NaReN

NaReN

Monday, October 2, 2023

చదవడం ఓ కళ

  చదవడం ఓ కళ


సంసార విషవృక్షానికి రెండు అమృత ఫలాలు. సజ్జన సాంగత్యం, సద్గ్రంథ పఠనం అంటుంది హితోపదేశం. మానవ నాగరికతా వికాసంలో పుస్తక పఠనం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఏ భాషా వ్యవహర్తల్లోనైనా వారి విద్యా సాంస్కృతిక వారసత్వాన్ని అనుసరించి భాషాభివ్యక్తి నైపుణ్యాలుంటాయి. శ్రవణం, భాషణం, పఠనం, రాత అనే నాలుగు పద్ధతులుగా ఈ నైపుణ్యాలను వర్గీకరించారు నిపుణులు.


పుస్తక పఠనం ప్రగతికి సోపానం. పుస్తకాలు చదవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేధావులుగా, తత్వవేత్తలుగా, రాజనీతిజ్ఞులుగా, సంస్కర్తలుగా రూపొందారు. ‘పుస్తకాలు బురదగుంటలో పడిఉన్న నన్ను లేవనెత్తి నా ముందు విశాలమైన ప్రపంచ దృక్పథాలను సాక్షాత్కరింపజేశాయి’ అంటారు మాక్సిం గోర్కీ. పుస్తకాలు మనోమాలిన్యాన్ని ప్రక్షాళనం చేస్తాయంటారు అంబేడ్కర్‌. ‘ఒక పెద్ద బ్యాంకులోకంటే ఒక మంచి పుస్తకంలో ఎక్కువ సంపద ఉంటుంది’ అన్న రాయ్‌.ఎల్‌.స్మిత అనే విఖ్యాత రచయిత మాటలు అక్షరసత్యాలు.


పుస్తకం ఒక నేస్తం. మంచి పుస్తకం మంచి మిత్రుడు. పుస్తకాలు ఎందరో మంచి మిత్రుల్ని కూడా మనకు పరిచయం చేస్తాయి. మొత్తం మానవ సమాజం ఆలోచించినవి, చేసినవి, సాధించినవి... అన్నీ పుస్తకాల పుటల్లో దర్శనమిస్తాయి. అన్నిరకాల ఆధునిక ప్రసార మాధ్యమాలకన్నా పుస్తకం గొప్పది.


పుస్తకంలో ఒక బంగారపు ఇల్లు ఇమిడి ఉంటుందనేది చైనీయుల సామెత. నువ్వు జేబులో పెట్టుకుపోగలిగిన ఉద్యానవనం పుస్తకమని అరేబియన్‌ సామెత. మంచి పుస్తకం నీటి ఊట వంటిది. ఎన్నిసార్లు తాగినా మళ్ళీ తాగడానికి ఇంకా మిగిలే ఉంటుంది. పుస్తకాలు మెదడును తెరుస్తాయి. విశాలం చేస్తాయి. శరీరానికి వ్యాయామం ఎలాగో, మెదడుకు చదువు అలాంటిది. అది మెదడు శక్తిని పెంచుతుంది.


‘మనసుంటే మార్గముంటుంది’ అనేది లోకోక్తి. అబ్రహాం లింకన్‌ పట్టుదలతో చదువుకుంటూ ఎందరికో మార్గదర్శి అయ్యాడు. చదువు అతడి జీవితాన్నే మార్చివేసింది. మహాత్మాగాంధీని రస్సెల్‌, టాల్‌స్టాయ్‌ రచనలు ప్రభావితం చేశాయి. కందుకూరి వీరేశలింగం బహుగ్రంథకర్త. ‘చిరిగిన చొక్కానైనా తొడుక్కోగాని మంచి పుస్తకం కొనుక్కో’మని చెప్పారు. నేటి యువత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పుస్తక పఠనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పరీక్ష కోసమే చదివే చదువు నిజమైన గ్రంథపఠనం కాదు. విజ్ఞానాన్ని, వివేకాన్ని, విశ్లేషణాశక్తిని కలిగించే పుస్తకాలు చదవడం ఏ తరంలోనైనా అనివార్యం.


ఏ పుస్తకం చదవాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. మంచి మిత్రుణ్ని ఎంచుకున్నట్లుగా మంచి రచయితను ఎంచుకోవాలి. క్షణికానందం కలిగించే పుస్తకాలుంటాయి. కలకాలం చదివి గుర్తుంచుకోదగిన పుస్తకాలూ ఉంటాయి. శాశ్వతంగా భద్రపరచుకోదగినవీ ఉంటాయి. ఎన్నిసార్లు చదివినా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు అందిస్తూ జీవితాన్ని వికసింపజేసే పుస్తకాలూ ఉంటాయి. ‘కొన్ని పుస్తకాలు రుచి చూడాలి... కొన్ని మింగేయాలి... కొన్ని నమిలి జీర్ణించుకోవాలి’ అంటాడు ఫ్రాన్సిస్‌ బేకన్‌.


పుస్తక పఠనం ఒక కళ. ఏది చదివి గుర్తుంచుకోవాలో, ఏది వదిలిపెట్టాలో తెలిస్తేనే పఠనకళలో నైపుణ్యం సాధించగలుగుతారు. ‘పుస్తకం హస్త భూషణం’ అనేది పాతమాట. అది కేవలం అలంకారప్రాయం కాదు. పుస్తకం మనల్ని ఆలోచింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది, ఉత్తేజపరుస్తుంది, సృజనాత్మకతను పురిగొల్పుతుంది. ఆధ్యాత్మిక గ్రంథపఠనం పరమాత్మకు సన్నిహితుణ్ని చేస్తుంది!


 

No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE