NaReN

NaReN

Monday, October 25, 2021

చేసిన సాయం వృధా కాదు !*

 చేసిన సాయం వృధా కాదు !


ఒక అడవిలో పొగరుబోతు ఎలుగుబంటి ఉండేది. ఎవ్వరితోను సరిగా కలిసేది కాదు. మాట్లాడేది కాదు. తన పిల్లలే లోకంగా బ్రతికేది.  అవసరమొచ్చి  ఎవరైనా సాయం అడిగినా  కసిరేది తప్ప  చేసేది కాదు. 


ఒకసారి పిల్లల్ని ఇంటి దగ్గరుంచి  ఆహారం కోసం వెళ్ళింది pసుకుంటూ అది వెళ్తుంటే దానికి రక్షించమని ఎవరో వేసిన కేకలు వినబడ్డాయి. 


కేకల్ని విననట్టే  వెళ్ళబోయింది ఎలుగుబంటి. 


మళ్ళీ రక్షించమన్న కేకలు పెద్దగా వినబడ్డాయి. “ ఎవరు పిలిస్తే నాకేంటి? అరిస్తే నాకేంటి? అవతల పిల్లల ఆకలి తీర్చాలి. వెళ్ళిపోతా” అనుకుని ముందుకే అడుగేసింది  ఎలుగుబంటి.  


ఈసారి మరింత దీనంగా కేకలు వినబడ్డాయి.

ఎలుగుబంటికి ఆగక తప్పలేదు. కేకలెవరివో చూసి వెళ్ళిపోదామనుకుంది. శబ్దం వచ్చిన వైపు వెళ్ళింది. 


అక్కడ ఊబిలో కూరుకుపోయిన ఒక  జింక కనబడింది . ప్రయత్నిస్తున్నా సరే బయటపడలేక చావు భయంతో అరుస్తోంది.  

 ఎలుగుబంటిని చూడగానే చిన్న ఆశ కలిగింది జింకకి. అంతలోనే  అదెవరికీ సాయం చెయ్యదని గుర్తొచ్చి ఆశ వదులుకుంది. కానీ బతుకుమీదున్న తీపితో సాయం చెయ్యమని ఎలుగుబంటిని అడిగింది జింక. 


“అవతల నా పిల్లలకి తిండి ఆలస్యమౌతోంది. తొందరగా వెళ్ళాలి” అని బయల్దేరబోయింది ఎలుగు. 


“నా పిల్లలు కూడా  చూస్తుంటాయి నాకోసం. ఏమీ తెలియని వయసు వాటిది. తల్లిలేని పిల్లల బతుకెంత   కష్టమో తెలియంది కాదు నీకు. నేను బయట పడేలా  సాయం  చెయ్యు” అని బ్రతిమాలింది జింక.  


ఎలుగుబంటి చిరాకు పడుతూ  “ఊబి ఉందో లేదో సరిగా చూసుకోవద్దా? నిన్ను రక్షించడం తప్ప  పనేమీ లేదనుకున్నావా?” అని కసురుకుంది. మళ్లీమళ్లీ జింక బ్రతిమాలేసరికి మూట క్రింద పెట్టి చుట్టూ చూసింది ఎలుగు.  కొంచెం  దూరంలో తాడు కనబడితే అక్కడకి వెళ్ళింది. గట్టు మీదున్న  రైతు పనిముట్లలోని బలమైన తాడుని  అందుకుంది. ఆ  తాడుతో ఊబిలోని జింకను బయట పడేలా చేసింది.  బయటకు వచ్చిన జింక ఎలుగుబంటికి ఎన్నో విధాలుగా ధన్యవాదాలు చెప్పింది. 


‘సర్లే. నీ పొగడ్తలు ఆపు. అవతల నా పిల్లలకు తిండి ఆలస్యమవుతోంది” అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది ఎలుగుబంటి.  


ఇంటికి వెళ్లేసరికి దొడ్లో కుందేలు, కోతి, గాడిద , ఏనుగు మొదలైన  జంతువులు కనబడ్డాయి ఎలుగుబంటికి.  


“ చెరకు గడలు తెస్తున్నట్టు వీటికి  తెలిసిందేమో. ఒక్కటి కూడా ఇవ్వను. ఇవన్నీ నా పిల్లలకే” అనుకుంది ఎలుగుబంటి. 


దారిలో ఉన్న జంతువుల్ని  ప్రక్కకు తప్పుకోమని కసురుకుంటూ గడప దగ్గరకి  వెళ్ళింది ఎలుగు. 


అక్కడ క్రింద పడి ఉంది దాని పిల్ల. దాని కాలికి  ఏదో పసరు రాస్తోంది కొంగ. అది  చూసి కంగారు పడిన ఎలుగు బంటి  “నా పిల్లకి ఏమైంది? పసరు ఎందుకు రాస్తున్నావు?” అని అడిగింది. 


“ఇది బయట ఆడుతుంటే పాము కాటేసింది. అది చూసిన  కోతి మామ మాతో  చెప్పాడు. సమయానికి  నువ్వు ఇంట్లో లేవు  కదా. వదిలేస్తే ప్రాణానికే ప్రమాదం.  అందుకే మేమంతా వచ్చాము. కొంగబావకు వైద్యం తెలుసని కుందేలు చెప్పడంతో చిలుక వెళ్లి పిలుచుకు వచ్చింది.  విషానికి విరుగుడు ఆకులు వెతికింది బాతు. ఆకుల్ని నూరి  పసరు రాస్తోంది కొంగ. ఇంతలో నువ్వొచ్చావు” అని జరిగిందంతా చెప్పింది ఏనుగు. 


“అయ్యో!  నా పిల్లని మీరు కాపాడారా? మీరే  లేకపోతే అది బ్రతికేది కాదు. మీకెప్పుడూ ఏమీ  చేయకపోయినా , మీతో మంచిగా ఉండకపోయినా కూడా మనసులో పెట్టుకోకుండా కాపాడారు” అంది ఎలుగుబంటి. 


అప్పుడే అక్కడకు వచ్చిన జింక “నువ్వేమీ సాయం చేయకపోవడమేమిటి?  ఇప్పుడే నన్ను ఊబిలో నుండి కాపాడావు ... నువ్వక్కడ నన్ను  కాపాడితే ఇక్కడ నీ పిల్లను వీళ్ళు కాపాడారు. అంతే” అంది. 


మిగతా జంతువులు ఎలుగుబంటి చుట్టూ చేరి జింకను కాపాడినందుకు  అభినందించాయి. 


“నీలోనూ మార్పు వచ్చింది. సాయం చెయ్యడానికి ముందుకు రాని నువ్వు ఈరోజు జింకని కాపాడావు. తెలిసో తెలియకో మనమెవరికైనా సాయం చేస్తే ఇంకో రూపంలో మనకు తిరిగి దొరుకుతుందని అమ్మ చెప్పేది. ఇప్పుడు రుజువయింది “ అంది చిలుక. 


“నిజమే. నేను విసుక్కుంటూనే జింకని రక్షించాను. కానీ చేసిన సాయం వూరికే పోలేదు. మీ రూపంలో నా పిల్లని రక్షించింది” అంది ఎలుగుబంటి.  


“అడవిలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఆపదలు వస్తుంటాయి. ఒకరికొకరు సాయం చేసుకుంటూ మనల్ని మనమే కాపాడుకోవాలి. అవసరంలో ఉన్నవారికి సాయపడమని పిల్లలకు కూడా చెప్పాలి” అంది ఏనుగు. అవును అన్నాయి జంతువులన్నీ. 

 

---***----

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE