NaReN

NaReN

Monday, July 26, 2021

మనసున్నోడు

 

*మనసున్నోడు*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*నేను ఇంటి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి రెండు నెలలు అయింది. పనిచురుకుగానే సాగుతున్నది. ఈ రోజు స్లాబ్ వేయాలి. మేస్త్రి కనిపిస్తే "పని వాళ్ళు అందరూ వచ్చినట్లేనా?" అని అడిగాను. "ఒక మనిషి తగ్గాడు. మరేం ఫర్లేదు. పనికి ఇబ్బంది లేదు" అన్నాడు.*


*అంతలో ఒక వ్యక్తి వచ్చాడు. నాకు నమస్కారం చేసి "అయ్యా! నా పేరు రాజయ్య. పొరుగూరు నుంచి కుటుంబంతో వచ్చాను. వారం నుండి పనికోసం తిరుగుతున్నాను. ఎక్కడా పని దొరకలేదు. పిల్లలు పస్తు ఉన్నారు. దయ చూపించి పని ఇప్పించండి" అని ప్రాధేయ పడ్డాడు.*

*అక్కడే ఉన్న మేస్త్రి "నీవెవరివో తెలీకుండా... నీ పనితనం తెలీకుండా.. పనిలో పెట్టుకొనేది లేదు. వెళ్ళు! వెళ్ళు!" అని కసురుకున్నాడు.*

     

*నా వైపు జాలిగా చూస్తూ "ఇది నాకు అలవాటున్న పనేనయ్యా! దయ చూపండి" అని ప్రాధేయపడ్డాడు. నాకెందుకో అతని మాటల్లో నిజాయితీ.. కన్నుల్లో ఆకలి కనిపించింది. మేస్త్రితో "తెలిసిన పనే అంటున్నాడుగా! ఈ రోజుకు పెట్టుకు చూద్దాం" అన్నాను. మేస్త్రీ అయిష్టంగా "సరే! మీ ఇష్టం " అన్నాడు.*


*అతను నావంక కృతజ్ఞతగా చూసి పనిముట్లు వైపు నడిచాడు. మధ్య మధ్యలోఅతని వంక చూసాను. కష్టపడి పని చేయడం గమనించాను. "పోనీలే! నేను పని ఇవ్వడం వలన అతని కుటుంబానికి ఒక రోజు గడుస్తుంది" అని మనసులో సంతోషించాను. మధ్యలో కూలీలు అందరికీ టీ తెప్పించాను. అందరూ పదినిముషాలు పని ఆపి కబుర్లు ఆడుతూ టీ తాగుతున్నారు. రాజయ్య వంక చూసాను. ఎంతో ఇష్టంగా టీ తాగుతూ నా వంక చూస్తున్నాడు. అతను ఆకలిగా ఉన్నట్లు గ్రహించాను. మధ్యాహ్నం కూలీలు పని ఆపి భోజనాలు చేస్తున్నారు. రాజయ్య ఏం తెచ్చుకోకపోవడంతో పని ఆపకుండా తట్టలు పైకి మోస్తున్నాడు. ఆతని  ఆకలి గుర్తించగలిగాను కానీ దగ్గరలో ఏం హోటల్స్ లేకపోవడంతో అతన్ని టిఫిన్ చేయడానికి పంపలేకపోయాను. రాజయ్య మాత్రం మంచి నీళ్ళతో సరిపెట్టేసుకున్నాడు. అతని ఆకలి నాకు గిల్టీగానే ఉంది.*


*సాయంత్రం అయింది. మేస్త్రీకి డబ్బులు ఇచ్చాను. అతడు కూలీలకు పంచాడు. రాజయ్య బయలు దేరుతూ నా దగ్గరకు వచ్చి రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. "నువ్వేం తినలేదు. త్వరగా వెళ్లి భోజనం చేయి" అన్నాను. "నేనే కాదయ్యా! ఇంట్లో వాళ్లకు ఎవరికీ భోజనం లేదు. మీ దయ వల్ల ఈ పూట గడుస్తుంది" అన్నాడు. అతనికన్నుల్లోని అవేదన సరిగానే గుర్తించాను. అతను బయలుదేరి పోయాడు. ఎందుకో తెలీదు... రాజయ్య వంకే చూడ సాగాను.*


*వెళ్తున్న రాజయ్యకు పావురాలు అమ్ముతున్న వ్యక్తి ఎదురుపడ్డాడు. రాజయ్య ఆగి తనను దాటిపోయిన పావురాలు అమ్మే వ్యక్తినే చూడసాగాడు. అతని చేతిలో రెండు పావురాలు ఉన్నాయి. రెండు నిముషాలు ఆగి రాజయ్య ఆ వ్యక్తిని కేకేసి పిలిచాడు. నాకు విషయం అర్థం అయిపోయింది. ఈ పూట రాజయ్య పావురాయి మాంసంతో విందు భోజనం చేయబోతున్నాడు అన్న ఆలోచన రాగానే నాకు అంతవరకు రాజయ్య మీద జాలి కరిగి పోయింది. "ఆ డబ్బు జాగ్రత్త చేసుకుంటే మరో పూట కూడా గడిచి పోతుంది. అలాంటిది పావురాయి మాంసంతో జల్సా చేసుకుంటున్నాడు" ఆ ఆలోచన నాకు అతని మీద సదభిప్రాయం దూరం చేసింది.*


*బేరం కుదిరినట్లు ఉంది. పావురాలు అమ్మే వ్యక్తి రాజయ్య ఇచ్చిన డబ్బు తీసుకొని పావురాలు అందిస్తూ "చాలా రుచిగా ఉంటాయి. మరలా నన్ను వెతుక్కోవాలి నువ్వు" అన్నాడు. రాజయ్య చిన్నగా నవ్వి వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీయ సాగాడు. పావురాలు అమ్మినవ్యక్తి, రాజయ్యను వారిస్తూ "ఈ పని ఇంటి దగ్గర చేయి. లేకపోతే ఎగిరి పోతాయి" అన్నాడు.*

*రాజయ్య అతని మాటలు పట్టించుకోకుండా వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీసి వాటిని ఒక్కసారి ముద్దు పెట్టుకొని గాలిలోకి ఎగర వేశాడు. స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పావురాల వంక అలానే ఆనందంగా చూడసాగాడు. ఆ రెండు పావురాలు స్వేచ్చగా ఎగిరి పోయాయి. రాజయ్య చేసిన పనికి నాతో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఆఖరికి పావురాలు అమ్మిన వ్యక్తి కూడా. "ఏంటి నీవు చేసిన పని? డబ్బులు తేరగా వచ్చాయా?" అన్నాడు.*


*డబ్బులు మరలా సంపాదించవచ్చు. పోయిన ప్రాణం మరలా రాదు" అన్నాడు రాజయ్య. ఆ మాట నా చెవిన పడింది. రాజయ్య నాకు ఒక అద్భుతమైన వ్యక్తిలా కనిపించాడు. అతని ఆకలి... ఎదురు చూసే అతని వాళ్ల ఆకలి నా కళ్ళ ముందు కదలాడింది. కూలీ పని చేసి బ్రతికే ఒక మనిషిలో ఎంత గొప్ప మనసు దాగి ఉందో బోధ పడింది.*

*అంతలో పావురాలు అమ్మిన వ్యక్తి.. రాజయ్యతో "అన్నా! నేను చేసే పని తప్పని తెలుసు. కానీ పొట్టకూటి కోసం తప్పడం లేదు. నీ డబ్బులు నీవే ఉంచుకో!" అని రాజయ్య డబ్బులు వెనక్కి ఇవ్వబోయాడు. రాజయ్య అతన్ని వారిస్తూ "డబ్బు వెనక్కి తీసుకుంటే నాకు తృప్తి ఉండదు" అని ముందుకు కదిలాడు. కొంచెంసేపు అలానే ఉండిపోయాను.*


*తరువాత బైక్ స్టార్ట్ చేసి.. రాజయ్య దగ్గరకు పోనిచ్చి "ఎక్కు"అన్నాను. "వద్దు అయ్యగారూ!" అన్నాడు. "మరేం ఫర్లేదు. నేనూ అటేవెళ్తున్నాను" అని బలవంతంగా ఎక్కించి ఒక హోటల్ ముందు ఆపి మీల్స్ పార్సెల్ చేయించాను. ఆ తరువాత రాజయ్య ఎక్కడ ఉంటున్నాడో కనుక్కొని అక్కడ డ్రాప్ చేసి మీల్స్ పార్సిల్ అందించి రెండు చేతులు జోడించి నమస్కారం చేశాను.*

*"అదేంటి  అయ్యగారూ! మీలాంటి గొప్పోళ్ళు నాకు దండం పెట్టడం" అన్నాడు రాజయ్య. "డబ్బు ఉన్నోడు గొప్పోడు కాదు. మనసున్న వాడు గొప్పొడు. ఆ మనసు నీకుంది. రేపు పనిలోకి వచ్చేయి!" అని బైక్ స్టార్ట్ చేసాను.*

*బైక్  డ్రైవ్ చేస్తున్న నాకు ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తూ కనిపించింది.*

*నాకు రాజయ్య గుర్తుకు వచ్చాడు!!*


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పసుపులేటి నరేంద్రస్వామి

2 comments:

  1. Wife and chidren had no food from few days. First he feed his family with money. ధర్మం తనకు మాలిన ధర్మం పనికిరాదు.

    ReplyDelete
  2. He is a good man ...remember it several times .. .he know his real works....with his hord work,he will get every thing

    ReplyDelete

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE