SON OF INDIA
(ఆగస్టు 18 సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా)
సుభాష్ చంద్ర బోస్ వీర విప్లవ స్వతంత్ర సమర యోధుడు. ఆయన పేరు వినగానే బ్రిటిష్ పాలకులకు వెన్నులో వణుకు పుట్టేది. మహాత్మా గాంధీ అహింసా పోరాటాన్ని సాగిస్తున్న తరుణంలో, బ్రిటిష్ పాలకులను ఒక్క అహింసా మార్గం ద్వారా ఎదుర్కోవడం సరి కాదని భావించి, సాయుధ పోరాటం ద్వారా అయుధంపట్టి బ్రిటిషర్లు ను దేశము నుండి తరిమి వేయ గలమని ఆయన నమ్మారు.
'దేశ భక్తి అంటే ఒక దేశాన్ని ద్వేషించి, మరొక దేశాన్ని ప్రేమించడం కాదు, దేశంలో ఉన్న ప్రజలందరినీ కుల, మతాల కతీతంగా ప్రేమించాలనే విషయాన్ని అక్షరాలా ఆచరించి చూపిన మహా మనిషి నేతాజీ. 1897 జనవరి 23న కటక్ లో జన్మించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నత విద్య నభ్యసించి ఇండియన్ సివిల్ సర్వీస్ కి ఎంపికయ్యారు. బ్రిటీష్ వారి క్రింద పనిచేయడం ఇష్టంలేక ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి 1921లో ఇండియాకి వచ్చారు. 1921 - 32 ల మధ్య భారత జాతీయ కాంగ్రెస్లో చురుకైన పాత్ర పోషించారు. అనంతరం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు పలు దేశాల్లో పర్యటించారు. స్వరాజ్ అనే పత్రికని నడిపారు. 'ది ఇండియన్ స్ట్రగుల్' అనే పుస్తకాన్ని రచించారు.
1939లో భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో విభేదించి సొంతంగా 'ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్' పార్టీని స్థాపించారు. వజ్రాన్ని వజ్రంతో కోయాలనే సంకల్పంతో 'అజాద్ హింద్ ఫౌజ్' (ఇండియన్ నేషనల్ ఆర్మీ )ని ఏర్పాటు చేసి
భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని పోరాటం చేసారు.
"ఢిల్లీ చలో" అనే నినాదం ఇచ్చి, భారతీయ సైనికులను స్వతంత్ర పోరాటంలో పాల్గొనమని పిలుపునిచ్చారు.1945 ఆగస్ట్ 18న విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని భావిస్తారు.
ఆయన మరణంపై 1956లో షానవాజ్ కమిటీని, 1970లో ఖోస్లా కమిటీని, 1999లో ముఖర్జీ కమీషన్ ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే ఈ కమిటీలేవి బోస్ మరణంపై సంతృప్తికరమైన వివరణలుఇవ్వలేకపోయాయి. జైహింద్ నినాదంతో తన సహచరులలో ఉత్తేజాన్ని నింపేవారు. ఆయన జన్మదినాన్ని 'దేశ్ ప్రేమ్ దివస్' గా జరుపుతారు. నేతాజీ స్ఫూర్తితో నేటి పాలకులు దేశంలోని పౌరులందరనీ కుల, మత, వర్గాల కతీతంగా సమానంగా చూడగల్గితే అదే బోస్ కిచ్చే నిజమైన నివాళి.
No comments:
Post a Comment