తెలంగాణ పోరాట యోధుని కథ
*సర్దార్ సర్వాయి పాపన్నగౌడ*
(రేపు పాపన్న పుట్టినరోజని రుజువులేమీ లేవు కాని, పాపన్న స్మరించుకోవడానికి ఒక సందర్భం)
సర్వాయి పాపన్న కథ:
తొలిసారి పాపని గురించి పాడిన పాట, జానపదుల నోట తర, తరాలుగా పాడబడుతున్న వీరగీతం, రాయలసీమ దత్తమండలాలకు(సీడెడ్ జిల్లాలకు) చెందిన పాలెగాండ్ల కుటుంబగాయకుడు బళ్ళారివాసి ఒక భట్రాజు పాడిన ఒక బాలడ్(జానపదగాథ) అని జేఏబోయెల్ తన వ్యాసంలో పేర్కొంటడు. తను సేకరించిన ‘పాపని’ జానపద వీరగీతంలో మాటల ఆధారంగా పాపడు నాయుడు లేదా కాపు కులానికి చెందినవాడు అంటడు బోయెల్. పాడిన పాటలో పాపని వివరాలు సరిగా లేకపోయినా అతని తల్లిపేరు ‘సారమ్మ’ అని తెలుస్తున్నదని రాసాడు.
ఆ పాట
‘వస్తాడు తను సర్వయ్య పాపడు’ అని మొదలైతుంది.
పాపడు తన కోరుకుంటున్నది, చేయాలనుకుంటున్నది తల్లికి చెప్పి, ఆమె దగ్గర సెలవు తీసుకుంటున్నపుడు
‘తల్లి కొలువుకు వడిగా వెళ్ళేను
తల్లికి దండముగ నిలిచేను
యేరు కట్టి వ్యవసాయము, అమ్మా
ఎంగిలి ముంత ఎత్తలేను
కొట్టుదును గోల్కొండ పట్టణం
ఢిల్లికి మోజూరునవుదును
మూడు గడియల బండారు గొట్టుదును
మూలకోట కందనూర సూచి
బంగారు కడియాలు పెట్టుదును’ అని పాపడంటే
‘మనకంత బంట్రోతు తన(0)మేలు
మన కులకై మానవద్దురా
సర్వయ్య పాప’ అని అడ్డుపడ్తది తల్లి.
కాని, పాపడు తల్లి మాట వినక తనదారిన తాను యుద్ధసన్నద్ధాలు చేసుకున్నడు. కత్తులు, కైజారులు, బల్లేలు సమకూర్చుకున్నడు. యుద్ధానికి సిద్ధమైపోతున్న పాపడు
‘అడుగో పాపడు వస్తానుంటే
కుందేళ్ళు కూర్సుండపడేను
లేడిపిల్లలు లేవలేవు
పసిబిడ్డలు పాలుతాగరు
నక్కలు, సింహాలు తోకముడుచును’
అరివీరభయంకరుడుగా కనిపించాడు. పాపడు తన నేస్తులను కలవడానికి తాళ్ళల్లకు పోయిండు. దోస్తులకు ధైర్యం తేవాలని తొలుత ‘దోచుడు’ యుద్ధపద్ధతిని ఎంచుకున్నడు. దోచుడంటే గొప్పతనంగ అనిపించకపోవచ్చు. కాని, స్థానికంగా తనకు అనువైన తొవ్వ. బోయలు ఇటువంటి పనులు చేయడానికి ముందు మంచిగ తాగకుండ మొదలుపెట్టరు. పాపడు మామూలు తాగుబోతు కాదు. తన తీరు వేరు.
‘పాపడు తాగేటి కల్లు
యే తాటి యే తాటి కల్లు
వేలు పెట్టితే వేలు తెగును
దివిటీ పెట్టితె భగ్గున మండును
తాగేటప్పుడు తీయగ వుండును
తాగినవాణ్ణి లేవనివ్వదు
లేచినవాని పోనివ్వదు’
ఈ గ్రామీణ ఇతిహాసాన్ని పల్లెటూరి యువతీ యువకులు పాడుకునే గీతాలతో పోల్చుకోవాలి.
ఈ కింది పాట మోటకొడ్తూ ఒక యువకుడు పాడుకున్నది
‘యేగి యేగి యెండలైన
యేడూరు గుమ్మి నీడలైన
దూడవాడు మొగడైన
వుండవలె కొండ నడుమ
యెదురింటి యెర్ర పాప
సూతుమన్న కానరాడు
పాపిష్టి తల్లిదండ్రి
బైలెల్ల నివ్వరు
యెత్తు గుబ్బలు యెర్రదాన్ని
కోరగుబ్బలు యెవ్వని పాలు
ఆలు లేని బాలునికి
ఆరు నెలల అరణం ఇస్తు
గుబ్బలుండే తీరు సూచి
గుద్దికొంటె తీరునంటె
గుండెగల బంటు అయితె
గుండ్లపల్లి కనమకురా’...
పాపని చూసి మోజుపడ్డ పడుచుదాని పాట ఆ రైతు పాడిన జానపదశృంగారగీతంలో నాయకుడు పాపన్న.
(Ed.JAS Burgess - Indian Antiquary,Vol.III(1874), Telugu Ballad Poetry-JA Boyle,p.1-6)
జానపద రచనల్లో వీరగుణ స్పోరకమైనది సర్వాయి పాపని కథ అంటాడు హరి ఆదిశేషువు(జానపదగేయ వాఙ్మయపరిచయము-59పే.)
పాపన్న పుట్టింది పులగాము. పెరిగింది తాటికొండ. గవండ్ల కులం. ఇంటిపేరు నాసనోళ్ళు. హసేన్, హుసేన్, తుర్క రహిమాన్, దూదేకుల పీరు సాబ్, నక్కల పెరుమాండ్లు, నెల్లూరి హనుమంతు, చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందులు నేస్తగాళ్ళు.
పాపనియొక్క పేరు చెప్పితే
వూరపిచ్చిక పొలం చేరదు
పొట్టిపిచ్చిక వూరు చేరదు
కౌంజులూ కారాడుతూండు
నక్కలు నాట్యాము త్రొక్కు...
పసిబిడ్డలు పాలుతాగరు
గుర్రాలు గుగ్గిళ్ళు తినవు
యేనుగూలు మేతాదినావు...
వాడిపేరంటే....
ఢిల్లీ దర్బారొణుకు, గోలుకొండబస్తీలొణుకు
కడపజిల్లా తొణుకురా, వాడిపేరంటే
కందనోలు మాలుతొణుకురా వాడిపేరంటే
మైసూరు జిల్లాలొణుకురా వాడిపేరంటే
చెన్నాపట్టణము వొణుకురా వాడిపేరంటే... అంతటా దడ దడే.
చిన్నపుడు చెట్టునీడ నిద్రపోతున్న తనకు ఎండ తగులకుండ పన్నెండు శిరసులనాగు పడగలగొడుగు పట్టిందని, పాముపడగపట్టినవాడు యేడుగడియలు రాజైతడని బ్రాహ్మణులు జాతకం చెప్పిండ్రని, ఇది తన బాల్యంలో జరిగిందని చెప్పిన గాధని నమ్మిండు పాపన్న. కులకస్పె పాటించలేదు. గౌండ్లవృత్తిని చేపట్టలేదు పాపన్న. దానితో ‘ఊరుకొట్టితే ఫలమేమి, పల్లెకొట్టితే ఫలమేమి, కొడ్తె గోలకొండనే కొట్టాలె’ననుకున్నడు.
దోస్తులతో పంతంకట్టి చెడతాగి, ఒళ్ళుమరిచి దారిలొస్తున్న పాపనికి ఎదురైన ఎరుకల నాంచారిని బుట్ట దింపించి గద్దెచెప్పుమన్నడంట.
నాంచారి ‘యేడుగురి పెండ్లాలతోను, పన్నెండుమంది లంజలతోను
ఏనాటపిల్లతోను, బోగమోరి కన్యతోను
పొలకినెక్కే పంతమున్నాది ఓరాయుడా,
గోలుకొండ ఏలడాన్కి పంతమున్నాది
ఓరాయుడా, నీకు పంతామున్నాది’ అని చెప్పిందంట గద్దె.
గద్దె చెప్పిన నాంచారినే గుంజుకొచ్చి, కోడలని తల్లికి అప్పజెప్పిండంట. మైకాన ఉన్న పాపన్న తల్లిని ‘గోలుకొండ కొట్టెతానికి పైకం కావాలె, కల్లమ్మి దాచిన పైసలియ్య’మని సీతబాధలు పెట్టిండట. దాచిన ధనం జాడలు చెప్పి అంత దోచిపెట్టిందట సర్వమ్మ. ఇది చాలదు ఇంకా కావాలె అంటే ఎల్లమ్మ గుడిల యేడు కొప్పెర్ల ధనమున్నదని చెప్పిందట ఆ తల్లి.
గుడికొస్తున్న పాపన్నను చూసి ఎల్లమ్మే పారిపోబోయిందంట. ఎల్లమ్మను పట్టుకుని ‘ఏడుదున్నలు కావలెనా, ఏటపోతులు కావలెనా’ అని అడిగితే, ఆ దేవత ‘అవన్నీ వద్దు పాపన్నా’ అని ధనం జాడ చూపిందట. ఆ ధనమంతా ఎత్తుకుని పాపన్న పన్నెండువేల రాణువను కూడగట్టుకున్నాడట. గోల్కొండ నవాబుతో యుద్ధం చేసి, గెలిచి యేడు గడియలు గోలుకొండ తఖ్తునెక్కినాడు పాపన్న. వరం నిజమైంది. 5లక్షల దండున్న నవాబు పాపన్నను దెబ్బతీసిండు. పగవాని చేతిలో చచ్చుడు నచ్చని పాపన్న బాకు నెగరేసి ఎదనెదురిచ్చి వీరమరణం పొందినాడంట.1(జానపదగేయ వాఙ్మయపరిచయము-59-60పే.)
ఈ పాపనికథలో అతిసామాన్యుడు ఒక మహారాజు గద్దెనెక్కడమనేది వీరోచితగాథే. ఏ రాజవంశంవాడు కాడు, రాజోచితమైన వారసత్వం లేదు తనకు. ధనవంతుడు, విద్యావంతుడు కాడు తాను. జనంలోని మనిషి. అందుకనే తమలోనివాడు, తమలాంటివాడు సర్వాయి పాపన్నంటే ప్రజలకు ఇష్టం. సర్వాయి పాపన్న గాథంటే ప్రజల కథే. జానపదుల కథే. అందుకే పాపన్నది జానపదవీరగాథ. పాపన్న ప్రజలవీరుడు.
పాపన్న చరిత:
తాటిగొండ(తరిగొండ)లో పుట్టి పెరిగిండు పాపన్న. కల్లుగీత కులవృత్తికి చెందిన పాపన్న తాను గౌండ్లపని చేయనని తల్లితో చెప్పిండు. కొడితే గోల్కొండ కోటనే కొడతగాని, నడుముకు ముస్తాదు కట్టనన్నడని జానపదగీతాల్లో వుంది.(1870). గౌండ్లు నాయకత్వాలకు సరిపోతరని, అధికారం చెయ్యగలరని, ఒక్క గౌండ్లపని ఎన్నో కులవృత్తులకు ఆధారమౌతుందని అనేటోడు.
పాపన్న గురించి ఖాఫీఖాన్ అనే చారిత్రక సమాచార సేకర్త... అధికారిక నివేదికల ఆధారంగా, తను రాసుకొన్న వార్తలవల్ల.. పాపన్న చరిత్ర వివరంగ తెలుస్తున్నది.
1690ల తరవాత తన అక్కదగ్గర వున్న ధనాన్ని దోచుకున్నాడు పాపన్న. ఆ డబ్బుతో కొంతమంది అనుచరులను సమకూర్చుకున్నడు. తరికొండగుట్టమీద ఒక కోట కట్టుకున్నడు. పెద్ద దారులమీద దారిదోపిడీ మొదలుపెట్టిండు. హైదరాబాదు వరంగల్ నడుమ తిరిగే వ్యాపారులను దోచిండు. పాపని పనుల గురించి స్థానిక ఫౌజిదారులకు, జమీందారులకు వ్యాపారులు ఫిర్యాదుచేసి, చెప్పుకునేవారు. వాళ్ళ వత్తిడివల్ల పాపన్న తరిగొండను వదిలి అక్కడికి 110మైళ్ళ దూరంలో వున్న కౌలాసుకు పోయి స్థానిక జమీందారు వెంకటరావు వద్ద చిన్న దళానికి నాయకుడుగా కొలువుకు కుదిరిండు.(కొంతకాలం ఎల్లందల(ఎల్గందల?) జమీందారు కొలువులో సైనికోద్యోగిగా వుండుకుంట జమీ ప్రజలను వేధించడం వల్ల జమీందారు పాపన్నను ఖైదు చేసిండు... ఆంధ్రుల చరిత్ర-బీఎస్సెల్ హనుమంతరావు, పేజి సం.465) మళ్ళీ పాతతీరు ఆలోచనలతో మళ్ళీ దండుబాటలమీద చోరీలు చేసిండు. వెంకటరావు తనని బంధించి జైల్లో పెట్టాడు. తమ కుమారుని అనారోగ్యాన్నుంచి తన జాలి, దయలు కాపాడుతాయని నమ్మి జమీందారు భార్య కొన్నినెలల నిర్బంధం తర్వాత అందరు ఖైదీలతోపాటు పాపన్నను విడుదల చేయించింది.
1701లో వెంకటరావు మొఘలుల అధికారపాలకులలో ఒకడైండు. తన హోదా మారింది. జమీందారు నుంచి మన్సబుదారైండు. తనకింద 500మంది అశ్వికులు, 2వేలమంది కాల్బలంతో హైద్రాబాద్ లోని ఉప పరిపాలకుని కింద 200 అశ్వికులకు అధికారిగా పనిచేసే హోదా దక్కింది.
పాపన్న తన పాతపద్ధతుల జీవితాన్నే గడుపుతున్నడు. తరిగొండకు కొన్ని మైళ్ళ దూరంలో వున్న షాపూర్లో మకాంపెట్టిండు. పెద్దసంఖ్యలో అనుచరులను సమకూర్చుకున్నడు. ఆ అనుచరులలో సర్వన్న ఒకడు. ఇద్దరు మంచి స్నేహితులు. షాపూర్లో ఇద్దరు మంచి వ్యూహాత్మకమైన కోటను కట్టించిండ్రు. ధనవంతులను కొల్లగొట్టి వచ్చి వుండడానికి మంచి నెలవైంది షాపూర్ కోట. మొఘల్ అధికారులు, స్థానిక పెద్దలు పాపాన్న మీద దృష్టిపెట్టిండ్రు. వ్యాపారులు, అన్ని వర్గాలనుంచి గౌరవనీయులైన పెద్దలు న్యాయాన్ని అర్థించడానికి ఔరంగజేబు కొలువుకే వెళ్ళిండ్రు. హైదరాబాదు సుబేదారును వెంటనే చర్య తీసుకొమ్మని ఆదేశించిండు. అతడు కొలనుపాకలో వున్న ఫౌజీదారును పాపని సంగతి తేల్చుమని ఆజ్ఞాపించిండు. ఫౌజ్దార్ ఖాసింఖాన్ అనే ఆఫ్ఘన్ ను పాపని అనుచరులలో ఒకడు కొలనుపాక పరిసరాల్లో కాల్చిచంపాడు.
1702లో సుబేదార్ రుస్తుం దిల్ ఖాన్ షాపూర్లోని పాపనికోటను ముట్టడించిండు. రెండునెలల పోరు తర్వాత పాపడు, సర్వన్నలిద్దరు తప్పించుకునిపోయిండ్రు. రుస్తుందిల్ ఖాన్ కోటను ఫిరంగులతో కూల్చి వాపసు పోయిండు. పాపన్న, సర్వన్నలిద్దరు ఖిలాషాపూరుకు తిరిగివచ్చి అనుచరులను కూడగట్టుకుని, కోటను బాగుచేయించాండ్రు. పాపన్న పేరు ప్రఖ్యాతులు చుట్టుపక్కల జిల్లాల్లో వ్యాపించినయి. పాపన్న పునరుత్థానం గురించి రుస్తుంకు తెలియనే లేదు. పాపన్న అనుచరులలో సర్వన్న, పుర్దిల్ ఖానులిద్దరు తగువు పెట్టుకున్నరు. దానితోని పాపన్న ఒక్కడే తన ఉద్యమానికి నాయకత్వం వహించిండు. చుట్టుపక్కల కోటలను గెలువడం మొదలుపెట్టాండు. తనదారిన తాను పాపన్న ఇపుడొక యుద్ధప్రభువు. రెండేండ్లలో పాపన్న మధ్య తెలంగాణాలో విక్రమించిండు. పాపన్న భయంతోని 1702-04లలో హైదరాబాదుకు వ్యాపార బిడారులే రాకుండ పోయినయి.
1703మే, 1705 డిసెంబరు మధ్యకాలంలో రుస్తుందిల్ ఖాన్ హైదరాబాదు నుంచి దూరం పంపించి వేయబడ్డడు. 1706 మొదట్లో మళ్ళీ హైదరాబాదుకు వచ్చిండు. చక్రవర్తి అభిమానం తిరిగి పొందడానికి ప్రయత్నించాలనుకున్నడు. అదే సంవత్సరం మేలో మరొక సుబేదారు రిజాఖానుకు తెలంగాణాలో బందిపోట్ల గురించి డచ్ వారు ఫిర్యాదు చేసారు. ఖాఫీఖాన్ నివేదికల్లో రుస్తుందిల్ ఖాన్ సాహసవంతుడైన సైనికుణ్ణి పాపని శిక్షించడానికి నియమించుకున్నడని వుంది. రెండవసారి కూడ పాపనిమీద దాడి విఫలమైంది. సర్వాయి పాపన్నను బందిపోటుగా భావించి అణచడానికి బందిపోటును వాడుకోవాలనుకోవడంలోనే హైద్రాబాద్ అంతర్గత భద్రత ఎంత లోపభూయిష్టంగా వుందో అర్థమైపోతుంది. ఒక సంవత్సరం తర్వాత 1707లో రుస్తందిల్ ఖాన్ మళ్ళీ చక్రవర్తి సైన్యాలతో తానే స్వయంగా పాపని మీద దాడికి బయల్దేరిపోయాడు. 2,3నెలలపాటు యుద్దం జరిగింది. చివరిలో పాపన్న ఇచ్చిన డబ్బుసంచులతో రుస్తుందిల్ ఖాన్ చల్లబడ్డడు. సైన్యాలు వెనుదిరిగిపోయినయి.
ఇది పాపన్నకు ధైర్యాన్నిచ్చింది. 1708లో పాపన్న, అతని అనుచరులు వరంగల్ కోటమీద దాడికి నిర్ణయించింరు. కాకతీయుల కాలంలో నిర్మించిన కోటను, బహమనీలు, కుతుబ్షాహీలు మరింత పటిష్టపరిచిండ్రు. వరంగల్ అప్పట్లో గొప్ప వ్యాపారకేంద్రం. తివాచీల వ్యాపారం అంతర్జాతీయంగా నడుస్తోంది. వరంగల్లును స్వాధీనం చేసుకోవడం చాలా అవసరం అనుకున్నడు పాపన్న. 1707 ఫిబ్రవరిలో ఔరంగజేబు మరణించిండు. రాజ్యపాలన సంక్షోభంలో పడిపోయింది. ఔరంగజేబు పెద్దకొడుకు తన తమ్ముళ్ళలో ఒకనిని చంపివేసిండు. తను కిరీటం ధరించి బహదూర్ షా పేరుతో మొఘల్ చక్రవర్తిగా ప్రకటించుకున్నడు. తమ్ముడు కాంబక్షుకు హైద్రాబాదు, బీజాపూరుల పాలకుడుగా కానుక ఇచ్చిండు. దానిని తిరస్కరించి కాంబక్ష్ తనను తాను 1708 జనవరిలో గోల్కొండ ప్రభువుగ ప్రకటించుకున్నడు.
ఇది అన్నాదమ్ముల సవాల్ గా మారిపోయింది, ఈ సందర్భాన్ని పాపన్న గమనంలోకి తీసుకున్నడు. నిరీక్షించిండు. మొహర్రం రోజున అందరు పీరీలపండుగలో మునిగివుండంగ వరంగల్ కోట మీద గెరిల్లా దాడి చేసిండు పాపన్న. అది 1708 ఏప్రిల్ 1వ తేది. ముందురోజు అనగా మార్చి31న 3వేలమంది కాల్బలం, 500మంది అశ్వసైన్యంతో కోటగోడలవద్దకు చేరుకుని కాపుగాచిండు పాపన్న. కొంతమంది సైన్యం దారులను మూసి కాపుకాసి వుండంగ, కొంతసైన్యం తాళ్ళతో కోటగోడలమీదికి చేరుకున్నరు. కోటతలుపులను బద్దలుకొట్టి సైన్యంతో పాపన్న వరంగల్లు కోటలోనికి చొరబడ్డడు. రెండు, మూడు రోజులు పాపన్న సైన్యం దుకాణాలనుంచి, వ్యాపారుల నుంచి, వరంగల్ వాసుల నుంచి పెద్ద ఎత్తున ధనం, వస్త్రాలను తీసుకున్నారు. వేలమంది ఉన్నత వ్యక్తులను ఖిలాషాపూరుకు తీసుకువెళ్ళి కోటలోపల నిర్బంధించాడు. తీసుకువెళ్ళిన వారిలో స్త్రీలు, పిల్లలు, వరంగల్ న్యాయాధీశుడు, అతని భార్యాపిల్లలు కూడ వున్నరు. వాళ్ళందరిని నిర్బంధించి, కావలసినంత ధనసేకరణ చేసుకున్నడు పాపన్న. సంపాదించిన ధనంతో పాపన్న సైన్యానికి అవసరమైన ఆయుధసంపత్తిని సమకూర్చు కున్నాడు. 700ల డబుల్ బ్యారెల్ మస్కట్లు, డచ్, ఇంగ్లీషు వ్యాపారుల దగ్గర కావలసిన యుద్ధ సామగ్రిని కొనుక్కున్నడు. ఈ విజయంతో పాపన్న రాజు హోదాను పాటించిండు. పల్లకీసేవలు, రాజు ప్రత్యేకసైన్యం, ప్రత్యేకంగా గుర్రం వుండేయి.
బంజారాలను బంధించి వారి పశువులను, మనుష్యులను తన పొలాలను దున్నడానికి నియోగించిండు. దాదాపు పది నుంచి పన్నెండువేల పశువులను ఇందుకు వాడుకున్నడని చరిత్ర. జమీందారుల నుంచి గుంజుకొన్న భూములను, బంజరుభూములను పెద్ద ఎత్తున సాగులోనికి తెచ్చిండు పాపన్న. తెలుగు నాయక హోదాను పొందిండు పాపన్న. వరంగల్లు గెలుపుతో ఉత్సాహం పొందిన పాపన్న భువనగిరికోటను స్వాధీనం చేసుకున్నడు. అది కూడా వరంగల్ దాడికి ఎన్నుకున్నట్లుగానే మహమ్మదు ప్రవక్త జన్మదినం(1708 జూన్ 1) నాడు భువనగిరికోట మీద దాడిచేసి గెలుచుకున్నడు. ఎంతో మందిని బందీలుగ పట్టుకున్నరు. ఆడవాళ్ళను వదలడానికి వెండినాణాలు, పెద్దింటి స్త్రీలకైతే బంగారు నాణాలను అడిగిండ్రట.
అనేక కారణాలవల్ల మొఘల్ అధికారులు పాపన్నను కట్టడి చేయలేకపోయిండ్రు.
1709 జనవరిలో బహదూరుషా గోల్కొండరాజు కాంబక్షు మీద దాడికి బయల్దేరిండు. హైద్రాబాద్ బయట రెండుసైన్యాలు తలపడ్డయి. గాయపడ్డ కాంబక్షు యుద్ధంలోనే మరణించిండు. బహదూరుషా ప్రజలసభలో (దర్బారు) డచ్ వాళ్ళిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న మాటను ‘బందిపోటు సర్వాయిపాపడు’ అని చెప్పిండు. చక్రవర్తి నుంచి గుర్తింపు కోరుతూ పాపన్న 14లక్షల రూపాయలను, ఆహారధాన్యాలను నజరానాగా పంపిండు. బదులుగ చక్రవర్తి పాపన్నకు తలపాగా పెట్టి సన్మానించిండు. ఇంతకు ముందెన్నడు ఎవరికి జరుగని ఆదరం సర్వాయి పాపన్నకు జరిగింది. 1687 నుంచి ఇట్లాంటి ప్రజాదర్బారు జరగలేదు. ఏ స్వతంత్ర నాయకునికి ఇటువంటి గౌరవం దక్కలేదు.
కాని, పాపన్న మీద షా ఇనాయత్ వంటి ముస్లిం కులీనులు ఇచ్చిన ఫిర్యాదుల కారణంగ చక్రవర్తి వెంటనే పాపన్నను నిర్మూలించమని కొత్తగా నియమించిన హైద్రాబాద్ పాలకుడు, యూసుఫ్ ఖాన్ ను ఆదేశించిండు. అతడు ఆ పనికి తన సహచరుడైన ఆఫ్ఘన్ దిలావర్ ఖాన్ ను నియోగించిండు.
చక్రవర్తి సన్మానం తలకెక్కిన పాపన్న తన రీతిలోనే పాతపద్ధతులలోనే పాలనను, యుద్ధాలను సాగించిండు. 1709 జూన్ లో పొరుగు భూస్వామి కోటను ఆక్రమించిండు. దిలావర్ దాడి గురించి తెలిసిన పాపన్న తనదాడిని మధ్యలోనే ఆపుకుని, ఖిలాషాపూరుకు తిరిగివచ్చిండు. పాపన్న బంధించి వుంచిన వారి తిరుగుబాటు పెరిగిపోయింది. వారిలో పాపన్న భార్య సోదరుడు ఒక ఫౌజీదారున్నడు. అతని ఆధ్వర్యంలో ఖైదీలు ఊచలు కోసి బయటపడ్డరు. తన కోటనుంచి తాను బంధించిన వారిచేతుల్లోవున్న తన ఫిరంగుల గుండ్లను ఎదుర్కోవల్సి వచ్చింది. అప్పటికే అక్కడికి చేరిన దిలావర్ సైన్యాలతో తలపడ్డం వ్యూహాత్మకంగా తగదనుకున్న పాపన్న తన వెంటవున్న సైన్యంతో తరికొండకు వెళ్ళి దాచుకున్నడు. ఇది తెలిసిన యూసుఫ్ ఖాన్ మరికొంతమంది సైన్యాన్ని తరికొండకు పంపించిండు. దిలావర్ ఖాన్ తాను పాపన్న ధనాన్ని వెతకడంలోనే మునిగిపోయిండు.
పాపన్న దొరకలేదు. నెలలు గడిచిపోయినయి. యూసుఫ్ ఖానే స్వయంగా పాపన్నమీద దాడి చేయాలనుకుని పదివేల ఫిరంగులతో, ఇరవైవేల కాల్బలంతో బయల్దేరిండు. తరికొండలో కూడా పాపన్న నెలలపాటు మొఘల్ సైన్యాన్ని నిలువరించిండు. పాపని అనుచరులకు దిలావర్ ఖాన్ లంచం ఆశచూపిండు. చాలామంది లొంగిపోయిండ్రు. పాపన్న దగ్గర తుపాకీ మందు అయిపోయింది. ఇక యుద్ధం సాగించలేననుకున్న పాపన్న మారువేషంతో తరిగొండకోటనుంచి బయటపడ్డడు. కాలికి తుపాకీగుండు గాయమైంది. రెండురోజులు ఒంటరిగా ఎవరికీ తెలియకుండ ప్రయాణం చేసి ఆఖరికి హుసనాబాదు చేరుకున్నడు. అక్కడొక కల్లుదుకాణంలో తలదాచుకోవడానికి ప్రయత్నించిండు. కాని, తనను గుర్తించిన దుకాణాదారుడు బయటకు వెళ్ళి 3వందలమంది సైన్యంతో వున్న ఫౌజీదారుని తోలుకొచ్చిండు. వచ్చినవాడు తాను నిర్బంధించిన తనభార్య సోదరుడే. పాపన్నను బంధించి ఖిలాషాపూరులోనే ఖైదు చేసిండ్రు. ఎన్నో రోజులు పాపన్నను తన ధనం జాడలు చెప్పమని ప్రశ్నించి నరికిండ్రు. పాపన్న తలను బహదూరుషా దర్బారుకు పంపించిండ్రు. మొండాన్ని హైద్రాబాదులో ద్వారంమీద వేలాడదీసిండ్రట.
పాపన్న సాంఘిక బందిపోటా?
ఒక తెలంగాణా గౌడు, తాటిగీతకార్మికుడు, పాపన్న కథ ఎన్నో ప్రశ్నలు వేస్తుంది మనల్ని. చివరికాలంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఎందుకున్నడు పాపన్న?. ఎందుకు తన స్వంతభార్యే తనకు ద్రోహం చేసింది? తన కులంవాడే తననెందుకు పట్టించిండు. తనను సమర్థించినవారెవరు? వ్యతిరేకించినదెవరు? కులము, ధనము తనను కాపాడినవ?
రైతుల తిరుగుబాటుదారుల తులనాత్మక అధ్యయనంలో సాంఘికబందిపోటు అన్నమాట చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్ బామ్ సూత్రీకరించిండు. రాజ్యము, భూస్వామి రైతును నేరస్తుడన్నపుడు రైతు తిరుగబడుతడు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటడు. రైతులతోనే ఆ రైతున్నపుడు వారతన్ని నాయకుడిగా చూస్తరు. అతడే సాంఘిక బందిపోటుగా చూడబడ్తడు. అతనిని కీర్తించే జానపదుల వీరగాథలు తయారవుతయి. వాళ్ళనే హాబ్స్ బామ్ ‘నోబుల్ రాబర్స్’ అంటడు. వాళ్ళు నేరస్తులు కాదు. వాళ్ళు ఉద్యమకారులు. తిరుగుబాటుదారులు. కాని వాళ్ళు ప్రవక్తలు కారు. ఆదర్శవాదులంతకన్నా కారు. ఆర్థిక సంక్షోభ సమయాల్లో, ప్రజాపాలనారాహిత్య కాలాల్లో, రైతుల వంటి వారు అనేక సమస్యల నేపథ్యంలో తిరుగుబాటు లెక్క వస్తరు. వారికి వ్యాపారమార్గాలు ఆర్థికసంపత్తిని సమకూర్చే వనరులు. ధనవంతుల ఖజానాలు వారికి అవసరమౌతయి.
జానపదగీతాలు గ్రామీణుల జీవనాన్ని పాపన్నను హీరోగా గీతించినయి. 1700ల ప్రాంతంలో ఏర్పడ ఆర్థిక అనిశ్చితి, సామాజిక భద్రతా లోపాలు పాపన్నవంటి నాయకుణ్ణి పుట్టించినయి. పాపన్న గొప్పవీరుడే కాని, తాను తీసుకున్న కార్యక్రమమేది సామాజికమైంది కాదు. ఆదర్శాలేమి లేవు. గ్రామీణ రైతాంగం నుంచి వచ్చిన పాపన్నను ఆయన కులంతో కీర్తిస్తున్నరు. కాని, పాపన్న సాంఘిక పునాది ఏది?తనను బలపరిచింది ఎవరు? పాపన్న కథను ఏ కులం గుర్తించలేదు. తన ఉద్యమాన్ని కులంతో కలిపి చెప్పలేదు పాపన్న. జానపదగీతాల్లోకెక్కిన పాపన్న కథమాత్రం అన్ని కులాలవాండ్లు పాడుకుంటున్నరు. 1974లో జానపదగాయకుడు, జీన్ రోఘైర్ గుంటూరు జిల్లా కోస్తాప్రాంతంలో పాపన్న గురించిన ఒక జానపదగీతాన్ని రికార్డు చేసిండు. జె.ఏ.బాయిల్ బళ్ళారి జిల్లాలో మరొకపాటను రికార్డు చేసిండు. పాపన్న దాడిచేయాలనుకున్న కోటలన్నీ తెలంగాణాలోనివే. నెల్లూరు, కడప జిల్లాల్లో, దక్షిణ కర్ణాటకలో మలబారుతీరంలో కూడా దాడులు చేయాలనుకున్నాడట. దక్షిణతెలంగాణా నుంచి సుదూరాలకు వెళ్ళిన పాపన్న కథ ఉత్తరతెలంగాణాలో వ్యాపించలేదు.
వేల్చేరు నారాయణరావు ‘గొప్పగా చదువుకున్న పండితులు, సాహిత్యకారులు పాపన్నను ఆదర్శ హిందూ యోధుడుగా, ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడిన వాడిగా చరిత్రలో నిలిపే ప్రయత్నం చేసారు. పాపన్న కథను అందరు అంగీకరించివుంటే అదొక పురాణమయ్యేది.’ అని రాసిండు.
మౌఖిక జానపద వీరగాథలు, ఖాఫీఖాన్ రచనలే పాపన్న చరిత్రకు సాక్ష్యం. హిందూ యోధుడుగా పాపన్న చేసిన యుధ్దాలేవి?. దారులు కొట్టినపుడు పాపన్న ధనవంతులైన స్త్రీలనే (హిందూ, ముస్లింలు) లక్ష్యంగా చేసుకున్నడు. వ్యాపారులు, అన్ని వర్గాల గౌరవనీయులు తన గురించి ఔరంగజేబుకు ఫిర్యాదు చేసిండ్రు. పాపన్నను అణిచివేయడానికి ముందు వెనకముందులాడిన హిందూనాయకులు తర్వాత తమ సైన్యాలను పాపన్న మీదికే పంపించిండ్రు.
1909, 1931లలో అచ్చయిన పాపన్న వీరగీతాలలో అతని దగ్గరి అనుచరుల పేర్లు తెలుస్తున్నయి. వారిలో హసన్, హుస్సేన్, తుర్క ఇమామ్, దూదేకుల పీర్, కోత్వాల్ మీర్ సాహిబ్, హనుమంతు, చాకలి సర్వన్న, మంగలి మానన్న, కుమ్మరి గోవిందు, మేదరి వెంకన్న, ఎరుకల చిట్టేలు, జక్కుల పెరుమాండ్లు, యానాది పాసేలు వున్నారు. అందులో 5గురు ముస్లింలున్నారు. 5గురు కులహిందువులు, మిగతా గిరిజనులు వీరితో తాను హిందూరాజ్య పోరాటం చేసిండని చెప్పడం కష్టం. పాపన్న ముఖ్య అనుచరులు సర్వన్న, పుర్దిల్ ఖాన్లు. పాపన్నతో వీరంతా తెలంగాణలోని సామాజిక నిమ్నస్తరాలవాళ్ళే. భూమిలేని పేదలే.
పాపన్న కోటనిర్మాణంలో పాల్గొన్నది, భూములు దున్ని వ్యవసాయం చేసిన వాళ్ళంతా పేదలే, పేదరైతులే. గ్రామీణ శ్రామికవర్గం ఎంతగా తనకు మద్ధతిచ్చారో అర్థమవుతుంది. ఒకప్రాంత రైతాంగప్రజలు ఎంత గాఢంగా తనను కోరుకున్నారో తెలుస్తుంది. పాపన్నను వ్యతిరేకించింది ధనవంతులైన వ్యాపారులు, కులీనులు, మిలిటరీ అధికారులు. జమీందార్లు కూడా పాపన్నను వ్యతిరేకించిండ్రు. అప్పట్లో ఫౌజ్దార్ల అధికారాలు తగ్గించిబడ్డయి.
యూసుఫ్ ఖాన్ తరిగొండలో పాపన్నతో తలపడ్డప్పుడు జమీందార్లు తమ సైన్యాలతో వచ్చి మొఘల్ సైన్యానికి బాసటగా నిలిచిండ్రు. పాపన్నను నిర్మూలించడమే వారి లక్ష్యం. తమకు పోటీగా పాపన్న జమీందారు హోదాను పొందడం వారికి నచ్చలేదు. మొఘల్ దర్బారులో చక్రవర్తి చేత తలపాగా ధరింపచేస్కుని చట్టబద్ధమైన పాలకుడుగా గుర్తింపబడడం వారికి సహింపరానిదయింది. తరతరాలుగా తాము అనుభవిస్తూ వస్తున్న నాయక పదవి పాపన్నకు దక్కడం వారికి మంట పుట్టించింది.
తెలంగాణా షరీఫ్ సమాజానికి పాపన్న పొందిన సభాగౌరవం కంటగింపైంది. ఉన్నతకులాల్లో పుట్టి, గౌరవనీయులని మన్ననలందుతూ, పట్టణాల్లో జీవిస్తున్న తమకు కల్లుగీతకార్మికుడు, గౌడ పాపన్న సాటివాడు కావడం ఇంతకూడ అంగీకారయోగ్యం కాలేదు. ఖాజీల బంధువర్గపు స్త్రీలను అపహరించిండని, షరీఫ్ వర్గంలోని షా ఇనాయత్ తన స్వంతకూతురు పాపన్న బంధించిన వారిలో వుండటం ఇవన్నీ పాపన్నమీద చక్రవర్తికి ఫిర్యాదు చేయడానికి కారణాలు.
ఒక గౌడుతో సంప్రదించడం యిష్టంలేదన్న చక్రవర్తిని కలిసి వచ్చిన పిదప ఇనాయత్ బాధతో జబ్బుపడి మరణించిండు. కాని, అతని మరణం ఫిర్యాదుమీద ఒత్తిడిని పెంచింది. హైద్రాబాద్ పాలకుడు యూసుఫ్ ఖాన్ పాపన్న వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి ఆదేశించిండు. ఇన్ని ఒత్తిళ్ళు, వ్యతిరేకతల నడుమ పాపన్న పదేండ్లు ఎట్ల రాజ్యమేలిండు.
దోచిన సంపదను ధనంగా మార్చుకుని పాపన్న స్థానిక రైతాంగంలో గొప్ప ధనవంతుడయ్యిండు. అంతులేని ధైర్యం, బలం, ఎత్తుగడలు, నిర్ణయాలు, చేసిన దోపిడీలైనా, పాలనైనా పేదప్రజలకు బాగా నచ్చింది. కాని, భార్యే తన అన్నఫౌజుదారును పాపన్న ఖిలాషాపూరు కోట జైలునుంచి విడిపించింది. హస్నాబాద్ గౌడ్ సైన్యానికి పాపన్నను పట్టించడం పాపన్నకు జరిగిన ద్రోహాలు.
పాపన్నకోటలు బహమనీలు, కుతుబ్షాహీల కోటల నిర్మాణాలను అనుకరించినయి. మొఘల్ దర్బారులో చక్రవర్తిచేత గుర్తింపు, తనకొక ఉపప్రభువు హోదా కలిగించింది. ఎవరినైనా ధిక్కరించినవాడు, అన్నీ అధికారాలను త్రోసి రాజునన్నవాడు ఒక తిరుగుబాటు తెలుగు భూమిపుత్రుడు పాపన్న ఆ రోజులలో గొప్ప నాయకుడు.
సర్వాయి పాపన్న-శివాజీలు
సర్వాయి పాపన్న వద్ద శివాజీ గెరిల్లాయుద్ధవ్యూహ తంత్రాలను నేర్చుకున్నాడని తన పరిశోధనలవల్ల తెలిసింది అని నాతో ఒక చరిత్రకారుడు అన్నారు. తను రాయబోతున్న చరిత్రగ్రంథంలో ఈ విషయాలను ప్రకటించబోతున్నానన్నారు. నన్ను ఇది నిజమేనా అని అడిగారు. నాకు తెలియదని చెప్పాను.
సందేహనివారణ కొరకు నేనపుడు శివాజీ గురించి చదివి ఈ తేదీలను తెలుసుకున్నాను. పాపన్న గురించి మొగలు చరిత్రకారుని(కాఫీఖాన్ రచన) వల్ల చదివినదానిని ఒక అంచనా వేసి, ఇద్దరి వయో తారతమ్యాలు, సమకాలికతలను గణించడానికి ప్రయత్నించాను.
శివాజీ పుట్టింది 19 ఫిబ్రవరి 1627 లేదా 1630
శివాజీ ఛత్రపతిగా పట్టాభిషేకం-1674 జ్యేష్ట శు.త్రయోదశి
శివాజీ మరణించింది 3 ఏప్రిల్ 1680
సర్దార్ సర్వాయి పాపన్న
పుట్టింది సుమారుగా క్రీ.శ. 1650(అనడానికి అవకాశం ఉంది.)
మరణించింది క్రీ.శ. 1710 (60వ యేట అని చరిత్రకారుల కథనం)
పై తేదీలను బట్టి శివాజీ పాపన్నకన్నా వయసులో పెద్దవాడు. పాపన్నకు పాతికేళ్ళు వచ్చేటప్పటికే శివాజీ పట్టాభిషిక్తుడైనాడు. అప్పటికి శివాజీకి 45యేండ్లు దాటివుంటాయి. ఇద్దరి మధ్య వయోభేదం 20సం.లన్నా వుంటుంది. పాపన్న చిన్నవాడు. తన వద్ద శివాజీ యుద్ధవిద్యలు, తంత్రాలు నేర్చుకునే అవకాశం లేదన్నది నా అభిప్రాయం.
శివాజీ పుట్టిన తేది మీద భిన్నాభిప్రాయాలున్నా పాపన్న కన్న శివాజే పెద్దవాడు. పాపన్న పుట్టిన తేది తెలుసుకునే అవకాశం లేదు. తన పుట్టినతేది వుందన్న ధూళ్మిట్ట శాసనాన్ని నేను స్వయంగా చదివాను. కాని, అది పాపన్న పేరున వేసిన శాసనమే కాదు. అందులో ఏ తేదీ పేర్కొనబడలేదు. ఆ శాసనంలో పేర్కొనబడిన వ్యక్తి సౌధరుడు, పోతగౌడు(బొల్లెపల్లి శాసనం ఆధారంగా) అంటే మైలారు దేవుని పూజారి. కనుక అది పాపన్న శాసనమే కాదు.
చారిత్రక ఆధారాలతో ఈ విషయంలో నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను
No comments:
Post a Comment