〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
బడి గంటలు-ఆకలి గుండెలు
![]() |
అక్కడెక్కడో బడిగంటలు మోగుతున్నాయి..
ఇక్కడ ఆకలిగుండెలు రగులుతున్నాయి..
అయినా..
నేనూ బడికెళ్తే ఎంత బాగుణ్ణు! అనుకుంటున్నాడా బాబు.
అదితీరే కోరికకాదని అమాయకంగా చూస్తుందా తల్లి.
ఈ సమాజంతో ఇంకా పరిచయం పెంచుకోలేదు ఒడిలోని పాపం పసివాడు ..
వాళ్ళూ మనోళ్లే..మన సమాజంలో సభ్యులే..
అయితే అసమానతల తలరాతల కందకం వారిచుట్టూ ఉంది..
కనపడని చీకటి కోణం ఎదగనీయని ఆవరణమై ఉంది..
వారి మనసుపొరల్లో ఎన్నో గాయాలు..
కాలేకడుపుల్లో ఎన్నో ఆర్తనాదాలు..
బిడ్డల కడుపు నింపడానికి ఆతల్లి ఆరుగాలం బతుకు పోరాటం..
తన చేతిలోని వాయిద్యం హెచ్చుతగ్గుల నిశ్శబ్దం..
కన్నబిడ్డల కంటిపాపల్లో శిధిలమైన ఆశల సౌధం..
వాళ్ళ కనులకు అందమైన ప్రపంచమే కరవు..
కనిపించే దంతా ముళ్ళదారులు.. ఎడారి నేలలు..
రాలే వసంతం.. కూలే అంతరంగం..
మబ్బులు పట్టిన కాలాన్ని కన్నీళ్ల శకటంలో దాటుతున్నారు..
అయినా అబ్బాయి అరుణారుణ కాంతులకోసం చూస్తున్నాడు..
అక్షర నేస్తం కోసం వెదుకుతున్నాడు..
అలాంటి అబ్బాయిల ఆశలు తీర్చుదాం..
వాళ్ళ కళ్లల్లో వెలుగు పూలు నింపుదాం..
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
పసుపులేటి నరేంద్రస్వామి
No comments:
Post a Comment