NaReN

NaReN

Sunday, August 20, 2023

ఉపాధ్యాయుడు స్పందించాడు

ఉపాధ్యాయుడు స్పందించాడు,
ప్రాణాలు కాపాడాడు...
-----------------



పాఠశాల ప్రారంభమయ్యే సమయానికంటే అరగంట ముందే కంగారుగా వచ్చాడు తన తరగతి గది వద్దకు.....
ఎనిమిదవ తరగతి చదివే హరికృష్ణ...

కారణం...
ముందు రోజు తన బూట్లు అక్కడే గది బయట వదిలి మరచిపోయి ఇంటికి వెళ్లిపోయాడు.

ఆ బూట్లు పోతే ఇంకోజత కొనలేని నిరుపేద కుటుంబం తనది. అందుకే అంత ఆత్రంగా వచ్చాడు. అవి అక్కడే ఉండడంతో ఆనందంగా వేసుకోవాలని కాలు దానిలో పెట్టాడు.

అప్పటికే అందులో ఒక నాగుపాము దూరి బూటు లో పడుకొని ఉంది. కాలు తనమీద పడగానే దానికి పారిపోయే అవకాశం లేక ప్రాణభయంతో కసితీరా కాటేసింది. ఎంత కసితో వేసిందంటే పాదం మీద కండ బయటకు వచ్చేలా.. హరికృష్ణ ఆ నొప్పికి తట్టుకోలేక గట్టిగా అమ్మా అని అరిచి బూటు ను విదిల్చాడు.

సరిగ్గా అప్పుడే పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బాషా గారు తన బైక్ లో పాఠశాల లోనికి ప్రవేశించాడు. హరికృష్ణ అరుపు విని బైక్ అక్కడే పడేసి పరుగున వచ్చాడు దగ్గరకు. నాగుపాము బూటు దగ్గరనుండి వెళ్ళడం గమనించి దానిని చంపేశాడు.. కాలు చూడగానే అర్థమైంది ఆయనకు పాము కాటేసింది అని. అందులోనూ విషపురుగు. ఆలస్యం చేస్తే ప్రాణం పోతుంది.

చుట్టూ చూశాడు..
ఇద్దరు విద్యార్థులు అప్పుడే లోపలకు వస్తున్నారు. వారిలో ఒకరిని రమ్మని తాను బైక్ స్టార్ట్ చేసి హరికృష్ణ ను కూర్చోమని ఆ తర్వాత ఇంకో పిల్లాడిని కూర్చోమన్నాడు. ఇంకో విద్యార్థికి హరికృష్ణ తల్లిదండ్రులకు విషయం తెలుపమని చెప్పాడు. 

క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇద్దరు విద్యార్థులను వెనకాల కూర్చొబెట్టుకొని బైకు ను ముందుకు దూకించాడు బాషా సర్.

పాఠశాల ఉన్నది చిన్న గ్రామమైన నగరూరు. హాస్పిటల్ ఉన్నది అక్కడకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడిపత్రి పట్టణంలో... అందులోనూ మూడు కిలోమీటర్లు రోడ్ సరిగాలేదు. నిమిషాల్లో హాస్పిటల్ కు చేరాలి. కాటు బాగా లోతుగా పడింది కాబట్టి విషప్రభావం వేగంగా ఉంటుందని అర్థమైంది. 

వెనక కూర్చున్న అబ్బాయికి తన మొబైల్ ఇచ్చి విద్యార్థులను కన్నబిడ్డలలా చూసుకునే  గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు Sana Sreenivasulu  గారికి కాల్ చేసి విషయం తెలుపమని చెప్పాడు. హరికృష్ణకు ధైర్యం చెపుతూనే బైక్ వంద కిలోమీటర్ల వేగంతో నడిపి పదిహేను నిమిషాల్లో తాడిపత్రి ఆసుపత్రికి చేరుకున్నాడు. అప్పటికే శ్రీనివాసులు సారు తెలిసిన వారిద్వారా హాస్పిటల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం వలన వారు అప్రమత్తమై విద్యార్థికి వైద్యం అందించి ప్రమాదం నుంచి కాపాడారు.

కొన్ని నిమిషాలు ఆలస్యమైనా ప్రాణం పోయేదని బాషా సర్ సమయస్ఫూర్తిని, సాహసాన్ని కొనియాడారు వైద్య సిబ్బంది. కొద్దిసేపటికి అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు, సహచర ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకుని బాషా సర్ ను అభినందించారు.

15.08.2023 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాల సిబ్బంది నన్ను అతిథిగా పిలవడంతో నాకు విషయం తెలిసింది. వెంటనే  శ్రీనివాసులు సర్ సహకారంతో బాషా సర్ ను సన్మానించడం జరిగింది. ధైర్యానికి ప్రతీక అయిన స్వామి వివేకానంద చిత్రపటాన్ని బహూకరించాము.

స్వాతంత్ర్యాన్ని తెచ్చిన వీరులను మనం చూడలేదు కానీ చరిత్ర ద్వారా తెలుసుకొని అభినందిస్తున్నాము.సమయస్ఫూర్తి తో  విద్యార్థికి ప్రాణం పోసిన బాషా సర్ కూడా వీరుడే అని విద్యార్థులకు వివరించాను.

ఉపాధ్యాయుడు...విద్య మాత్రమే కాదు, విలువలు కూడా నేర్పాలి అని ప్రాక్టికల్ గా చూపించారు.

బాషా సర్.... 🙏

ఉపాధ్యాయుల గురించి నీచంగా, నిర్లక్ష్యంగా ఊహించుకుంటున్న ఈ సమయంలో ఇలాంటి వారు కూడా ఉన్నారని తెలియజేయాలనే తలంపుతో ఈ పోస్ట్ పెట్టాను. 
షేర్ చేసి పదిమందికి తెలుపగలరు. 

✍️....

👍👍👍👏👏👏👏

1 comment:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE