NaReN

NaReN

Monday, August 18, 2025

లోకం ఆగదు

 ఎవ్వరు లేకపోయినా ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకటం ఆపేద్దాం …


ఒక సిస్టమ్‌, ఆర్గనైజేషన్‌, రిలేషన్‌షిప్‌ ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్‌ చేయొచ్చు. 


‘నేను లేకపోతే ఈ కంపెనీ.. ఆఫీస్‌.. ఈ సంస్థ, ఈ ఇల్లు.. ఈ రాష్ట్రం.. ఈ దేశం.. ఏమైపోతుందో’ అని చాలామంది అనుకుంటూ ఉంటారు!


ఏం కాదు! అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. 

ఇంకా బాగా నడవవచ్చు కూడా ! 

కొత్తవారు కొత్త ఆలోచనతో రావచ్చు! 


మనలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు. 

మనకున్న అనుభవం, మనం ఆలోచించే విధానం, మన ఎనర్జీ - ఇలా ఎన్నో మంచి లక్షణాలు మన లో ఉండవచ్చు.


ఆ విషయంలో మన స్థానాన్నితాత్కాలికంగా ఎవరూ భర్తీ చేయలేకపోవచ్చు ! అంతమాత్రాన ఏమీ ఆగిపోదు! 


అయినా, మన టైమ్‌ బాగుండకపోయినా, దగ్గర పడినా అందరూ ఠక్కున పక్కన పెడతారు! అప్పటిదాకా మన పక్కన ఉన్న వాళ్లే, పక్క దారి పడతారు! 


ఎన్నో ఏళ్లు పనిచేసిన కంపెనీలో, సంస్థలో మన రిటర్మైంట్‌ రోజున బాగా భావోద్వేగానికి గురయి మాట్లాడుతూ ఉంటామ్!  అప్పటివరకూ సాధించిన వాటి గురించి గొప్పలు (గప్పాలు) చెబుతూ ఉంటాం! 

కానీ, ఇటు మన స్పీచ్‌ నడుస్తుంటే, మన యాక్సిస్‌ కార్డును, ఐడి కార్డును, ఇంకొకడు అప్పటికే డి-యాక్టివేట్‌ చేసేసి ఉంటాడు.


మరొకడు మన అఫీషియల్‌ మెయిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌ మార్చేస్తాడు. 

బ్యాంకు అకౌంట్ ఆథరైజ్డ్ సిగ్నేచర్ మార్చేసి బ్యాంకు కి అప్పటికే లెటర్పంపించేసి ఉంటారు! 


మన టేబుల్ మీద మనం పెట్టుకున్న దేవుడి ఫోటో తీసేసి వాళ్ళది పెట్టేసుకుంటారు! ఇవన్నీ సహజం! 


మనకు కాఫీ ఇచ్చే బాయో, బంట్రోతో అప్పటికే మన డెస్క్‌ ఖాళీ చేసి, అన్నీ మన కారులో పెట్టేసుంటాడు. 

మన తరువాత మన పోస్టులోకి వచ్చే వ్యక్తి, మన నేమ్ ప్లేట్ తీసేసి మన బ్యాగ్లో వేసేసి- “సార్ మీ నేమ్ ప్లేట్ తీయించి మీకు ఇస్తున్నాము సార్ ! గుర్తు గా వుంచుకోండి”అంటూ, అప్పటికే రెడీ అయిన తన నేమ్ ప్లేట్ ఫిక్స్ చేయించే ప్రయత్నంలో వుంటాడు!


మన  సహచర ఉద్యోగులు మనల్ని ఎంతో మిస్‌ అవుతున్నామని తెచ్చిపెట్టుకున్న కన్నీళ్లతో చప్పట్లు కొడుతూ ఉంటారు.


అదే సమయంలో మన తర్వాత ఆ కుర్చీలో కూర్చొనేవాడు మన పక్కనే బాధగా నిలబడి, మన  స్పీచ్‌ అయిపోగానే, ఆ సీట్లో కూర్చుందామని చూస్తుంటాడు. 

వీడ్కోలు పార్టీ అయిపోగానే అందరూ మనల్ని మర్చిపోతారు. అంతెందుకు, వీడ్కోలు మీటింగ్ మధ్యలోనే కొంత మంది శాలువా కప్పి చల్లగా జారుకుంటారు, అప్పటిదాకా ఉండవలసి వచ్చినందుకు బాధ పడుతూ! 


ఆ తర్వాత జీవితం అంతా ఇంట్లోనే!


ఆఫీస్‌ నుంచి ఎవరూ ఫోన్ చేసి మన  సలహాలు, సూచనలు అడగరు! వాటి కోసం ఎదురు చూడొద్దు. ఎవడూ రాడు. 

ఏదైనా సలహా కావాలంటే చాట్‌- జీపీటీని అడుగుతారు . ప్రపంచం ఎంతో వేగంతో పరుగెడుతోంది. 

కళ్లు మూసి తెరిస్తే అన్నీ మారిపోతాయి. 

పెద్ద పోస్టులో రిటైర్ అయిన వ్యక్తుల PA లు కూడా, ఆ సదరు రిటైర్ అయిన వ్యక్తి రిటైర్మెంట్ అయిన మరునాడు ఫోన్ చేసి ఏదైనా పాత విషయం అడగబోతే, ఆ సదరు “నిన్నటి సారు “ చెప్పే లోపే, “సార్!  పెద్ద సార్, కొత్త సార్ పిలుస్తున్నారు intercom లో! మళ్లీ పది నిమిషాలు ఆగి ఖాళీ అయ్యాక ఫోన్ చేస్తాను “ అని , ఇటు రెస్పాండ్ అయ్యేలోపే ఫోన్ కట్ చేస్తాడు! అది ఉద్యోగధర్మం! 

మనం తప్పు పట్టకూడదు! 

నిన్నటితో అతనిది ముగిసింది! 

ఈరోజు నుండి“పెద్దసార్“ 

మారాడు! ఇది కొంతవరకు జీర్ణించుకోవచ్చు! 


అదే పాత ప్రభుత్వంలో పదవి వెలగబెట్టిన ఏ ప్రజా నాయకుడో, ఏ సంస్థ కార్య నిర్వాహక సభ్యుడో అయితే ఈ అవకాశం కూడా లేదు! ప్రభుత్వం మారినా వెంటనే, మూటా ముల్లి సర్దుకోవాలి! పాత రికార్డ్స్ మనకు ఇబ్బంది కలిగించే డాక్యుమెంట్స్ ముందే సర్దుకోవాలి! 


మనం అందరం మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా? 

మన టైం అయిపోయింది! 

మనం మంచి పొజిషన్‌.. సక్సెస్‌లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటాం. 

తర్వాత అందరూ మర్చిపోతారు. 


‘నేనే లేకపోతే’ 

అని ప్రతి అత్తగారు అనుకుంటుంది. 

కానీ, కొత్త కోడలు వస్తుంది. 

ఆమెకంటే ఇల్లు బాగా చూసుకుంటుంది! ఇది 95% నిజం కూడా! 


కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే 

”ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం అనేది అవమానించడం కాదు. 

మనం చేయాల్సిన పనులు అక్కడ పూర్తయ్యాయని అర్థం. మిగిలిన జీవితం హాయిగా బతకాలి! ద్వేషాలు, వైషమ్యాలు విడవాలి! 


కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి . కొత్త సవాళ్లను ఎదుర్కోవాలి . పాత అలవాట్లని కొంతవరకు మార్చుకోవాలి! సర్దుకు పోటం నేర్చుకోవాలి! 

మనల్ని మనమే  గౌరవించుకోవాలి! తప్పదు మరి!


ఇంకా ఆఫీస్‌, పోస్ట్ నెత్తి మీద పెట్టుకుని మోయరాదు. పిల్లా, పాపలతో సరదాగా గడపటం నేర్చుకోవాలి! 


పవర్‌.. మనీ.. సక్సెస్‌.. జీవితాంతం ఉండవు. అవి వున్నప్పుడే, అవి లేనప్పుడు ఎలా బతకాలి నేర్చుకోవాలి.


‘నేనే లేకపోతే..’ అనే ఆలోచన వస్తే, ఒక్కటే గుర్తు పెట్టుకోండి. 


“నేనే” లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది… 

ఏదీ ఆగదు… 

పాత నీరు పోతూనే ఉంటుంది… 

కొత్త నీరు భర్తీ చేస్తూనే ఉంటుంది… 


ఎవరైనా వచ్చి మనల్ని పొగిడి “సార్! మీరు లేకపోతే “ అంటే, మనం వెంటనే అర్థం చేసుకోవాలి, వాడు మనల్ని మోసం చేస్తున్నాడని, వాడిని కూడా మోసం చేసుకుంటున్నాడని! 


ఇంత వయసు వచ్చి రిటైర్ అయ్యాక, ఈ మాత్రం maturity రాకపోతే, మనం ఇన్నాళ్లు బతికింది వృధా అన్న మాట! 


కొన్ని విషయాల్లో, కొంత సమయం తర్వాత, వదిలేయడంలో ఉన్నఆనందం పట్టుకొని వేళ్ళాడటంలో వుండదు!


మనం పట్టు వదలకపోతే, వాళ్లే వదిలిస్తారు! 


ఈ విషయంలో, నేటి తరంలో, మన పిల్లలే మన మాట వినరు! 

“మీ టైం అయిపోయింది, మీకేమి తెలియదు! 

మీరు ఊరుకోండి, అన్నిట్లోనూ వేళ్లు పెట్టకండి! మాకు తెలుసు, మేము చూసుకుంటాము! మేమూ పెద్ద వాళ్ళమయ్యాముగా “ అంటారు! 


వాళ్ళు ‘మేమూ పెద్దవాళ్లమయ్యాముగా’అనగానే, మనం మన పెద్దరికాన్ని పక్కన పెట్టి, పద్ధతిగా, పెద్దరికాన్ని కాపాడుకుంటూ పక్కకు తప్పుకోవాలి! 

లేదంటే మనల్ని మనమే చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది!


ఇది ఉద్యోగంలో నైనా, వ్యాపారంలో నైనా, వేరే దేనిలోనైనా, ఇంట్లో నైనా తెలుసుకొని మసలటం విజ్ఞుల లక్షణం! 

లేకపోతే అభాసుపాలవటం తధ్యం! ఇది మనకు చరిత్ర చెబుతున్న సత్యం!

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE