిరిగే వ్యాపారులను దోచిండు. పాపని పనుల గురించి స్థానిక ఫౌజిదారులకు, జమీందారులకు వ్యాపారులు ఫిర్యాదుచేసి, చెప్పుకునేవారు. వాళ్ళ వత్తిడివల్ల పాపన్న తరిగొండను వదిలి అక్కడికి 110మైళ్ళ దూరంలో వున్న కౌలాసుకు పోయి స్థానిక జమీందారు వెంకటరావు వద్ద చిన్న దళానికి నాయకుడుగా కొలువుకు కుదిరిండు.(కొంతకాలం ఎల్లందల(ఎల్గందల?) జమీందారు కొలువులో సైనికోద్యోగిగా వుండుకుంట జమీ ప్రజలను వేధించడం వల్ల జమీందారు పాపన్నను ఖైదు చేసిండు... ఆంధ్రుల చరిత్ర-బీఎస్సెల్ హనుమంతరావు, పేజి సం.465) మళ్ళీ పాతతీరు ఆలోచనలతో మళ్ళీ దండుబాటలమీద చోరీలు చేసిండు. వెంకటరావు తనని బంధించి జైల్లో పెట్టాడు. తమ కుమారుని అనారోగ్యాన్నుంచి తన జాలి, దయలు కాపాడుతాయని నమ్మి జమీందారు భార్య కొన్నినెలల నిర్బంధం తర్వాత అందరు ఖైదీలతోపాటు పాపన్నను విడుదల చేయించింది.


 1701లో వెంకటరావు మొఘలుల అధికారపాలకులలో ఒకడైండు. తన హోదా మారింది. జమీందారు నుంచి మన్సబుదారైండు. తనకింద 500మంది అశ్వికులు, 2వేలమంది కాల్బలంతో హైద్రాబాద్ లోని ఉప పరిపాలకుని కింద 200 అశ్వికులకు అధికారిగా పనిచేసే హోదా దక్కింది.


 పాపన్న తన పాతపద్ధతుల జీవితాన్నే గడుపుతున్నడు. తరిగొండకు కొన్ని మైళ్ళ దూరంలో వున్న షాపూర్లో మకాంపెట్టిండు. పెద్దసంఖ్యలో అనుచరులను సమకూర్చుకున్నడు. ఆ అనుచరులలో సర్వన్న ఒకడు. ఇద్దరు మంచి స్నేహితులు. షాపూర్లో ఇద్దరు మంచి వ్యూహాత్మకమైన కోటను కట్టించిండ్రు. ధనవంతులను కొల్లగొట్టి వచ్చి వుండడానికి మంచి నెలవైంది షాపూర్ కోట. మొఘల్ అధికారులు, స్థానిక పెద్దలు పాపాన్న మీద దృష్టిపెట్టిండ్రు. వ్యాపారులు, అన్ని వర్గాలనుంచి గౌరవనీయులైన పెద్దలు న్యాయాన్ని అర్థించడానికి ఔరంగజేబు కొలువుకే వెళ్ళిండ్రు. హైదరాబాదు సుబేదారును వెంటనే చర్య తీసుకొమ్మని ఆదేశించిండు. అతడు కొలనుపాకలో వున్న ఫౌజీదారును పాపని సంగతి తేల్చుమని ఆజ్ఞాపించిండు. ఫౌజ్దార్ ఖాసింఖాన్ అనే ఆఫ్ఘన్ ను పాపని అనుచరులలో ఒకడు కొలనుపాక పరిసరాల్లో కాల్చిచంపాడు.


 1702లో సుబేదార్ రుస్తుం దిల్ ఖాన్ షాపూర్లోని పాపనికోటను ముట్టడించిండు. రెండునెలల పోరు తర్వాత పాపడు, సర్వన్నలిద్దరు తప్పించుకునిపోయిండ్రు. రుస్తుందిల్ ఖాన్ కోటను ఫిరంగులతో కూల్చి వాపసు పోయిండు. పాపన్న, సర్వన్నలిద్దరు ఖిలాషాపూరుకు తిరిగివచ్చి అనుచరులను కూడగట్టుకుని, కోటను బాగుచేయించాండ్రు. పాపన్న పేరు ప్రఖ్యాతులు చుట్టుపక్కల జిల్లాల్లో వ్యాపించినయి. పాపన్న పునరుత్థానం గురించి రుస్తుంకు తెలియనే లేదు. పాపన్న అనుచరులలో సర్వన్న, పుర్దిల్ ఖానులిద్దరు తగువు పెట్టుకున్నరు. దానితోని పాపన్న ఒక్కడే తన ఉద్యమానికి నాయకత్వం వహించిండు. చుట్టుపక్కల కోటలను గెలువడం మొదలుపెట్టాండు. తనదారిన తాను పాపన్న ఇపుడొక యుద్ధప్రభువు. రెండేండ్లలో పాపన్న మధ్య తెలంగాణాలో విక్రమించిండు. పాపన్న భయంతోని 1702-04లలో హైదరాబాదుకు వ్యాపార బిడారులే రాకుండ పోయినయి.


 1703మే, 1705 డిసెంబరు మధ్యకాలంలో రుస్తుందిల్ ఖాన్ హైదరాబాదు నుంచి దూరం పంపించి వేయబడ్డడు. 1706 మొదట్లో మళ్ళీ హైదరాబాదుకు వచ్చిండు. చక్రవర్తి అభిమానం  తిరిగి పొందడానికి ప్రయత్నించాలనుకున్నడు. అదే సంవత్సరం మేలో మరొక సుబేదారు రిజాఖానుకు తెలంగాణాలో బందిపోట్ల గురించి డచ్ వారు ఫిర్యాదు చేసారు. ఖాఫీఖాన్ నివేదికల్లో రుస్తుందిల్ ఖాన్ సాహసవంతుడైన సైనికుణ్ణి  పాపని శిక్షించడానికి నియమించుకున్నడని వుంది. రెండవసారి కూడ పాపనిమీద దాడి విఫలమైంది. సర్వాయి పాపన్నను బందిపోటుగా భావించి అణచడానికి బందిపోటును వాడుకోవాలనుకోవడంలోనే హైద్రాబాద్ అంతర్గత భద్రత ఎంత లోపభూయిష్టంగా వుందో అర్థమైపోతుంది. ఒక సంవత్సరం తర్వాత 1707లో రుస్తందిల్ ఖాన్ మళ్ళీ చక్రవర్తి సైన్యాలతో తానే స్వయంగా పాపని మీద దాడికి బయల్దేరిపోయాడు. 2,3నెలలపాటు యుద్దం జరిగింది. చివరిలో పాపన్న ఇచ్చిన డబ్బుసంచులతో రుస్తుందిల్ ఖాన్ చల్లబడ్డడు. సైన్యాలు వెనుదిరిగిపోయినయి.


 ఇది పాపన్నకు ధైర్యాన్నిచ్చింది. 1708లో పాపన్న, అతని అనుచరులు వరంగల్ కోటమీద దాడికి నిర్ణయించింరు. కాకతీయుల కాలంలో నిర్మించిన కోటను, బహమనీలు, కుతుబ్షాహీలు మరింత పటిష్టపరిచిండ్రు. వరంగల్ అప్పట్లో గొప్ప వ్యాపారకేంద్రం. తివాచీల వ్యాపారం అంతర్జాతీయంగా నడుస్తోంది. వరంగల్లును స్వాధీనం చేసుకోవడం చాలా అవసరం అనుకున్నడు పాపన్న. 1707 ఫిబ్రవరిలో ఔరంగజేబు మరణించిండు. రాజ్యపాలన సంక్షోభంలో పడిపోయింది. ఔరంగజేబు పెద్దకొడుకు తన తమ్ముళ్ళలో ఒకనిని చంపివేసిండు. తను కిరీటం ధరించి బహదూర్ షా పేరుతో  మొఘల్ చక్రవర్తిగా ప్రకటించుకున్నడు. తమ్ముడు కాంబక్షుకు హైద్రాబాదు, బీజాపూరుల పాలకుడుగా కానుక ఇచ్చిండు. దానిని తిరస్కరించి కాంబక్ష్ తనను తాను 1708 జనవరిలో గోల్కొండ ప్రభువుగ ప్రకటించుకున్నడు. 


ఇది అన్నాదమ్ముల సవాల్ గా మారిపోయింది, ఈ సందర్భాన్ని పాపన్న గమనంలోకి తీసుకున్నడు. నిరీక్షించిండు. మొహర్రం రోజున  అందరు పీరీలపండుగలో మునిగివుండంగ వరంగల్ కోట మీద గెరిల్లా దాడి చేసిండు పాపన్న. అది 1708 ఏప్రిల్ 1వ తేది. ముందురోజు అనగా మార్చి31న 3వేలమంది కాల్బలం, 500మంది అశ్వసైన్యంతో కోటగోడలవద్దకు చేరుకుని కాపుగాచిండు పాపన్న. కొంతమంది సైన్యం దారులను మూసి కాపుకాసి వుండంగ, కొంతసైన్యం తాళ్ళతో కోటగోడలమీదికి చేరుకున్నరు. కోటతలుపులను బద్దలుకొట్టి సైన్యంతో పాపన్న వరంగల్లు కోటలోనికి చొరబడ్డడు. రెండు, మూడు రోజులు పాపన్న సైన్యం దుకాణాలనుంచి, వ్యాపారుల నుంచి, వరంగల్ వాసుల నుంచి పెద్ద ఎత్తున ధనం, వస్త్రాలను తీసుకున్నారు. వేలమంది ఉన్నత వ్యక్తులను ఖిలాషాపూరుకు తీసుకువెళ్ళి కోటలోపల నిర్బంధించాడు. తీసుకువెళ్ళిన వారిలో స్త్రీలు, పిల్లలు, వరంగల్ న్యాయాధీశుడు, అతని భార్యాపిల్లలు కూడ వున్నరు. వాళ్ళందరిని నిర్బంధించి, కావలసినంత ధనసేకరణ చేసుకున్నడు పాపన్న. సంపాదించిన ధనంతో పాపన్న సైన్యానికి అవసరమైన ఆయుధసంపత్తిని సమకూర్చు కున్నాడు. 700ల డబుల్ బ్యారెల్ మస్కట్లు, డచ్, ఇంగ్లీషు వ్యాపారుల దగ్గర కావలసిన యుద్ధ సామగ్రిని కొనుక్కున్నడు. ఈ విజయంతో పాపన్న రాజు హోదాను పాటించిండు. పల్లకీసేవలు, రాజు ప్రత్యేకసైన్యం, ప్రత్యేకంగా గుర్రం వుండేయి.


 బంజారాలను బంధించి వారి పశువులను, మనుష్యులను తన పొలాలను దున్నడానికి నియోగించిండు.  దాదాపు పది నుంచి పన్నెండువేల పశువులను ఇందుకు వాడుకున్నడని చరిత్ర. జమీందారుల నుంచి గుంజుకొన్న భూములను, బంజరుభూములను పెద్ద ఎత్తున సాగులోనికి తెచ్చిండు పాపన్న. తెలుగు నాయక హోదాను పొందిండు పాపన్న. వరంగల్లు గెలుపుతో ఉత్సాహం పొందిన పాపన్న భువనగిరికోటను స్వాధీనం చేసుకున్నడు. అది కూడా వరంగల్ దాడికి ఎన్నుకున్నట్లుగానే మహమ్మదు ప్రవక్త జన్మదినం(1708 జూన్ 1) నాడు భువనగిరికోట మీద దాడిచేసి గెలుచుకున్నడు. ఎంతో మందిని బందీలుగ పట్టుకున్నరు. ఆడవాళ్ళను వదలడానికి వెండినాణాలు, పెద్దింటి స్త్రీలకైతే బంగారు నాణాలను అడిగిండ్రట. 


  అనేక కారణాలవల్ల మొఘల్ అధికారులు పాపన్నను కట్టడి చేయలేకపోయిండ్రు.

 1709 జనవరిలో బహదూరుషా గోల్కొండరాజు కాంబక్షు మీద దాడికి బయల్దేరిండు. హైద్రాబాద్ బయట రెండుసైన్యాలు తలపడ్డయి. గాయపడ్డ కాంబక్షు యుద్ధంలోనే మరణించిండు. బహదూరుషా ప్రజలసభలో (దర్బారు) డచ్ వాళ్ళిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న మాటను ‘బందిపోటు సర్వాయిపాపడు’ అని చెప్పిండు.  చక్రవర్తి నుంచి గుర్తింపు కోరుతూ పాపన్న 14లక్షల రూపాయలను, ఆహారధాన్యాలను నజరానాగా పంపిండు. బదులుగ చక్రవర్తి పాపన్నకు తలపాగా పెట్టి సన్మానించిండు. ఇంతకు ముందెన్నడు ఎవరికి  జరుగని ఆదరం  సర్వాయి పాపన్నకు జరిగింది. 1687 నుంచి ఇట్లాంటి ప్రజాదర్బారు జరగలేదు. ఏ స్వతంత్ర నాయకునికి ఇటువంటి గౌరవం దక్కలేదు.


 కాని, పాపన్న మీద షా ఇనాయత్ వంటి ముస్లిం కులీనులు ఇచ్చిన ఫిర్యాదుల కారణంగ చక్రవర్తి వెంటనే పాపన్నను నిర్మూలించమని కొత్తగా నియమించిన హైద్రాబాద్ పాలకుడు, యూసుఫ్ ఖాన్ ను ఆదేశించిండు. అతడు ఆ పనికి తన సహచరుడైన ఆఫ్ఘన్ దిలావర్ ఖాన్ ను నియోగించిండు.


 చక్రవర్తి సన్మానం తలకెక్కిన పాపన్న తన రీతిలోనే పాతపద్ధతులలోనే పాలనను, యుద్ధాలను సాగించిండు. 1709 జూన్ లో పొరుగు భూస్వామి కోటను ఆక్రమించిండు. దిలావర్ దాడి గురించి తెలిసిన పాపన్న తనదాడిని మధ్యలోనే ఆపుకుని, ఖిలాషాపూరుకు తిరిగివచ్చిండు. పాపన్న బంధించి వుంచిన వారి తిరుగుబాటు పెరిగిపోయింది. వారిలో పాపన్న భార్య సోదరుడు ఒక ఫౌజీదారున్నడు. అతని ఆధ్వర్యంలో ఖైదీలు ఊచలు కోసి బయటపడ్డరు. తన కోటనుంచి తాను బంధించిన వారిచేతుల్లోవున్న తన ఫిరంగుల గుండ్లను ఎదుర్కోవల్సి వచ్చింది.  అప్పటికే అక్కడికి చేరిన దిలావర్ సైన్యాలతో తలపడ్డం వ్యూహాత్మకంగా తగదనుకున్న పాపన్న తన వెంటవున్న సైన్యంతో తరికొండకు వెళ్ళి దాచుకున్నడు. ఇది తెలిసిన యూసుఫ్ ఖాన్ మరికొంతమంది సైన్యాన్ని తరికొండకు పంపించిండు. దిలావర్ ఖాన్ తాను పాపన్న ధనాన్ని వెతకడంలోనే మునిగిపోయిండు.


 పాపన్న దొరకలేదు. నెలలు గడిచిపోయినయి. యూసుఫ్ ఖానే స్వయంగా పాపన్నమీద దాడి చేయాలనుకుని పదివేల ఫిరంగులతో, ఇరవైవేల కాల్బలంతో బయల్దేరిండు. తరికొండలో కూడా పాపన్న నెలలపాటు మొఘల్ సైన్యాన్ని నిలువరించిండు. పాపని అనుచరులకు దిలావర్ ఖాన్ లంచం ఆశచూపిండు. చాలామంది లొంగిపోయిండ్రు. పాపన్న దగ్గర తుపాకీ మందు అయిపోయింది. ఇక యుద్ధం సాగించలేననుకున్న పాపన్న మారువేషంతో తరిగొండకోటనుంచి బయటపడ్డడు. కాలికి తుపాకీగుండు గాయమైంది. రెండురోజులు ఒంటరిగా ఎవరికీ తెలియకుండ ప్రయాణం చేసి ఆఖరికి హుసనాబాదు చేరుకున్నడు. అక్కడొక కల్లుదుకాణంలో తలదాచుకోవడానికి ప్రయత్నించిండు. కాని, తనను గుర్తించిన దుకాణాదారుడు బయటకు వెళ్ళి 3వందలమంది సైన్యంతో వున్న ఫౌజీదారుని తోలుకొచ్చిండు. వచ్చినవాడు తాను నిర్బంధించిన తనభార్య సోదరుడే. పాపన్నను బంధించి ఖిలాషాపూరులోనే ఖైదు చేసిండ్రు. ఎన్నో రోజులు పాపన్నను తన ధనం జాడలు చెప్పమని ప్రశ్నించి నరికిండ్రు. పాపన్న తలను బహదూరుషా దర్బారుకు పంపించిండ్రు. మొండాన్ని  హైద్రాబాదులో ద్వారంమీద వేలాడదీసిండ్రట.


పాపన్న సాంఘిక బందిపోటా? 

 ఒక తెలంగాణా గౌడు, తాటిగీతకార్మికుడు, పాపన్న కథ ఎన్నో ప్రశ్నలు వేస్తుంది మనల్ని. చివరికాలంలో ఎక్కడైనా,  ఎప్పుడైనా ఎందుకున్నడు పాపన్న?. ఎందుకు తన స్వంతభార్యే తనకు ద్రోహం చేసింది? తన కులంవాడే తననెందుకు పట్టించిండు. తనను సమర్థించినవారెవరు? వ్యతిరేకించినదెవరు? కులము, ధనము తనను కాపాడినవ?


 రైతుల తిరుగుబాటుదారుల తులనాత్మక అధ్యయనంలో సాంఘికబందిపోటు అన్నమాట చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్ బామ్ సూత్రీకరించిండు. రాజ్యము, భూస్వామి రైతును నేరస్తుడన్నపుడు రైతు తిరుగబడుతడు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటడు. రైతులతోనే ఆ రైతున్నపుడు వారతన్ని నాయకుడిగా చూస్తరు. అతడే సాంఘిక బందిపోటుగా చూడబడ్తడు. అతనిని కీర్తించే జానపదుల వీరగాథలు తయారవుతయి. వాళ్ళనే హాబ్స్ బామ్ ‘నోబుల్ రాబర్స్’ అంటడు. వాళ్ళు నేరస్తులు కాదు. వాళ్ళు ఉద్యమకారులు. తిరుగుబాటుదారులు. కాని వాళ్ళు ప్రవక్తలు కారు. ఆదర్శవాదులంతకన్నా కారు. ఆర్థిక సంక్షోభ సమయాల్లో, ప్రజాపాలనారాహిత్య కాలాల్లో, రైతుల వంటి వారు అనేక సమస్యల నేపథ్యంలో తిరుగుబాటు లెక్క వస్తరు. వారికి వ్యాపారమార్గాలు ఆర్థికసంపత్తిని సమకూర్చే వనరులు. ధనవంతుల ఖజానాలు వారికి అవసరమౌతయి.


 జానపదగీతాలు గ్రామీణుల జీవనాన్ని పాపన్నను హీరోగా గీతించినయి. 1700ల ప్రాంతంలో ఏర్పడ ఆర్థిక అనిశ్చితి, సామాజిక భద్రతా లోపాలు పాపన్నవంటి నాయకుణ్ణి పుట్టించినయి. పాపన్న గొప్పవీరుడే కాని, తాను తీసుకున్న కార్యక్రమమేది సామాజికమైంది కాదు. ఆదర్శాలేమి లేవు. గ్రామీణ రైతాంగం నుంచి వచ్చిన పాపన్నను ఆయన కులంతో కీర్తిస్తున్నరు. కాని, పాపన్న సాంఘిక పునాది ఏది?తనను బలపరిచింది ఎవరు? పాపన్న కథను ఏ కులం గుర్తించలేదు. తన ఉద్యమాన్ని కులంతో కలిపి చెప్పలేదు పాపన్న. జానపదగీతాల్లోకెక్కిన పాపన్న కథమాత్రం అన్ని కులాలవాండ్లు పాడుకుంటున్నరు. 1974లో జానపదగాయకుడు, జీన్ రోఘైర్ గుంటూరు జిల్లా కోస్తాప్రాంతంలో పాపన్న గురించిన ఒక జానపదగీతాన్ని రికార్డు చేసిండు. జె.ఏ.బాయిల్ బళ్ళారి జిల్లాలో మరొకపాటను రికార్డు చేసిండు. పాపన్న దాడిచేయాలనుకున్న కోటలన్నీ తెలంగాణాలోనివే. నెల్లూరు, కడప జిల్లాల్లో, దక్షిణ కర్ణాటకలో మలబారుతీరంలో కూడా దాడులు చేయాలనుకున్నాడట. దక్షిణతెలంగాణా నుంచి సుదూరాలకు వెళ్ళిన పాపన్న కథ ఉత్తరతెలంగాణాలో వ్యాపించలేదు.


 వేల్చేరు నారాయణరావు ‘గొప్పగా చదువుకున్న పండితులు, సాహిత్యకారులు పాపన్నను ఆదర్శ హిందూ యోధుడుగా, ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడిన వాడిగా చరిత్రలో నిలిపే ప్రయత్నం చేసారు. పాపన్న కథను అందరు అంగీకరించివుంటే అదొక పురాణమయ్యేది.’ అని రాసిండు.


 మౌఖిక జానపద వీరగాథలు, ఖాఫీఖాన్ రచనలే పాపన్న చరిత్రకు సాక్ష్యం. హిందూ యోధుడుగా పాపన్న చేసిన యుధ్దాలేవి?. దారులు కొట్టినపుడు పాపన్న ధనవంతులైన స్త్రీలనే (హిందూ, ముస్లింలు) లక్ష్యంగా చేసుకున్నడు. వ్యాపారులు, అన్ని వర్గాల గౌరవనీయులు తన గురించి ఔరంగజేబుకు ఫిర్యాదు చేసిండ్రు. పాపన్నను అణిచివేయడానికి ముందు వెనకముందులాడిన హిందూనాయకులు తర్వాత తమ సైన్యాలను పాపన్న మీదికే పంపించిండ్రు.


 1909, 1931లలో అచ్చయిన పాపన్న వీరగీతాలలో అతని దగ్గరి అనుచరుల పేర్లు తెలుస్తున్నయి. వారిలో హసన్, హుస్సేన్, తుర్క ఇమామ్, దూదేకుల పీర్, కోత్వాల్ మీర్ సాహిబ్, హనుమంతు, చాకలి సర్వన్న, మంగలి మానన్న, కుమ్మరి గోవిందు, మేదరి వెంకన్న, ఎరుకల చిట్టేలు, జక్కుల పెరుమాండ్లు, యానాది పాసేలు వున్నారు. అందులో 5గురు ముస్లింలున్నారు. 5గురు కులహిందువులు, మిగతా గిరిజనులు వీరితో తాను హిందూరాజ్య పోరాటం చేసిండని చెప్పడం కష్టం. పాపన్న ముఖ్య అనుచరులు సర్వన్న, పుర్దిల్ ఖాన్లు. పాపన్నతో వీరంతా తెలంగాణలోని సామాజిక నిమ్నస్తరాలవాళ్ళే. భూమిలేని పేదలే.


 పాపన్న కోటనిర్మాణంలో పాల్గొన్నది, భూములు దున్ని వ్యవసాయం చేసిన వాళ్ళంతా పేదలే, పేదరైతులే. గ్రామీణ శ్రామికవర్గం ఎంతగా తనకు మద్ధతిచ్చారో అర్థమవుతుంది. ఒకప్రాంత రైతాంగప్రజలు ఎంత గాఢంగా తనను కోరుకున్నారో తెలుస్తుంది. పాపన్నను వ్యతిరేకించింది ధనవంతులైన వ్యాపారులు, కులీనులు, మిలిటరీ అధికారులు. జమీందార్లు కూడా పాపన్నను వ్యతిరేకించిండ్రు. అప్పట్లో ఫౌజ్దార్ల అధికారాలు తగ్గించిబడ్డయి.

యూసుఫ్ ఖాన్ తరిగొండలో పాపన్నతో తలపడ్డప్పుడు జమీందార్లు తమ సైన్యాలతో వచ్చి మొఘల్ సైన్యానికి  బాసటగా నిలిచిండ్రు. పాపన్నను నిర్మూలించడమే వారి లక్ష్యం. తమకు పోటీగా పాపన్న జమీందారు హోదాను పొందడం వారికి నచ్చలేదు. మొఘల్ దర్బారులో చక్రవర్తి చేత తలపాగా ధరింపచేస్కుని చట్టబద్ధమైన పాలకుడుగా గుర్తింపబడడం వారికి సహింపరానిదయింది. తరతరాలుగా తాము అనుభవిస్తూ వస్తున్న నాయక పదవి పాపన్నకు దక్కడం వారికి మంట పుట్టించింది.

తెలంగాణా షరీఫ్ సమాజానికి పాపన్న పొందిన సభాగౌరవం కంటగింపైంది. ఉన్నతకులాల్లో పుట్టి, గౌరవనీయులని మన్ననలందుతూ, పట్టణాల్లో జీవిస్తున్న తమకు కల్లుగీతకార్మికుడు, గౌడ పాపన్న సాటివాడు కావడం ఇంతకూడ అంగీకారయోగ్యం కాలేదు. ఖాజీల బంధువర్గపు స్త్రీలను అపహరించిండని, షరీఫ్ వర్గంలోని షా ఇనాయత్ తన స్వంతకూతురు పాపన్న బంధించిన వారిలో వుండటం ఇవన్నీ పాపన్నమీద చక్రవర్తికి ఫిర్యాదు చేయడానికి కారణాలు.


ఒక గౌడుతో సంప్రదించడం యిష్టంలేదన్న చక్రవర్తిని కలిసి వచ్చిన పిదప ఇనాయత్ బాధతో జబ్బుపడి మరణించిండు. కాని, అతని మరణం ఫిర్యాదుమీద ఒత్తిడిని పెంచింది. హైద్రాబాద్ పాలకుడు యూసుఫ్ ఖాన్ పాపన్న వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి ఆదేశించిండు. ఇన్ని ఒత్తిళ్ళు, వ్యతిరేకతల నడుమ పాపన్న పదేండ్లు ఎట్ల రాజ్యమేలిండు.


దోచిన సంపదను ధనంగా మార్చుకుని పాపన్న స్థానిక రైతాంగంలో గొప్ప ధనవంతుడయ్యిండు. అంతులేని ధైర్యం, బలం, ఎత్తుగడలు, నిర్ణయాలు, చేసిన దోపిడీలైనా, పాలనైనా పేదప్రజలకు బాగా నచ్చింది. కాని, భార్యే తన అన్నఫౌజుదారును పాపన్న ఖిలాషాపూరు కోట జైలునుంచి విడిపించింది. హస్నాబాద్ గౌడ్ సైన్యానికి పాపన్నను పట్టించడం పాపన్నకు జరిగిన ద్రోహాలు.


పాపన్నకోటలు బహమనీలు, కుతుబ్షాహీల కోటల నిర్మాణాలను అనుకరించినయి. మొఘల్ దర్బారులో  చక్రవర్తిచేత గుర్తింపు, తనకొక ఉపప్రభువు హోదా కలిగించింది. ఎవరినైనా ధిక్కరించినవాడు, అన్నీ అధికారాలను త్రోసి రాజునన్నవాడు ఒక తిరుగుబాటు తెలుగు భూమిపుత్రుడు పాపన్న ఆ రోజులలో గొప్ప నాయకుడు. 


సర్వాయి పాపన్న-శివాజీలు


 సర్వాయి పాపన్న వద్ద శివాజీ గెరిల్లాయుద్ధవ్యూహ తంత్రాలను నేర్చుకున్నాడని తన పరిశోధనలవల్ల తెలిసింది అని నాతో ఒక చరిత్రకారుడు అన్నారు. తను రాయబోతున్న చరిత్రగ్రంథంలో ఈ విషయాలను ప్రకటించబోతున్నానన్నారు. నన్ను ఇది నిజమేనా అని అడిగారు. నాకు తెలియదని చెప్పాను.

 సందేహనివారణ కొరకు నేనపుడు శివాజీ గురించి చదివి ఈ తేదీలను తెలుసుకున్నాను. పాపన్న గురించి మొగలు చరిత్రకారుని(కాఫీఖాన్ రచన) వల్ల చదివినదానిని ఒక అంచనా వేసి, ఇద్దరి వయో తారతమ్యాలు, సమకాలికతలను గణించడానికి ప్రయత్నించాను.

 శివాజీ పుట్టింది 19 ఫిబ్రవరి 1627 లేదా 1630

శివాజీ ఛత్రపతిగా పట్టాభిషేకం-1674 జ్యేష్ట శు.త్రయోదశి

శివాజీ మరణించింది  3 ఏప్రిల్ 1680


సర్దార్ సర్వాయి పాపన్న 

పుట్టింది సుమారుగా క్రీ.శ. 1650(అనడానికి అవకాశం ఉంది.)

మరణించింది క్రీ.శ. 1710 (60వ యేట అని చరిత్రకారుల కథనం)


పై తేదీలను బట్టి శివాజీ పాపన్నకన్నా వయసులో పెద్దవాడు. పాపన్నకు పాతికేళ్ళు వచ్చేటప్పటికే శివాజీ పట్టాభిషిక్తుడైనాడు. అప్పటికి శివాజీకి 45యేండ్లు దాటివుంటాయి. ఇద్దరి మధ్య వయోభేదం 20సం.లన్నా వుంటుంది. పాపన్న చిన్నవాడు. తన వద్ద శివాజీ యుద్ధవిద్యలు, తంత్రాలు నేర్చుకునే అవకాశం లేదన్నది నా అభిప్రాయం.


 శివాజీ పుట్టిన తేది మీద భిన్నాభిప్రాయాలున్నా పాపన్న కన్న శివాజే పెద్దవాడు. పాపన్న పుట్టిన తేది తెలుసుకునే అవకాశం లేదు. తన పుట్టినతేది వుందన్న ధూళ్మిట్ట శాసనాన్ని నేను స్వయంగా చదివాను. కాని, అది పాపన్న పేరున వేసిన శాసనమే కాదు. అందులో ఏ తేదీ పేర్కొనబడలేదు. ఆ శాసనంలో పేర్కొనబడిన వ్యక్తి సౌధరుడు, పోతగౌడు(బొల్లెపల్లి శాసనం ఆధారంగా) అంటే మైలారు దేవుని పూజారి. కనుక అది పాపన్న శాసనమే కాదు.


 చారిత్రక ఆధారాలతో ఈ విషయంలో నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను

Wednesday, August 13, 2025

వదిలెయ్

 *వదిలెయ్*


ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా ఎవరికీ అర్థం కాకపోతే, అవతలి వ్యక్తికి వివరించండం 

*వదిలెయ్*


పిల్లలు ఎదిగినప్పుడు, వారు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు, వారి వెనుకాలా పడడం 

*వదిలెయ్*


 కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి.  ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే, అటువంటి వాళ్లను

*వదిలెయ్*



ఒక వయస్సు తర్వాత, ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకపోతే లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, దానిని మనసులో పెట్టుకోకుండా 

*వదిలెయ్*


 మనచేతుల్లో ఏమీ లేదు, మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం

*వదిలెయ్*


 మనలోని కోరికకు, మన సామర్థ్యానికి చాలా తేడా ఉంటే, నీ గురించి నువ్వే ఎక్కువ ఆశించడం 

*వదిలెయ్*


ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. అంతెందుకు, ఓ మనిషి ఎత్తు, రంగు మొదలుకొని అన్నీ భిన్నంగా ఉంటాయి కాబట్టి సరిపోల్చడం

*వదిలెయ్*


నేను మంచి స్నేహితుడిగా కనిపిస్తే సరేసరి, లేదంటే నన్ను కూడా

*వదిలెయ్*


వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించండి, రోజువారీ పేరుకుపోయిన ఖర్చుల గురించి చింతించడం

*వదిలెయ్*


మీకు ఈ సందేశం నచ్చితే సరి. ఒకవేళ మీకు నచ్చకపోతే, సీరియస్ గా  తీసుకోకుండా

*వదిలెయ్*....


ప్రియ మిత్రమా 


*వృద్ధుడు వ్యర్థుడు కాదు*

*ఇంటికి ఈశ్వరుడు*


*మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడు*

ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే ఈశ్వరుడు...*


*బతుకుబాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి. 

కాపాడే సిద్ధుడు వృద్ధుడు...* *వృద్ధులు సారధులైతే యువకులు విజయులౌతారు... అనుభవాల గనులు... 

ఆపాత బంగారాలు...*


*వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు...* 

*చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు 

ఓ బుద్ధుడు..* 

*నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడుకాళ్ల ముసలివాడు..*

*తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రముడు...*


*ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు... 

తనను పట్టించుకోకున్నా,

నువ్వు పచ్చగా ఉండాలని తపించే ఉదాత్తుడు వృద్ధుడు...*


*పలకరిస్తే చాలు పాలకడలిలా పొంగులు వారే పసివాడు వృద్ధుడు... 

వృద్ధుడంటే పైపైన చూస్తే జుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవాడు... అంతర్గతంగా తలపండిన పండితుడు...*     


*వృద్ధుడు వ్యర్థుడు కాదు... ఇంటికి ఈశ్వరుడు...*


*వృద్దులకు గౌరవం ఇద్దాం*

*మన గౌరవం పెంచుకుందాం ---//-*

మేము అరవై లో ఇరవై. 


పచ్చగా మెరిసే పండుటాకులమే గాని

             చప్పుడు చేసే ఎండుటాకులం కాదు

కలలు పండినా పండకపోయినా

            మేము తలలు పండిన తిమ్మరుసులం


కొరవడింది  కంటి చూపు గాని

          మందగించలేదు ముందు చూపు


అలసిపోయింది  దేహమే గాని

          మనసుకు లేనే లేదు సందేహం


ఎగిరి అంబరాన్ని అందుకోకున్నా

                      ఈ భూమికి కాబోము భారం


అరవై లో ఇరవై కాకున్నా

                      అందని ద్రాక్ష కై అర్రులు చాచం


కుందేళ్ళమై పరుగులు తీయకున్నా

               తాబేళ్లమై గెలుపు బాట చూపగలం


చెడుగుడు కూతల సత్తా లేకున్నా

              చదరంగపు ఎత్తులు నేర్పగలం


సమయం ఎంతో మాకు లేకున్నా

            సమయమంతా మీకు సమర్పిస్తాం


అనుకోకుంటే అధిక ప్రసంగం

              అనుభవ సారం పంచుకుంటాం


వాడిపోయే పూవులమైనా

                        సౌరభాలు వెదజల్లుతాం


రాలిపోయే తారలమైనా

   కాంతి పుంజాలు వెదజల్లుతాం. 💐


*🙏🏻🪷DEDICATED TO ALL SENIOR CITIZENS🪷🙏🏻* 

మన మూలలు అయినా మన పెద్దలను మాత్రం వదలకండి నరేంద్రులారా....

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE