NaReN

NaReN

Tuesday, September 16, 2025

Sunday, September 7, 2025

పెద్ధలకు పాదాభివందనం చేయటము వలన ప్రయోజనం ఏమిటి ?*

 *🧘🏻‍♂️SKY Life Foundation*


*365 Learning*


*పెద్ధలకు పాదాభివందనం చేయటము వలన ప్రయోజనం ఏమిటి ?*

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*శుభకార్యాలలో పెద్దల, ఆశీర్వాదం తీసుకోవాలని, చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.*


  *కేవలం శుభకార్యాల లోనే కాక పెద్దవారు, కనిపించనప్పుడు, కూడా వారి పాదాలను, తాకుతారు చిన్నవారు.*


*అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి?*


*భారతీయ సంప్రదాయంలో, పెద్దవారి పాదాలను, తాకడం అనేది గౌరవసూచికంగా ఉన్న, పురాతనపద్దతి. అయితే, కొందరు అడుగులను అపరిశుభ్రంగా  భావిస్తారు.*


*పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత, ప్రయోజనాలు, అర్ధవంతమైన సూచనలున్నాయి.*


*పెద్దవారి పాదాలను తాకాలంటే మన అహంకారం వదిలి తల వంచాలి. అది పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను గౌరవించడంతో సమానం.*


*సాధారణంగా పెద్దవారి, పాదాలు తాకినప్పుడు, వారి,ఆలోచనలు, స్పందనలు వాటి నుండి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా ఉంటం వల్ల చిన్నవారికి లాభం చేకూరుతాయి.*


*పెద్దవారి పాదాలను తాకడానికి నడుము వంచి కుడిచేతిని వారి, ఎడమ కాలిమీద పెట్టాలి.  అలాగే ఎడమచేతిని వారి, కుడి కాలి మీద ఉంచాలి. అప్పుడు పెద్దవారి చేతులు, మన మీదఉంటాయి. ఇలా, చేయడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఆ సమయంలో వారి, శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవ్వుతాయి.*


*ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే  దీవెనలు ఫలిస్తాయి.*


*పెద్దవారు ఈ భూమి మీద, నడిచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించడం, వల్ల వారి పాద ధూళిలో, కూడా, ఎంతో జ్ఞానం దాగి, ఉంటుంది. ‘మేము కూడా, మీ మార్గంలో  నడిచి అనుభవాన్ని,జ్ఞానాన్ని, సంపాదించడానికి, ఆశీర్వదించండి అని, చెప్పే సంప్రదాయానికి, ప్రతీకగా వారి పాదాలను, తాకుతాము.*

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Wednesday, September 3, 2025

టీనేజ్ హోమ్స్

 *టీనేజ్ హోమ్స్*

ఓల్డేజ్ హోమ్స్ తో పాటు ఇప్పుడు కొత్తగా టీనేజ్ హోమ్స్ రాబోతున్నాయ్.

షాకవుతున్నారా ? అప్పట్లో ఓల్డేజ్ హోమ్స్ వచ్చినప్పుడు కూడా ఇలాగే షాకయ్యారు. కాని, ఇప్పుడు అవి నార్మల్. ఇంతకూ ఈ టీనేజ్ హోమ్స్ కథా కమామీషు ఏంటనేగా!



ఈ సంభాషణ వినండి..

 P: Parent, 

TH: Teenage Home Manager : 

P: "నమస్తే సార్ ".

TH: నమస్తే –రండి కూర్చోండి.

P: "మీరు ప్రారంభించిన హోమ్ ఫర్ ది టీనేజ్డ్ గురించి తెలుసుకోటానికి వచ్చాను సార్". 

TH: వెల్కం. అబ్బాయా అమ్మాయా?

P: "ఇద్దర్నీ జాయిన్ చేస్తా..." 

TH: ఇద్దరికీ నెలకు యాభై వేలు కట్టాలి.

P: "ఓకే సార్ .కట్టేస్తాం". 

TH: ఇంతకూ వాళ్ళ ప్రాబ్లెం ఏమిటి?

P: "మామూలే .. ఘర్ ఘర్ కీ కహానీ..."

TH: అంటే?

P: "ఇద్దరూ సెల్ ఫోన్ వదలటం లేదు".

TH: అంటే......? ఉదయం లేచిన దగ్గర్నుంచీ రాత్రి వరకూ ఫోన్ వాడుతూనే ఉంటారా?

P: "అలా చేస్తే మాకు ప్రాబ్లెం ఏముంది? అసలు నిద్రే పోవటం లేదు". 

TH: అంటే.......? రాత్రుళ్ళు ఎన్నింటి వరకూ మేలుకుoటున్నారు?

P: "ఎన్నింటి వరకూ ఏమిటి నా శ్రాద్ధం. అసలు నిద్ర పోతేగా?". 

TH: ఓహో......అర్ధమయింది. అసలు నిద్రపోకుండా 24 గంటలూ ఫోన్ వాడుతూనే ఉంటారన్న మాట.

P: "అవును".

TH: మధ్యలో ఫోన్ చార్జింగ్ కోసమైనా దూరంగా ఉండరా?

P: "అందుకు రెండు ఫోన్లు వాడుతున్నారు". 

TH: ఫోన్లు లాక్కో పోయారా?

P: "బావుంది, మొన్న మావాడి ఫోన్ లాక్కుంటే నామీద కత్తితో ఎటాక్ చేసాడు".

TH: ఓహో వయొలెన్స్ సిండ్రోమ్ అన్నమాట, మాదగ్గర దానికి ట్రీట్మెంట్ వుంది.

P: "అలాగే ఫోన్ వాడద్దని వాళ్ళమ్మ మందలించేసరికి మా అమ్మాయ్ ఇల్లు వదలి వెళ్ళిపోయింది. వారం రోజుల పాటు వెతికాక వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో దొరికింది. బలవంతంగా ఇంటికి తీసుకొస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది నా తల్లి దండ్రులు నన్ను ఆత్మహత్యకు పురిగొల్పుతున్నారు అని. పోలీసులు కేస్ రిజిస్టర్ చేసారు. వాళ్ళను వదిలించుకోటానికి రెండు లక్షలు ఖర్చయింది. అప్పటినుంచీ ఎందుకైనా మంచిదని మా ఇంట్లో మా రక్షణ కోసం ఒక బౌన్సర్ ని పెట్టుకున్నాం. బౌన్సర్ కీ ముప్పై వేలు జీతం".

TH: మరి అదే కంటిన్యూ చేయక పోయారా?

P: "ఇప్పటికే ఆ బౌన్సర్ కోసం,పోలీసుల కోసం, ఇద్దరు పిల్లల ఫోన్ల కోసం, రీచార్జ్ కోసం మా ఇంట్లో సగం పోర్షన్ అమ్మేసాం. మిగతాది కూడా అమ్మితే మేము రోడ్ న పడతాం". 

TH: ఓకే, అర్ధమయింది. కాని మా ఫీజ్ ఎలా కడతారు మరి?

P: "మీకు కట్టటానికి మా ఇంటి మీద బాంక్ లోన్ తీసుకున్నాం..". 

TH: గుడ్...... రేపే మీ పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేసేయండి.

P: "మేమెలా తీసుకొస్తాం? ఇక్కడికి తీసుకొస్తామని తెలుస్తే వాళ్ళు అన్నంలో పురుగుల మందు పెట్టి మమ్మల్ని చంపేస్తారు". 

TH: ఓకే.... .అయితే మా సెక్యూరిటీ వాళ్ళను పంపిస్తాం. వాళ్ళు తాళ్ళతో కట్టేసి తీసుకొస్తారు. అలా రిస్క్ తీసుకుంటున్నందుకు ఇంకో పాతిక వేలు కట్టాలి.

P: "అంత సీన్ అవసరం లేదు. మా పిల్లలు రాత్రి పన్నెండు నుంచి తెల్లారు జామున నాలుగింటివరకూ వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ తో చాటింగ్ చేస్తూంటారు. ఆ టైములో వాళ్లకు సృహ వుండదు. ఈజీగా ఎత్తుకొచ్చి మీ వాన్ లో పడేయవచ్చు". 

TH: అలా అయితే పదివేలు కట్టండి చాలు.

P: "ఇంతకూ మీరు వాళ్ళను మళ్ళీ ఆ మెషిన్ లైఫ్ నుంచి మనిషి లైఫ్ లోకి ఎలా తీసుకొస్తారు?".

TH: ముందు వాళ్ళను సెల్ ఫోన్ డి–ఎడిక్షన్ హాస్టల్ లో పెడతాం. అక్కడ రకరకాల ట్రీట్మెంట్ ఇస్తాం. మా సైఖియాట్రిస్ట్ వాళ్లకు మైల్డ్ షాక్స్ ఇస్తాడు. తరువాత, వాళ్లoదర్నీ ఒక హాల్లో కూర్చోబెట్టి ఫోన్ లేకుండా ఎలా మాట్లాడు కోవాలో నేర్పిస్తాం. ఆ తరువాత, ఆటలు, పాటలు నేర్పిస్తాం. జంతువులు ఫోన్లు లేకుండా ఎంత హాపీగా ఉంటున్నాయో డాక్యుమెంటరీలు చూపిస్తాం. పాత కాలంలో ఫోన్లు లేనప్పుడు ప్రజలు ఎంత హాపీగా కలసి మెలసి వుండేవారో మూవీస్ ద్వారా చూపిస్తాం. తల్లిదండ్రుల్ని బంధువులను ఎలా గుర్తు పట్టాలో ట్రైనింగ్ ఇస్తాం. డమ్మీ తల్లిదండ్రుల్ని ఎరేంజ్ చేసి వాళ్ళు ఎంతగా పిల్లల్ని ప్రేమిస్తారో ట్రయల్ రన్స్ ఇస్తాం. ఫోన్ లేకపోయినా మనం బతకవచ్చు అనే ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చూపిస్తాం...

P: "ఒక డౌట్ సార్".

TH: ఏంటది?

P: "ఒకవేళ అప్పటికీ పిల్లలు మారక పోతే?".

TH: అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను వేరే హోమ్ లో చేర్చుకుంటాం.

P: "ఎందుకు?".

TH: అలాంటి రిపేర్ కి పనికిరాని పిల్లలతో ఎలా శేష జీవితం గడపాలో తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇస్తామన్న మాట. దానికి ఫీజ్ తీసుకోము. ఫ్రీ.

ఎందుకంటే, అప్పటికే వాళ్ళు, పొలాలు, స్థలాలు, ఇల్లు అమ్ముకొని ఆరిపోయి వుంటారు గనక...


భవిష్యత్తి లో జరిగే పరిణామాలు తెలియజేయాలి అన్న  సదుద్దేశం తో ఈ చిన్న వ్యంగ్య గా విషయం తెలియచేయడం జరిగింది.

Wednesday, August 27, 2025

జీవితానికి ఉపయోగపడే 15 మంచి మాటలు

 


*జీవితానికి ఉపయోగపడే 15 మంచి matalu

 (Life-Useful Quotations)*  


*ముందుమాట (Introduction)*  

జీవితం అనేది అనుభవాల సమాహారం. మనకు దిశానిర్దేశం ఇచ్చేది సద్బోధన, సూక్తులు. ఇవి మనసుకు వెలుగునిస్తూ, ఆచరణలో మార్గదర్శకత్వం ఇస్తాయి.  


**1. Truth – సత్యం**  

సత్యం ఎప్పటికీ ఓడిపోదు. అది కొన్నిసార్లు ఆలస్యంగా గెలుస్తుంది కానీ శాశ్వతంగా నిలుస్తుంది. సత్యం మనసుకు ధైర్యం ఇస్తుంది. అబద్ధం తాత్కాలిక సౌకర్యమే ఇస్తుంది. సత్యవంతుల జీవితం అందరికీ ఆదర్శం. సత్యం అనుసరించే వారు భయపడరు. సత్యం ద్వారా నమ్మకం పెరుగుతుంది. సత్యం మనిషిని నిజమైన మహానుభావుడిగా మారుస్తుంది.  


**2. Patience – సహనం**  

సహనం కలవారు కష్టాలను జయిస్తారు. ఆత్రం ఎప్పుడూ తప్పులకు దారి తీస్తుంది. సహనం ఉన్నవారికి బుద్ధి నిలుస్తుంది. సహనంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. కోపం క్షణికం, సహనం శాశ్వతం. సహనం కలవారు ఇతరులకు శాంతిని పంచుతారు. సహనం ఉన్నవారికి విజయం దగ్గరలోనే ఉంటుంది. సహనం ఒక గొప్ప ఆయుధం.  


**3. Discipline – క్రమశిక్షణ**  

క్రమశిక్షణ లేని జీవితం అసంపూర్ణం. స్వీయ నియంత్రణతోనే విజయాలు వస్తాయి. క్రమశిక్షణతో సమయం వృథా కాదు. సమాజం క్రమశిక్షణతోనే సజావుగా నడుస్తుంది. క్రమశిక్షణ ఉన్నవారిని అందరూ గౌరవిస్తారు. విజయానికి క్రమశిక్షణ మూలస్థంభం. క్రమశిక్షణ ఉన్నవారికి క్రమబద్ధత పెరుగుతుంది. క్రమశిక్షణ జీవన ప్రమాణాన్ని పెంచుతుంది.  


**4. Hard Work – కష్టపడి పనిచేయడం**  

కష్టం లేకుండా ఫలితం రాదు. కష్టం చేసినవారే నిజమైన విజయాన్ని అందుకుంటారు. కష్టపడి పనిచేయడం శ్రమ కాదు సదుపాయం. కష్టాన్ని దాటితేనే గెలుపు ఉంటుంది. కష్టపడే మనసు ఎప్పటికీ వెనుకబడదు. కష్టపడితేనే ప్రతిభ వెలుగుతుంది. కష్టానికి గౌరవం ఎల్లప్పుడూ ఉంటుంది. కష్టపడి సాధించినదే శాశ్వతం.  


**5. Knowledge – జ్ఞానం**  

జ్ఞానం కంటే గొప్ప సంపద లేదు. జ్ఞానం ఉన్నవారిని ఎవ్వరూ దోచుకోలేరు. జ్ఞానం చీకటిలో వెలుగులాంటిది. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ వినయం పెరుగుతుంది. జ్ఞానం మనిషిని వినయశీలిగా మారుస్తుంది. జ్ఞానం ఉన్నవారు ఇతరులను వెలిగిస్తారు. జ్ఞానం మనిషి జీవితాన్ని ఉన్నతంగా మార్చుతుంది. జ్ఞానం సమాజానికి దారి చూపుతుంది.  


**6. Honesty – నిజాయితీ**  

నిజాయితీ గలవారికి అందరూ నమ్మకం పెడతారు. నిజాయితీ గల వ్యక్తి ఎప్పుడూ భయపడడు. నిజాయితీ మనిషికి నైతిక శక్తినిస్తుంది. నిజాయితీ ఉన్నవారిని సమాజం గౌరవిస్తుంది. నిజాయితీ వల్ల నమ్మకం నిలుస్తుంది. నిజాయితీ జీవనంలో ఆనందం ఇస్తుంది. నిజాయితీతోనే మంచి సంబంధాలు ఏర్పడతాయి. నిజాయితీ శాంతికి మూలం.  


**7. Time – సమయం**  

సమయం అనేది అమూల్యమైనది. దానిని వృథా చేస్తే తిరిగి రావడం లేదు. సమయాన్ని కాపాడినవారే విజయాన్ని అందుకుంటారు. సమయం మనిషిని ముందుకు నడిపిస్తుంది. సమయం విలువ తెలుసుకున్నవారికి గౌరవం లభిస్తుంది. సమయం శ్రద్ధగా వినియోగించాలి. సమయాన్ని వృథా చేస్తే జీవితం వెనుకబడుతుంది. సమయం సక్రమంగా వాడితే ఫలితాలు గొప్పవిగా వస్తాయి.  


**8. Friendship – స్నేహం**  

స్నేహం జీవనంలో ఆనందాన్ని ఇస్తుంది. నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ తోడుంటాడు. స్నేహం నమ్మకంపై నిలుస్తుంది. స్నేహితుడు మన లోపాలను సరిచేస్తాడు. స్నేహం మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. స్నేహితుడు బాధల్లో తోడ్పడతాడు. స్నేహం నిజాయితీతో బలపడుతుంది. స్నేహం జీవన పథంలో వెలుగును నింపుతుంది.  


**9. Love – ప్రేమ**  

ప్రేమ జీవనానికి శక్తినిస్తుంది. ప్రేమతో సంబంధాలు నిలుస్తాయి. ప్రేమ మనసును మృదువుగా చేస్తుంది. ప్రేమ ద్వేషాన్ని దూరం చేస్తుంది. ప్రేమలో నిజాయితీ ఉంటే బంధం బలపడుతుంది. ప్రేమతోనే శాంతి పెరుగుతుంది. ప్రేమ మనిషిని దయగలవాడిగా మారుస్తుంది. ప్రేమ ప్రపంచానికి మానవత్వాన్ని ఇస్తుంది.  


**10. Health – ఆరోగ్యం**  

ఆరోగ్యం లేకపోతే ధనం ఉపయోగం లేదు. ఆరోగ్యం ఉంటే శ్రమించగలం. ఆరోగ్యం మనిషి జీవనానికి పునాది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కర్తవ్యం. ఆరోగ్యం శాంతిని ఇస్తుంది. ఆరోగ్యం ఉన్నవారు ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం విజయం సాధించడానికి తోడ్పడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం.  


**11. Charity – దానం**  

దానం మనిషిని మహోన్నతుడిగా చేస్తుంది. దానం సమాజంలో సానుభూతిని పెంచుతుంది. దానం చేసే హృదయం పవిత్రం. దానం వల్ల సమానత్వం పెరుగుతుంది. దానం ఇతరుల కష్టాలను తగ్గిస్తుంది. దానం మనసుకు శాంతినిస్తుంది. దానం మానవత్వాన్ని నిలుపుతుంది. దానం మనిషి విలువను పెంచుతుంది.  


**12. Courage – ధైర్యం**  

ధైర్యం లేని జీవితం బలహీనత. ధైర్యం కలవారే సమస్యలను ఎదుర్కొంటారు. ధైర్యం మనిషికి ఆత్మవిశ్వాసం ఇస్తుంది. ధైర్యంతో విజయాలు సాధ్యమవుతాయి. ధైర్యం లేకపోతే భయమే మిగులుతుంది. ధైర్యం జీవితం ముందుకు నడిపిస్తుంది. ధైర్యం ఉన్నవారికి గౌరవం వస్తుంది. ధైర్యం మానవత్వానికి శక్తి.  


**13. Simplicity – సరళత**  

సరళత కలవారు అందరినీ ఆకట్టుకుంటారు. సరళత మనసుకు ప్రశాంతి ఇస్తుంది. సరళతలోనే గొప్పదనం ఉంటుంది. సరళత గలవారు ఎవరినీ కించపరచరు. సరళతతో జీవితం సులభమవుతుంది. సరళత మనిషిని వినయశీలిగా మారుస్తుంది. సరళతతో బంధాలు బలపడతాయి. సరళత అనేది సహజమైన అందం.  


**14. Gratitude – కృతజ్ఞత**  

కృతజ్ఞత గలవారు నిజమైన మహానుభావులు. కృతజ్ఞత మనిషిని వినయవంతుడిగా ఉంచుతుంది. కృతజ్ఞత చూపించడం ఒక గొప్ప గుణం. కృతజ్ఞత బంధాలను బలపరుస్తుంది. కృతజ్ఞత గల మనసు అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. కృతజ్ఞత గలవారికి మరింత సహాయం లభిస్తుంది. కృతజ్ఞత మనసు పవిత్రతను చూపిస్తుంది. కృతజ్ఞత మానవత్వానికి మూలం.  


**15. Self-Confidence – ఆత్మవిశ్వాసం**  

ఆత్మవిశ్వాసం కలవారు ఏదైనా సాధిస్తారు. ఆత్మవిశ్వాసం మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం విజయానికి దారి చూపిస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్నవారు వెనుకడుగు వేయరు. ఆత్మవిశ్వాసం మనసును బలంగా ఉంచుతుంది. ఆత్మవిశ్వాసం లేనివారు ఎప్పుడూ భయపడతారు. ఆత్మవిశ్వాసం గలవారికి అవకాశాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం జీవితం ఉన్నతంగా మార్చుతుంది.  


*ముగింపు (Conclusion)*  

ఈ సూక్తులు జీవనంలో మార్గదర్శకత్వం ఇస్తాయి. వీటిని పాటిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, సమాజం సౌఖ్యంగా ఉంటుంది. జీవితం సార్థకంగా గడుస్తుంది.


శుభం భూయాత్🙏🏻


సదా మీ సేవలో🙏🏻

పసుపులేటి నరేంద్రస్వామి

Tuesday, August 19, 2025

గద్వాల రాణి

 గద్వాల రాణి 


*నిజాం నవాబును ఎదురించిన వీరవనిత. గద్వాల సంస్థానాన్ని స్వతంత్ర సంస్థానంగా ప్రకటించి పాలించిన మహారాణి. నిజాం ప్రభువుల నుంచి పతనమైన తన రాజ్యాన్ని పునరుద్ధరించుకున్న వీరవనిత మహారాణి ఆది లక్ష్మిదేవమ్మ గారి వర్ధంతి జ్ఞాపకం* !


      🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿



గద్వాల సంస్థానంలో సాహితి పోషకులలో చెప్పకోదగ్గ రాజు శ్రీ మహారాజా సీతారామభూపాలుడు 1924లో స్వర్గస్తు లైనారు. తరువాత పాలన బాధ్యతలు శ్రీ మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ 1929లో చేపట్టారు. 1949లో జాగీరుల రద్దుతో రాణి పాలన ముగిసంది. ఆమె చేసిన 25సంవత్సరాల పాలనలో ఎ న్నో విజయాలు. మన్ననలను, ప్రశంసలను రాణి అందు కున్నారు. 25సంవత్సరాల రాణి పాలనను గద్వాల చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగ్గదిగా ఇప్పటికీ చెప్పుకుంటారు.

.......

పూడూరును చాళుక్యులు పరిపాలించగా, చాళుక్యులకు, పల్లవులకు మధ్య జరిగిన యుద్ధంలో పెదసోమభూపాలుడు గదను, వాలమును ప్రయోగించడం వలన ఈ కోటకు "గదవాల (గద్వాల)" అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ విధంగా 1663 నుండి 1950 వరకు గద్వాల సంస్థానాధీశులచే పరిపాలింపబడింది. రాజాభరణాల రద్దు తరువాత ఈ కోటను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, 

......

గద్వాల, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలానికి చెందిన పట్టణం. ఇది జోగులాంబ గద్వాల జిల్లాకు పరిపాలనా కేంద్రం. మండలానికి, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్రంగా కూడా ఉంది

.....

గద్వాల సంస్థానం తుంగభద్ర, కృష్ణానదుల మధ్య ప్రాంతంలో నడిగడ్డగా పిలిచే ప్రాంతంలో 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. 14వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత గద్వాల సంస్థానాధీశులు బహుమనీ సామ్రాజ్యం సామంతులుగా ఉన్నారు. 1663లో రాజా పెదసోమభూపాలుడితో ప్రారంభమైన గద్వాల సంస్థాన పాలన విలీనమయ్యే వరకు కొనసాగింది. 1704లో నాడగౌడుగా ఉన్న సోమన్న కృష్ణానది తీరన గద్వాల కోటను నిర్మించారు. రాజ్యాన్ని బనగానపల్లె, ఆదోని, సిరివెల్ల, నంద్యాల, ఆత్మకూరు, అహోబిలం ప్రాంతాలకు విస్తరించారు. 1909 వరకు గద్వాల సంస్థానాధీశులు సొంత నాణేలను ముద్రించుకున్నారు. ఈ సంస్థానంలో 11 మంది రాజులు, 9 మంది రాణులు పాలించారు. చివరగా మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ గారు 1924 నుంచి సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యే వరకు మహారాణిగా కొనసాగారు. గద్వాల సంస్థాన వారసుడైన కృష్ణ రాంభూపాల్‌రెడ్డి 1962లో రాష్ట్రలో  జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

......

గద్వాల్ కోట ఒక అద్భుతమైన కట్టడం, దీని చుట్టూ పాత పట్టణం విస్తరించి ఉంది.  కోటలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనది శ్రీ చెన్నకేశవ స్వామి.  జమ్ములమ్మ అనే మరొక ప్రసిద్ధ దేవాలయం పట్టణానికి పశ్చిమాన ఉంది.

.....

మహారాణి ఆది లక్ష్మి దేవమ్మ మహబూబ్ నగర్ జిల్లా లోని ఒకనాటి గద్వాల సంస్థానాన్ని పాలించిన మహారాణి. రాజా చిన సీతారామభూపాలుని భార్య. ఆయన అనంతరం పాలనచేశారు. 1946 నుండి 1949 వరకు పాలించారు. ఆమె ఈ సంస్థానపు చివరి పాలకురాలు కూడా. నిజాం నవాబును ఎదురించిన వీరవనిత. గద్వాల సంస్థానాన్ని స్వతంత్ర సంస్థానంగా ప్రకటించి పాలించించారు. సీతారామభూపాలునికి సంతానం లేకపోవడంచే నిజాం నవాబు మిర్ ఉస్మాన్ అలీఖాన్ తమ రాజ్యంలో గద్వాల సంస్థానాన్ని కలుపుకుంటే, రాణి న్యాయపోరాటం చేసి సంస్థానాన్ని తిరిగి చేజిక్కించుకున్నారు. 


▪️ సాహితి సేవా.....


శ్రీ మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ పాలనలో చేసినా సాహితిసేవను గద్వాల చరిత్రలో సువర్ణక్షరాలతో లి ఖించదగినది. రాణి పాలనలో వెలుగులోకి వచ్చిన సాహితి సేవలు ఎవరి పాలనలో వెలుగులోకి రాలేదు. ప్ర తి సంవత్సరం కార్తీక మాఘ శుద్ధ పౌర్ణమి నాడు కవి పం డితులను ఆదరించి వారిని సన్మానించి వారి పాదదూళిని సింధూరంగా భావించి నుదుటన పెట్టుకునే వారట. అలాగే ప్రతి మాఘపౌర్ణమి నాడు చెన్నకేశవ స్వామి రథో త్సవం సందర్భంగా దక్షిణ భారత దేశము నుంచి కళా కారులను ఆహ్వానించి సన్మానించేవారు. నాడు సన్మానం పొందిన వారిలో తిరుపతి వెంకటకవులు కూడా ఉన్నారు. ఆంధ్రదేశంలో గద్వాలలో సన్మానం పొందుట తమ విద్య కు పరిపూర్ణత లభించినట్లేనని కవులు భావించేవారు. అందుకే రాణి పాలనలో గద్వాలను విద్వద్గద్వాలగా కీర్తి సంతరిం చుకుంది.

.......

సంస్థానంలో సంప్రదాయంగా వస్తున్న సాహిత్య పోషణను కొనసాగిస్తూ, ఎందరో కవులను ఆదరించి గద్వాలకు విద్వద్గద్వాలగా కీర్తి రావడానికి కారకులయ్యారు. ఎంతోమంది కవుల పుస్తకాలను ముద్రింపజేశారు. 1949 లో సంస్థానాల, జాగీర్ధారుల పాలనలు రద్దు కావటంతో రాణి సంస్థానపు ఆస్తులను, చారిత్రాత్మక గద్వాల కోటను ప్రభుత్వ పరం చేశారు. 1663లో రాజా పెద సోమభూపాలుడి పాలనతో ప్రారంభమైన గద్వాల సంస్థానపు పాలన 1949లో మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ పాలనతో ముగిసింది. ఆమె పేరు మీదుగా గద్వాల కోటలో మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటైన మొదటి డిగ్రీ కళాశాల. 

.....

స్వాత్రంత్యానికి పూర్వం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 16 సంస్థానాలు ఉండేవి. అందులో ముఖ్యమైనవి వనపర్తి, గద్వాల, కొల్లాపూర్‌, అమరచింత సంస్థానాలు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం కాలేదు. కేంద్రప్రభుత్వం ‘ఆపరేషన పోలో’తో సైనిక చర్యకు దిగడంతో 1948 సెప్టెంబర్‌ 17న విలీనం కావడంతో ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం సిద్ధించింది. దీంతో సంస్థానాలన్నీ పోయి ప్రజాస్వామ్య పాలన ఏర్పడింది. అప్పటి వరకు సంస్థానాధీశులుగా కొనసాగిన వారిలో కొంతమంది ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ నిలబడి గెలిచారు. ప్రస్తుతం రాజవంశాలకు చెందిర వారు క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.


• గద్వాల సంస్థానంను పాలించిన రాజులు....


బుడ్డారెడ్డి గద్వాల సంస్థానానికు మూలపురుషుడు. మొత్తం 11 రాజులు, 9 రాణులు ఈ సంస్థానాన్ని పాలించారు. వీరిలో ముఖ్యులు.


1) రాజ శోభనాద్రి

2) రాణి లింగమ్మ (1712 - 1723)

3) రాణి అమ్మక్కమ్మ (1723 - 1724 )

4) రాణి లింగమ్మ ( 1724 - 1738 )

5) రాజా తిరుమలరావు

6) రాణి మంగమ్మ ( 1742 - 1743)

7) రాణి చొక్కమ్మ ( 1743 - 1747 )

8) రాజా రామారావు

9) రాజా చిన్నసోమభూపాలుడు

10) రాజా చిన్నరామభూపాలుడు

11) రాజా సీతారాం భూపాలుడు

12) రాణి లింగమ్మ (1840 - 1841 )

13) రాజా సోమభూపాలుడు

14) రాణి వెంకటలక్ష్మమ్మ

15) రాజారాంభూపాలుడు

16) రాణి లక్ష్మీదేవమ్మ

17) మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ ( 1924 - 1949 )


• సంస్థానం గుండా యూనియన్ దళాలకు ప్రవేశం...


మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ గారు 1947లో భారత స్వాతంత్ర్యానంతరం నిజాం నవాబును ఎదిరించిన సాహసి. 1948లో భారత యూనియన్ దళాలు హైదరాబాదుపై పోలీస్ చర్య తీసుకొనే సమయంలో కర్నూలు మీదుగా హైదరాబాదుకు వెళ్ళడానికి తన సంస్థానం గుండా యూనియన్ దళాలకు ప్రవేశం కల్పించింది తన దేశభక్తిని చాటుకున్నారు.

......

1948 సెప్టెంబరులో హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన పిదప తన సంస్థాన ఆస్తులను, తెలంగాణలోనే ప్రఖ్యాతి  గాంచిన గద్వాల మట్టికోటను ప్రభుత్వానికి ధారాదత్తం చేసింది. ప్రస్తుతం ఈ కోటలోనే జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, పిజి సెంటర్, దేవాలయం ఉన్నాయి. డిగ్రీ కళాశాలకు ఈమె పేరిట మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ (మాల్డ్) డిగ్రీ కళాశాలగా పిలుస్తున్నారు.


• గద్వాల చీరలకు పునాదివేసారు మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ గారు.


గద్వాలనుండి కొన్ని కుటుంబాలను బెనారస్ పంపించి అక్కడ నేతపని శిక్షణ ఇప్పించి దానిలో కూడా గద్వాల ప్రత్యేక అంచుని తయారుచేయడానికి  బాటవేసింది రాణీ గారు.గద్వాల చీరకు అంత సొగసు పాపులారిటి ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు రాణి  గారికి వచ్చిన అలోచన కొత్తగా పట్టు+కాటన్ కలగలిపి చీరలు నేస్తే  ఎలాగుంటుందన్న అదే విషయాన్ని కంచి, బెనారస్ లోశిక్షణ తీసుకొచ్చిన 12 మంది చేనేతలతో మాట్లాడారు.కోటగుమ్మం డిజైన్ గద్వాలకు చిహ్నంగా కనిపిస్తుంది.ఈ ఆలోచన ఆదిలక్ష్మిదేవమ్మ గారిదే. 


• గద్వాల చీరల్లో మాత్రమే ఎందుకుంది ? 


చీరలు ఎందుకింత పాపులరైంది ? ఎందుకంటే రెండు రకాల వస్త్రాలను మిశ్రమంచేసి గద్వాలలో చీరలను నేస్తారు కాబట్టే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతిచీరకు బార్డర్ తో పాటు పల్లు అంటే కొంగు ఉంటుందని అందరికీ తెలిసిందే. మామూలుగా ఏ ప్రాంతంలో చీరలు నేసినా పూర్తి కాటన్ లేదా పట్టు లేదా ఏదో ఒకరకమైన బట్టతో మాత్రమే తయారవుతాయి.కాని గద్వాలలో మాత్రం బార్డర్, కొంగును పట్టుతోను మధ్యలోని చీరమొత్తాన్ని కాటన్ తో నేస్తారు.పట్టు+కాటన్ మిశ్రమంతో చీరలు నేస్తారు కాబట్టే దేశం మొత్తంమీద గద్వాల చీరలు ఎంతో ప్రత్యేకంగా  నిలుస్తున్నాయి. కాటన్+పట్టుతో కలిపి చీరను నేసే ప్రక్రియ దేశంలో గద్వాలలో తప్ప ఇంకెక్కడాకనబడదు. అందుకనే గద్వాల పట్టుచీరలు ఎంతో ప్రత్యేకం.1946 ప్రాంతంలో హైదరాబాద్ లోని అబిడ్స్ లో గద్వాల చీరల కోసమే మహారాణి ప్రత్యేకంగా షోరూమ్ ను ఏర్పాటు చేసారు. భర్త సీతారాంభూపాలుడి ద్వారానే అప్పటిదాకా అన్ని విద్యలలో ముందున్న గద్వాల "విద్వద్ గద్వాల"గా విద్యావంతులకు పండితులకు నిలయంగా మారాయి.ఆ విద్యలలో చేనేతలను పుట్టించి,ప్రోత్సహించిన గొప్ప కళా పోషకురాలు గద్వాల మహారాణి గారు.

.......

1663లో మహారాజా పెద్దసోమభూపాలుని పాలనతో ప్రారంభమైన గద్వాల సంస్థానం 1949లో శ్రీ మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ పాలనతో అంతమైంది. 1949లో జాగీరుల రద్దు తో రాజుల పాలనకు తెరపడింది. మూడు సంవత్సరాలు ప్రభు త్వ పాలనను చూసిన ఆమె 18-8-1953న దివంగతులైనారు. 25సంవత్సరాలు సాగిన రాణిగారి పాలనను ఇప్పటికీ ఎవ రు మరచిపోలేదు. కాని రాణి సేవలు, త్యాగాలు, గొప్పతనం ఎంతమందికి గుర్తుకు ఉందన్నది ప్రశ్నార్థకం.


• శ్రీవారికి ఏరువాడ జోడు పంచెలు....


బహుమానంగా పంపటం కూడా మహారాణి హయాంలోనే మొదలైందన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు ముందు వెంకటేశ్వరస్వామికి గద్వాల నుండి పట్టుతో నేసిన జోడు పంచెలు బహుమానంగా వెళ్ళటం దశాబ్దాలుగా ఆనవాయితీగా ఉన్నది. జోడు పంచెలను తయారుచేసే చేనేతలు ప్రత్యేకంగా దీక్ష తీసుకుని 41 రోజుల పాటు ప్రత్యేకమైన మగ్గంలోనే నేస్థారు. శ్రీవారికి నేసే జోడు పంచెల మగ్గాన్ని ఏడాది మొత్తం మీద దేనికీ వాడ కుండా ఉంచుతారు.మహారాణి వారసులు కొడుకు, కోడలు లతా భూపాల్ నేటికీ  ప్రతి ఏడాది గద్వాల నుండి జోడు పంచెలను నేయించి ప్రత్యేకంగా తిరుమలకు పంపుతూ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.


         🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

ఉడిపి హోటల్ తెలుసా...

 ఉడిపి హోటల్ తెలుసా...


ఉడుపి హోటల్ ఎందుకంత పేరు గాంచాయో తెలుసా....


ఇంట్లో మనం నలుగురికి లేదా 5గురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోండి.


మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు.అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి,,రెండవది బలరాముడు.ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి.

 

  దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది.ఉడిపిరాజైన నరేషుడు

  సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు. 


అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు.అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు.

మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.


అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది,

నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు.

 అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము.వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు  చెపుతాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది,50 లక్షల మందికి భోజనం వండటం

 అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది,అందరికీ భోజనాలు తయారుచేయమని చెపుతాడు.


50 లక్షల మందికి భోజనాలు వండాలంటే  

 భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం

 భీముడు కు ముఖ్యం.అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు.అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు.


నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న  సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేష్ ఎలా 

వండేవాడు అంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా,వృధాకాకుండా వండేవాడు.


రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది.

అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా 

వండేవాడు నరేశుడు.

ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు.

 ఇది ఎలా సాధ్యం?అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు,అది కూడా ఒక్క మెతుకు కూడా

 మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు.

 అసలు నరేశునికి ఎలా తెలుస్తుంది?

 ఈ రోజు  ఇంతమంది మాత్రమే చనిపోతారని,మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?..


ఇలా18 రోజులు గడిచిపోయాయి.పాండవులు గెలిచారు.పట్టాభిషేకం జరుగుతుంది.అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు.కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు.ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అంటాడు.


అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగాడు.

అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికి చెందుతుంది అని చెప్తాడు.

 అప్పుడు నరేష్ మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం.కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణుని కే చెందుతుంది అని చెప్తాడు.

  ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు.

  ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా

  కారణం అని నరేషుడుని అడుగుతారు. 

అప్పుడునరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు...


శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.నేను లెక్క పెట్టి పెట్టే వాడిని.

శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని...

 శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలుఅయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.. ఆంటే

 శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు.

  దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు.

  ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు.

  ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు.

ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు.

"హరిసర్వోత్తమ"

"వాయు ఉత్తమ*"

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

Monday, August 18, 2025

లోకం ఆగదు

 ఎవ్వరు లేకపోయినా ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకటం ఆపేద్దాం …


ఒక సిస్టమ్‌, ఆర్గనైజేషన్‌, రిలేషన్‌షిప్‌ ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్‌ చేయొచ్చు. 


‘నేను లేకపోతే ఈ కంపెనీ.. ఆఫీస్‌.. ఈ సంస్థ, ఈ ఇల్లు.. ఈ రాష్ట్రం.. ఈ దేశం.. ఏమైపోతుందో’ అని చాలామంది అనుకుంటూ ఉంటారు!


ఏం కాదు! అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. 

ఇంకా బాగా నడవవచ్చు కూడా ! 

కొత్తవారు కొత్త ఆలోచనతో రావచ్చు! 


మనలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు. 

మనకున్న అనుభవం, మనం ఆలోచించే విధానం, మన ఎనర్జీ - ఇలా ఎన్నో మంచి లక్షణాలు మన లో ఉండవచ్చు.


ఆ విషయంలో మన స్థానాన్నితాత్కాలికంగా ఎవరూ భర్తీ చేయలేకపోవచ్చు ! అంతమాత్రాన ఏమీ ఆగిపోదు! 


అయినా, మన టైమ్‌ బాగుండకపోయినా, దగ్గర పడినా అందరూ ఠక్కున పక్కన పెడతారు! అప్పటిదాకా మన పక్కన ఉన్న వాళ్లే, పక్క దారి పడతారు! 


ఎన్నో ఏళ్లు పనిచేసిన కంపెనీలో, సంస్థలో మన రిటర్మైంట్‌ రోజున బాగా భావోద్వేగానికి గురయి మాట్లాడుతూ ఉంటామ్!  అప్పటివరకూ సాధించిన వాటి గురించి గొప్పలు (గప్పాలు) చెబుతూ ఉంటాం! 

కానీ, ఇటు మన స్పీచ్‌ నడుస్తుంటే, మన యాక్సిస్‌ కార్డును, ఐడి కార్డును, ఇంకొకడు అప్పటికే డి-యాక్టివేట్‌ చేసేసి ఉంటాడు.


మరొకడు మన అఫీషియల్‌ మెయిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌ మార్చేస్తాడు. 

బ్యాంకు అకౌంట్ ఆథరైజ్డ్ సిగ్నేచర్ మార్చేసి బ్యాంకు కి అప్పటికే లెటర్పంపించేసి ఉంటారు! 


మన టేబుల్ మీద మనం పెట్టుకున్న దేవుడి ఫోటో తీసేసి వాళ్ళది పెట్టేసుకుంటారు! ఇవన్నీ సహజం! 


మనకు కాఫీ ఇచ్చే బాయో, బంట్రోతో అప్పటికే మన డెస్క్‌ ఖాళీ చేసి, అన్నీ మన కారులో పెట్టేసుంటాడు. 

మన తరువాత మన పోస్టులోకి వచ్చే వ్యక్తి, మన నేమ్ ప్లేట్ తీసేసి మన బ్యాగ్లో వేసేసి- “సార్ మీ నేమ్ ప్లేట్ తీయించి మీకు ఇస్తున్నాము సార్ ! గుర్తు గా వుంచుకోండి”అంటూ, అప్పటికే రెడీ అయిన తన నేమ్ ప్లేట్ ఫిక్స్ చేయించే ప్రయత్నంలో వుంటాడు!


మన  సహచర ఉద్యోగులు మనల్ని ఎంతో మిస్‌ అవుతున్నామని తెచ్చిపెట్టుకున్న కన్నీళ్లతో చప్పట్లు కొడుతూ ఉంటారు.


అదే సమయంలో మన తర్వాత ఆ కుర్చీలో కూర్చొనేవాడు మన పక్కనే బాధగా నిలబడి, మన  స్పీచ్‌ అయిపోగానే, ఆ సీట్లో కూర్చుందామని చూస్తుంటాడు. 

వీడ్కోలు పార్టీ అయిపోగానే అందరూ మనల్ని మర్చిపోతారు. అంతెందుకు, వీడ్కోలు మీటింగ్ మధ్యలోనే కొంత మంది శాలువా కప్పి చల్లగా జారుకుంటారు, అప్పటిదాకా ఉండవలసి వచ్చినందుకు బాధ పడుతూ! 


ఆ తర్వాత జీవితం అంతా ఇంట్లోనే!


ఆఫీస్‌ నుంచి ఎవరూ ఫోన్ చేసి మన  సలహాలు, సూచనలు అడగరు! వాటి కోసం ఎదురు చూడొద్దు. ఎవడూ రాడు. 

ఏదైనా సలహా కావాలంటే చాట్‌- జీపీటీని అడుగుతారు . ప్రపంచం ఎంతో వేగంతో పరుగెడుతోంది. 

కళ్లు మూసి తెరిస్తే అన్నీ మారిపోతాయి. 

పెద్ద పోస్టులో రిటైర్ అయిన వ్యక్తుల PA లు కూడా, ఆ సదరు రిటైర్ అయిన వ్యక్తి రిటైర్మెంట్ అయిన మరునాడు ఫోన్ చేసి ఏదైనా పాత విషయం అడగబోతే, ఆ సదరు “నిన్నటి సారు “ చెప్పే లోపే, “సార్!  పెద్ద సార్, కొత్త సార్ పిలుస్తున్నారు intercom లో! మళ్లీ పది నిమిషాలు ఆగి ఖాళీ అయ్యాక ఫోన్ చేస్తాను “ అని , ఇటు రెస్పాండ్ అయ్యేలోపే ఫోన్ కట్ చేస్తాడు! అది ఉద్యోగధర్మం! 

మనం తప్పు పట్టకూడదు! 

నిన్నటితో అతనిది ముగిసింది! 

ఈరోజు నుండి“పెద్దసార్“ 

మారాడు! ఇది కొంతవరకు జీర్ణించుకోవచ్చు! 


అదే పాత ప్రభుత్వంలో పదవి వెలగబెట్టిన ఏ ప్రజా నాయకుడో, ఏ సంస్థ కార్య నిర్వాహక సభ్యుడో అయితే ఈ అవకాశం కూడా లేదు! ప్రభుత్వం మారినా వెంటనే, మూటా ముల్లి సర్దుకోవాలి! పాత రికార్డ్స్ మనకు ఇబ్బంది కలిగించే డాక్యుమెంట్స్ ముందే సర్దుకోవాలి! 


మనం అందరం మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా? 

మన టైం అయిపోయింది! 

మనం మంచి పొజిషన్‌.. సక్సెస్‌లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటాం. 

తర్వాత అందరూ మర్చిపోతారు. 


‘నేనే లేకపోతే’ 

అని ప్రతి అత్తగారు అనుకుంటుంది. 

కానీ, కొత్త కోడలు వస్తుంది. 

ఆమెకంటే ఇల్లు బాగా చూసుకుంటుంది! ఇది 95% నిజం కూడా! 


కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే 

”ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం అనేది అవమానించడం కాదు. 

మనం చేయాల్సిన పనులు అక్కడ పూర్తయ్యాయని అర్థం. మిగిలిన జీవితం హాయిగా బతకాలి! ద్వేషాలు, వైషమ్యాలు విడవాలి! 


కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి . కొత్త సవాళ్లను ఎదుర్కోవాలి . పాత అలవాట్లని కొంతవరకు మార్చుకోవాలి! సర్దుకు పోటం నేర్చుకోవాలి! 

మనల్ని మనమే  గౌరవించుకోవాలి! తప్పదు మరి!


ఇంకా ఆఫీస్‌, పోస్ట్ నెత్తి మీద పెట్టుకుని మోయరాదు. పిల్లా, పాపలతో సరదాగా గడపటం నేర్చుకోవాలి! 


పవర్‌.. మనీ.. సక్సెస్‌.. జీవితాంతం ఉండవు. అవి వున్నప్పుడే, అవి లేనప్పుడు ఎలా బతకాలి నేర్చుకోవాలి.


‘నేనే లేకపోతే..’ అనే ఆలోచన వస్తే, ఒక్కటే గుర్తు పెట్టుకోండి. 


“నేనే” లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది… 

ఏదీ ఆగదు… 

పాత నీరు పోతూనే ఉంటుంది… 

కొత్త నీరు భర్తీ చేస్తూనే ఉంటుంది… 


ఎవరైనా వచ్చి మనల్ని పొగిడి “సార్! మీరు లేకపోతే “ అంటే, మనం వెంటనే అర్థం చేసుకోవాలి, వాడు మనల్ని మోసం చేస్తున్నాడని, వాడిని కూడా మోసం చేసుకుంటున్నాడని! 


ఇంత వయసు వచ్చి రిటైర్ అయ్యాక, ఈ మాత్రం maturity రాకపోతే, మనం ఇన్నాళ్లు బతికింది వృధా అన్న మాట! 


కొన్ని విషయాల్లో, కొంత సమయం తర్వాత, వదిలేయడంలో ఉన్నఆనందం పట్టుకొని వేళ్ళాడటంలో వుండదు!


మనం పట్టు వదలకపోతే, వాళ్లే వదిలిస్తారు! 


ఈ విషయంలో, నేటి తరంలో, మన పిల్లలే మన మాట వినరు! 

“మీ టైం అయిపోయింది, మీకేమి తెలియదు! 

మీరు ఊరుకోండి, అన్నిట్లోనూ వేళ్లు పెట్టకండి! మాకు తెలుసు, మేము చూసుకుంటాము! మేమూ పెద్ద వాళ్ళమయ్యాముగా “ అంటారు! 


వాళ్ళు ‘మేమూ పెద్దవాళ్లమయ్యాముగా’అనగానే, మనం మన పెద్దరికాన్ని పక్కన పెట్టి, పద్ధతిగా, పెద్దరికాన్ని కాపాడుకుంటూ పక్కకు తప్పుకోవాలి! 

లేదంటే మనల్ని మనమే చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది!


ఇది ఉద్యోగంలో నైనా, వ్యాపారంలో నైనా, వేరే దేనిలోనైనా, ఇంట్లో నైనా తెలుసుకొని మసలటం విజ్ఞుల లక్షణం! 

లేకపోతే అభాసుపాలవటం తధ్యం! ఇది మనకు చరిత్ర చెబుతున్న సత్యం!

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE