NaReN

NaReN

Wednesday, November 24, 2021

 ఆకాశం-మనకోసం

  🌺 ఆకాశం-మనకోసం🌺

                 


గేటు తెరుచుకున్న 🏠చప్పుడయింది.


అప్పుడే నిద్రపడుతున్న శంకరానికి నిద్రా

భంగం అయింది.


    తలతిప్పి ⏰గడియారం వంక చూశాడు.

సమయం రాత్రి పదకొండు అయింది. “ఈ సమయంలో వచ్చింది ఎవరా? అని ఆలోచించలేదతను. వచ్చింది నాన్న కోసమే!” అని మాత్రం అనుకున్నాడు.


    అంతలో పక్కగది తలుపు తెరుచుకుంది. "నువ్వా రమణయ్యా! ఈ సమయంలో వచ్చావు. మందేమైనా కావాలా?" అని తండ్రి అడగడం శంకరానికి వినిపిస్తూనే ఉంది.


     "ఉన్నట్లుండి ఆయాసం వచ్చిపడింది. ఊపిరి సలపడం లేదు. అందుకే ఈ సమయంలో వచ్చాను. ఏమీ అనుకోకు

క్రిష్ణమూర్తీ!" అన్నాడు రమణయ్య.


 “మరేం ఫర్వాలేదు.అలా కూర్చో! మందు ఇస్తాను" అన్నాడు క్రిష్ణమూర్తి. అతనిచ్చిన మందు వేసుకుని అయిదు నిముషాల తరువాత వెళ్లిపోయాడు రమణయ్య.


  క్రిష్ణమూర్తి బయట గేటు వేసి వచ్చి మంచం మీద నడుము వాల్చాడు.నిద్రాభంగం అయిన శంకరానికి మరిక నిద్ర పట్ట

లేదు. అందుకు కారకుడైన తండ్రి మీద పీకలదాకా కోపం వచ్చింది. అది వెంటనే వెళ్లగక్కకపోతే మరిక  నిద్రపట్టదని

నిశ్చయం అయ్యాక మంచం మీద నుంచి లేచి తండ్రి గదిలోకి వెళ్లాడు.


  “ఏం శంకరం! నిద్ర పట్టలేదా?" పలకరించాడు క్రిష్ణమూర్తి.“పట్టిన నిద్ర నీ వలన పాడైంది. అయినా మందులు ఇవ్వడానికి వేళాపాళా లేదా? ఎప్పుడు పడితే అప్పుడు రావద్దని వాళ్లకు చెప్పు" అన్నాడు విసుగ్గా.


“వచ్చే రోగం వేళాపాళా చూసుకుని వస్తుందా? ఏదోచేతనైన సహాయం చేస్తున్నాను. కోపగించకు" అన్నాడు

క్రిష్ణమూర్తి.


"నీ మటుకు నీవుండక ఎందుకొచ్చిన సహాయాలు? ఇంటిని సత్రం చేస్తున్నావు. ఎప్పుడూ ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు" చికాకు పడుతూ తన గదిలోకి వెళ్లిపో

యాడు శంకరం.


    కొడుకు మాటలకు క్రిష్ణమూర్తి మనసు చివుక్కు మంది. అది అతనికి కొత్తేమీ కాదు. ప్రతీసారీ బాధనిపిస్తూనే ఉంటుంది. ప్రక్కవాడికి సహాయం చేయడం తప్పా? మనిషికి మనిషి సహాయం చేయకపోతే మరెవరుచేస్తారు? మనిషి తన మటుకు తాను ఉంటే కుంచించుకుపోతాడు. పదిమందికి సహాయం చేస్తేపరిమళిస్తాడు అన్నది అతని భావన. అతను అలాగే

ఉంటాడు. అందరూ అలా ఉండాలని అనుకుంటాడు.


    శంకరానికి నిద్రపట్టలేదు. తండ్రితో అంత కటువుగా మాట్లాడకుండా ఉండ వలసింది అనుకున్నాడు.


    శంకరానికి పదేళ్ల వయసు వచ్చేసరికి

అతని తల్లి కాలం చేసింది. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా క్రిష్ణమూర్తి మరలా రెండో పెళ్లి చేసుకోలేదు. శంకరాన్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాడు. ఆ అభిమానం

శంకరానికి లేకపోలేదు. వద్దనుకుంటూనే తండ్రి మీద కోపగించుకుంటూ ఉంటాడు.


      తలతిప్పి చూసిన శంకరానికి భార్య ఇందిర, అయిదేళ్ల కొడుకు అనిల్ నిద్రపోతూ కనిపించారు.శంకరానికి కంటిమీదకు కునుకు రాలేదు.


   తెలతెలవారుతుండగా బయట గేటు తీసిన చప్పుడయింది.అప్పుడే నిద్ర పడుతున్న శంకరానికి వెంటనేమెలకువ వచ్చింది. 'ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. అప్పుడే తగలడ్డారు' అని మనసులో తిట్టుకున్నాడు.


   క్రిష్ణమూర్తికి యోగాలో మంచి ప్రవేశం ఉంది.  రిటైరయ్యాక నలుగురిని పిలిచి ఆసనాలు వేయించడం, ధ్యానం

చేయించడం వంటివి నేర్పించడం మొదలు పెట్టాడు.


    ఎప్పుడూ పదిమందికి తక్కువ కాకుండా జనం అతని దగ్గరకు వస్తూనే ఉంటారు.

అది శంకరానికి నచ్చదు. ఎవరింటి దగ్గర వాళ్లుయోగా చేసుకోవచ్చు కదా! మా ఇంటి మీదకు వచ్చిపడతారెందుకు? అనుకుంటాడు. అదే విషయం తండ్రితో

వాదించాడు కూడా!


    ఎవరింటి దగ్గర వాళ్లుఅయితే

బధ్ధకిస్తారు.అదే పదిమందీ ఒక చోట చేస్తే శ్రద్ధగా చేస్తారు.మనిషి పది మందితో కలిస్తే చాలా ప్రయోజనాలుంటాయి. నీవు కూడా వచ్చి వాళ్లతో పాటు యోగా చేయి. ఆరోగ్యానికి ఆరోగ్యం.మానవ సంబంధాలు మెరుగుపడతాయి" అని చెప్పేవాడు

క్రిష్ణమూర్తి.ఆ మాటలు శంకరానికి రుచించేవి కావు.


   సమయం అయిదు గంటలు అయింది. శంకరం మరలా నిద్రపోవడానికి ప్రయత్నించాడు గాని నిద్ర పట్టలేదు.

అతనికి త్వరగా నిద్ర పట్టదు. పట్టినా చిన్న చప్పుడుకే మెలకువ వచ్చేస్తుంది.

అది తెలుసుకున్న క్రిష్ణమూర్తి ఒకసారి 'శంకరం! నీవు ఇష్టపడే ఒంటరితనం నీలో అభద్రతా భావంపెంచింది. నీ సంతోషం హరిస్తున్నది. అది నీవు గ్రహించడం లేదు. నీ మటుకు నీవుంటే నీ సంతోషం నీది. నీ

దుఃఖం నీది. బయటకి వచ్చి పదిమందితో పంచుకుంటే నీ సంతోషం మరింత పెరుగుతుంది. దుఃఖం తగ్గుతుంది" అని సలహా ఇచ్చాడు. తండ్రి మాటలు ఛాద

స్తంగా కొట్టిపారేశాడు శంకరం.


    ఏడు గంటలకు యోగా క్లాస్ పూర్తి అయింది. వచ్చినవారు వెళ్లిపోయారు. క్రిష్ణమూర్తి డాబా మీద నుంచి కిందకు దిగాడు. అప్పటికీ శంకరం కాఫీ తాగి పేపర్ 

చదువుకుంటున్నాడు.


   “కొంచెం సేపు ధ్యానం చేయకూడదూ? ఏకాగ్రత పెరుగుతుంది" అన్నాడు క్రిష్ణమూర్తి. శంకరం పేపర్ లోంచి

తలెత్తకుండానే “అవన్నీ పనీపాటా లేనివారికి. నాకెందుకు?" అన్నాడు.


క్రిష్ణమూర్తి మౌనంగా లోనికి నడిచి అప్పుడే నిద్రలేచిన మనవడ్ని పలకరించి వాడితో సూర్యనమస్కారాలు ప్రాక్టీస్ చేయించ

సాగాడు. అది చూసిన శంకరం “ఈయనగారు ఎవరినీ వదలడు" అనుకున్నాడు.


    శంకరం స్నానం చేసి, టిఫిన్ తిని ఆఫీస్ కి బయలుదేరబోతుండగా క్రిష్ణమూర్తి అతని దగ్గరకువచ్చాడు.


  “ఏమిటి?” అడిగాడు శంకరం. అతను,

శంకరానికి అయిదు వందలు అందించి “ఈ

చిరునామాకు మనీ ఆర్డర్ పంపించు" అని

చెప్పాడు. "ఎందుకట?" వివరం అడిగాడు శంకరం.


    "ఆ అబ్బాయికి చిన్న వయసులోనే గుండెజబ్బట. ఆపరేషన్ కి ఆర్ధిక

సహాయం కోరుతూ పేపర్ ప్రకటన

ఇచ్చారు. నేను చేయగల సహాయం

చేస్తున్నాను" చెప్పాడు క్రిష్ణమూర్తి. 


"అవన్నీ దొంగ ప్రకటనలు" చెప్పాడు శంకరం."మనిషి మీద అంత అపనమ్మకం పెంచుకోకు శంకరం! మనిషి, మనిషిని నమ్మకపోతే అది మానవ మనుగడకే ముప్పు"  కొడుకును హెచ్చరించాడు క్రిష్ణమూర్తి.


    అంతలో అటు వచ్చిన ఇందిర, భరతో 'మామయ్య పెన్షన్ డబ్బు ఆయన ఇష్టం వచ్చినట్లు వాడుకోమని మీరే కదా ! చెప్పారు.

ఆయన చెప్పినట్లు మని ఆర్డర్ చేయండి.

సరిపోతుంది" అన్నది.


  కృష్ణ మూర్తికోడలి వంక ప్రేమ పూర్వకంగా చూశాడు.శంకరం ,భార్య వంక అదోలా 

చూసి బయటకు నడిచాడు.


  శంకరం స్కూటర్ స్టార్ట్ చేస్తూ "అనిల్ ని ఒకసారి బయటకు పిలువు" అని భార్యకు చెప్పాడు."అనిల్ !డాడీ పిలుస్తున్నారు" కేక వేసింది ఇందిర.


    వీడియో గేమ్ ఆడుకుంటున్న అనిల్ బయటకురాకుండానే "బై డాడీ" అని అరిచి చెప్పాడు.కొడుకు బయటకు రాక పోవడం

శంకరానికి బాధ కలిగించింది. ఆఫీస్ కి బయలుదేరిపోయాడు.


    మనవడు బయటకు రాకుండానే బై చెప్పడం గమనించిన క్రిష్ణమూర్తి "మనిషి మనసుతో చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీయాంత్రికం అయిపోతున్నాయి. కొంత కాలానికి మనిషి, మనసులేని మరబొమ్మ అయిపోతాడు" అనుకున్నాడు.


   అతను మనవడి దగ్గరకు వెళ్లి 'అని ల్! నాన్న పిలిచినప్పుడు బయటకు వెళ్లి ప్రేమగా బై చెప్పాలి.అప్పుడతని మనసుకు సంతోషం కలుగుతుంది.వీడియో గేమ్ ఎప్పుడూ ఉంటుంది. డాడీ మళ్లీ

సాయంత్రానికి గాని రాడు" అని చెప్పాడు.


   “అలాగే తాతయ్యా! రేపటి నుంచి బయటకు వెళ్లి డాడీకి బై చెప్తాను" అన్నాడు అనిల్. "కొడుకు కంటే మనవడే నయం. విషయం గ్రహించాడు" అనుకున్నాడు క్రిష్ణమూర్తి.


ఆయనకు భోజనం వడ్డించే సమయంలో

“మామయ్యా! ఎల్లుండి అనిల్ పుట్టినరోజు. మీ యోగా వాళ్లను భోజనానికి పిలుద్దాం" అన్నది. ఇందిర. అతను కోడలు

వంక అపురూపంగా చూశాడు. అతనికి శంకరం ఒక్కడే కొడుకు, కూతుళ్లు లేరు. అందుకని అతను కోడలులోనే కూతురిని చూసుకుంటాడు. ఆ అమ్మాయి కూడా అంతే.

మామగారిని పన్నెత్తి మాట అనదు. గౌరవం

చూపిస్తుంది. ప్రేమ కురిపిస్తుంది.


   "వాళ్లను పిలవడం శంకరానికి ఇష్టం

ఉండదేమో!" అన్నాడు క్రిష్ణమూర్తి. “ఆయనఎవరినీ పిలవొద్దనే అన్నారు. అయినా రోజూ మన ఇంటికి వచ్చేవాళ్లకు చెప్పక పోతే ఏం బాగుంటుంది? మీరు ఆహ్వా

నించండి. మీ అబ్బాయికి నేను నచ్చ చెప్తానులెండి" అన్నది ఇందిర.

“అలాగేనమ్మా!" అన్నాడు. క్రిష్ణమూర్తి.


  ఆ సాయంత్రం శంకరం ఇంటికి వచ్చాక “మనీ ఆర్డర్ పం పావా" అని అడిగాడు క్రిష్ణమూర్తి. "పంపాను. అది చూసి మా కొలీగ్ నవ్వాడు"అని చెప్పాడు శంకరం.


  "ఎందుకు నవ్వాడు?" అడిగాడు క్రిష్ణ మూర్తి."తనకు ఉన్నదేదో మనవడికి ఇవ్వాలి గాని బయట వాళ్లకు దానం చేయడం ఏమిటి! అని కామెంట్ చేశాడు" చెప్పాడు శంకరం. “నువ్వేమన్నావు?"ఆరా తీశాడు క్రిష్ణమూర్తి. "అది నిజమే కదా! అందుకే మౌనం వహించాను" చెప్పాడుశంకరం.


    "మనవాళ్లకే ఉపయోగ పడాలి అనుకోవడం  స్వార్థం అవుతుంది.అందరూ మనవాళ్లే అనుకోవడం ప్రేమ అనిపించుకుంటుంది. మనిషి ప్రేమించడం నేర్చుకోవాలని నీ కొలీగ్ కి చెప్పు" అన్నాడు క్రిష్ణమూర్తి.


     శంకరం తండ్రివంక విసుగ్గా చూసి ఊరుకున్నాడు.


 వ్   శంకరం కాఫీ తాగుతుండగా "అనిల్  పుట్టిన రోజుకి యోగా వాళ్లను పిలవమని మామయ్యకు చెప్పాను" అంది ఇందిర.

“నేననుకోవడం ఈ ఆలోచన నీది కాదు. మా నాన్నది" అన్నాడు శంకరం. ఇందిర కాదని చెప్పినాశంకరం వినిపించుకోలేదు.


   కాఫీ తాగడం పూర్తయ్యాక తండ్రి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో క్రిష్ణమూర్తి

మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు.

“బాబు పుట్టిన రోజుకి యోగావాళ్లను పిలుస్తానన్నావట. వాళ్లు రావడం నాకిష్టం లేదు"చెప్పాడు శంకరం.


  “అయితే మీ ఆఫీస్ స్టాఫ్ ని పిలువు. పుట్టిన రోజునాడు పదిమంది వచ్చిబాబు మీద అక్షింతలు వేసి దీవిస్తే మంచిది"

చెప్పాడు క్రిష్ణమూర్తి.


“మావాళ్లు బిజీ. రాలేరు" చెప్పాడుశంకరం. “ఇంట్లో టీవీ చూస్తూ కూర్చోవడం,

ప్రక్కింటి వాళ్లతో కూడా సెల్ ఫోన్ లో

మాట్లాడ్డం ఇదేగా మీ దృష్టిలో బిజీగా

ఉండడం?" ప్రశ్నించాడు క్రిష్ణమూర్తి.


 “అదేం కాదు. పిల్లల్ని కష్టపడి చదివిం చడం, టాలెంట్ పరీక్షలు రాయించడం వంటి

పనుల్లో వాళ్లు బిజీ" చెప్పాడు శంకరం.

“పిల్లల మనసుల్ని చదువుల పేరుతో

మీరు ఎదగనివ్వడం లేదు. మొగ్గలుగా ఉండగానే తుంచేస్తున్నారు. మానవ సంబంధాలు దెబ్బతినడానికి ఇది ఒక కారణం" అన్నాడు క్రిష్ణమూర్తి,


   అంతలో అక్కడకు వచ్చిన ఇందిర,

భర్తతో “రోజూ మన ఇంటికి వస్తున్నారు.

ఏనాడూ మనం కాఫీ ఇచ్చింది కూడా లేదు.

ఒక్క రోజైనా పిలిచి పలకరిస్తేబాగుంటుంది" అన్నది.


  శంకరం భార్య వంక గుర్రుగా చూశాడు.

ఆ రాత్రి క్రిష్ణమూర్తికి చాలాసేపు నిద్రపట్ట

లేదు. అతను తరిగిపోతున్న మానవ సంబం

ధాల గురించి ఆలోచించాడు. యంత్రాల మధ్య పడి మనిషి కూడా ఒక యంత్రంగా మారిపోతున్నాడు. మనిషికిమనసే తరగని ఆస్తి అన్న సత్యం మరచి పతనాన్ని కొని

తెచ్చుకుంటున్నాడు” అని ఆలోచించాడు. 


   అనిల్ పుట్టిన రోజు వచ్చింది. ఆ రోజు సాయంత్రం క్రిష్ణమూర్తి పిలుపు అందుకున్న యోగా బృందం వాళ్లింటికి వచ్చింది. బాబుకి నీతి కథల పుస్తకాలు, ఆటబొమ్మలు

తెచ్చిచ్చారు. తాము తెచ్చిన స్వీట్స్ బాబు చేత తినిపించారు. అక్షింతలు వేసి దీవించారు. పాటలు పాడి అనిల్ నిఆనందపరిచారు. వాడి చేత ఆడించారు, పాడించారు.

శంకరంతో కూడా కలుపుగోలుగా మాట్లాడారు.


 వ ఎందుకో తెలీదుగానీ శంకరానికి  కూడా

ఆ సాయంత్రంఆనందంగా గడిచిందనిపించింది. వాళ్లు వచ్చి ఉండకపోతే

ఆ వేడుకకు అంత నిండుదనం వచ్చి ఉండేది కాదనుకున్నాడు.


వాళ్లందరూ వెళ్లాక క్రిష్ణమూర్తి, కొడుకుతో “మావాళ్లు రావడం నీకేమైనా ఇబ్బందిగా అనిపించిందా?" అని అడిగాడు.


“అటువంటిదేం లేదు. సంతోషంగానే అనిపించింది"మనస్ఫూర్తిగా చెప్పాడు శంకరం.


“శంకరం! ఒక సత్యం చెబుతాను. నాది ఛాద

స్తంగా భావించకుండా మనసు పెట్టి అలోచించు.మొక్కను తెచ్చి గదిలో పెడితే వాడిపోతుంది. బయట పెడితే చిగురిస్తుంది. దానికి జీవం పోసేది సూర్యకిరణం. ఇదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది. ఒంటరిగా

గదిలో కూర్చుంటే మనసు చచ్చిపోతుంది. బయటకువెళ్లి పదిమందితో గడిపితే అది సేద తీరుతుంది. మనసుకు ప్రాణం పోసేది  ప్రేమ అని మరువకు" అని

చెప్పాడు క్రిష్ణమూర్తి. 


   ఎప్పటిలా ఈసారి తండ్రిమాటలు శంకరం ఖండించలేదు. మౌనం వహించాడు.

ఆ రాత్రి క్రిష్ణమూర్తికి గుండెలో నొప్పిగా అనిపించింది. కొడుకును నిద్ర లేపి విషయం చెప్పాడు.ఎప్పుడూ ఏ నొప్పీ అనని తండ్రి ఒకేసారి గుండెనొప్పి అనగానే శంకరం కంగారుపడ్డాడు. "హాస్పిటల్ కి వెళ్దాం!" అన్నాడు. 


   “ఉదయం వెళ్దాం" అంటూ క్రిష్ణమూర్తి హోమియో మందులేసుకుని కళ్లు

మూసుకుపడుకున్నాడు. శంకరం తండ్రి మంచం పక్కనే పడక కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.


అర్ధరాత్రి చూస్తే తండ్రి ఊపిరి పీలుస్తున్నట్లు అనిపించలేదు. నాడి చూసిన శంకరం తండ్రి ప్రాణం

పోయినట్లు గ్రహించి కంట తడి పెట్టుకున్నాడు.విషయం తెలుసుకున్న ఇందిర, అనిల్ పెద్దగా ఏడవ సాగారు. 


   బంధువులకు, స్నేహితులకు కబుర్లు అందాయి.అంత దుఖం లోనూ శంకరానికి

ఆశ్చర్యం కలిగించింది ఏమంటే కబురు చేసిన వారి కంటే వచ్చిన వారు పది రెట్లున్నారు.


   ఇంటి ముందున్న రోడ్డు అంతా జనంతో నిండిపోయింది. అందరూ విషాద వదనాలతో కనిపించారు.


క్రిష్ణమూర్తి మంచితనం గురించి,అతను తమకు చేసిన సహాయం గురించి కథలు కథలుగా చెప్పుకోసాగారు.


  “శంకరం! పూలదండలోని దారం బయకు కనిపించదు.కానీ అది పూలనన్నింటినీ దగ్గరకు చేరుస్తుంది.ప్రేమ కూడా అంతే! అది బయటకు కనిపించదు. కానీ

మనుషులనందరినీ దగ్గరకు చేరుస్తుంది" అన్న తండ్రిమాటలు గుర్తుకొచ్చాయి శంకరానికి.


   మధ్యాహ్నానికి శవయాత్ర మొదలయింది. పాడెమోయడానికి చాలామందిముందుకు వచ్చారు. భుజం మార్చుకుంటూ తమ అభిమానం చాటుకున్నారు. సాయంత్రానికి అంత్యక్రియలు కార్యక్రమం ముగిసింది.


  ఆ తరువాత ప్రతీరోజు ఎవరో ఒకరు వచ్చి శంకరాన్ని కలిసి అతని తండ్రి మంచితనాన్ని పొగిడి, అతనికి ఓదార్పు మాటలు చెప్పేవారు. పెద్దకర్మ కూడా జరిగిపోయింది. ఇక

అంతటితో అంతా ముగిసిపోయిందని ఇక ఎవరూ తమఇంటికి రారని ఊపిరి 

పీల్చుకున్నాడు శంకరం.ఆ రాత్రి గాఢంగా నిద్రపోయాడు. 


  తెలతెలవారుతుండగా మెలకువ వచ్చింది. తండ్రి చనిపోయేవరకూ ప్రతీ రోజూ ఆ సమయానికి బయట గేటు తెరుచుకునేది. డాబా మీద తండ్రి, వచ్చినవారితో కలసి ఆసనాలు వేసేవాడు.వాళ్ల మాటలు, చిన్న చిన్న శబ్దాలు లీలగా వినిపించేవి.

అప్పట్లో వాళ్ల వలన నిద్రపాడైందని తిట్టుకునేవాడుశంకరం. ఇప్పుడా నిశ్శబ్దం అతని మనసుకు బాధను కలిగించింది.


    భోజనం చేసి ఆఫీసుకి బయలుదేరి నప్పుడు పిలవకుండానే అనిల్ బయటకు వచ్చి బై చెప్పాడు. 'పిలిచినా రానివాడివి. ఈరోజు పిలవకుండానే వచ్చి బై

 చెబుతున్నావు. ఏమిటి విశేషం?" అడిగాడు శంకరం.


   “తాతయ్య చెప్పారు. నేను బయటకు వచ్చి నీకు 'బై' చెబితే నీ మనసుకు సంతోషం కలుగుతుందట" చెప్పాడుఅనిల్. శంకరం కళ్లముందు తండ్రి రూపం కదలాడింది.

మనసును ఎవరో మెల్లగా స్పృశించినట్లు

అనిపించింది.కన్నుల్లో చెమ్మ చేరింది.

కొడుక్కు ' బై' చెప్పి బయలుదేరి పోయాడు.

 

   ఆ సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు కూరగాయల దుకాణానికి వెళ్లాడు. దుకాణం అతను ఆప్యాయంగా పలకరించి “నాన్నగారు పోయారని తెలిసింది. ఊరిలోలేక

రాలేక పోయాను. మహానుభావుడు. ఈ దుకాణం పెట్టుకోడానికి బ్యాంక్ లోన్ ఇప్పించి సహాయం చేశాడు.అతన్ని ఎప్పటికీ మరచిపోలేను" అని చెప్పాడు.


  “నాన్న కనిపించకుండా ఎంత చేశాడు?” అనుకున్నాడు శంకరం. నెల రోజుల తరువాత శంకరానికి ఒక విషయం అర్థమయింది. తను భావించినట్లు చనిపోవడంతో తండ్రి అధ్యాయం ముగిసిపోలేదు. ప్రతిరోజూ ఎవరో ఒకరు క్రిష్ణమూర్తి సహాయాన్ని, మంచితనాన్ని, ప్రేమను శంకరం దగ్గర గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.


  ఒకరోజు శంకరం టవల్స్ కొనడానికి బట్టల కొట్టుకువెళ్లాడు. అది పేరుమోసిన బట్టల దుకాణం. ఆ దుకాణం

యజమాని శంకరాన్ని చూడగానే పలకరింపుగా నవ్వి“మీరు క్రిష్ణమూర్తిగారి అబ్బాయి కదూ!” అని కూర్చోబెట్టి మర్యాద చేశాడు.


     “అప్పుడప్పుడూ మీ నాన్నగారు వచ్చి ఇక్కడ కూర్చునేవారు. ఒకసారి నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నాననిచెప్పాను. మానసిక అశాంతి వలన అయి ఉంటుంది.ధ్యానం చేయమని సలహా ఇచ్చారు. ధ్యానం ఎలా చేయాలో కూడా వివరించారు. అప్పటినుంచి ధ్యానం చేస్తున్నాను. మనసు చాలా ప్రశాంతంగా ఉంటున్నది.ఆయన చనిపోవడం దురదృష్టకరం" అని బాధపడ్డాడు

దుకాణదారు.


తండ్రి ఎందరి మనసుల్లోనో నిలిచి పోయాడు అన్న సత్యం గ్రహించేసరికి శంకరానికి దిగులుగా అనిపించింది. అటు

వంటి తండ్రిని తను ఖాతరు చేసేవాడు కాదు. ప్రేమ చూపించేవాడు కాదు. ప్రతి చిన్న విషయానికి తప్పు పట్టేవాడు. శంకరం మనసులో తీవ్రంగా బాధపడ్డాడు.


   అతను ఇల్లు చేరగానే ఇందిర ఒక ఉత్తరం అందించింది. చనిపోయిన తండ్రి పేరున ఉన్నదా ఉత్తరం.శంకరం కవరు చింపి చదివాడు.


     "శ్రీయుతులు క్రిష్ణమూర్తి గారికి! నమస్సులు. మీవంటి వాళ్లు పంపిన విరాళం చిన్న మొత్తము కావచ్చు. కాని అది

కష్టకాలంలో నాకెంతో ధైర్యాన్నిచ్చింది. నేను ఒంటరిని కాదు.నాకు తోడుగా చాలామంది ఉన్నారన్న ఆత్మసంతృప్తిని కలిగించింది. మీకు ధన్యవాదాలు... ఇట్లు .. గోపీ

అని ఉందా ఉత్తరంలో.


   శంకరం గోడకు తగిలించిన తండ్రి ఫోటో వంకచూశాడు. “శంకరం! మనిషి- నేను, నా కుటుంబం అన్న సంకుచితత్వం నుంచి బయటపడి మనం - మన వసుధైక

కుటుంబం అన్న విశాల దృక్పథం అలవరచుకోవాలి" అని చెబుతున్నట్లు అనిపించింది.


ఆ రాత్రి శంకరానికి నిద్ర కరువయింది. తనకు,తండ్రికి తేడా ఏమిటో అతను స్పష్టంగా గ్రహించగలిగాడు.తన తండ్రి మనసున్న మనిషి. తను మనసులేని మరబొమ్మ.తనకు జీవన సౌందర్యం తెలియదు. అదెలా ఉంటుందో తండ్రి తెలియబరిచాడు.


    ఒక ఆదివారం అతను తన తండ్రి బ్రతికి ఉండగా యోగాసనాలు వేయడానికి తమ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరి ఇంటికి వెదుక్కుంటూ వెళ్లాడు. “మా నాన్నగారు చనిపోయారని మీరు మా ఇంటికి రావడం మానుకోకండి. నేనూ మీతో కలుస్తాను. యోగాతో నాన్నగారికి అంజలి ఘటిద్దాం" అని ఆహ్వానించాడు. అందుకు వారందరూ

సంతోషంగా తమ సమ్మతి తెలిపారు.


     మరునాడు తెలతెలవారుతుండగా శంకరం ఇంటి బయటి గేటు తెరిచాడు. వస్తున్న వారందరికీ హృదయ పూర్వకంగా ఆహ్వానం పలికాడు. డాబా పైకి వెళ్లి వాళ్లతో

పాటు ఆసనాలు వేశాడు. ఆ తరువాత ధ్యానంలో కూర్చున్నాడు.


    మనసులో తండ్రి రూపం కనిపించింది. “శంకరం!మనిషి తలుపులు మూసుకుని ఒంటరిగా గదిలో ఉండిపోతున్నాడు. అది తప్పు. మన కోసం ఆకాశం బయట వేచి

చూస్తున్నదని తెలుసుకోవాలి. ఇంటి తలుపులే కాదు,మనసు తలుపులు కూడా తెరుచుకుని బయటకు రావాలి.అప్పుడు ప్రపంచమే అతనిదవుతుంది" తండ్రి చెప్పిన

మాటలు మనసులో ప్రతిధ్వనించాయి.


   శంకరం కళ్లు తెరిచాడు. గదిలో ఉంటే కనిపించని ఆకాశం ఎంతో అందంగా,విశాలంగా కనిపించింది.మనసు

కొత్త చిగురు తొడిగిన భావన కలిగింది 


     తొలిసారి అతని మనసుకు ఎంతో సంతోషం, ప్రశాంతత కలిగాయి.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

1 comment:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE