NaReN

NaReN

Thursday, November 25, 2021

నీ శత్రువులు ఎవరో తెలుసా

 నీ శత్రువులు ఎవరో తెలుసా

      


 *మనిషికున్న ప్రబల శత్రువుల్లో ఆరోది అసూయ. కోరిక, కోపం, మోహం, లోభం, అహం- వీటిని జయించిన ఎంతటి తపోధనులు అయినా... అసూయకు అతీతులు కాదని చాటే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇద్దరు మునులు కఠోర తపస్సు చేస్తున్నారు. కొంత కాలానికి దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని ఒకరిని అడుగుతాడు. సమీపంలో మరో ముని తపస్సు చేస్తున్నాడు, అతడు కోరిన దానికి రెట్టింపు నాకు ఇవ్వమని అడుగుతాడు. దేవుడు రెండో ముని వద్దకు వెళ్ళి, మొదటి ముని కోరిన కోరిక తెలిపి, నీకేం కావాలి అంటాడు. వెంటనే ఆ రెండో ముని ‘నాకు ఒక కన్ను పోవాలి’ అని కోరుకుంటాడు. దేవుడు తథాస్తు అంటాడు. ఫలితం తెలిసిందే!* 


 *బాల్యంలో ఊహ కలిగినప్పటి నుంచే అసూయ మొదలవుతుంది. అమ్మ ఒక పిల్లవాడిని ముద్దు చేస్తే మరొకరికి అసూయ, అసహనం కలుగుతాయి. రుక్మిణిపై అసూయ కారణంగానే శ్రీకృష్ణుణ్ని సత్యభామ వీధిలో విక్రయించి, తులాభారం వరకు తీసుకెళ్ళింది. అసూయను పూర్తిగా త్యజించి అప్రమత్తంగా ఉండేవారు సమస్త విశ్వంలోని ప్రేమను పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు. దాన్ని నిస్వార్థంగా పంచగలుగుతారు.* 


 *‘అసూయ కలిగినవాళ్లు ప్రశాంతంగా ఉండలేరు. ఎప్పుడూ అసంతృప్తితో, ప్రతీకారేచ్ఛతో, సందర్భం కోసం ఎదురు చూస్తుంటారు. తమకు ఎంత ఉన్నా ఎదుటివారికి ఉన్న ‘కొంత’ను చూసి అసంతృప్తితో రగిలిపోతుంటారు. నూరుగురు అన్నదమ్ములు, రాజ్యం, సకల సంపదలున్న దుర్యోధనుడు- దాయాదులైన పంచ పాండవులకు సూది మొన మోపినంత భాగం కూడా ఇవ్వననడం అసూయకు పరాకాష్ఠ. అసూయతో సాధించేది శూన్యమని గ్రహించలేకపోవడం* *మూర్ఖత్వం. అసూయ కట్టెకు అంటుకున్న నిప్పు లాంటిది. అసూయకు ఆశ్రయం ఇస్తే వారిని అది చెదపురుగులా తొలుస్తూ, ఆఖరికి అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తుంది.* 


 *అసూయను పట్టుకుని శిఖరాగ్రం వరకు ఎవరైనా చేరారనుకోండి. అక్కడి నుంచి కిందకు చూస్తే, ఏ ఒక్క బంధం కనుచూపు మేరలో కనిపించదు. పైకి వెళ్ళలేక, కిందకు రాలేక, త్రిశంకు స్వర్గమనే శూన్యంలో ఒంటరిగా మిగలాలి.* 



No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE